భూదాహం | Thirsty land | Sakshi
Sakshi News home page

భూదాహం

Published Thu, Dec 22 2016 10:41 PM | Last Updated on Mon, Sep 4 2017 11:22 PM

భూదాహం

భూదాహం

  • భూదందాలు, కబ్జాల్లో మునిగితేలుతున్న  అధికారపార్టీ నేతలు
  • రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత, శ్రీరాం పేరుతో ఆగడాలు
  • మండలాలను విభజించుకుని దందాలు సాగిస్తోన్న అనుచరులు
  • రూ.కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం
  • ఇళ్లస్థలాల పేరుతో పేదలకు వంచన
  • పూర్తిగా సహకరిస్తున్న అధికార యంత్రాంగం
  •  

    – ఇది ప్రకృతి విపత్తు వల్ల జరిగిన నష్టం కాదు! అధికార పార్టీ నేతల భూదాహానికి నిరుపేద కుటుంబాలు బలైన దృశ్యమిది. అనంతపురం శివారులోని కక్కలపల్లిలో ఉన్న ప్రభుత్వ స్థలంలో 132 కుటుంబాలు గుడిసెలు వేసుకుని నివాసముండేవి. వీరికి ఇళ్లపట్టాలు ఇప్పిస్తామని ఎన్నికల ప్రచారంలో  ఇప్పటి మంత్రి పరిటాల సునీత హామీ ఇచ్చారు.  కానీ అధికారం దక్కిన తర్వాత  మొత్తం గుడిసెలను పోలీసుల అండతో గత ఏడాది కూల్చేశారు. మంత్రి సోదరుడు మురళి, బంధువు మహేంద్ర వచ్చి ఖాళీ చేయాలని చెప్పారని, తాము ససేమిరా అనడంతో గుడిసెలను కూల్చేసి నిలువ నీడ లేకుండా చేశారని బాధితులు ఆరోపించారు.

                       ఈ ఒక్కచోటే కాదు..అనంతపురం రూరల్‌ పరిధిలో ఎక్కడ ప్రభుత్వ స్థలాలు, అసైన్డ్‌భూములు కన్పించినా.. కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు ఉపక్రమిస్తున్నారు. ఖాళీ స్థలం కన్పిస్తే ‘పరిటాల’ పేరుతో పచ్చజెండాలు పాతేస్తున్నారు. టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత రెండున్నరేళ్లుగా ఇది రివాజుగా మారింది. పైగా వారు కన్నేస్తోన్న స్థలాలు ఎక్కడో మారుమూల ఉన్నవి కావు. అనంతపురం నగరానికి అతి దగ్గరగా ఉన్నవే! ఇవి రూ.కోట్ల విలువ చేస్తాయి. నిత్యం ఎక్కడో ఒకచోట భూదందాలు సాగుతోన్న అధికార యంత్రాంగం అడ్డుకోలేకపోతోంది. అడ్డు చెబితే బదిలీలు..అవసరమైతే భౌతికదాడులకు దిగుతారనే భయంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొందరు అధికారులు మాత్రం మెప్పుకోసం వారికి సహకరిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే  టీడీపీ నేతలు ప్రతి అంశంలోనూ ఆదాయమార్గాన్ని అన్వేషిస్తూ, అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు.  ఖాళీగా ఉన్న అసైన్డ్‌ భూములు, పేదలు పూరి గుడిసెలు వేసుకున్న ప్రభుత్వ స్థలాలపై కన్నేస్తున్నారు. అధికారుల అండతో వీటిని కబ్జా చేస్తున్నారు. వీరిలో ‘పరిటాల’ పేరుతో కబ్జాలు చేసేవారి సంఖ్యే అధికంగా ఉంది. మొదట  ఎంతోకొంత చిల్లర విదిల్చి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. కుదరకపోతే కబ్జాలకు తెగిస్తున్నారు.

    • ఆత్మకూరు మండలం బి.యాలేరులో 4.40 ఎకరాల అసైన్డ్‌భూమిని ఈ గ్రామ దళితులు దాదాపు 200 మంది ఇళ్లస్థలాల కోసం తులశమ్మ అనే మహిళ నుంచి కొనుగోలు చేశారు. ఈ భూమిని తహశీల్దార్‌కు స్వాధీనం చేసి.. ఇళ్ల పట్టాలు తీసుకోవాలని భావించారు. ఈ తంతు 2014కు ముందు జరిగింది. ఎన్నికల తర్వాత పట్టాలివ్వకుండా అధికారపార్టీ నేతలు అడ్డుకున్నారు. పైగా భూమిని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. టీడీపీలో క్రియాశీలకంగా ఉండే కార్యకర్తలకు ఇందులో పట్టాలివ్వాలని భావిస్తున్నారు. దీంతో డబ్బు  చెల్లించి భూమి కొనుగోలు చేసిన బాధితులు లబోదిబోమంటున్నారు. సొంతిల్లు, ఇంటి స్థలం లేనివారికే  పట్టాలివ్వాలనేది ప్రభుత్వ నిబంధన. కానీ బి.యాలేరులో దీనికి భిన్నంగా జరుగుతోంది. ఇక్కడ టీడీపీ అత్యంత బలహీనంగా ఉంది. దీంతో ఇళ్ల పట్టాలిప్పిస్తామంటూ గ్రామస్తుల్లో చిచ్చురేపి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
    • కక్కలపల్లిలో ఐదెకరాల ప్రభుత్వస్థలంలో ఏడాది కిందట కొంతమంది టీడీపీ నేతలు ‘పరిటాల రవీంద్ర కాలనీ’ పేరుతో బోర్డుపెట్టారు. దాదాపు 200 గుడిసెలు వేయించారు. ఇక్కడ పట్టాలిప్పిస్తామని కొందరు భారీగా దండుకున్నారు. ఇందులో రెండెకరాలు పేదలకు ఇచ్చి, మిగిలిన మూడెకరాలను స్వాధీనం చేసుకోవాలనే కుట్రతోనే 'తమ్ముళ్లు' వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఏర్పాటైన బోర్డుతో తమకు సంబంధం లేదని టీడీపీ నేతలు ఎలాంటి ప్రకటనా చేయలేదు.
    • ఏడాది కిందట అనంతపురంలోని హౌసింగ్‌బోర్డులో ఓ స్థల వివాదంలో ఓ ప్రజాప్రతినిధి జోక్యం చేసుకున్నారు. ఏ అండా లేని ఓ వ్యక్తికి సంబంధించిన రూ.కోటి విలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని భావించారు. దీనికి అడ్డొచ్చిన ఓ సీఐని లూప్‌ లైన్‌కు పంపారు.
    • బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం సమీపంలో సర్వే నంబర్‌ 777లో పదెకరాల చెరువు పొరంబోకు స్థలం ఉంది. ఇందులో చెట్లు పెంచుకునేందుకు స్థానికులైన ఐదుగురికి లీజుకిచ్చారు. అయితే ఇక్కడి టీడీపీ నేతలు ‘ఎన్‌టీఆర్‌ కాలనీ’ పేరుతో గుడిసెలు వేశారు. పట్టాలిప్పిస్తామని ఒక్కొక్కరి వద్ద రూ.2వేలు వసూలు చేశారు. నిజానికి పట్టాల పేరుతో ఆ స్థలాన్ని దక్కించుకోవాలనే వ్యూహంతోనే ఈ పన్నాగం పన్నారు.
    • జేఎన్‌టీయూ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు చెందిన 3.80 ఎకరాల స్థలంలో అక్రమంగా ఇళ్లు నిర్మించి ‘నారా లోకేశ్‌బాబు కాలనీ’ అని పేరు పెట్టారు. ఈ స్థలం కూడా రూ.కోట్లు విలువ చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement