the ruling party leaders
-
భూదాహం
భూదందాలు, కబ్జాల్లో మునిగితేలుతున్న అధికారపార్టీ నేతలు రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత, శ్రీరాం పేరుతో ఆగడాలు మండలాలను విభజించుకుని దందాలు సాగిస్తోన్న అనుచరులు రూ.కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం ఇళ్లస్థలాల పేరుతో పేదలకు వంచన పూర్తిగా సహకరిస్తున్న అధికార యంత్రాంగం – ఇది ప్రకృతి విపత్తు వల్ల జరిగిన నష్టం కాదు! అధికార పార్టీ నేతల భూదాహానికి నిరుపేద కుటుంబాలు బలైన దృశ్యమిది. అనంతపురం శివారులోని కక్కలపల్లిలో ఉన్న ప్రభుత్వ స్థలంలో 132 కుటుంబాలు గుడిసెలు వేసుకుని నివాసముండేవి. వీరికి ఇళ్లపట్టాలు ఇప్పిస్తామని ఎన్నికల ప్రచారంలో ఇప్పటి మంత్రి పరిటాల సునీత హామీ ఇచ్చారు. కానీ అధికారం దక్కిన తర్వాత మొత్తం గుడిసెలను పోలీసుల అండతో గత ఏడాది కూల్చేశారు. మంత్రి సోదరుడు మురళి, బంధువు మహేంద్ర వచ్చి ఖాళీ చేయాలని చెప్పారని, తాము ససేమిరా అనడంతో గుడిసెలను కూల్చేసి నిలువ నీడ లేకుండా చేశారని బాధితులు ఆరోపించారు. ఈ ఒక్కచోటే కాదు..అనంతపురం రూరల్ పరిధిలో ఎక్కడ ప్రభుత్వ స్థలాలు, అసైన్డ్భూములు కన్పించినా.. కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు ఉపక్రమిస్తున్నారు. ఖాళీ స్థలం కన్పిస్తే ‘పరిటాల’ పేరుతో పచ్చజెండాలు పాతేస్తున్నారు. టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత రెండున్నరేళ్లుగా ఇది రివాజుగా మారింది. పైగా వారు కన్నేస్తోన్న స్థలాలు ఎక్కడో మారుమూల ఉన్నవి కావు. అనంతపురం నగరానికి అతి దగ్గరగా ఉన్నవే! ఇవి రూ.కోట్ల విలువ చేస్తాయి. నిత్యం ఎక్కడో ఒకచోట భూదందాలు సాగుతోన్న అధికార యంత్రాంగం అడ్డుకోలేకపోతోంది. అడ్డు చెబితే బదిలీలు..అవసరమైతే భౌతికదాడులకు దిగుతారనే భయంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొందరు అధికారులు మాత్రం మెప్పుకోసం వారికి సహకరిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే టీడీపీ నేతలు ప్రతి అంశంలోనూ ఆదాయమార్గాన్ని అన్వేషిస్తూ, అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఖాళీగా ఉన్న అసైన్డ్ భూములు, పేదలు పూరి గుడిసెలు వేసుకున్న ప్రభుత్వ స్థలాలపై కన్నేస్తున్నారు. అధికారుల అండతో వీటిని కబ్జా చేస్తున్నారు. వీరిలో ‘పరిటాల’ పేరుతో కబ్జాలు చేసేవారి సంఖ్యే అధికంగా ఉంది. మొదట ఎంతోకొంత చిల్లర విదిల్చి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. కుదరకపోతే కబ్జాలకు తెగిస్తున్నారు. ఆత్మకూరు మండలం బి.యాలేరులో 4.40 ఎకరాల అసైన్డ్‌భూమిని ఈ గ్రామ దళితులు దాదాపు 200 మంది ఇళ్లస్థలాల కోసం తులశమ్మ అనే మహిళ నుంచి కొనుగోలు చేశారు. ఈ భూమిని తహశీల్దార్‌కు స్వాధీనం చేసి.. ఇళ్ల పట్టాలు తీసుకోవాలని భావించారు. ఈ తంతు 2014కు ముందు జరిగింది. ఎన్నికల తర్వాత పట్టాలివ్వకుండా అధికారపార్టీ నేతలు అడ్డుకున్నారు. పైగా భూమిని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. టీడీపీలో క్రియాశీలకంగా ఉండే కార్యకర్తలకు ఇందులో పట్టాలివ్వాలని భావిస్తున్నారు. దీంతో డబ్బు చెల్లించి భూమి కొనుగోలు చేసిన బాధితులు లబోదిబోమంటున్నారు. సొంతిల్లు, ఇంటి స్థలం లేనివారికే పట్టాలివ్వాలనేది ప్రభుత్వ నిబంధన. కానీ బి.యాలేరులో దీనికి భిన్నంగా జరుగుతోంది. ఇక్కడ టీడీపీ అత్యంత బలహీనంగా ఉంది. దీంతో ఇళ్ల పట్టాలిప్పిస్తామంటూ గ్రామస్తుల్లో చిచ్చురేపి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కక్కలపల్లిలో ఐదెకరాల ప్రభుత్వస్థలంలో ఏడాది కిందట కొంతమంది టీడీపీ నేతలు ‘పరిటాల రవీంద్ర కాలనీ’ పేరుతో బోర్డుపెట్టారు. దాదాపు 200 గుడిసెలు వేయించారు. ఇక్కడ పట్టాలిప్పిస్తామని కొందరు భారీగా దండుకున్నారు. ఇందులో రెండెకరాలు పేదలకు ఇచ్చి, మిగిలిన మూడెకరాలను స్వాధీనం చేసుకోవాలనే కుట్రతోనే 'తమ్ముళ్లు' వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఏర్పాటైన బోర్డుతో తమకు సంబంధం లేదని టీడీపీ నేతలు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఏడాది కిందట అనంతపురంలోని హౌసింగ్‌బోర్డులో ఓ స్థల వివాదంలో ఓ ప్రజాప్రతినిధి జోక్యం చేసుకున్నారు. ఏ అండా లేని ఓ వ్యక్తికి సంబంధించిన రూ.కోటి విలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని భావించారు. దీనికి అడ్డొచ్చిన ఓ సీఐని లూప్ లైన్‌కు పంపారు. బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం సమీపంలో సర్వే నంబర్ 777లో పదెకరాల చెరువు పొరంబోకు స్థలం ఉంది. ఇందులో చెట్లు పెంచుకునేందుకు స్థానికులైన ఐదుగురికి లీజుకిచ్చారు. అయితే ఇక్కడి టీడీపీ నేతలు ‘ఎన్టీఆర్ కాలనీ’ పేరుతో గుడిసెలు వేశారు. పట్టాలిప్పిస్తామని ఒక్కొక్కరి వద్ద రూ.2వేలు వసూలు చేశారు. నిజానికి పట్టాల పేరుతో ఆ స్థలాన్ని దక్కించుకోవాలనే వ్యూహంతోనే ఈ పన్నాగం పన్నారు. జేఎన్టీయూ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన 3.80 ఎకరాల స్థలంలో అక్రమంగా ఇళ్లు నిర్మించి ‘నారా లోకేశ్‌బాబు కాలనీ’ అని పేరు పెట్టారు. ఈ స్థలం కూడా రూ.కోట్లు విలువ చేస్తుంది. -
వరద కాలువ టెండర్లు రద్దు
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లాలో కుందూ–పెన్నా వరద కాలువ నిర్మాణానికి సంబంధించిన టెండర్లు శుక్రవారం చివరి నిమిషంలో రద్దయ్యాయి. రూ.112 కోట్ల విలువైన ఈ పనుల టెండర్ల నిర్వహణలో జరిగిన లోటుపాట్లపై సర్వత్రా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ అధికారులు టెండర్‌ను రద్దు చేశారు. టెండర్ నోటిఫికేషన్లో జరిగిన తప్పులను సరిదిద్ది త్వరలో మళ్లీ జారీ చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వివరాలిలా వున్నాయి. ప్రొద్దుటూరు పట్టణానికి మంచినీరు అందించేందుకు మొత్తం రూ.183కోట్ల వరద కాలువ నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం రూ.112కోట్లతో పనులు చేపట్టేందుకు అధికారులు టెండర్లు నిర్వహించారు. భూసేకరణకు సంబంధించి అభ్యంతరం లేనిచోట పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. అయితే టెండర్ నిబంధనల తీరుపై పలువురు కాంట్రాక్టర్లు ఇంజనీరింగ్ అధికారుల వ్యవహారశైలిని విమర్శించారు. టెండర్లు నిర్వహిస్తే కోర్టును ఆశ్రయించేందుకు కూడా కొందరు కాంట్రాక్టర్లు, నేతలు సిద్ధమయ్యారు. అలాగే పలువురు నేతలు కూడా ఈ నిబంధనల పట్ల అధికారులను ప్రశ్నించారు. అలాగే ఈ పనులను ఎలాగైనా దక్కించుకునేందుకు స్థానికంగా అధికారపార్టీ నేతలు తీవ్రస్థాయిలో పోటీపడ్డారు. చివరి రోజు కావడంతో శుక్రవారం హైదరాబాద్‌లోని చీఫ్ ఇంజనీర్ కార్యాలయానికి వెళ్లారు. విమర్శలు వెల్లువెత్తడంతో టెండర్లో పొరపాట్లను గమనించిన ఇంజనీరింగ్ అధికారులు శుక్రవారం సాయంత్రం 3.30 ప్రాంతంలో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ టెండర్‌కు పోటీపడిన తెలుగు తమ్ముళ్లు నిరాశతో వెనుదిరికి వచ్చారు. మార్పులు చేయాల్సి ఉంది: ఎస్ఈ ఈ విషయంపై చిన్ననీటిపారుదల శాఖ జిల్లా ఎస్ఈ శంకర్‌రెడ్డిని సాక్షి వివరణ కోరగా కమిషనర్ ఆఫ్ టెండర్స్ నిబంధనల ప్రకారం జాయింట్ వెంచర్లు టెండర్లో పాల్గొనకూడదన్నారు. తమకు ఈ విషయం తెలియకపోవడంతో జాయింట్ వెంచర్లను కూడా ఆహ్వానించామన్నారు. అలాగే సర్ఫేస్ డ్యాం నిబంధనల్లో కూడా మార్పులు చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రద్దయిన వరద కాలువ పనులకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుని వీలైనంత త్వరలో తిరిగి టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. -
కొండనూ కొల్లగొడుతున్నారు!
►అనుమతులు లేకుండానే ► అక్కమాంబ కొండపై తవ్వకాలు, బ్లాస్టింగ్లు ► అక్రమార్కులకుఅధికార పార్టీ నేతల అండ ► చర్యలకు వెనకాడుతున్న అధికారులు కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గం పరిసరాల్లో ఎకోరియన్ పవన్ విద్యుత్ కంపెనీ ఆధ్వర్యంలో గాలిమరలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను కంపెనీ పలువురికి సబ్‌కాంట్రాక్ట్ ఇచ్చింది. గాలిమరల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను సబ్‌స్టేషన్‌కు అనుసంధానించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన విద్యుత్ టవర్లను ప్రైవేటు భూములలో ఏర్పాటు చేయాలంటే భూ యజమానులకు లక్షలాది రూపాయల పరిహారం చెల్లించాలి. దీంతో కంపెనీ కొండ చుట్టూ, పైన పొరంబోకు స్థలంలో విద్యుత్ టవర్లను ఏర్పాటు చేసి పరిహారం సొమ్మును మిగుల్చుకునేందుకు సిద్ధమైంది. అధికార పార్టీ నేతల అండ కూడా ఉండటంతో ఈ పనులను చకచకా చేసుకుపోతోంది. ఇందుకోసం పెద్ద పెద్ద యంత్రాలతో కొండను తవ్వుతున్నారు. గుంతలు తవ్వి.. బండలు వచ్చిన చోట ట్రాక్టర్ బ్లాస్టింగ్ యంత్రాలతో వాటిని పేల్చుతున్నారు. అనంతపురం ప్రధాన రహదారి పక్కనే ఉన్న అక్కమాంబ కొండలో ఈ విధ్వంసం సాగిపోతోన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. రెవెన్యూ, మైన్స్అండ్ జియాలజీ శాఖల అనుమతులు.. ఏపీ వాల్టా చట్టం లాంటివేవీ అక్రమార్కులకు అడ్డురాలేదు. ఆలయ, కొండ సంరక్షణను చూసుకోవాల్సిన ఆలయ కమిటీ ముడుపులు తీసుకుని కొండనే అమ్మేందుకు సిద్ధపడిందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చర్యలు చేపట్టని అధికారులు ఎలాంటి అనుమతుల్లేకుండా అక్కమాంబ కొండను ధ్వంసం చేస్తున్నా.. అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం వెనకంజ వేస్తోంది. అక్రమార్కులను కట్టడి చేయడానికి తహశీల్దార్ రవీంద్రనాథ్, సీఐ మన్సూరుద్దీన్ రంగంలోకి దిగడంతో అధికార పార్టీ ముఖ్యనేతల నుంచి ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. కొండ వద్దకు చేరుకున్న సీఐ... యంత్రాల యజమానులు, ఆలయ కమిటీ అధ్యక్షుడు గోవిందప్పను మందలించారు. ఇందుకు స్పందించిన కమిటీ అధ్యక్షుడు ఆలయ అభివృద్ధికి రూ.లక్షలు ఇస్తామన్నందునే సహకరించామని సమాధానమిచ్చారు. ఇది జరిగిన కొద్దిసేపటికే పోలీసు అధికారికి అధికార పార్టీ నేతల నుంచి ఫోన్లలో ఒత్తిళ్లు అధిక మయ్యాయి. మునిసిపాలిటీ అనుమతులున్నాయా?! కొండలో విద్యుత్ టవర్ల ఏర్పాటు కోసం విధ్వంసానికి పాల్పడుతున్న కాంట్రాక్టర్లకు మున్సిపాలిటీ అనుమతులున్నాయా అనే అనుమానం కలుగుతోంది. మునిసిపల్ చైర్మన్ వైపీ రమేష్ మాత్రం అనుమతులు ఇచ్చామని చెబుతున్నారు. రెవెన్యూ అనుమతుల్లేవ్ -రవీంద్రనాథ్, తహశీల్దార్ అక్కమాంబ కొండలో గాలిమరల కంపెనీ కాంట్రాక్టర్లు పనులు చేపట్టడానికి రెవెన్యూ అనుమతుల్లేవు. చట్ట ప్రకారం కొండ పొరంబోకు ప్రాంతంలో పనులకు రెవెన్యూశాఖ అనుమతులుండాలి. వాటిని తీసుకోకుండా పనులు చేస్తున్నందున నిలిపివేశాం. తిరిగి చేపడితే చర్యలు తప్పవు. కాంట్రాక్టర్లపై కేసులు పెడతాం - రామాంజినేయులు, ఈవో, దేవాదాయ శాఖ అక్కమాంబ కొండలో ఎలాంటి అనుమతుల్లేకుండా యంత్రాలతో తవ్వకాలు చేస్తున్న కాంట్రాక్టర్లపై కేసులు పెడతాం. ఆలయ అభివృద్ధి బాధ్యత ఆలయ కమిటీకి ఉంటుంది. కొండలో పనులు చేపట్టాలంటే వివిధ శాఖల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. -
‘భూ’ ప్రకంపనలు
► సంచలనం సృష్టిస్త్తున్న ‘సాక్షి’ కథనాలు ► ఎక్కడ చూసినా ‘రాజధాని దురాక్రమణ’పైనే చర్చ ► రాజకీయ, అధికారవర్గాల్లోనూ కలకలం ► ఎవరి బండారం బయటపడుతుందోనని గుబులు ► మంత్రులు, టీడీపీ నేతల భూ బాగోతంపై జనాగ్రహం ► కడుపులు కొట్టి భూములు మింగారని ఆందోళన ► అన్యాయం చేసిన వారి పాపం ఊరికే పోదని శాపనార్థాలు ఊళ్లల్లో తిరుగుతూ హడావుడి చేసిన మంత్రి నారాయణ మూడు వేల ఎకరాలు కొనేశాడా..! ఓ రైతు ఆశ్చర్యం ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని చెప్పి ప్రపంచ స్థాయి భూ కుంభకోణానికి తెరతీశారా..! మరొకరి అనుమానం ‘సాక్షి’లో సాక్ష్యాధారాలతో సహా వచ్చాయిగా ఇంకా సందేహమెందుకు..? ఇంకొకరి సమర్థన ...రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా ‘దేశం’ దురాక్రమణ’పైనే చర్చ సాక్షి, విజయవాడ బ్యూరో/మంగళగిరి : రాజధాని ప్రాంతంలో అధికార పార్టీ చేసిన అడ్డగోలుLand exploitation,పై ‘సాక్షి’ దినపత్రికలో ‘రాజధాని దురాక్రమణ’ పేరుతో వచ్చిన కథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. రాజకీయ, అధికార వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేపాయి. ప్రధానంగా రాజధాని ప్రాంతాలైన మంగళగిరి, తుళ్లూరు, అమరావతి మండలాల్లో ఈ కథనాలు ప్రకంపనలు సృష్టించాయి. దురాక్రమణలో టీడీపీ నేతల నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండడంతో రేపటి కథనాల్లో ఎవరి బండారం బయటపడుతుందోనని అధికార పార్టీ నేతలు గుబులు చెందుతున్నారు. భూముల క్రయ విక్రయాల్లో అధికార పార్టీ నేతలకు సహకరించిన రియల్ఎస్టేట్ వ్యాపారులు, దళారులు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో నేతలకు సహకరించిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. పక్కా సాక్ష్యాధారాలతో ప్రచురితం అవుతున్న కథనాలపై పోలీస్, ఇంటిలిజెన్స్ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తంచేస్తూ విచారణకు దిగారు. కడుపు కొట్టారంటూ కూలీల ఆవేదన.. రాజధాని పేరుతో రాజకీయ వ్యాపారం చేస్తున్నారని రైతులు, కూలీలు ప్రభుత్వ తీరును ఎండగడుతు న్నారు. ముఖ్యమంత్రి కుటుంబం, మంత్రులు, టీడీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ భూములు లాక్కుని రాజధాని కడతారనుకుంటే వాటిని స్వాధీనం చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారని మండిపడుతున్నారు. వ్యవసాయం లేకుండా పోయి నానా బాధలు పడుతున్నామని రైతులు, పనులు లేకుండా రోడ్డున పడ్డామని కూలీలు ఆందోళన చెందుతున్నారు. భూములు లాక్కుని తమ కడుపులు కొట్టారని వెంకటపాలెం రైతు పి.శేఖర్ ఆవేదనగా చెప్పాడు. రాజధాని పేరుతో తమ ప్రాంతాన్ని సర్వ నాశనం చేశారని, టీడీపీ తమను నట్టేట ముంచిందని తాళ్లాయపాలెంలో ఏసోబు అనే కార్మికుడు ఆవేదనగా చెప్పాడు. చుకుంటే ఏమీ మిగలదని చెప్పడంతో చాలా తక్కువ రేటుకు తన భూమి అమ్మేశానని మందడం గ్రామానికి చెందిన రైతు నాగేశ్వరరావు తెలిపాడు. తమకు అన్యాయం చేసిన వాళ్ల పాపం ఊరికే పోదని శాపనార్ధాలు పెడుతున్నారు. కొమ్మాలపాటి కుచ్చుటోపీపై తీవ్ర చర్చ... పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ నిర్వహిస్తున్న అభినందన హౌసింగ్ సంస్థ రాజధాని గ్రామమైన యర్రబాలెంలో 42 ఎకరాలు కొనుగోలు చేసి వాయిదాల పద్ధతిలో ప్లాట్లు విక్రయించింది. రాజధాని ప్రకటన తర్వాత కొందరు ఖాతాదారులకు ఇక్కడ కాకుండా వేరేవెంచర్లలో ప్లాట్లు కేటాయించింది. మరి కొందరికి నగదు తిరిగి చెల్లించింది. ఇంకా 500కు పైగా ఖాతాదారులు తమకు అక్కడే ప్లాట్లు కేటాయించాలని తిరుగుతుండగా అనుమతులు రావంటూ భయపెట్టి, ఆ భూములను భూ సమీకరణకు కూడా ఇవ్వకుండా మెగా సిటీ నిర్మాణం కోసం ప్లాన్ చేస్తున్నారని వచ్చిన కథనం ఖాతాదారు ల్లో ఆగ్రహాన్ని రగిల్చినట్లు సమాచారం. దీంతో కొందరు ఖాతాదారులు కలిసి సంఘంగా ఏర్పడి తమకు ప్లాట్లు అక్కడే కేటాయించే విధంగా సంస్థపై ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్టు ఓ ఖాతాదారుడు తెలిపారు. ఖాతాదారుల్లో ఉలికిపాటు.. రాజధాని భూ దురాక్రమణ కథనాల్లో భాగంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని రామ కృష్ణా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వెంచర్లో 194 ఎకరాల్లో 54 ఎకరాలు అసైన్డు భూములున్నాయని రావడం యాజమాన్యంతో పాటు అధికార వర్గాల్లోనూ ఆందోళన రేకెత్తించింది. కొందరు ఖాతాదారులు తాము కొనుగోలు చేసిన ప్లాట్లలో ఏవైనా అసైన్డు భూములు ఉన్నాయా.. అని ఆరాలు తీయడం ప్రారంభించారు. దీనిపై యాజమాన్యం ముందు జాగ్రత్తగా వచ్చిన వినియోగదారులను విజయవాడ కార్యాలయానికి పిలిపించి, ఆందోళన చెందాల్సిన పనిలేదని నచ్చజెప్పి పంపినట్లు సమాచారం. బెదిరించి దోచుకున్నారు.. పేపర్లో కొన్ని భూములే వచ్చాయి. అన్ని ఊళ్లలోనూ నాయకులు భూములు కొన్నారు. కూలి చేసుకునే వాళ్లం మేం ఏం చేయగలం. ఏదైనా మాట్లాడితే బెదిరిస్తున్నారు. -దార్ల విజయ్‌కుమార్ రాయపూడి రైతుల్ని నట్టేట ముంచారు మా భూములన్నీ కొల్లగొట్టి వాటితో ఇప్పుడు వ్యాపారం చేసుకుంటున్నారు. సాగు భూములన్నీ బీళ్లయిపోయాయి. రాజధాని సంగతేమో కాని మమ్మల్ని నట్టేట ముంచేశారు. -పి.శేఖర్, వెంకటపాలెం మాకు మట్టిదిబ్బలు మిగిల్చారు.. టీడీపీ నాయకులు మొదట్లో కార్లేసుకుని మా ఊళ్లలో తిరిగారు. తక్కువ రేటుకు భూములు కొనేశారు. వాళ్ల స్వార్థం చూసుకుని మాకు మట్టిదిబ్బలు మిగిల్చారు. - ఆర్ ముక్కంటి, తాళ్లాయపాలెం -
ఇదేం పాలన?
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో పాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన యంత్రాంగం తద్భిన్నంగా స్పందిస్తోంది. అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అన్నట్లుగా ఇష్టారాజ్యమైంది. జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య తీవ్ర జఠిలంగా మారింది. ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి చర్యలు చేపట్టాల్సిన ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వ్యక్తిగత ఆదాయ మార్గాలపై ఉన్న ప్రత్యేక చొరవ జిల్లాభివృద్ధిపై కన్పించడం లేదు. వెర సి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, సూచనలకు జిల్లాలో తావు లేకుండా పోతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అధికార పార్టీ నేతలు ప్రకృతి సంపదను అందివచ్చిన అవకాశంగా మలుచుకుంటున్నారు. యథేచ్ఛగా అక్రమంగా కొల్లగొడుతున్నారు. ఇసుక, మైనింగ్, ఎర్రచందనం కారణంగా పాలకపక్షం నాయకుల అక్రమ సంపాదనకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రభుత్వం సూచించిన దానికంటే పది రెట్లు ఎక్కువగా ఇసుక అక్రమంగా తరలుతోంది. పగలు ప్రభుత్వ డంప్‌లకు.. రాత్రులు అక్కడి నుంచి ఇతర చోట్లకు యథేచ్ఛగా తరలిస్తున్నారు. జిల్లాలో పాలనను గాడిలో పెట్టాల్సిన అత్యున్నతాధికారి తనకు ఏది నచ్చితే అదే కరెక్టు అన్నట్లుగా వ్యవహరించడం వివాదాస్పదమవుతోంది. సమస్యలపై ప్రజలు ఏకరువు పెట్టినా కనీస స్పందన ఉండడం లేదని పలువురు ఊదాహరణలతో సహా వివరిస్తున్నారు. తాగు నీటి సమస్య తీవ్రం జిల్లా వ్యాప్తంగా 463 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రతరమైంది. ట్రాన్సుపోర్టర్లు ఆశించిన మేరకు నీరు సరఫరా చేయడం లేదు. సమీక్షించించి తగు చర్యలు చేపట్టాల్సిన యంత్రాంగం మిన్నకుండి పోయింది. ట్రాక్టర్‌కు రూ.500 మాత్రమే కేటాయిస్తున్నారని తాము చేతి నుంచి భరించాల్సిన దుస్థితి నెలకొందని ట్రాన్సుపోర్టు ఆపరేటర్లు నీటి సరఫరాకు వెనకాడుతున్నారు. ఇలాంటి పరిస్థితి జిల్లాలో డిసెంబర్ నుంచే ఉత్పన్నమైంది. ప్రస్తుతం మరింత ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. నీటి సమస్యను పరిష్కరించాల్సిన యంత్రాంగం.. ఇసుకపై మరింత ఆదాయాన్ని ఎలా పొందాలి.. ఎర్ర చందనాన్ని ఎలా విక్రయించాలి.. మంగంపేట బరైటీస్ను ఎలా కొల్లగొట్టగలగాలి.. అన్న ధోరణిలో నిమగ్నమైందని బాహాటంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా ఇసుకను తరలిస్తూ భూగర్భ జలాలు మరింత అధఃపాతాళానికి వెళ్లేలా వ్యవహరిస్తున్నా ఎలాంటి చర్యలు లేవు. జిల్లాలో 48 మండలాల్ని కరువు మండలాలుగా ప్రభుత్వం గుర్తించడం మినహా ప్రత్యేక శ్రద్ధ చూపి సహాయక చర్యలు చేపట్టడ ంలో యంత్రాంగం విఫలమైంది. పశువులకు గ్రాసం లేదు. వలసల నివారణకు ఉపాధి కల్పన ఆశించిన స్థాయిలో లేదు. కరువు నేపథ్యంలో ఉపాధి పనుల్లో ప్రజాప్రతినిధుల అభ్యర్థనకు తగిన గుర్తింపు లేదని పలువురు ఆరోపిస్తున్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడి, పంటల ఇన్స్యూరెన్సు 2011-14 వరకూ పెండింగ్‌లో ఉంది. ఇన్ని సమస్యలతో జనం సతమతమవుతుంటే ప్రభుత్వం, అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. టీడీపీ నేతల పట్ల మాత్రమే శ్రద్ధ జిల్లా ప్రజల పట్ల, జిల్లాభివృద్ధి పట్ల ఏమాత్రం చొరవ చూపెట్టని యంత్రాంగం తెలుగు తమ్ముళ్ల పట్ల ప్రత్యేక చొరవ చూపుతోంది. నిబంధనలకు విరుద్ధమైనా సరే పోట్లదుర్తి బ్రదర్స్ ఆదేశిస్తే గంగిరెద్దులా తలూపుతూ వ్యవహారం చక్కబెట్టుతోన్నట్లు తెలుస్తోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ముద్దనూరు మండలం చిన్నదుద్యాల గ్రామంలో చేపడుతోన్న అక్రమ మైనింగ్ వ్యవహారమే. సర్వే నంబర్ 221లో క్వారీకి అనుమతి కోసం ముద్దనూరు మండల వాసులు మోహన్‌రెడ్డి, నారాయణరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ భూమి పశువుల మేత పరంబోకు అంటూ మైనింగ్ అధికారులు తిరస్కరించారు. అదే సర్వేనంబర్‌లో మైనింగ్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా పోట్లదుర్తి బ్రదర్స్‌లో ఒకరు దరఖాస్తు చేసుకున్నారు. ఆగమేఘాలపై అనుమతులు ఇచ్చేందుకు రెవిన్యూ యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. అనుమతులు ఇచ్చేందుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు మార్గం సుగమం చేస్తోంది. జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, తహాశీల్దారు, మైనింగ్ యంత్రాంగం ఇటీవల ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అనుమతులు రాకుండానే యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌కు పాల్పడుతుంటే అధికారులు గుడ్లప్పగించి చూస్తున్నారని జనం గగ్గోలు పెడుతున్నారు. ఈ సమస్యలన్నింటిపై నేడు (మంగళవారం) నిర్వహించనున్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు చర్చించాలని ప్రజలు కోరుతున్నారు. -
శాండ్ రిచ్
అనంతపురం సెంట్రల్ : ఇసుక రీచ్‌లపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. త్వరితగతిన సంపాదనకు ఏకైక వనరుగా ఇసుక రీచ్‌లే కనిపిస్తున్నారుు. దీంతో తొలుత లక్ష క్యూబిక్ మీటర్లు ఇసుక వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ప్రస్తుతం మూడు లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వుకోవడానికి ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోతాయని స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నా నేతల ఒత్తిళ్లు మాత్రం ఆగడం లేదు. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వర్షాభావ ప్రాంతమైన జిల్లాలో తాగునీటికి కొరత ఉందేమో కానీ అనేక నదీ పరివాహక ప్రాంతాలు ఉండడంతో ఇసుకకు కొదవలేదు. ఇన్నాళ్లు తెరవెనుక ఉండి ఇసుక వ్యాపారం చేస్తున్న నాయకులు.. ఈ ప్రభుత్వ హయాంలో అధికారికంగానే ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా ఇసుక వ్యాపారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో తాడిమర్రి మండలం సీసీ రేవు గ్రామంలో చిత్రావతి నది, పెన్నానది పరివాహక ప్రాంతాలైన పెద్దపప్పూరు, చిన్న ఎక్కలూరు గ్రామం, శింగనమల మండలం ఉల్లికల్లు గ్రామంలో ఇసుక రీచ్‌లను గుర్తించారు. ఈ మూడు రీచ్‌లలో లక్ష క్యూబిక్ మీటర్లు తవ్వుకోవచ్చునని గుర్తించారు. ఆమేరకు మహిళా సంఘాల ద్వారా వ్యాపారం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సీసీరేవు, చిన్న ఎక్కలూరులో ఇసుక రీచ్‌లు ప్రారంభించగా.. వ్యాపారం కూడా మొదలైంది. శింగనమల మండలంలోని ఉల్లికల్లులో మొదలు కావాల్సి ఉంది. భూగర్భ జలాలు అడుగంటి పోతాయని ఆ గ్రామ ప్రజలు ఇసుక రీచ్‌లను వ్యతిరేకిస్తున్నారు. గత నెలలో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ అధ్యక్షతన గ్రామ ప్రజలతో సంప్రదింపులు జరిపినా ఫలితం రాలేదు. లక్ష్యం పెంచి.. ప్రతిపాదనలు స్వయం సహాయక సంఘాలను అడ్డుపెట్టుకొని అధికార పార్టీ నేతలు ఇసుక రీచ్‌లపై పెత్తనం చెలాయిస్తున్నారు. డ్వాక్రా మహిళలకే ఇసుక రీచ్‌లు కేటారుుస్తామని బయటకు చెబుతున్నా, లోలోపల మాత్రం అంతా టీడీపీ నేతలే చక్రం తిప్పుతున్నారు. ఇటీవల ప్రారంభించిన ఇసుక రీచ్‌లలో లక్షలాది రూపాయల విక్రయాలు జరిపారు. వ్యాపారం జోరందుకోవాలంటే ఇబ్బడిముబ్బడిగా తవ్వుకోవాలని భావించిన నేతలు లక్ష క్యూబిక్ మీటర్లు ఏమాత్రం సరిపోదని, మూడు లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వడానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. రెండు నెలల క్రితం ఉల్లికల్లు గ్రామంలో పోలీసు బందోబస్తు మద్య స్థానిక ఎమ్మెల్యే ఇసుక రీచ్‌ను ప్రారంభించినా, ఇప్పటికీ తవ్వకాలు మొదలు పెట్టనివ్వడం లేదు. మిగిలిన చోట్ల కూడా ప్రజల అభిప్రాయాన్ని కాదని తవ్వకాలు చేపడుతున్నారు. తొలుత లక్ష క్యూబిక్ మీటర్లు మాత్రమేనని చెప్పడంతో ప్రజలు అంగీకరించారు. ప్రస్తుతం మూడు లక్షల క్యూబిక్ మీటర్లకు అనుమతులు ఇవ్వడానికి రంగం సిద్ధమైన నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను ఎలా అణచివేయూలా అని అలోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇసుక తవ్వకాల్లో నిర్వాహకులు చేతి వాటం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు పది ట్రిప్పులు పంపితే ఏడెనిమిది మాత్రమే నమోదు చేస్తున్నట్లు సమాచారం. మిగతా రెండు మూడు ట్రిప్పులు దొడ్డిదారిన అమ్ముకుంటున్నట్లు తెలిసింది. -
కాసుల వేట.. బదిలీల ఆట
ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. స్వామికార్యం, స్వకార్యం చక్కబెట్టుకునేందుకు అధికార పార్టీ తెరతీసింది. కీలక శాఖల్లో మొదలుపెట్టిన కుర్చీలాట వివాదాస్పదంగా మారుతోంది. సొంత లాభం ఉంటే చాలు.. నిబంధనలకు పాతరేసి బదిలీల జాతరకు నాయకులు బరితెగిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఐఏఎస్ అధికారులు జిల్లాను వదిలి వెళ్లడానికి ఇష్టపడడం లేదు. సాక్షి ప్రతినిధి, విజయవాడ : ఇటీవల జరుగుతున్న బదిలీల వెనుక జిల్లాకు చెందిన కీలక రాజకీయ నాయకులతోపాటు వారిని ప్రభావితం చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడ్డదోవలో ఉపాధ్యాయ బదిలీల్లో అందినంత మూటగట్టుకున్నారన్న అపవాదును నెత్తినేసుకున్న అధికార పార్టీ నేతలు తాజాగా ఉన్నతాధికారుల పోస్టులపై గురిపెట్టారు. రెండు జిల్లాలకు చెందిన ముఖ్య పోస్టుకు లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు అధికార పార్టీ నేతలే ఓ ముఖ్య ప్రజాప్రతినిధిపై దుమారం రేపుతున్నారు. మొన్న జాయింట్ కలెక్టర్, తాజాగా డీటీసీ, నగరపాలక సంస్థ కమిషనర్ కుర్చీలను ఖాళీ చేయించేందుకు బేరసారాలు నడుస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టువదలని ఉషాకుమారి.. గతంలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన ఉషాకుమారిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికార పార్టీ నేతలే మాకొద్దు బాబోయ్ అని గగ్గోలు పెట్టారు. నాటకీయ పరిణామాల మధ్య ఆమె శ్రీకాకుళం బదిలీ అయ్యారు. పట్టుమని పది రోజులు కాకుండానే తిరిగొచ్చి ఉడా వీసీ పోస్టు దక్కించుకున్నారు. ఇందుకోసం రాజధాని స్థాయిలో భారీగా పైరవీ సాగిందనే విమర్శలున్నాయి. ముఖ్య ప్రజాప్రతినిధి ‘హస్త’ వాసితోనే తిరిగి పోస్టు దక్కించుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. జేసీ పోస్టుపై రామారావు గురి.. ఉడా వైస్ చైర్మన్ పోస్టును పోగొట్టుకున్న రామారావు తనకు అన్యాయం జరిగిందంటూ రాజధానిలో నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఉషాకుమారిని ఢీకొట్టలేక జాయింట్ కలెక్టర్ సీటుపై దృష్టిసారించారు. ఉన్నత పదవిని చేపట్టిన కొద్దికాలానికే సీటు కోల్పోవడంపై ఆయన తీవ్రంగా ఆవేదన చెందారు. జేసీ కుర్చీ ఇచ్చేందుకు జిల్లాకు చెందిన నేతలు భారీగానే బేరం పెట్టినట్లు తెలుస్తోంది. డీటీసీ పోస్టుపై మ్యాచ్ ఫిక్సింగ్.. జిల్లాలో అతి కీలకమైన ఉప రవాణాశాఖాధికారి పోస్టుకు రాంగ్రూట్లో బేరసారాలు సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ప్రస్తుత డీటీసీపై బదిలీ వేటు వేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు మ్యాచ్ ఫిక్సింగ్ అయినట్లు సమాచారం. ప్రైవేటు బస్సు ఆపరేటర్ల దందాపై డీటీసీ ఉక్కుపాదం మోపారు. ఆపరేటర్ల అక్రమ వ్యాపారం దెబ్బతినడంతో విజయవాడ పార్లమెంట్ స్థాయి టీడీపీ నేత కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య ప్రజాప్రతినిధితో ఆర్థిక లావాదేవీలపై మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. డీటీసీని ఇక్కడ నుంచి సాగనంపుతామని వారం రోజులుగా ప్రచారం సాగిస్తున్నారు. తమ అడుగులకు మడుగులొత్తే అధికారికి ఇక్కడ పోస్టింగ్ ఇప్పించేందుకు ‘లక్షల్లో’ బేరాలు సాగుతున్నాయి. మూడు నెలల్లోనే బదిలీ.. మూడు నెలల క్రితం వచ్చిన నగరపాలక సంస్థ కమిషనర్ హరికిరణ్‌ను ఇక్కడ నుంచి బదిలీ చేయించేందుకు ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ళు, కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలనే యోచనలో కమిషనర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అబ్దుల్ అజీం, పండాదాస్లను ఏడాదిలోపే సాగనంపారు. ముక్కుసూటిగా వ్యవహరించిన కలెక్టర్లు రిజ్వీ, బుద్ధప్రకాష్లపై బదిలీ వేటు వేసిన వారే నేడు హరికిరణ్‌ను సాగనంపేందుకు యత్నాలుసాగిస్తున్నట్లు తెలుస్తోంది. బదిలీలకు కేరాఫ్ సీఎం పేషీ .. సీఎం పేషీ బదిలీలకు కేరాఫ్‌గా మారింది. ఇటీవలే జిల్లాలో 33 మంది ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయి. ఒక్కో పోస్టుకు రూ.2 లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలో అక్రమ ఆదాయం దండిగా వచ్చే సబ్‌రిజిస్ట్రార్ పోస్టుల్ని సీఎం పేషీ నుంచే బది‘లీలలు’ సాగిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా జిల్లానుంచి బయటకు వెళ్లే అధికారులు కూడా సమీప జిల్లాల పోస్టింగ్‌లకోసం ముఖ్య ప్రజాప్రతినిధిపై కాసుల వర్షం కురిపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటన్నింటి వెనుక జిల్లా ముఖ్య ప్రజాప్రతినిధితో పాటు రాష్ట్ర ఉద్యోగ సంఘాల ముఖ్యనేత చక్రం తిప్పుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.