![Timmanacherla Lakshmi Narasimha Swamy Temple Lands Alienation - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/4/Temple-Lands-Alienation.jpg.webp?itok=K9atk0kB)
అన్యాక్రాంతమైన మాన్యం ఇదే-భూమి రికార్డులు(డైక్లాట్‌లో) స్వామి పేరున ఉన్న దృశ్యం,అడంగల్‌లో టీడీపీమద్దతు దారుల పేర్లు
పెద్దపప్పూరు: మండలంలోని నరసింహస్వామి మాన్యం అన్యాక్రాంతమైంది. స్వామి మాన్యాన్ని టీడీపీ మద్దతుదారులు గత ప్రభుత్వ పాలకుల అండతో ఏకంగా తమపేరున పట్టాదారు పాసుపుస్తకాలు చేయించుకున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. తిమ్మనచెరువు గ్రామసమీపంలో కొండపై ప్రసిద్ధిగాంచిన వజ్రగిరి లక్ష్మీనరసింహ్మస్వామికి సర్వేనంబర్ 244లో 3.72 ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డు (డైక్లాట్)లో స్పష్టంగా ఉంది.
అదే భూమిని ధర్మాపురం గ్రామానికి చెందిన ఎం.మాదన్న, ఎం. నారాయణప్ప తమ పలుకుబడిని ఉపయోగించి పట్టాదారు పాసుపుస్తకాలు చేయించుకుని నేడు పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం అన్యాకాంత్రమైన భూమిని మరొకరికి కౌలుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. దేవుడి మాన్యం అన్యాక్రాంతమైనట్లు తెలిసినా..గత పాలకులకు బెదిరి అధికారులు నోరుమెదపలేదు. ప్రస్తుతం ఆలయభూమి అన్యాక్రాంతమైందని, తగు చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ అధికారులకు పూర్తి వివరాలతో కొందరు భక్తులు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపినట్లు సమాచారం. ఇప్పటి కైనా జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని స్వామి వారి భక్తులు అధికారులను కోరుతున్నారు.
పరిశీలించి పాసుపుస్తకాలను రద్దుచేయిస్తాం
తిమ్మనచెరువు లక్ష్మీనరసింహ్మస్వామి ఆలయానికి చెందిన 3.72 ఎకరాల భూమి అన్యాక్రాంతమైనట్లు ఆదివారం సాయంత్రం ఎవరో ఒక భక్తుడు సెల్‌ఫోన్‌కు వివరాలను మెసేజ్ పంపాడు. వెంటనే తగు చర్యలు చేపట్టాలని సంబంధిత ఆలయ అధికారి ఆదేశించాం. పూర్తిగా పరిశీలించి పట్టాదారుపాస్తకాలను రద్దు చేయించడంతో పాటు ఆలయ భూమిని తప్పక
స్వాధీనం చేసుకుంటాం.
– రామాంజనేయులు, దేవదాయశాఖ సహాయక కమిషనర్, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment