alienation
-
సంఘీభావమే పరాయీకరణకు మందు
మనిషి క్రమంగా మనిషితనానికి దూరమై మాయమవుతున్నాడు. ఆధునిక పెట్టుబడిదారీ ఉత్పాదక వ్యవస్థలో అతడు ఒక మహాయంత్రంలో చిన్న ‘మర’ లాంటి పాత్రను పోషిస్తున్నాడు. ఈ క్రమంలో సృజనాత్మకతను కోల్పోయి వస్తూత్పత్తి యంత్రంగా మిగిలిపోతున్నాడు. తాను తయారుచేసే వస్తువు పట్ల సంతృప్తి పొందలేకపోతున్నాడు. ఇలా మొత్తంగా పరాయీకరణకు గురై... మనిషి సొంత గుర్తింపు రద్దు అవుతున్న స్థితిలో, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అవసరం ఉన్నా లేకున్నా... వస్తువులను కొంటూ పోతున్నాడు. ఈ వస్తు వినిమయంలోనే ఆనందాన్ని వెదుక్కొంటున్నాడు. తద్వారా వస్తువులే మానవ సంబంధాలను నిర్ణయించే స్థితి ఏర్పడుతోంది. అందుకే సముదాయాల నడుమ అర్థవంతమైన సంఘీభావాన్ని నిర్మించడమే ఇప్పుడు కావలసింది. పెట్టుబడిదారీ విధానాన్ని సునిశిత విమర్శకు గురి చేసే కార్ల్‌మార్క్స్ నేటికీ తన ప్రాసంగికత కోల్పోలేదు. పెట్టుబడిదారీ విధానంలో తీవ్రమైన ఆర్థిక అసమానతలు పెరిగిపోతాయనీ, అలాగే వేతన శ్రామికుని పరాయీ కరణ జరిగే విధానాన్నీ మార్క్స్ పేర్కొన్నాడు. తన తొలి రచనలలో– మనిషి తన పట్ల, తన చుట్టూ ఉన్న ప్రకృతి పట్ల ఎరుక ఉన్న జీవిగా (స్పీసీస్–బీయింగ్) ఒక రకమైన పరాయీకరణకు గురవ్వడాన్ని ప్రస్తావించాడు. తరువాతి కాలపు రచనలలో ఆయన ఎక్కువగా ఈ పరాయీకరణకు కారణమైన వ్యవస్థీకృత సాంకేతిక అంశాల మీద చూపు నిలిపాడు. పెట్టుబడిదారీ ఉత్పత్తి పద్ధతిలో శ్రామికులు సాధా రణంగా తాము చేసే వస్తు ఉత్పత్తితో ముడి పడి ఉండే సంతృప్తినీ, ఉత్పత్తి అయిన వస్తువుతో తమకు జోడై ఉండే గుర్తింపునూ ఎట్లా కోల్పోతారో వివరించే యత్నం చేశాడు. శ్రమ విభజన ప్రధానంగా ఉండే పెట్టుబడిదారీ ఉత్పత్తి పద్ధతిలో ఉత్పత్తి సామర్థ్యానికి ఇచ్చే ప్రాధాన్యం వల్ల శ్రామికులు వస్తూత్పత్తిలోని ఏదో ఒక అంశానికే పరిమితమై ఆ పనిని మాత్రమే గానుగెద్దులా చేసే యంత్రంలా మారి పోతారనీ, ఈ క్రమంలో తమ సాధారణ మానవ సున్నితత్వాలనూ, ఉత్పత్తితో ఉండే గుర్తింపునూ కోల్పోతారనీ మార్క్స్ వివరిస్తాడు. ఈ రకమైన పరాయీకరణ వలన శ్రామికులకు తాముచేస్తున్న పనులతో మమేకత్వం ఉండదు. ఈ అంశాన్నే సమకాలిక మానవ శాస్త్రవేత్త డేవిడ్ గ్రాబార్, పెట్టుబడిదారీ యుగంలో ‘పనికిమాలిన ఉద్యోగాలు’ (బుల్షిట్ జాబ్స్) ఉన్నాయని ప్రతిపాదించాడు. పనికి మాలిన నౌకరీ అంటే ఏమిటో వివరిస్తూ గ్రాబార్ – అవి వేతన శ్రామి కులకు ఏమాత్రం తృప్తిని ఇవ్వనివీ, అర్థరహితమైనవీ అంటాడు. ఇంకా చెప్పాలంటే శ్రామికులు చేస్తున్న పనులు వారి సొంత విలువను ఏ తీరులోనూ పెంచేవి కావనీ అంటాడు. అర్థరహితం, విలువలేని పనులు రాను రానూ అనేక రంగాలలోకి విస్తరిస్తున్నాయనిపిస్తుంది. పెచ్చుపెరిగిపోతున్న ఆటోమేషన్, కృత్రిమ మేధకు లభిస్తున్న ప్రాధాన్యం చూస్తే రాబోయే కాలంలో ఈ పరిస్థితి తీవ్రం అయ్యేటట్టు కనిపిస్తోంది. ఈ స్థితి తీవ్ర మానవ అసంతృప్తికి కారణం అవుతోంది. చేసిన పని నుండి మనం పొందే తృప్తి ఎందుకు మనకు అంద కుండా పోతుంది? మనం ఒక మహా ప్రక్రియ (యంత్రం)లో ప్రాధా న్యంలేని చిన్న పని చేసే ‘మర’ స్థాయికి కుదించబడటమే దీనికి కారణం అని చెప్పుకోవచ్చు. ఉత్పత్తి ప్రక్రియలో ఒక సహజమైన ఉత్సాహ శక్తి ఉబికి రావడం మరుగున పడిపోయి... వాటి స్థానంలో ఆర్థిక, గణిత, అల్గారిథమ్స్లకు ప్రాధాన్యం వచ్చింది. చరిత్రకారుడు యువల్ నోవా హారారీ ఇరవై ఒకటవ శతాబ్దిలో అత్యంత ప్రధానమైన పదం కంప్యూటర్ ఆధార గణన లేక ‘అల్గారిథమ్స్’ అంటాడు. ఈ మారిన పని పరిస్థితులను జాగ్రత్తగా గమనించిన అభివృద్ధి అర్థ శాస్త్రవేత్త గై స్టాండింగ్... ‘ప్రికారియట్’(అసురక్షిత లేక అస్థిర కార్మి కులు) తప్పని పరిస్థితులు అన్న భావన తీసుకువచ్చారు. ఈ భావన ప్రకారం పర్మనెంటు నౌకరీలు తగ్గిపోతూ... కాసింత ఉద్యోగ భద్రత, పెన్షన్ సౌకర్యం, ఆరోగ్య రక్షణ వంటివి పూర్తిగా కనుమరుగైపోయి స్వల్పకాల కాంట్రాక్టులు, తాత్కాలిక ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఈ రకమైన నూతన శ్రామికులను ‘ప్రికారియట్’ అంటున్నాడాయన. సమకాలిక పెట్టుబడిదారీ ఉత్పత్తి వ్యవస్థలో కొత్త పని ప్రపంచాలు వీరితో నిండిపోతున్నాయని అంటున్నాడు. మన కాలంలో పని... అర్థరాహిత్యానికీ, అభద్రతకూ ఏకకాలంలో దారితీస్తోంది. గై స్టాండింగ్, మార్టిన్ గ్రాబర్ వంటి సామాజిక పరిశీలకులు ఈ రకమైన పనికిమాలిన పనులకు, దారుణమైన అభద్రత గల పని పరిస్థితులకు సార్వత్రిక కనీస ఆదాయం (యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్) ఒక పరిష్కారంగా చూస్తున్నారు. అయితే పని లేదా శ్రమ లక్ష్యం కేవలం ఆదాయ సంపాదన మాత్రమే కాదు. అది పని చేస్తున్న వారికి ఆత్మతృప్తినీ, పరిపూర్తి అనుభూతినీ ఇవ్వడం కూడా ప్రధానం అన్న అమర్త్య సేన్ చెప్పిన ఒక విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి. ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇట్లా మనిషి సొంత గుర్తింపు రద్దు అవుతున్న స్థితిలో, మనిషి కొనుగోలుదారుగా మారి... కోల్పోయిన వ్యక్తిత్వాన్ని తన కప్పిపుచ్చుకునే కొనుగోలుదారీతనంతో భర్తీ చేసుకునే కంపెన్సేటరీ కన్సూ్యమరిజమ్లోకి మారిపోతున్నాడు. అలా మారి ‘తాము బాగున్నాం’ అనేదానికి గుర్తుగా వస్తువులు కొను క్కోవాలి అనే ‘కొనుగోలుదారీ’ అవస్థలోకి జారుకుంటున్నాడని ప్రముఖ మార్క్సిస్ట్ భూగోళ విజ్ఞాని డేవిడ్ హార్వే విశ్లేషిస్తున్నారు. ఇటువంటి కొనుగోలుదారీతనానికి నెట్‌ఫ్లిక్స్‌ను ఉదాహరణగా చూపుతున్నాడు. ఈ రకమైన వస్తువులు మీటనొక్కడం ద్వారా అనేక మంది ఒకేసారి వాడుకునే లక్షణం కలిగి ఉన్నవి. కళ్ళు జిగేల్మనే మాల్స్‌లో షాపింగ్ అనుభూతి ఒక కొత్త లోకంలోకి పోయిన అనుభూతిని ఇస్తుంది. ఆ విధంగా మానవ జీవితాలను వస్తువులు ఆక్రమించేస్తున్నాయి. మనుషులు తమ ఇంగితాల మీద, సున్నితత్వాల మీద నియంత్రణ కోల్పోతారని మార్క్స్ చాలాకాలం కిందనే ఊహిం చాడు. దాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. వస్తువులే మానవ సంబంధాలను నిర్ణయించే స్థితి ఏర్పడుతుంది. వస్తువులకు ఉండే మారకపు విలువనే వస్తువు ఉపయోగ విలువను నిర్ణయిస్తుంది. ఈ స్థితినే ఆయన ‘వస్తు వ్యామోహ సంస్కృతి’ అన్నాడు. ఈ పరిస్థితే దుస్సహమైన పని పరిస్థితులను, పనికిమాలిన ఉద్యోగాలను పుట్టించి మనుషులలో తీవ్రమైన పరాయీకరణకు దారితీస్తుందనీ అన్నాడు. ఆ మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయి. ఈ ఆధునిక పరాయీకరణ పరిస్థితులు కేవలం ఆర్థిక రంగానికి అంటే మార్కెట్‌కు మాత్రమే పరిమితమై ఉండవు. అవి సామాజిక, వ్యక్తిగత, రాజకీయ జీవితాలలోకి కూడా వ్యాపిస్తాయి. రాజ్య యంత్రమూ, దానికున్న సార్వభౌమాధికారమూ; అది నియంత్రించే ప్రాంతం మీదా, ప్రజల మీదా ఉండే అధికారం సందర్భంలోనూ ఈ పరాయీకరణ ప్రభావం కనిపిస్తుంది. ప్రజల నుండి పాలన పరాయీకరణకు గురి కావడం ఒక కీలక అంశం. పాలనాధికారం విపరీతంగా కేంద్రీకరించబడటం, పాలకులు తాము చాలా ప్రత్యేకం అనుకోవడం, సామాన్య ప్రజలను దూరం పెట్టడం ఈ పరాయీకరణ రూపాలే. ‘అరబ్ స్ప్రింగ్ ’ పోరాటాలూ, ‘ఆక్యుపై వాల్‌స్ట్రీట్’ పోరా టాలూ... పరాయీకరించబడిన సమూహాలు, జాతి రాజకీయ జీవ నంతో తిరిగి పెనవేసుకోవడానికి పడుతున్న ఆరాటానికి చిహ్నాలు! పాలనా యంత్రాంగం, ప్రతినిధులు... ప్రజారాశుల నుండి పూర్తిగా వేరుపడటం అనే పరాయీకరణ ప్రాతినిధ్య సంక్షోభానికి (క్రైసిస్ ఆఫ్ రిప్రెజెంటేషన్) దారి తీస్తున్నది. ప్రతినిధులను ప్రజలు నమ్మని స్థితి ఇది. ఒక రకంగా పైన పేర్కొన్న పోరాటాలు ఈ అవినీతికర స్థితికి వ్యతిరేకంగా ప్రజలు ప్రదర్శించే ఆగ్రహ వ్యక్తీకరణగా అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వాతావరణంలో పరాయీకరణ వల్ల ప్రేరేపితం అయిన నిస్సార కొనుగోలుదారీతనానికీ, ప్రాతినిధ్య సంక్షోభం వల్ల పుట్టు కొస్తున్న, పరిమిత దృష్టి కలిగిన తమ వాటాకు మాత్రమే ప్రాధాన్య మిచ్చే ఉనికి రాజకీయ వాదులకూ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవలసి ఉంది. తమ పరిధిని తీవ్రంగా పరిమితంగా ఉంచుకునే ఉనికి రాజకీయాలకూ, నిస్సార కొనుగోలుదారీ తత్వానికీ కారణం... మనిషి తన నుండీ, సముదాయం నుండీ పరాయీకరించ బడటమే. ఈ స్థితిలో ఊహాశక్తితో అనేక (పీడిత) సముదాయాల నడుమ నాణ్యమైన, అర్థవంతమైన సంఘీభావాన్ని నిర్మించే వైపు చేసే గట్టి ప్రయత్నాలు మాత్రమే... పెట్టుబడిదారీ వ్యవస్థ మీద పోరును పదు నెక్కించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడగలవు. ప్రొ. అజయ్ గుడవర్తి వ్యాసకర్త ప్రొఫెసర్,జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ -
నారసింహుడి మాన్యం అన్యాక్రాంతం
పెద్దపప్పూరు: మండలంలోని నరసింహస్వామి మాన్యం అన్యాక్రాంతమైంది. స్వామి మాన్యాన్ని టీడీపీ మద్దతుదారులు గత ప్రభుత్వ పాలకుల అండతో ఏకంగా తమపేరున పట్టాదారు పాసుపుస్తకాలు చేయించుకున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. తిమ్మనచెరువు గ్రామసమీపంలో కొండపై ప్రసిద్ధిగాంచిన వజ్రగిరి లక్ష్మీనరసింహ్మస్వామికి సర్వేనంబర్ 244లో 3.72 ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డు (డైక్లాట్)లో స్పష్టంగా ఉంది. అదే భూమిని ధర్మాపురం గ్రామానికి చెందిన ఎం.మాదన్న, ఎం. నారాయణప్ప తమ పలుకుబడిని ఉపయోగించి పట్టాదారు పాసుపుస్తకాలు చేయించుకుని నేడు పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం అన్యాకాంత్రమైన భూమిని మరొకరికి కౌలుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. దేవుడి మాన్యం అన్యాక్రాంతమైనట్లు తెలిసినా..గత పాలకులకు బెదిరి అధికారులు నోరుమెదపలేదు. ప్రస్తుతం ఆలయభూమి అన్యాక్రాంతమైందని, తగు చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ అధికారులకు పూర్తి వివరాలతో కొందరు భక్తులు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపినట్లు సమాచారం. ఇప్పటి కైనా జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని స్వామి వారి భక్తులు అధికారులను కోరుతున్నారు. పరిశీలించి పాసుపుస్తకాలను రద్దుచేయిస్తాం తిమ్మనచెరువు లక్ష్మీనరసింహ్మస్వామి ఆలయానికి చెందిన 3.72 ఎకరాల భూమి అన్యాక్రాంతమైనట్లు ఆదివారం సాయంత్రం ఎవరో ఒక భక్తుడు సెల్‌ఫోన్‌కు వివరాలను మెసేజ్ పంపాడు. వెంటనే తగు చర్యలు చేపట్టాలని సంబంధిత ఆలయ అధికారి ఆదేశించాం. పూర్తిగా పరిశీలించి పట్టాదారుపాస్తకాలను రద్దు చేయించడంతో పాటు ఆలయ భూమిని తప్పక స్వాధీనం చేసుకుంటాం. – రామాంజనేయులు, దేవదాయశాఖ సహాయక కమిషనర్, అనంతపురం -
ఆదిత్యా... నీకు దిక్కెవరు?
ఆయన అందరికంటే ఎత్తులో ఉంటూ అందరికీ వెలుగులు ప్రసాదిస్తాడు.. అయితే ఆయన కొలువుకు చెందిన భూములను మాత్రం కాపాడుకోలేకపోతున్నాడు.. సర్వదిక్కులను శాసిస్తున్న భానుడే దిక్కులేక మిన్నకుండిపోతున్నాడు.. కోట్లాది రూపాయల విలువైన భూములను అన్యాకాంత్రం చేసుకుని ఏళ్ల తరబడి ఫలసాయం పొందుతున్నప్పటికీ అధికారులు సైతం కిమ్మనకపోవడం చర్చనీయాంశమైంది. అరసవల్లి: శ్రీసూర్యనారాయణస్వామి వారి ఆలయ భూముల్లో అత్యధిక శాతం ఇనాం కింద ఆలయ అర్చకుల వద్దనే ఉండగా, మిగిలినవి ఆక్రమణలకు గురవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో చాలాచోట్ల జరిగిన భూ ఆక్రమణల్లాగే.. అరసవల్లి ఆలయానికి చెందిన భూములను కూడా స్థానిక నేతల అండదండలతో అక్రమార్కులు కాజేశారు. గత ఐదేళ్లలోనే ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉన్న కొన్ని ఎకరాల భూములను ఇష్టానుసారంగా రెవన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేసేసి టీడీపీ నేతలు అనుకూలురకు అప్పగించారనే ఆరోపణలున్నాయి. దీంతో ఆలయానికి చెందిన భూములు అపార్ట్‌మెంట్లుగానూ, భవనాల సముదాయాలు, దుకాణాల సముదాయాలుగా మారిపోయాయి. ఆదిత్యుని భూముల లెక్కలివే.....! అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయానికి సుమారు 120 ఎకరాలకు పైగానే భూమి ఉంది. 1932 నాటి మద్రాస్ హైకోర్టు ఇచ్చిన డిక్రీ ఆధారంగా మొత్తం 53.24 ఎకరాల భూమిని ఆలయ వంశపారంపర్య అర్చకులకు జీతాలకు బదులుగా సరీ్వస్ ఇనాంగా అప్పగించారు. ఇందులో భాగంగా ఉన్న 2.48 ఎకరాల భూమిలో కొంత భాగం టూరిజం బడ్జెట్ హోటల్‌కు, మరికొంత భాగం టీటీడీ కళ్యాణ మండపాన్ని నిర్మించేందుకు ప్రతిపాదించారు. ఇవి కాకుండా మరో 27.91 ఎకరాల భూమి ప్రస్తుతానికి లీజుల కింద కేటాయించారు. వీటి నుంచి వార్షిక ఆదాయం 1.71 లక్షల వరకు వస్తోంది. ఇవన్నీ కాకుండా మరో 41.30 ఎకరాల వరకు భూమిని దశాబ్దాల కాలం క్రితమే ఆలయంలో పనిచేస్తున్న బోయిలు, దివిటీలు, చాకళ్లు, భజన కర్తలు, వేదపారాయణదారులకు, నాయీ బ్రాహ్మణులకు వాయిద్యాల కర్తలకు, స్వామి ఆలంకరణకు గాను పూల తోటల పెంచడానికి గానూ అప్పట్లో సరీ్వస్ ఇనాం కింద కేటాయించారు. అయితే దాదాపుగా ఈ మొత్తం ఇనాం భూమి చేతులు మారిపోయాయి. దీంతో ఆలయ భూముల లెక్కల్లోనే ఈ వివరాలు లేకుండా పోయాయి. అయితే పాత రికార్డుల్లో ఉన్న వాస్తవ లెక్కలను ప్రస్తుతం కని్పంచకుండా గతంలో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శించారు. దీంతో ప్రస్తుతానికి ఆలయానికి తాజా రికార్డుల ద్వారా 83.99 ఎకరాల భూములున్నట్లుగా చూపిస్తున్నారు. అయితే ప్రాపర్టీ రిజిస్టర్లో మాత్రం ఇప్పటికీ ఇనాం భూములుగా ఎకరాల కొద్దీ భూములు కన్పిస్తున్నాయి. ఇనాం భూములన్నీ హాంఫట్...! అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారికి వివిధ రకాలుగా సేవలందించే సేవకులకు గాను అప్పట్లో సరీ్వస్ ఇనాం కింద సుమారు 41.30 ఎకరాల భూములను ఇచ్చినట్లుగా పాత రికార్డులు చూపిస్తున్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఎన్నో చేతులు మారిపోవడంతో ఆలయ గత ఆస్తులుగానే రికార్డుల్లో ఉండిపోయాయి. అరసవల్లి మిల్లు కూడలి సమీపంలో సాగునీటి కాలువకు ఆనుకుని ఇరువైపులా సర్వే నెంబర్ 12తోపాటు పలు సర్వే నెంబర్లలో ఆలయానికి భూములున్నాయి. ఇందులో భాగంగా 12/3, 12/4 సర్వే నెంబర్లులో మొత్తం 0.95 ఎకరాల భూమి కూడా తాజాగా ఆక్రమణలకు గురయ్యింది. అయితే ఈ భూములతో పాటు పక్కనే 2.68 ఎకరాల భూమిలోనే రాష్ట్ర పర్యాటక శాఖ బడ్జెట్ హోటల్ నిర్మాణం, టీటీడీ కళ్యాణమండపాలను నిర్మించేందుకు కేటాయించారు. ఇదిలావుంటే 12/3, 12/4 సర్వే నెంబర్లలో రెవెన్యూ రికార్డుల ప్రకారం చూస్తే సూర్యనారాయణ స్వామి వారికి చెందినట్లుగానే ఉన్నాయి. అయినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో ఇదే ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌ను కూడా నిర్మించారు. ఇదే ప్రాంతంలో సుమారు ఐదారు ఎకరాల్లో పెద్ద పెద్ద భవనాలు కూడా వెలిసిపోయాయి. అలాగే ఆక్రమణ స్థలాల్లో రోడ్డుకు ఆనుకుని షాపింగ్ కాంప్లెక్స్‌ను కూడా నిర్మించారు. ఇదంతా ఓ స్థానికుడు స్పందనలో ఇచ్చిన ఫిర్యాదుతోనే వెలుగులోకి వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇనాం భూములన్నీ ఇలాగే అన్యాక్రాంతమయ్యాయనే వాదనకు ఇదే పెద్ద ఉదాహరణగా నిలిచింది. ఆక్రమణ భూములపై ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తున్నాం అరసవల్లి ఆలయానికి చెందిన కొన్ని భూములు ఆక్రమణకు గురైన విషయం దృష్టికి వచ్చింది.. ఇటీవల ‘స్పందన’ ద్వారా పలు భూముల అన్యాక్రాంతానికి సంబంధించి వచ్చిన ఫిర్యాదుతో.. ఆలయ భూములను సర్వే చేయించి ఆక్రమణలను గుర్తించాం. దీనిపై ఆలయ భూములను అనుభవంలోకి తీసుకున్న వారిపై ట్రిబ్యునల్‌ను ఆశ్రయించనున్నాం. ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు.. – వి.హరిసూర్యప్రకాష్, ఆలయ ఈవో -
భూదాహం
భూదందాలు, కబ్జాల్లో మునిగితేలుతున్న అధికారపార్టీ నేతలు రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత, శ్రీరాం పేరుతో ఆగడాలు మండలాలను విభజించుకుని దందాలు సాగిస్తోన్న అనుచరులు రూ.కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం ఇళ్లస్థలాల పేరుతో పేదలకు వంచన పూర్తిగా సహకరిస్తున్న అధికార యంత్రాంగం – ఇది ప్రకృతి విపత్తు వల్ల జరిగిన నష్టం కాదు! అధికార పార్టీ నేతల భూదాహానికి నిరుపేద కుటుంబాలు బలైన దృశ్యమిది. అనంతపురం శివారులోని కక్కలపల్లిలో ఉన్న ప్రభుత్వ స్థలంలో 132 కుటుంబాలు గుడిసెలు వేసుకుని నివాసముండేవి. వీరికి ఇళ్లపట్టాలు ఇప్పిస్తామని ఎన్నికల ప్రచారంలో ఇప్పటి మంత్రి పరిటాల సునీత హామీ ఇచ్చారు. కానీ అధికారం దక్కిన తర్వాత మొత్తం గుడిసెలను పోలీసుల అండతో గత ఏడాది కూల్చేశారు. మంత్రి సోదరుడు మురళి, బంధువు మహేంద్ర వచ్చి ఖాళీ చేయాలని చెప్పారని, తాము ససేమిరా అనడంతో గుడిసెలను కూల్చేసి నిలువ నీడ లేకుండా చేశారని బాధితులు ఆరోపించారు. ఈ ఒక్కచోటే కాదు..అనంతపురం రూరల్ పరిధిలో ఎక్కడ ప్రభుత్వ స్థలాలు, అసైన్డ్భూములు కన్పించినా.. కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు ఉపక్రమిస్తున్నారు. ఖాళీ స్థలం కన్పిస్తే ‘పరిటాల’ పేరుతో పచ్చజెండాలు పాతేస్తున్నారు. టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత రెండున్నరేళ్లుగా ఇది రివాజుగా మారింది. పైగా వారు కన్నేస్తోన్న స్థలాలు ఎక్కడో మారుమూల ఉన్నవి కావు. అనంతపురం నగరానికి అతి దగ్గరగా ఉన్నవే! ఇవి రూ.కోట్ల విలువ చేస్తాయి. నిత్యం ఎక్కడో ఒకచోట భూదందాలు సాగుతోన్న అధికార యంత్రాంగం అడ్డుకోలేకపోతోంది. అడ్డు చెబితే బదిలీలు..అవసరమైతే భౌతికదాడులకు దిగుతారనే భయంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొందరు అధికారులు మాత్రం మెప్పుకోసం వారికి సహకరిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే టీడీపీ నేతలు ప్రతి అంశంలోనూ ఆదాయమార్గాన్ని అన్వేషిస్తూ, అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఖాళీగా ఉన్న అసైన్డ్ భూములు, పేదలు పూరి గుడిసెలు వేసుకున్న ప్రభుత్వ స్థలాలపై కన్నేస్తున్నారు. అధికారుల అండతో వీటిని కబ్జా చేస్తున్నారు. వీరిలో ‘పరిటాల’ పేరుతో కబ్జాలు చేసేవారి సంఖ్యే అధికంగా ఉంది. మొదట ఎంతోకొంత చిల్లర విదిల్చి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. కుదరకపోతే కబ్జాలకు తెగిస్తున్నారు. ఆత్మకూరు మండలం బి.యాలేరులో 4.40 ఎకరాల అసైన్డ్‌భూమిని ఈ గ్రామ దళితులు దాదాపు 200 మంది ఇళ్లస్థలాల కోసం తులశమ్మ అనే మహిళ నుంచి కొనుగోలు చేశారు. ఈ భూమిని తహశీల్దార్‌కు స్వాధీనం చేసి.. ఇళ్ల పట్టాలు తీసుకోవాలని భావించారు. ఈ తంతు 2014కు ముందు జరిగింది. ఎన్నికల తర్వాత పట్టాలివ్వకుండా అధికారపార్టీ నేతలు అడ్డుకున్నారు. పైగా భూమిని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. టీడీపీలో క్రియాశీలకంగా ఉండే కార్యకర్తలకు ఇందులో పట్టాలివ్వాలని భావిస్తున్నారు. దీంతో డబ్బు చెల్లించి భూమి కొనుగోలు చేసిన బాధితులు లబోదిబోమంటున్నారు. సొంతిల్లు, ఇంటి స్థలం లేనివారికే పట్టాలివ్వాలనేది ప్రభుత్వ నిబంధన. కానీ బి.యాలేరులో దీనికి భిన్నంగా జరుగుతోంది. ఇక్కడ టీడీపీ అత్యంత బలహీనంగా ఉంది. దీంతో ఇళ్ల పట్టాలిప్పిస్తామంటూ గ్రామస్తుల్లో చిచ్చురేపి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కక్కలపల్లిలో ఐదెకరాల ప్రభుత్వస్థలంలో ఏడాది కిందట కొంతమంది టీడీపీ నేతలు ‘పరిటాల రవీంద్ర కాలనీ’ పేరుతో బోర్డుపెట్టారు. దాదాపు 200 గుడిసెలు వేయించారు. ఇక్కడ పట్టాలిప్పిస్తామని కొందరు భారీగా దండుకున్నారు. ఇందులో రెండెకరాలు పేదలకు ఇచ్చి, మిగిలిన మూడెకరాలను స్వాధీనం చేసుకోవాలనే కుట్రతోనే 'తమ్ముళ్లు' వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఏర్పాటైన బోర్డుతో తమకు సంబంధం లేదని టీడీపీ నేతలు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఏడాది కిందట అనంతపురంలోని హౌసింగ్‌బోర్డులో ఓ స్థల వివాదంలో ఓ ప్రజాప్రతినిధి జోక్యం చేసుకున్నారు. ఏ అండా లేని ఓ వ్యక్తికి సంబంధించిన రూ.కోటి విలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని భావించారు. దీనికి అడ్డొచ్చిన ఓ సీఐని లూప్ లైన్‌కు పంపారు. బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం సమీపంలో సర్వే నంబర్ 777లో పదెకరాల చెరువు పొరంబోకు స్థలం ఉంది. ఇందులో చెట్లు పెంచుకునేందుకు స్థానికులైన ఐదుగురికి లీజుకిచ్చారు. అయితే ఇక్కడి టీడీపీ నేతలు ‘ఎన్టీఆర్ కాలనీ’ పేరుతో గుడిసెలు వేశారు. పట్టాలిప్పిస్తామని ఒక్కొక్కరి వద్ద రూ.2వేలు వసూలు చేశారు. నిజానికి పట్టాల పేరుతో ఆ స్థలాన్ని దక్కించుకోవాలనే వ్యూహంతోనే ఈ పన్నాగం పన్నారు. జేఎన్టీయూ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన 3.80 ఎకరాల స్థలంలో అక్రమంగా ఇళ్లు నిర్మించి ‘నారా లోకేశ్‌బాబు కాలనీ’ అని పేరు పెట్టారు. ఈ స్థలం కూడా రూ.కోట్లు విలువ చేస్తుంది.