Usakumari
-
కాసుల వేట.. బదిలీల ఆట
ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. స్వామికార్యం, స్వకార్యం చక్కబెట్టుకునేందుకు అధికార పార్టీ తెరతీసింది. కీలక శాఖల్లో మొదలుపెట్టిన కుర్చీలాట వివాదాస్పదంగా మారుతోంది. సొంత లాభం ఉంటే చాలు.. నిబంధనలకు పాతరేసి బదిలీల జాతరకు నాయకులు బరితెగిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఐఏఎస్ అధికారులు జిల్లాను వదిలి వెళ్లడానికి ఇష్టపడడం లేదు. సాక్షి ప్రతినిధి, విజయవాడ : ఇటీవల జరుగుతున్న బదిలీల వెనుక జిల్లాకు చెందిన కీలక రాజకీయ నాయకులతోపాటు వారిని ప్రభావితం చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడ్డదోవలో ఉపాధ్యాయ బదిలీల్లో అందినంత మూటగట్టుకున్నారన్న అపవాదును నెత్తినేసుకున్న అధికార పార్టీ నేతలు తాజాగా ఉన్నతాధికారుల పోస్టులపై గురిపెట్టారు. రెండు జిల్లాలకు చెందిన ముఖ్య పోస్టుకు లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు అధికార పార్టీ నేతలే ఓ ముఖ్య ప్రజాప్రతినిధిపై దుమారం రేపుతున్నారు. మొన్న జాయింట్ కలెక్టర్, తాజాగా డీటీసీ, నగరపాలక సంస్థ కమిషనర్ కుర్చీలను ఖాళీ చేయించేందుకు బేరసారాలు నడుస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టువదలని ఉషాకుమారి.. గతంలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన ఉషాకుమారిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికార పార్టీ నేతలే మాకొద్దు బాబోయ్ అని గగ్గోలు పెట్టారు. నాటకీయ పరిణామాల మధ్య ఆమె శ్రీకాకుళం బదిలీ అయ్యారు. పట్టుమని పది రోజులు కాకుండానే తిరిగొచ్చి ఉడా వీసీ పోస్టు దక్కించుకున్నారు. ఇందుకోసం రాజధాని స్థాయిలో భారీగా పైరవీ సాగిందనే విమర్శలున్నాయి. ముఖ్య ప్రజాప్రతినిధి ‘హస్త’ వాసితోనే తిరిగి పోస్టు దక్కించుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. జేసీ పోస్టుపై రామారావు గురి.. ఉడా వైస్ చైర్మన్ పోస్టును పోగొట్టుకున్న రామారావు తనకు అన్యాయం జరిగిందంటూ రాజధానిలో నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఉషాకుమారిని ఢీకొట్టలేక జాయింట్ కలెక్టర్ సీటుపై దృష్టిసారించారు. ఉన్నత పదవిని చేపట్టిన కొద్దికాలానికే సీటు కోల్పోవడంపై ఆయన తీవ్రంగా ఆవేదన చెందారు. జేసీ కుర్చీ ఇచ్చేందుకు జిల్లాకు చెందిన నేతలు భారీగానే బేరం పెట్టినట్లు తెలుస్తోంది. డీటీసీ పోస్టుపై మ్యాచ్ ఫిక్సింగ్.. జిల్లాలో అతి కీలకమైన ఉప రవాణాశాఖాధికారి పోస్టుకు రాంగ్రూట్లో బేరసారాలు సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ప్రస్తుత డీటీసీపై బదిలీ వేటు వేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు మ్యాచ్ ఫిక్సింగ్ అయినట్లు సమాచారం. ప్రైవేటు బస్సు ఆపరేటర్ల దందాపై డీటీసీ ఉక్కుపాదం మోపారు. ఆపరేటర్ల అక్రమ వ్యాపారం దెబ్బతినడంతో విజయవాడ పార్లమెంట్ స్థాయి టీడీపీ నేత కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య ప్రజాప్రతినిధితో ఆర్థిక లావాదేవీలపై మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. డీటీసీని ఇక్కడ నుంచి సాగనంపుతామని వారం రోజులుగా ప్రచారం సాగిస్తున్నారు. తమ అడుగులకు మడుగులొత్తే అధికారికి ఇక్కడ పోస్టింగ్ ఇప్పించేందుకు ‘లక్షల్లో’ బేరాలు సాగుతున్నాయి. మూడు నెలల్లోనే బదిలీ.. మూడు నెలల క్రితం వచ్చిన నగరపాలక సంస్థ కమిషనర్ హరికిరణ్‌ను ఇక్కడ నుంచి బదిలీ చేయించేందుకు ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ళు, కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలనే యోచనలో కమిషనర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అబ్దుల్ అజీం, పండాదాస్లను ఏడాదిలోపే సాగనంపారు. ముక్కుసూటిగా వ్యవహరించిన కలెక్టర్లు రిజ్వీ, బుద్ధప్రకాష్లపై బదిలీ వేటు వేసిన వారే నేడు హరికిరణ్‌ను సాగనంపేందుకు యత్నాలుసాగిస్తున్నట్లు తెలుస్తోంది. బదిలీలకు కేరాఫ్ సీఎం పేషీ .. సీఎం పేషీ బదిలీలకు కేరాఫ్‌గా మారింది. ఇటీవలే జిల్లాలో 33 మంది ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయి. ఒక్కో పోస్టుకు రూ.2 లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలో అక్రమ ఆదాయం దండిగా వచ్చే సబ్‌రిజిస్ట్రార్ పోస్టుల్ని సీఎం పేషీ నుంచే బది‘లీలలు’ సాగిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా జిల్లానుంచి బయటకు వెళ్లే అధికారులు కూడా సమీప జిల్లాల పోస్టింగ్‌లకోసం ముఖ్య ప్రజాప్రతినిధిపై కాసుల వర్షం కురిపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటన్నింటి వెనుక జిల్లా ముఖ్య ప్రజాప్రతినిధితో పాటు రాష్ట్ర ఉద్యోగ సంఘాల ముఖ్యనేత చక్రం తిప్పుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
ఉషాకుమారికి లైన్‌క్లియర్
మున్సిపల్ శాఖ నుంచి వెలువడిన ఉత్తర్వులు ఉడా వీసీగా నేడు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఫలించని రామారావు యత్నాలు సాక్షి, విజయవాడ : ఉడా వైస్ చైర్మన్ బదిలీ వ్యవహారంలో ఉత్కంఠ తొలగింది. వీజీటీఎం ఉడా వైస్ చైర్మన్‌గా నియమితులైన పి.ఉషాకుమారిని చార్జ్ తీసుకోవాలని సూచిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ నుంచి బుధవారం ఉత్తర్వులు రావటంతో ఆమెకు లైన్‌క్లియర్ అయ్యింది. గురువారం ఆమె బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. ఉడా వైస్ చైర్మన్ బదిలీ వ్యవహారం ఇప్పటివరకు అనేక మలుపులు తిరిగింది. ప్రస్తుత వైస్ చైర్మన్ రామారావు సీటు కాపాడుకోవటానికి చివరి నిమిషం వరకు ప్రయత్నాలు సాగించారు. వాస్తవానికి గత నెల 31న పి.ఉషాకుమారిని ఉడా వైస్‌చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వైస్ చైర్మన్‌గా పనిచేస్తున్న రామారావు ఉడాకు వచ్చి ఎనిమిది నెలలు కూడా పూర్తికాకపోగా, బదిలీ క్రమంలో పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు అందాయి. దీంతో ఆయన పోస్టింగ్ కోసం ప్రయత్నాలు చేయటంతో పాటు అవకాశం ఉంటే ఉడాలోనే కొనసాగించాలని ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ శాఖ కార్యదర్శిని కలిసి విన్నవించారు. ఈ క్రమంలో రామారావు ఇంకా రిలీవ్ కాకుండా కొనసాగుతున్నారు. ఉన్నతాధికారుల వద్ద ఆవేదన మొర పెట్టుకోవడంతో ఫలితం ఉంటుందని రామారావు భావించినా తాజా ఉత్తర్వులతో ఆయన రిలీవ్ కావటం అనివార్యంగా మారింది. -
ఉడాలో కుర్చీలాట సా...గదీతే
రిలీవ్ కాని వైస్ చైర్మన్ రామారావు నూతన వీసీ చేరికపై వీడని సందిగ్ధత రెండు రోజులు వేచిచూడాలని ఉషాకుమారికి పెద్దల సూచన! కొనసాగుతున్న రామారావు యత్నాలు నేడు లేదా రేపు ఉషాకుమారి చేరే అవకాశం ఉడాలో కుర్చీలాట ఇంకా కొన‘సా...గుతోంది’. ప్రస్తుత వైస్ చైర్మన్ రామారావు, నూతనంగా నియమితులైన ఉషాకుమారి తమ పరపతిని ఉపయోగించి ముమ్మరంగా లాబీయింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వైస్‌చైర్మన్‌గా చివరికి ఎవరు వస్తారనేదానిపై సందిగ్ధత నెలకొంది. ఉషాకుమారి సోమవారమే బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా, రామారావు రిలీవ్ కాకపోవటం చర్చనీయాంశంగా మారింది. సాక్షి, విజయవాడ : ఉడా వైస్‌చైర్మన్‌గా పి.ఉషాకుమారిని నియమిస్తూ గత నెల 31న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో వీసీగా ఉన్న రామారావును బదిలీ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ కేటాయించలేదు. ఉషాకుమారి ఈ నెల ఒకటిన బాధ్యతలు స్వీకరించాల్సి ఉండగా వీసీ రామారావు రిలీవ్ కాకుండా నేరుగా హైదరాబాద్ వెళ్లి సోమవారమే తిరిగి వచ్చారు. రిలీవ్ కాకుండా విధుల్లో కొనసాగారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎవరి ప్రయత్నాలు వారివి... ఇద్దరు ఐఏఎస్ అధికారులూ తమ గాడ్ఫాదర్ల ద్వారా ఎవరికివారు సీటు దక్కించుకోవటానికి ముమ్మర యత్నాలు సాగిస్తున్నారు. వైస్ చైర్మన్ రామారావుకు ఐఏఎస్ అయ్యాక వచ్చిన మొదటి మంచి పోస్టింగ్ కావడం.. అదీ తక్కువ రోజుల్లోనే ఆకస్మికంగా బదిలీ చేయటంతో సీటును కాపాడుకోవటానికి ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. హైదరాబాద్ వెళ్లి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ శాఖ కార్యదర్శిని కలిసి తన ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఐఏఎస్ వచ్చాక పోస్టింగ్ కోసం ఎక్కువ కాలం నిరీక్షించాల్సి వచ్చిందని, ఆ తర్వాత వచ్చిన ఉడా పోస్టింగ్‌లోనూ పట్టుమని మూడు నెలలు కూడా పనిచేసే అవకాశం లేదని చెప్పినట్లు తెలిసింది. తన బదిలీ విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేయటంతో పాటు తన గాడ్ఫాదర్ల ద్వారా హైదరాబాద్‌లో లాబీయింగ్ కొనసాగించినట్లు సమాచారం. మరోవైపు చివరి ప్రయత్నాలు చేస్తున్నారని, అవి ఫలించకపోతే మంగళవారం సాయంత్రం ఆయన రిలీవ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. జిల్లా నుంచి బదిలీ అయిన ఉషాకుమారి తన రాజకీయ పరపతితో చక్రం తిప్పి ఉడా వైస్‌చైర్మన్ సీటును పొందగలిగారు. రామారావు ప్రయత్నాల నేపథ్యంలో ఆమె కూడా పావులు కదిపి పోస్టింగ్‌లో చేరే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. వేచిచూడండి... ఈ క్రమంలో పి.ఉషాకుమారి రెండు రోజులు వేచిచూడాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదివారం మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో ఆమె సోమవారం విధుల్లో చేరలేదు. మంగళవారం సాయంత్రం లేదా బుధవారం విధుల్లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు గత నెల 21న విజయవాడలో జేసీగా రిలీవై 31న ఉడా వైస్ చైర్మన్‌గా మళ్లీ పోస్టింగ్ దక్కించుకున్న క్రమంలో 22 నుంచి 31 వరకు ఆమె దరఖాస్తు చేసుకున్న సెలవు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఉడా రాజకీయం.. రాజధానికి..
చైర్మన్ ప్రమేయం లేకుండానే వీసీ బదిలీ రిలీవ్ కాని వైస్ చైర్మన్ రామారావు పోస్టింగ్ కోసం హైదరాబాదులో మకాం రేపు ఉషాకుమారి బాధ్యతల స్వీకరణ! ఉడా వైస్ చైర్మన్ బదిలీ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. విజయవాడలోనే పోస్టింగ్ కోసం మకాం వేసిన ఐఏఎస్ అధికారిణి ఉషాకుమారి ఉడా వైస్ చైర్మన్‌గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం వీసీగా ఉన్న రామారావుకు ఎక్కడా పోస్టింగ్ కేటాయించకుండానే ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ క్రమంలో రామారావు శనివారం బదిలీ కాకుండా నేరుగా హైదరాబాద్ వెళ్లటం చర్చనీయాంశమైంది. మరోవైపు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించటానికి ఉషాకుమారి సిద్ధమయ్యారు. సాక్షి, విజయవాడ : జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన ఉషాకుమారి గత ఏడాది అక్టోబర్‌లో బదిలీ అయ్యారు. పలు కారణాలతో రిలీవ్ కాకుండా ఈ ఏడాది జనవరి వరకు ఇక్కడే జేసీగా కొనసాగారు. శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధుల్లో చేరాల్సి ఉన్నప్పటికీ అక్కడ చేరకుండా ఉండి విజయవాడలో పోస్టింగ్ కోసం విశ్వప్రయత్నాలు చేసి రాజకీయ సహకారంతో అనుకున్నది సాధించారు. దీంతో అకారణంగా వైస్ చైర్మన్‌పై బదిలీ వేటు పడింది. ఉడా వైస్ చైర్మన్ పోస్టింగ్ కోసం దాదాపు ఆరు నెలలు రామారావు ఎదురుచూశారు. చివరకు పోస్టింగ్ వచ్చిన వెంటనే పంచాయతీ ఎన్నికల కోసం పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లారు.. ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమంతో రెండున్నర నెలలు ఉడా సిబ్బంది విధులకు గైర్హాజరయ్యారు.. అనంతరం ఎన్నికల విధుల నిమిత్తం వీసీ మధ్యప్రదేశ్‌కు వెళ్లారు.. ఇలా నిత్యం ప్రత్యేక విధులే ఆయనకు సరిపోయాయి. చివరకు బదిలీ జరిగిన శుక్రవారం కూడా పామర్రులో ఓటర్ల గుర్తింపు కార్డుల్లో అవకతవకలపై విచారణ కోసం ప్రత్యేక డ్యూటీలో వెళ్లారు. ఇలా ఎనిమిది నెలల పదవీకాలంలో ఎక్కువ రోజులు ప్రత్యేక సేవల్లోనే కొనసాగిన ఆయనపై అకస్మాత్తుగా బదిలీ వేటు పడింది. అదీ అకారణంగా కావటం ఉడాలో చర్చనీయాంశమైంది. మరోవైపు ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి అభిప్రాయంతో నిమిత్తం లేకుండానే ప్రభుత్వం వీసీని బదిలీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీసీగా రామారావు రిలీవ్ కాకుండా శనివారం హైదరాబాద్ వెళ్లారు. చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి కూడా హైదరాబాద్‌లోనే ఉండటంతో ఉడా రాజకీయం రాజధానికి చేరినట్లయింది. రాజధానిలో మకాం... వీసీ రామారావు హైదరాబాద్‌లో మకాం వేశారు. కనీసం పోస్టింగ్ కూడా ఎక్కడ కేటాయించకపోవటంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి పోస్టింగ్ కేటాయించాల్సిదిగా విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అవకాశం ఉంటే ఉడాలోనే కొనసాగించాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉషాకుమారి శ్రీకాకుళంలో జేసీగా విధుల్లో చేరలేదు. దీంతో అక్కడ ఆయన్ని నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నూతన విసీగా నియమితులైన ఉషాకుమారి ఈ నెల మూడున బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. వాస్తవానికి శనివారమే చార్జ్ తీసుకుంటారని అందరూ భావించినా వీసీ రామారావు రిలీవ్ కాకపోవటంతో సోమవారం బాధ్యతలు స్వీకరిస్తారని తెలిసింది. మరోపక్క బదిలీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. 6- 10 నుంచి వీరమ్మ తల్లి ఉత్సవాలు ఉయ్యూరు, న్యూస్‌లైన్ : కోర్కేలు తీర్చే కొంగుబంగారం ఉయ్యూరు శ్రీ కనకచింతయ్య సమేత వీరమ్మతల్లి ఉత్సావాలు 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా మాఘశుద్ధ(భీష్మ) ఏకాదశి పర్వదినాన ప్రారంభమై 15రోజులపాటు అంగరంగ వైభవంగా తిరునాల జరుగుతుంది. ఈ ఏడాది భీష్మ ఏకాదశి రోజు సోమవారం రాత్రి 8.30గంటల తరువాత అమ్మవారి తిరునాల ప్రారంభమవుతుంది. ఆనవాయితీ ప్రకారం ఉయ్యూరు టౌన్ పోలీసులు అమ్మవారికి పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు, సారే సమర్పిస్తారు. అనంతరం పారపూడి వంశస్తులు పూజా కార్యక్రమాలు పూర్తిచేసి తల్లిని మెట్టినింటి నుంచి బయటకు తీసుకొచ్చి పల్లకిలో కూర్చోబెట్టి ఊరేగింపు నిర్వహిస్తారు. అమ్మవారు మెట్టినింటి నుంచి ఊరే గింపుగా బయలుదేరగా, వేలాది మంది భక్తులు అఖండ(ఎదురు గండ) దీపాలతో హారతులిచ్చి స్వాగతం పలికి మొక్కుబడి తీర్చుకుంటారు. తిరుగుడు గండ దీపాల భక్తులు వెంటరాగాపట్టణ పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగింపు జరుగుతుంది. 11వ తేదీ సాయంత్రం ప్రధాన సెంటర్లో ఊయల స్తంభాల వద్ద అమ్మవారు ఊరేగి ఆదే రోజు రాత్రి ఆలయ ప్రవేశం చేస్తారు. అక్కడ నుంచి ఆలయంలో భక్తుల పూజలు అందుకుంటారు. ఉత్సవాల్లో 11వ రోజు శిడిబండి ఉత్సవం జరుగుతుంది. ఈ వేడుక ఉత్సావాల్లో ప్రధానమైనది. పెళ్లి కాని ఓ దళిత యువకుడు శిడి బుట్టలో కూర్చుని వేడుక నిర్వహిస్తుండగా భక్తులు ఆ యువకుడు, శిడి బుట్టపై అరటిపండ్లు విసురుతూ భక్తిపారవశ్యం చెందుతారు. ఉత్సవాలకు జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. రంగుల ఉత్సవానికి తరలిన అమ్మవారు... ప్రతి రెండేళ్లకోసారి అమ్మవారి రంగుల ఉత్సవాన్ని కనులపండువగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రంగుల ఉత్సవానికి శనివారం శ్రీకారం చుట్టారు. శ్రీ కనకచింతయ్య సమేత వీరమ్మతల్లి విగ్రహాలకు అనాధిగా మచిలీపట్నంలో రంగులు వేయటం, ఉత్సవం నిర్వహించటం ఆనవాయితీ. దీంతో శనివారం వేకువజామున మెట్టినింటిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీలో జిల్లా కేంద్రానికి తీసుకువెళ్లారు. రంగుల ఉత్సవానికి వెళ్తున్న తల్లికి మార్గమధ్యంలో దారి పొడవున భక్తులు పసుపు నీళ్లు వారపొసి అమ్మవారిని దర్శించుకున్నారు. రాజుపేటకు చెందిన స్వర్ణకారుడు దిలీప్ ఈ ఏడాది సాంప్రదాయ పద్ధతిలో ఉత్సవ విగ్రహాలను ముస్తాబు చేయనున్నారు. రంగుల ఆలంకరణ 7వ తేదీ లోగా పూర్తి చేసి 9వ తేదీవరకు బందరులోని పురవీధులో అమ్మవారు ఊరేగింపు పూర్తి చేసుకొని 10వ తేదీ ఉదయానికి మెట్టినింటిలోకి ప్రవేశిస్తుందని నిర్వాహకులు తెలిపారు. -
నేనింతే...
మళ్లీ జిల్లాకు ఉషాకుమారి ఉడా వైస్ చైర్మన్‌గా నియామకం చక్రం తిప్పిన జిల్లా మంత్రి అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి శ్రీకాకుళంలో చేరకుండానే మళ్లీ విజయవాడకు సాక్షి, విజయవాడ : నేనింతే.. ఎవరేమనుకున్నా సరే జిల్లాలోనే ఉంటా.. అన్నట్టుగా ఉంది జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేసి బదిలీపై వెళ్లిన పి.ఉషాకుమారి తీరు. గత ఏడాది అక్టోబర్‌లోనే బదిలీ అయినా వెళ్లకుండా రకరకాల కారణాలతో ఇక్కడే ఉన్న ఆమె ఎట్టకేలకు ఈ ఏడాది జనవరిలో జిల్లాను వదిలివెళ్లారు. కేవలం 12 రోజుల్లో మళ్లీ కొత్త పోస్టింగ్‌తో ఇక్కడికి వచ్చారు. జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన పి.ఉషాకుమారి బదిలీ వ్యవహారం జిల్లాలో వివాదాస్పదంగా మారింది. అనేక మలుపులు తిరిగి రాజకీయరంగు పులుముకున్న ఈ వ్యవహారంలో జిల్లాకు చెందిన మంత్రి కీలకంగా పనిచేసి చక్రం తిప్పారు. జేసీగా వరుస వివాదాల్లో... 2004 బ్యాచ్‌కి చెందిన పి.ఉషాకుమారి 2012 ఆగస్టు 29న విజయవాడ జాయింట్ కల్టెకర్‌గా బదిలీపై వచ్చారు. జిల్లాలో పాలనపరంగా తనదైన ముద్ర వేసుకోలేకపోయినా వరుస వివాదాల్లో మాత్రం నిలిచారు. స్వయంగా జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆమెను బదిలీ చేయాలని ముఖ్యమంత్రి, ఇతరులకు ఫిర్యాదులు చేశారు. జాయింట్ కలెక్టర్ హోదాలో ఆమె ఇసుక రీచ్‌లను కేటాయించిన వ్యవహారంపై అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రితో పాటు పలువురు అధికారులకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు, పామర్రు ఎమ్మెల్యే డీవై దాస్ బహిరంగంగానే ఫిర్యాదులు చేయటం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఆమెకు జిల్లాకు చెందిన మంత్రి పూర్తిస్థాయిలో మద్దతిస్తూ వచ్చారు. చేపల చెరువుల తవ్వకాల వ్యవహారం, ఎల్ఆర్ఎస్ వ్యవహారాల్లోనూ ఆరోపణలు వినిపించాయి. పలువురు పదేపదే ఆమెపై ఫిర్యాదు చేసినా బదిలీ కాకుండా జిల్లా మంత్రి అడ్డుకుంటూ వచ్చారు. చివరకు అకస్మాత్తుగా గత ఏడాది అక్టోబర్ ఎనిమిదిన శ్రీకాకుళం జేసీగా ఆమెను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. కలెక్టర్ బుద్ధప్రకాష్, జేసీ ఉషాకుమారిల బదిలీ ఒకేరోజు జరగటం తీవ్ర చర్చనీయాంశమైంది. మూడు నెలలు జిల్లాలోనే... జిల్లాకు జేసీగా నియమితులైన మురళి పలు కారణాలు, ఒత్తిళ్లతో విధుల్లో చేరలేదు. ఈ క్రమంలో తుపానును కారణంగా చూపి ఉషాకుమారి రిలీవ్ కాకుండా ఇక్కడే కొనసాగారు. బదిలీ ఉత్తర్వులు వచ్చినా దాదాపు జిల్లాలోనే మూడు నెలలు ఆమె కొనసాగటం వెనుక మంత్రి కృషి ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఎట్టకేలకు జనవరి 21న మురళి జిల్లాలో బాధ్యతలు స్వీకరించటంతో అనివార్య పరిస్థితుల్లో ఉషాకుమారి రిలీవ్ అయ్యారు. అయినా ఆమె శ్రీకాకుళంలో విధుల్లో చేరకుండా ఉండిపోయారు. జేసీ మురళి కూడా రాజ్యసభ నోటిఫికేషన్ వస్తే కోడ్ అమలులోకి వస్తుందనే కారణంగానే జిల్లాలో చేరారు. ఉడా వైస్ చైర్మన్‌గా నియామకం ఉషాకుమారి జిల్లాలో ఐఏఎస్ స్థాయి పోస్టింగ్ కోసం కసరత్తు చేసి ఉడా వైస్‌చైర్మన్‌గా శుక్రవారం నియమితులయ్యారు. సరిగ్గా జిల్లాలో రిలీవైన 12 రోజులకే మళ్లీ ఇక్కడే పోస్టింగ్ దక్కించుకోవటం వెనుక పెద్ద ఎత్తున పొలిటికల్ లాబీయింగ్ నడిచినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులే బహిరంగంగా వ్యతిరేకించినా మంత్రి మాత్రం చక్రం తిప్పినట్లు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రి తీరుపై అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై సీఎం వద్ద పంచాయితీ పెట్టే దిశగా నేతలు యత్నిస్తున్నారు. ఆమె కోసం... కేవలం ఉషాకుమారికి జిల్లాలో పోస్టింగ్ ఇవ్వటం కోసం ఉడా వైస్ చైర్మన్ రామారావుపై బదిలీ వేటు వేయటం చర్చనీయాంశంగా మారింది. ఎక్కడా పోస్టింగ్ కూడా ఇవ్వకపోవటం విచారకరం. -
జిల్లా...వదలా...
జేసీ కుర్చీ కుస్తీ =జిల్లా వీడేందుకు ఉషాకుమారి బెట్టు =మురళీ పట్టు =వారం రోజులపాటు శెలవుపై జేసీ =ఆఖరి ప్రయత్నాలకేనంటూ ప్రచారం సాక్షి, మచిలీపట్నం : ఈ ఏడాది అక్టోబర్‌లో ఒకేసారి ఇద్దరు కీలక అధికారులపై ప్రభుత్వం బదిలీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి, జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారిలను ఏకకాలంలో బదిలీ చేయడం వెనుక రాజకీయ నేతల హస్తం ఉన్నట్టు ప్రచారం జరిగింది. తుపానుల సమయంలో జిల్లాపై అవగాహన ఉన్న ఇద్దరు కీలక అధికారులను ఒకేసారి జిల్లా నుంచి పంపించడం సరికాదన్న కారణాన్ని చూపి జేసీ బదిలీకి అప్పట్లో మంత్రి అడ్డుచక్రం వేశారు. కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి అక్టోబర్ 14న ఇక్కడ విధుల నుంచి రిలీవ్ అయ్యారు. జేసీ ఉషాకుమారి మాత్రం ఇక్కడ కొనసాగుతుండటంతో ఆమె బదిలీ నిలిచిపోయినట్టేనని అందరూ భావించారు. దీంతో జేసీకి అనుకూలంగా, వ్యతిరేకంగా అధికార పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయి పట్టు నిలుపుకొనేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని సీఎం పేషీ నుంచి జాయింట్ కలెక్టర్‌గా ఇక్కడికి బదిలీ అయిన జె.మురళి జిల్లాకు వచ్చి విధుల్లో చేరేందుకు ఒత్తిడి పెంచినట్టు సమాచారం. ఈ విషయమై హైదరాబాద్ నుంచి ఉన్నతస్థాయి అధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు ఇప్పించినట్టు చెబుతున్నారు. ఈ నెల 28న ఆయన జేసీగా ఇక్కడ విధులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో జేసీ ఉషాకుమారి తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ రిలీవ్ అయ్యి తనకు కేటాయించిన శ్రీకాకుళం జిల్లాకు వెళ్లాల్సి ఉంది. ఆఖరి ప్రయత్నంగా... జిల్లాను విడిచి వేళ్లేందుకు ఇష్టపడని జేసీ ఉషాకుమారి ఇక్కడే కొంతకాలం ఉండేందుకు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇక్కడ విధుల్లో చేరేందుకు మురళి ఒత్తిడి పెంచడంతో ఆమె తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ మేరకు తనను కొంతకాలం ఇక్కడే కొనసాగించేలా కలెక్టర్ ఎం.రఘునందనరావు నుంచి కూడా సమ్మతి లేఖ తీసుకుని వెళ్లినట్టు సమాచారం. రాజధాని స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేసేందుకు ఈ నెల 19 నుంచి 25 వరకు ఆరు రోజులపాటు ఆమె సెలవుపై వెళ్లారు. జిల్లాలో కీలకమైన జేసీ పోస్టు ఖాళీగా ఉండటం ఎందుకని ఎవరికైనా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాలని వచ్చిన ప్రతిపాదనను కూడా ఆమె తిరస్కరించినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బెట్టు చేస్తున్న జేసీ ఉషాకుమారి పట్టు సాధిస్తారో.. పట్టుబడుతున్న మురళి బందరు గట్టుకు చేరుకుంటారో చూద్దాం. -
‘ఆధార్’కు వారం గడువు
జిల్లాలోని వివిధ సంక్షేమ శాఖల్లో కొనసాగుతున్న ఆధార్ కార్డుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి అర్జీలను అందజేశారు. కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : ప్రజావాణి కార్యక్రమంలో జేసీతోపాటు డీఆర్వో ఎల్.విజయచందర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఉషాకుమారి మాట్లాడుతూ ఆధార్ నమోదు ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. ఆధార్ కార్డుల నమోదు, ఎన్రోల్మెంట్ విషయంలో నమోదైన శాతం ప్రకారం కాకుండా లబ్ధిదారుడిపరంగా నివేదిక పూర్తిస్థాయిలో ఉండాలన్నారు. ఆధార్‌కార్డు పొందని వారు తీసుకునేలా చూడాలన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలకు జాప్యం చేయకుండా పరిష్కారం చూపాలన్నారు. మెప్మా పీడీ పి.అనిల్‌కుమార్ మాట్లాడుతూ ఉపాధిహామీ కూలీలకు సంబంధించి ఇప్పటివరకు 84 శాతం ఆధార్ నమోదు ప్రక్రియ జరిగిందన్నారు. ఈ నెల 15 తర్వాత ఉపాధిహామీ పనుల ద్వారా కూలీలకు చెల్లించాల్సిన సొమ్మును ఆధార్‌కార్డుల ద్వారా చెల్లించడానికి ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. ప్రజావాణికి వచ్చిన అర్జీల్లో కొన్నింటిని పరిశీలిద్దాం. దళితవాడలో రహదారి నిర్మాణం కోసం సేకరించే భూమికి నిధులు మంజూరుచేయాలని కృత్తివెన్ను మండలం మునిపెడ గ్రామానికి చెందిన డి.ఇషాక్రావు జేసీకి అర్జీ ఇచ్చారు. బాపులపాడు మండలం బిల్లనపల్లి గ్రామానికి చెందిన మన్నెం సూరిబాబు తన స్వాధీనంలో ఉన్న భూమికి రెవెన్యూ అధికారులు పట్టాభూమిని మంజూరు చేయాలంటూ అర్జీ ఇచ్చారు. మచిలీపట్నం కొబ్బరితోట ప్రాంతంలో లోవోల్టేజీ కారణంగా విద్యుత్ సరఫరా సక్రమంగా జరగడం లేదని, దీన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని సీహెచ్.రాము కోరారు. మచిలీపట్నంలో అపరిశుభ్రత, కలుషితనీరు కారణంగా ప్రజలు రోగాలబారిన పడుతున్నారని, వీటి నివారణకు వైద్యశాఖ.. మునిసిపల్ కమిషనర్‌కు తగిన ఆదేశాలు జారీ చేయాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు. సుల్తానగరం గ్రామ పంచాయతీ పరిధిలో 250 మంది పేదలకు ఇళ్లస్థలాలు కేటాయించేందుకు భూమి అందుబాటులో ఉందని, గ్రామంలోని పేదలకు ఈ స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ మాజీ సర్పంచి జోగి ఏసుప్రభు అర్జీ అందజేశారు. పెడన మండలం మడక గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తప్పులు దొర్లాయని, రీకౌంటింగ్ చేయాలని గ్రామానికి చెందిన వై.వెంకటేశ్వరరావు అర్జీలో కోరారు. మచిలీపట్నం మున్సిపాలిటీలో పీయూసీ వర్కర్‌గా ఉన్న తనను 1995లో తొలగించారని, అనంతరం తనకంటే సర్వీసు తక్కువ ఉన్న వారిని కోర్టు ఆదేశాల ప్రకారం విధుల్లోకి తీసుకున్నారని వై.దుర్గాప్రసాద్ ఫిర్యాదు చేశారు. సీనియార్టీ ఉన్న తనను మాత్రం విధుల్లోకి తీసుకోవడం లేదని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అర్జీలో పేర్కొన్నారు. కోడూరు గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో పోస్టల్ బ్యాలెట్లు లెక్కించకుండా ఎన్నికల అధికారులు నిలిపివేశారు. సరైన కారణాలు చెప్పకుండా పోస్టల్ బ్యాలెట్లను పక్కనపెట్టారు. దీనిపై చర్య తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ ఐదవ వార్డు సభ్యుడు యోగప్రకాష్ జేసీకి అర్జీ ఇచ్చారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ కె.శివశంకర్, జెడ్పీ సీఈవో కొండయ్యశాస్త్రి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ డి.మధుసూదనరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ రంగరాజారావు, డీఎస్వో పీబీ సంధ్యారాణి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.