కాసుల వేట.. బదిలీల ఆట
ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. స్వామికార్యం, స్వకార్యం చక్కబెట్టుకునేందుకు అధికార పార్టీ తెరతీసింది. కీలక శాఖల్లో మొదలుపెట్టిన కుర్చీలాట వివాదాస్పదంగా మారుతోంది. సొంత లాభం ఉంటే చాలు.. నిబంధనలకు పాతరేసి బదిలీల జాతరకు నాయకులు బరితెగిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఐఏఎస్ అధికారులు జిల్లాను వదిలి వెళ్లడానికి ఇష్టపడడం లేదు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ : ఇటీవల జరుగుతున్న బదిలీల వెనుక జిల్లాకు చెందిన కీలక రాజకీయ నాయకులతోపాటు వారిని ప్రభావితం చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడ్డదోవలో ఉపాధ్యాయ బదిలీల్లో అందినంత మూటగట్టుకున్నారన్న అపవాదును నెత్తినేసుకున్న అధికార పార్టీ నేతలు తాజాగా ఉన్నతాధికారుల పోస్టులపై గురిపెట్టారు. రెండు జిల్లాలకు చెందిన ముఖ్య పోస్టుకు లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు అధికార పార్టీ నేతలే ఓ ముఖ్య ప్రజాప్రతినిధిపై దుమారం రేపుతున్నారు. మొన్న జాయింట్ కలెక్టర్, తాజాగా డీటీసీ, నగరపాలక సంస్థ కమిషనర్ కుర్చీలను ఖాళీ చేయించేందుకు బేరసారాలు నడుస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పట్టువదలని ఉషాకుమారి..
గతంలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన ఉషాకుమారిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికార పార్టీ నేతలే మాకొద్దు బాబోయ్ అని గగ్గోలు పెట్టారు. నాటకీయ పరిణామాల మధ్య ఆమె శ్రీకాకుళం బదిలీ అయ్యారు. పట్టుమని పది రోజులు కాకుండానే తిరిగొచ్చి ఉడా వీసీ పోస్టు దక్కించుకున్నారు. ఇందుకోసం రాజధాని స్థాయిలో భారీగా పైరవీ సాగిందనే విమర్శలున్నాయి. ముఖ్య ప్రజాప్రతినిధి ‘హస్త’ వాసితోనే తిరిగి పోస్టు దక్కించుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
జేసీ పోస్టుపై రామారావు గురి..
ఉడా వైస్ చైర్మన్ పోస్టును పోగొట్టుకున్న రామారావు తనకు అన్యాయం జరిగిందంటూ రాజధానిలో నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఉషాకుమారిని ఢీకొట్టలేక జాయింట్ కలెక్టర్ సీటుపై దృష్టిసారించారు. ఉన్నత పదవిని చేపట్టిన కొద్దికాలానికే సీటు కోల్పోవడంపై ఆయన తీవ్రంగా ఆవేదన చెందారు. జేసీ కుర్చీ ఇచ్చేందుకు జిల్లాకు చెందిన నేతలు భారీగానే బేరం పెట్టినట్లు తెలుస్తోంది.
డీటీసీ పోస్టుపై మ్యాచ్ ఫిక్సింగ్..
జిల్లాలో అతి కీలకమైన ఉప రవాణాశాఖాధికారి పోస్టుకు రాంగ్‌రూట్‌లో బేరసారాలు సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ప్రస్తుత డీటీసీపై బదిలీ వేటు వేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు మ్యాచ్ ఫిక్సింగ్ అయినట్లు సమాచారం. ప్రైవేటు బస్సు ఆపరేటర్ల దందాపై డీటీసీ ఉక్కుపాదం మోపారు. ఆపరేటర్ల అక్రమ వ్యాపారం దెబ్బతినడంతో విజయవాడ పార్లమెంట్ స్థాయి టీడీపీ నేత కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య ప్రజాప్రతినిధితో ఆర్థిక లావాదేవీలపై మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. డీటీసీని ఇక్కడ నుంచి సాగనంపుతామని వారం రోజులుగా ప్రచారం సాగిస్తున్నారు. తమ అడుగులకు మడుగులొత్తే అధికారికి ఇక్కడ పోస్టింగ్ ఇప్పించేందుకు ‘లక్షల్లో’ బేరాలు సాగుతున్నాయి.
మూడు నెలల్లోనే బదిలీ..
మూడు నెలల క్రితం వచ్చిన నగరపాలక సంస్థ కమిషనర్ హరికిరణ్‌ను ఇక్కడ నుంచి బదిలీ చేయించేందుకు ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ళు, కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలనే యోచనలో కమిషనర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అబ్దుల్ అజీం, పండాదాస్‌లను ఏడాదిలోపే సాగనంపారు. ముక్కుసూటిగా వ్యవహరించిన కలెక్టర్లు రిజ్వీ, బుద్ధప్రకాష్‌లపై బదిలీ వేటు వేసిన వారే నేడు హరికిరణ్‌ను సాగనంపేందుకు యత్నాలుసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
బదిలీలకు కేరాఫ్ సీఎం పేషీ ..
సీఎం పేషీ బదిలీలకు కేరాఫ్‌గా మారింది. ఇటీవలే జిల్లాలో 33 మంది ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయి. ఒక్కో పోస్టుకు రూ.2 లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలో అక్రమ ఆదాయం దండిగా వచ్చే సబ్‌రిజిస్ట్రార్ పోస్టుల్ని సీఎం పేషీ నుంచే బది‘లీలలు’ సాగిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా జిల్లానుంచి బయటకు వెళ్లే అధికారులు కూడా సమీప జిల్లాల పోస్టింగ్‌లకోసం ముఖ్య ప్రజాప్రతినిధిపై కాసుల వర్షం కురిపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటన్నింటి వెనుక జిల్లా ముఖ్య ప్రజాప్రతినిధితో పాటు రాష్ట్ర ఉద్యోగ సంఘాల ముఖ్యనేత చక్రం తిప్పుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.