narasimha swamy
-
సింగరాయ జాతరకు పోటెత్తిన భక్తులు
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీనరసింహస్వామి జాతరకు శనివారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. గోవింద నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. భక్తులు తొలుత మోయతుమ్మెద వాగులో స్నానం చేసి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం వాగు పక్కన చెలమను తోడి అందులో నుంచి తీసిన నీటితో వంకాయ కూర, చింతపండు చారు చేసుకొని అక్కడే భోజనాలు చేశారు. మరికొందరు వంకాయ, చిక్కుడు, టమాటాలను కలిపి కూర చేసుకోవడం గమనార్హం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు జాతర సాగింది. జాతరకోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. -
వంకాయ కూర..చింతపండు చారు!
సాక్షి, సిద్దిపేట: జాతర్లకు వెళ్లడం, పూజలు నిర్వహించడంతో పాటు అక్కడే వంటలు చేసుకుని తినడం సర్వసాధారణం. కొన్నిచోట్ల మాంసాహారంతో పాటు శాకాహారం వండుతారు. కొన్నిచోట్ల శాకాహారానికే పరిమితమవుతారు. కానీ శాకాహారం..అందులోనూ ‘ఆహా..ఏమి రుచి..అనరా మైమరచి..’ అంటూ ఓ సినీ కవి అభివర్ణించిన వంకాయ కూరతో పాటు చింతపండు చారు మాత్రమే చేసుకుని అన్నంతో కలిపి ఆరగించడం శ్రీ సింగరాయ లక్ష్మీనరసింహస్వామి జాతర స్పెషల్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సమీపంలోని కోహెడ మండలం కూరెల్ల–తంగళ్లపల్లి గ్రామాల సరిహద్దుల్లో ఈ శ్రీ సింగరాయ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. దీని వెనకో కథ కూడా ఉంది. కాకతీయుల కాలంలో ప్రారంభం కాకతీయుల కాలంలో రాజులు అనువైన చోటల్లా చెరువులు తవ్వించారు. అందులో భాగంగా కాకతీయ చివరిరాజు ప్రతాపరుద్రుడు కూరెల్ల–తంగళ్లపల్లి గ్రామాల వద్ద చెరువు తవ్వే విషయం పరిశీలించాల్సిందిగా సంబంధిత నిపుణుడైన సింగరాయుడుతో పాటు మరికొందర్ని పంపించాడు. వారంతా కొద్దిరోజులు అక్కడే మకాం వేసి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న క్రమంలో బృందంలో కొందరు అనారోగ్యంతో మరణించారు. దీంతో సింగరాయ మినహా మిగిలిన వారంతా తమ పని మధ్యలోనే వదిలేసి ఓరుగల్లుకు తిరిగివెళ్లిపోయారు. సింగరాయ అక్కడే అడవిలో తిరుగుతున్న క్రమంలో ఓ చోట సొరంగంలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కనిపించింది. ఆ విగ్రహానికి ఆయన భక్తి శ్రద్ధలలో పూజలు చేస్తూ వచ్చాడు. కొద్దిరోజుల తర్వాత సింగరాయుడు కూడా వెళ్లిపోయాడు. ఆ తర్వాత సమీప గ్రామాల ప్రజలు లక్ష్మీనరసింహ స్వామికి పూజలు చేయడం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే అక్కడ శ్రీ సింగరాయ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఏర్పడింది. ఏటా పుష్య అమావాస్య రోజున పెద్ద సంఖ్యలో భక్తులు సింగరాయ జాతర నిర్వహించడం ఆనవాయితీగా మారింది. శనివారం అమావాస్య పురస్కరించుకుని జాతర నిర్వహణకు రెవెన్యూ, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. చెలిమ నీటిలో ఔషధ గుణాలు! కూరెల్ల–తంగళ్లపల్లి గ్రామాలను ఆనుకుని మోయతుమ్మెద వాగు తూర్పు నుంచి పడమటకు దట్టమైన వన మూలికల చెట్ల మధ్య నుంచి ప్రవహిస్తుంది. దీంతో ఆ నీటిలో ఔషధ గుణాలు ఉంటాయనేది భక్తుల నమ్మకం. దీంతో ఈ వాగులో స్నానం చేసిన తర్వాత భక్తులు సింగరాయ నరసింహస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. వాగు చెలిమల (నీటి గుంటలు) నుంచి తీసిన నీటితో వంకాయ కూర, చింతపండు చారు సిద్ధం చేస్తారు. అల్లం, వెల్లుల్లి, జిలకర లాంటి వేమీ ఉపయోగించరు. స్వామికి నైవేద్యంగా సమర్పించాక సహపంక్తి భోజనం చేస్తారు. మోయతుమ్మెద వాగు చెలిమ నీటితో చేసిన వంటలు రుచిగా ఉండటమే కాకుండా దివ్య ఔషధంలా పని చేస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఆరోగ్యానికి మంచిదనే స్థానికులు ఈ నీటిని వినియోగిస్తుంటారు. -
యాదాద్రి: వైభవంగా లక్ష్మీనారసింహుడి తిరుకల్యాణం (ఫొటోలు)
-
నారసింహుడి మాన్యం అన్యాక్రాంతం
పెద్దపప్పూరు: మండలంలోని నరసింహస్వామి మాన్యం అన్యాక్రాంతమైంది. స్వామి మాన్యాన్ని టీడీపీ మద్దతుదారులు గత ప్రభుత్వ పాలకుల అండతో ఏకంగా తమపేరున పట్టాదారు పాసుపుస్తకాలు చేయించుకున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. తిమ్మనచెరువు గ్రామసమీపంలో కొండపై ప్రసిద్ధిగాంచిన వజ్రగిరి లక్ష్మీనరసింహ్మస్వామికి సర్వేనంబర్ 244లో 3.72 ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డు (డైక్లాట్)లో స్పష్టంగా ఉంది. అదే భూమిని ధర్మాపురం గ్రామానికి చెందిన ఎం.మాదన్న, ఎం. నారాయణప్ప తమ పలుకుబడిని ఉపయోగించి పట్టాదారు పాసుపుస్తకాలు చేయించుకుని నేడు పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం అన్యాకాంత్రమైన భూమిని మరొకరికి కౌలుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. దేవుడి మాన్యం అన్యాక్రాంతమైనట్లు తెలిసినా..గత పాలకులకు బెదిరి అధికారులు నోరుమెదపలేదు. ప్రస్తుతం ఆలయభూమి అన్యాక్రాంతమైందని, తగు చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ అధికారులకు పూర్తి వివరాలతో కొందరు భక్తులు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపినట్లు సమాచారం. ఇప్పటి కైనా జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని స్వామి వారి భక్తులు అధికారులను కోరుతున్నారు. పరిశీలించి పాసుపుస్తకాలను రద్దుచేయిస్తాం తిమ్మనచెరువు లక్ష్మీనరసింహ్మస్వామి ఆలయానికి చెందిన 3.72 ఎకరాల భూమి అన్యాక్రాంతమైనట్లు ఆదివారం సాయంత్రం ఎవరో ఒక భక్తుడు సెల్‌ఫోన్‌కు వివరాలను మెసేజ్ పంపాడు. వెంటనే తగు చర్యలు చేపట్టాలని సంబంధిత ఆలయ అధికారి ఆదేశించాం. పూర్తిగా పరిశీలించి పట్టాదారుపాస్తకాలను రద్దు చేయించడంతో పాటు ఆలయ భూమిని తప్పక స్వాధీనం చేసుకుంటాం. – రామాంజనేయులు, దేవదాయశాఖ సహాయక కమిషనర్, అనంతపురం -
కనులపండువగా సుదర్శన జయంతి
– వేద పండితుల ఆధ్వర్యంలో సుదర్శన హోమం, అభిషేకం – భారీగా తరలి వచ్చిన భక్తులు అహోబిలం (ఆళ్లగడ్డ) : సుదర్శన జయంతి మహోత్సవం ఆదివారం అహోబిల క్షేత్రంలో వైభవంగా జరిగింది. ఎగువ అహోబిలంలో కొలువైన ఉత్సవమూర్తులైన జ్వాలనరసింహ స్వామి, శ్రీదేవి, భూదేవి, చెంచులక్ష్మీ అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి దేవాలయం ఎదురుగా కొలువుంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామి అమ్మవారికి ఎదురుట పండితులు వేద మంత్రోచ్ఛారణలతో సుదర్శన హోమం నిర్వహించారు. అంతకుముందు ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో నవకలశ పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం ఉత్సవమూర్తి సుదర్శనమూర్తిని కొలువుంచి నవకలశస్తాపన, గంధాబిషేకం, తిరుమంజనం నిర్వహించి స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో కొలువైన వెండి సుదర్శనమూర్తి ప్రతిమ (సుదర్శ చక్రం)కు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. సుదర్శన హోమం ప్రత్యేకత సాధారణంగా లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురష్కరించుకుని ప్రతి నెల స్వాతి రోజు సుదర్శన హోమం నిర్వహించడం సాంప్రదాయం. అయితే ఏడాదికి ఒకసారి ఆషాడమాసంలో వచ్చే స్వాతి నక్షత్రానికి ముందు రోజైన చిత్తా నక్షత్రం రోజున సుదర్శనమూర్తి జయంతి కావడంతో సుదర్శన హోమం నిర్వహిస్తారు. సుదర్శనమూర్తి ఆరు చేతులతో ఆరు రకాల ఆయుధాలతో వైష్ణవ దేవుళ్లను రక్షిస్తుంటారని పురాణాలు చెబుతున్నాయి. సుదర్శనమూర్తికి ఆదిదేవుడు లక్ష్మీనరసింహస్వామి గురువు కావడంతో ప్రతి స్వాతి వేడుకల్లో సుదర్శన హోమం చేస్తుంటారు. స్వామి సేవలో ఎమ్మెల్సీ గంగుల సుదర్శన జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి పాల్గొని స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మర్యాదల్లో భాగంగా ఎమ్మెల్సీకి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రధానార్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వాదం అందజేశారు. ఈయన వెంట గంగుల బిజేంధ్రారెడ్డి, కెడీసీసీ బ్యాంకు డైరెక్టర్ నాసారి వెంకటేశ్వర్లు, సింగం భరత్‌రెడ్డి, కందుకూరు శ్రీను ఉన్నారు. నేడు దిగువ అహోబిలంలో స్వాతి మహోత్సవాలు : దిగువ అహోబిలంలో సోమవారం స్వాతి నక్షత్రం సందర్భంగా వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు జేష్టాభిషేకం, గరుడ సేవ కార్యక్రమాల అనంతరం స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, హోమాలు తదితర కార్యక్రమాలు ఉంటాయి. -
మద్దిలేటి క్షేత్రంలో తిరుచ్చి వేడుకలు
బేతంచెర్ల: శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి తిరుచ్చి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదపండితులు జ్వాలా చక్రవర్తి, ప్రధాన అర్చకుడు మద్దిలేటి స్వామిలు.. శ్రీదేవి, భూదేవి సమేతుడైన మద్దిలేటి నరసింహస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీల్లో ఉత్సమూర్తులను కొలువుంచి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. పుష్పాలంకరణ శోభితుడై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. -
ముగిసిన పెన్నోహోబిలం బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ రూరల్ : పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఉదయం స్వామి వారికి అభిషేకం మహా మంగళహారతి, కుంకమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పల్లకీలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవ మూర్తులను ఆలయ అర్చకులు ద్వారకనాథాచార్యులు ఆధ్వర్యంలో ఆమిద్యాల గ్రామంలోని పెన్నోబులేసుని ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. -
వైభవంగా నారసింహుడి జయంతుత్సవాలు
ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో వెలసిన లక్ష్మీనృసింహస్వామి జయంతి మహోత్సవాలు మంగళవారం వైభవంగా ముగిశాయి. నృసింహస్వామి అవతార దినమైన వైశాఖ శుద్ధ చతుర్దశిని పురష్కరించుకుని స్వామి జయంతి ఉత్సవాన్ని మంగళవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దిగువ అహోబిలంలో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు తెల్లవారుజామున విశ్వరూప సేవ, నిత్య పూజలతో మొదలైన ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించి కొలువుంచి వేదపండితుల వేద మంత్రోచ్చారనల మధ్య స్వాతి , సుదర్శన హోమాలు ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీ పెరుమాల్ తయార్, 108 కలశ తిరుమంజనం, అవతార ఉత్సవం అనంతరం ఆస్థానం గోష్టి నిర్వహించారు. రాత్రి తమిళనాడు ప్రాంతములోని శ్రీరంగం పట్టణం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన వివిధ రకాల పూలతో విశేష పుష్పాలతో ఉత్సవ పల్లకిని అలకంరించి ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం శయనోత్సవ శేవతో కార్యక్రమాన్ని ముగించారు. -
జయంత్యుత్సవం..నారసింహుని వైభవం
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక మండపంలో ఉత్సవమూర్తులను కొలువుంచి అర్చన, అభిషేకాలు జరిపారు. అనంతరం ఉత్సవ మూర్తులను నూతన పట్టువస్త్రాలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సోమవారం రాత్రి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. కర్ణాటక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఈశ్వరప్ప.. నరసింహ స్వామి జయంతి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. -
ఘనంగా నరసింహ స్వామి జయంత్యుత్సవాలు
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం లో వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురష్కరించుకుని దిగువ అహోబిలంలోని శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో స్వామి అమ్మవార్లను కొలువుంచి అర్చన, అభిషేకాలు, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాత్రి ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సవ పల్లకిలో కూర్చోబెట్టి మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. -
నమో నారసింహ
- నల్లమలలో మోరుమోగిన గోవింద నామస్మరణ - శేష వాహనంపై దర్శనమిచ్చిన జ్వాలనారసింహుడు - హనుమంత వాహనంపై ఊరేగిన ప్రహ్లాదవర స్వామి అహోబిలం(ఆళ్లగడ్డ): బ్రహ్మోత్సవాల సందర్భంగా అహోబిల క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ విరజిల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఎగువ అహోబిలంలో కొలువైన శ్రీ జ్వాలనృసింహస్వామి శేష వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులైన శ్రీ జ్వాలనృసింహ స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు నిత్య పూజల్లో భాగంగా తెల్లవారు జామునే మేలుకొలుపు చేసి వేదపండితుల వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పుష్పాలంకరణ చేసి శేష వాహనంపై కొలువుంచి మంగళ వాయిద్యాల మధ్య భక్తి శ్రద్దలతో మాడ వీధుల్లో వైభవోపేతంగా గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజల్లో భాగంగా అభిషేకం, తిరుమంజనం నిర్వహించి భక్తుల దర్శనార్థం ప్రతేకంగా అలకంరించిన మండపంలో కొలువుంచారు. దిగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం ఉదయం శ్రీ ప్రహ్లాదవరదస్వామి శ్రీదేవి భూదేవి అమ్మవారు శ్రీ యోగానృసింహ గారుడ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. అంతకు ముందు వేకవజామున నిత్య పూజల్లో భాగంగా సుప్రత సేవ అనంతరం స్వామి అమ్మవార్లను మేలుకొలిపి శ్రీఘ్రదర్శనం అనంతరం అర్చనలు నిర్వహించి, నవకళశస్థాపన గావించిన అనంతరం జలాఅభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన పట్టువస్త్రాలు, మణి మానిక్యాల అభరణాలతో ప్రత్యేకంగా అలకంరించిన స్వామి అమ్మవార్లను శ్రీ యోగనృసింహ గరుడ విమాన వాహనంలో కొలువుంచారు. మంగళవాయిద్యాలతో వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం పంచామృతాభిషేకం, జలాభిషేకం నిర్వహించి స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో కొలువుంచారు. రాత్రి శ్రీ ప్రహ్లాదరవదస్వామి హనుమంతు వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. నేటి కార్యక్రమాలు.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఎగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ఉదయయం ఉత్సవం, మధ్యాహ్నం అభిషేకం, రాత్రి శరభ వాహణ సేవ ఉంటుంది. దిగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ ప్రహ్లాదవరదుడు ఉదయం శేషవాహనంపై కొలువై దర్శనమిస్తారు. మధ్యాహ్నం స్వామి, అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై దర్శనమివ్వనున్నారు -
వైభవంగా నృసింహుడి ధ్వజారోహణం
మంగళగిరి: నృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణం ఉత్సవాన్ని శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవానికి భక్తజనులు, దేవతలను వాయు వేగంతో వెళ్లి ఆహ్వానించేందుకు భక్తాగ్రేశ్వరుడైన గరుత్మంతుడిని ధ్వజంపై ప్రతిష్టించడం ఉత్సవ ప్రత్యేకత. రాత్రి పొద్దుపోయాక భక్తజన కోటి సమక్షంలో ఉత్సవం నిర్వహించారు. ఈ వేడుకలలో మరో ప్రత్యేకత ఉంది. అష్టనాగాధిపతి అయిన గరుత్మంతునికి నివేదన చేసిన ప్రసాదాన్ని గరుడముద్దగా పిలుస్తారు. సంతానం లేని వారు ధ్వజారోహణ ఉత్సవంలో గరుడ ముద్దను ప్రసాదంగా స్వీకరిస్తే సంతానం కలుగుతారని భక్తుల నమ్మకం. గరుడముద్ద ప్రసాదం కోసం మహిళా భక్తులు పెద్ద ఎత్తున ఉత్సవానికి తరలివచ్చారు. ఉత్సవం అనంతరం ప్రత్యేక వాహనంపై ఉత్సవమూర్తులను అధిష్టంపచేసి పురవీధులలో విహరింపచేశారు. ఉత్సవ కైంకర్యపరులుగా మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోషియన్ వారు వ్యవహరించగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్న ఉత్సవంలో ధర్మకర్తల మండలి సభ్యులు ఊట్ల శ్రీమన్నారాయణ, అనుమోలె వెంకటసాంబశివరావు, క్రోసూరి శివనాగరాజు, రావుల శ్రీనివాసరావు, మోరంపూడి నాగేశ్వరరావు, ఆలేటి నాగలక్ష్మి, వెనిగళ్ళ ఉమాకాంతం, పంచుమరి ప్రసాద్, దీవి అనంతపద్మాచార్యులు పూజలు నిర్వహించగా ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణ అధికారి మండెపూడి పానకాలరావు పర్యేక్షించారు. -
హంస వాహనంపై అహోబిలేశుడు
అహోబిలం (ఆళ్లగడ్డ): బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో శనివారం.. శ్రీ జ్వాలా నరసింహస్వామి హంస వాహనం పై భక్తులకు దర్శనమిచ్చారు. గోవింద నామ స్మరణతో మాడా వీధుల్లో గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులైన శ్రీ జ్వాలా నసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతేకంగా అలకంరించిన మండపంలో భక్తుల దర్శనార్థం ఉంచారు. తిరిగి రాత్రి సూర్యప్రభ వాహనముపై స్వామికి గ్రామోత్సవం నిర్వహిచారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాదు, మఠం ప్రతినిథి సంపత్ పాల్గొన్నారు. -
అహోబిల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
అహోబిలం (ఆళ్లగడ్డ): దిగువ అహోబిల క్షేత్రంలో శుక్రవారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ పూజలు నిర్వహించారు. మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. దిగువ అహోబిలంలోని శ్రీ ప్రహ్లాద వరదస్వామి ఆలయ ప్రాంగణంలో ఉదయం నుంచి వేద పండితులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయ అర్చకులు.. విశ్వక్సేనుడికి పూలమాలలు వేసి తల పాగా చుట్టి పల్లకిలో కొలువుంచి మాడ వీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి ఆటంకాలు కలుగకుండా నిరంతరం పర్యవేక్షకుడిగా విశ్వక్సేనుడు వ్యవహరిస్తారని విశ్వాసం. ఆలయానికి ఈశాన్యం వైపున ఉన్న పుట్ట మన్ను తీసుకొని వచ్చి.. కుంకుమ, పసుపుతో బ్రహ్మోత్సవ మండపాన్ని సుందరంగా అలకంరించారు. అంకుర హోమం నిర్వహించి సోముడిని (చంద్రుడిని) మట్టిలోకి ఆవాహం చేశారు. పాత్రలో ఉన్న మట్టిలో నవగ్రహాలకు సూచికగా నవధాన్యాలు పోసి సోమ కుంభస్థాపన చేశారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ సందర్భంగా శనివారం ఉదయం ధ్వజారోహణం, మధ్యాహ్నం అభిషేకం, సాయంత్రం భేరీపూజ నిర్వహించనున్నారు. రాత్రి సింహవాహనంపై స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
సకల దేవతలకు ఆహ్వానం
- అహోబిలంలో ధ్వజపటావిష్కరణ, ధ్వజారోహణం – గరుత్మంతునికి విశేష పూజలు అహోబిలం(ఆళ్లగడ్డ): బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో శుక్రవారం..శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గరుత్మంతుని చిత్రపటావిష్కరణ చేశారు. అంతకు ముందు గరుత్మంతున్ని..పల్లకిలో కొలువుంచి ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు. మొదటి జియర్ ఆదివన్ షఠకోపన్ ఉత్సవ విగ్రహం ఎదురుగా ఉంచి శ్రీ లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలకు తరలిరావాలని ఆహ్వానిస్తూ ధ్వజారోహణం చేశౠరు. శ్రీ జ్వాలా నృసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల కల్యాణ మహోత్సవానికి ముక్కోటి దేవతలు వస్తారని నమ్మకం. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామిని, అమ్మవార్లను ఆశీర్వదించేందుకు వచ్చే ముక్కోటి దేవతలు, దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా గరుత్మంతుడు కాపాలా ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. -
అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
అహోబిలం(ఆళ్లగడ్డ): అహోబిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అహోబిల మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్, మఠం ప్రతినిధి సంపత్, దేవస్థాన కార్యనిర్వహణ అధికారి మల్లికార్జున ప్రసాదు, వేదపండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నియమనిష్టలతో.. విశేష పూజలతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఎగువ అహోబిలంలోని యాగశాలలో ఉదయం నుంచి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు విశ్వక్సేనుడికి పూల మాలలు వేసి తల పాగా చుట్టి పల్లకిలో కొలువుంచారు. పల్లకిని ఆలయం వెలుపలకు తీసుకొచ్చి ఉత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి ఆటంకాలు కలుగకుండా నిరంతరం పర్యవేక్షకుడిగా విశ్వక్సేనుడు వ్యవహరిస్తారని విశ్వాసం. అనంతరం మంగళ వాయిద్యాలతో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆలయానికి ఈశాన్యం వైపున ఉన్న పుట్ట మన్ను తీసుకు వచ్చారు. పుట్టమన్ను, కుంకుమ, పసుపుతో బ్రహ్మోత్సవ మండపాన్ని సుందరంగా అలకంరించి అంకుర హోమం నిర్వహించారు. సోముడిని (చంద్రుడిని) మట్టిలోకి ఆవాహం చేశారు. పాత్రలో ఉన్న మట్టిలో నవగ్రహాలకు సూచికగా నవధాన్యాలు పోసి సోమ కుంభస్థాపన చేశారు. నేడు ధ్వజారోహణం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఎగువ అహోబిలంలో ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం భేరీపూజ కొనసాగుతుంది. సింహ వాహనంపై స్వామి, అమ్మవారులు భక్తులకు దర్శనమివ్వనున్నారు. దిగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ సందర్భంగా శుక్రవారం సాయంత్రం వేదపండితుల ఆధ్వర్యంలో అంకురార్పరణ కార్యక్రమం నిర్వహిస్తారు. -
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
ఆళ్లగడ్డ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిల లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు 2వ తేదీన అంకురార్పన జరగనుందని దేవస్థాన పర్యవేక్షణాధికారి మల్లికార్జున ప్రసాద్ బుధవారం తెలిపారు. గురువారం నుంచి ఎగువ అహోబిలం, శుక్రవారం నుంచి దిగువ అహోబిల క్షేత్రాల్లో అంకుర్పారణతో 11 రోజుల పాటు నవాహ్నిక దీక్షతో కొనసాగే ఉత్సవాలు 13వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. గురువారం నుంచి ప్రతిరోజు ప్రత్యేక పూజలు, వాహన సేవలు ఎగువ అహోబిలంలో గురువారం, దిగువ అహోబిలంలో శుక్రవారం నుంచి బ్రహ్మోత్సవాలకు అంకుర్పాణ చేస్తారు. 4 నుంచి ప్రతి రోజు ప్రత్యేక పూజధికాలను, ఆలయప్రాంగణంలో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రతిరోజు స్వామి అమ్మవారిని ఓ వాహనంపై కొలువుంచి మాడ వీధుల్లో ఊరేగిస్తారు. 9న ఎగువ, 10న దిగువన తిరుకల్యాణోత్సవం ఎగువ అహోబిలంలో వెలసిన జ్వాలనరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల కల్యాణం 9తేదీన, దిగువ అహోబిలంలో వెలిసిన జ్వాలనరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల కల్యాణోత్సవం 10న నిర్వహిస్తారు. సాయంత్రం 7 గంటలకు ఎదురుకోలు ఉత్సవం అనంతరం ప్రత్యేక మండపంలో కల్యాణ మహోత్సవం జరుగుతుంది. ప్రతిరోజూ స్వామి అమ్మవార్ల వాహనసేవలు బ్రహ్మోత్సవాలను పురష్కరించుకుని ప్రతి రోజు ఉదయం, రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లకు వివిధ వాహనసేవలతో గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఎగువ అహోబిలంలో: 3న సింహ వానసేవ, 4న ఉదయం హంస వాహనసేవ, రాత్రి సూర్యప్రభ వాహనసేవ, 5న హనుమంత వాహనసేవ, 6న ఉదయం శేష వాహనసేవ, రాత్రి చంద్రప్రభ వాహనసేవ, 7న శరభ వాహనసేవ, 8న పొన్నచెట్టు వాహనసేవ, 9న గజ వాహనసేవ, 10 అçశ్వ వాహనసేవ, 11న ఉదయం రథోత్సవము , 12న గరుడోత్సవం దిగువ అహోబిలంలో: 4న సింహ వాహనసేవ, 5న ఉదయం హంస వాహనసేవ, రాత్రి సూర్యప్రభ వాహనసేవ, 6న శ్రీయోగానృసింహ గారుడ విమానసేవ, రాత్రి హనుమంత వాహనసేవ, 7న ఉదయం శేష వాహనసేవ, రాత్రి చంద్రప్రభ వాహన సేవ, 8న చంద్రప్రభ వాహనము, 9న పొన్నచెట్టు వాహనసేవ, 10న గజ వాహ వాహనసేవ, 11న అశ్వ వాహనసేవ, 12న రథోత్సవం, 13న గరుడ వాహనసేవలు జరుగుతాయి. -
తుది ఘట్టానికి పారువేట ఉత్సవం
- రుద్రవరం బోయినుల కాలనీలో పూజలందుకున్న నారసింహుడు - రాత్రికి కొల్లంవారి కాలనీలో తెలుపుపై కొలువు రుద్రవరం: పారువేట ఉత్సవంలో భాగంగా అహోబిలం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆదివారం పలు తెలుపులపై కొవుదీరి పూజలందుకోవడంతో ఉత్సవం చివరి ఘట్టానికి చేరింది. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా గత నెల 16న పారువేట ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అహోబిలంలో ప్రారంభమైన ఉత్సవాలు ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, రుద్రవరం మండలాల్లోని పలుగ్రామాల్లో సాగాయి. చివరగా స్వామివారి మండల కేంద్రమైన రుద్రవరం చేరుకున్నాడు. నాలుగు రోజులుగా ఉత్సవ మూర్తులు పలు తెలుపులపై కొలువు దీరగా స్థానికులతోపాటు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహించారు. ఇదే గ్రామంలో మరో రెండు రోజులపాటు పూజలందుకున్న అనంతరం స్వామివారు కొండకు బయలు దేరుతారు. పల్లకి మోసే బోయినులు నివాసం ఉన్న కాలనీలో స్వామి కొలువుదీరడంతో కాలనీలు వాసులు ఆనందోత్సాహాలతో పూజలు జరిపారు. బోయినీలకు ఇష్ట దైవం, ఇంటి దేవుడు కావడంతో బంధు మిత్రులతో సందడి వాతావరణం నెలకొంది. రాత్రికి కొల్లం వారి తెలుపుపై కొలువుదీరేంత వరకు గోవింద నామస్మరణతో కాలనీలు మొత్తం మారుమోగాయి. స్వామివారి రాకను పురస్కరించుకుని తిరునాల నిర్వహిస్తుండడంతో గ్రామంలోని అమ్మవారిశాల సెంటర్ బొమ్మలు, గాజుల అంగళ్లు, వాటిని కొనుగోలు చేసేందుకు వచ్చిన జనంతో కళకళలాడుతోంది. -
హంస, శేష వాహనాలపై నరసన్న
సఖినేటిపల్లి(రాజోలు) : అంతర్వేది శ్రీలక్ష్మీ నృసింహస్వామివారు హంస, శేష వాహనాలపై శనివారం గ్రామంలో ఊరేగారు. స్వామివారి కల్యాణోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో అర్చకులు వాస్తుపూజ, అంకురార్పణ, విష్ణుదీక్షాధారణ చేపట్టారు. ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగడానికి ఏటా ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. స్వామి వారిని సాయంత్రం హంస వాహనంపై ఉంచి గ్రామంలో ఊరేగించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఎదురు చూశారు. రాత్రి శేష వాహనంపై ఉంచి స్వామి వారి గ్రామోత్సవం కనుల పండువగా నిర్వహించారు. ధూపసేవ, ధ్వజారోహణం కార్యక్రమాలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
కలియుగ దైవం లక్ష్మీనరసింహస్వామి
దక్షిణ కాశీగా పురాణ ప్రసిద్ధి చెంది, చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకున్న పవిత్ర పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్షీ్మనృసింహస్వామివారి ఆలయం. ఈ క్షేత్రంలో శ్రీలక్షీ్మనృసింహస్వామివారు శిలారూపంలో పశ్చిమ ముఖంగా అవతరించారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి స్వామివారు కాపాడతారని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాçÜం. ఫిబ్రవరి మూడో తేదీ నుంచి స్వామివారి కల్యాణోత్సవాలు ప్రారంభంకానున్నాయి. – సఖినేటిపల్లి సఖినేటిపల్లి మండలం తీరప్రాంత గ్రామం అంతర్వేది క్షేత్ర మహత్యానికి సంబంధించి అనేక పురాణ గాధలున్నాయి. కృతయుగ ఆరంభంలో సృష్టికర్త బ్రహ్మ రుద్రయాగం చేయడానికి నిర్ణయించి, ఆయాగ వేదికను సాగరసంగమం తీరమైన గ్రామంలో నిర్మించినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది. యాగరక్షణకు నీలకంఠేశ్వరుడిని ప్రాణప్రతిష్ఠ చేసి, యాగం పూర్తి చేసినట్టు పండితులు చెబుతున్నారు. బ్రహ్మయాగ వేదికగా ఉన్న ఈ గ్రామానికి అంతర్వేదిక పేరొచ్చింది. కాలక్రమంలో అది అంతర్వేదిగా స్థిరపడింది. అంతర్వేది ఉత్సవాల షెడ్యూల్... ఫిబ్రవరి 3 నుంచి 11 వరకూ జరుగుతున్న అంతర్వేది శ్రీలక్షీ్మనృసింహస్వామివారి వార్షిక దివ్య తిరు కల్యాణోత్సవాల ప్రధాన ఘట్టాల షెడ్యూల్. ∙3న రథసస్తమి. సూర్యవాహనం, చంద్రప్రభ వాహనంపై గ్రామోత్సవం. ముద్రికాలంకరణ(శ్రీస్వామివారినిపెళ్లికుమారుని, అమ్మవారిని పెళ్లికుమార్తె చేయడం) ∙6న పంచముఖ ఆంజనేయస్వామి, కంచుగరుడ వాహనాలపై గ్రామోత్సవాలు. రాత్రి 12.21 గంటలకు మృగశిర నక్షత్రయుక్త తులా లగ్నపుష్కరాంశలో శ్రీస్వామివారి తిరు కల్యాణ మహోత్సవం. ∙7న భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీస్వామివారి రథోత్సవం. ∙10న మాఘ పౌర్ణమి(సముద్ర స్నానాలు) ∙11న అంతర్వేది చెరువులో హంసవాహనంపై తెప్పోత్సవం. నా పూర్వజన్మ సుకృతం ఇంత వరకూ లక్షీ్మనృసింహస్వామివారికి అర్చకుడిగా సేవలు చేసుకున్న తనకు ఈ ఏడాది స్వామివారి కల్యాణం చేయించే భాగ్యం దక్కడం పూర్వజన్మసుకృతం. ప్రధాన అర్చకుడిగా తొలిసారిగా స్వామివారి కల్యాణం తన చేతుల మీదుగా జరుగునున్న తరుణంలో ఎంతో ఆనందిస్తున్నా. – పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, ప్రధాన అర్చకుడు స్వామివారి దయ ఎంతో ఉంది శ్రీలక్షీ్మనృసింహస్వామివారు కొలువై ఉన్న దేవస్థానానికి అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తుండడం ఎంతో సంతోషకరం. శ్రీస్వామివారి కరుణకటాక్షాలతో భక్తులు, తాము ఎంతో ఆనందంగా జీవిస్తున్నాం. అలాగే స్వామివారు భక్తుల నుంచి కోరుకునే కార్యక్రమాలను తన చేతుల మీదుగా స్వామివారికి చేరడం ఎంతో సంతృప్తి. – చిక్కాల వెంకట్రావు, అసిస్టెంట్ కమిషనర్ అంతర్వేదిలో సందర్శనీయ ప్రాంతాలు వశిష్టసేవాశ్రమం: ఆలయానికి సుమారు 500 మీటర్ల దూరంలో ఏటిగట్టుకు ఆవలి వైపున ఉంది. అంతర్వేదిలోని వశిష్టాసేవాశ్రమం ఆధ్యాత్మిక నిలయంగా భాసిల్లుతోంది. ఈ ఆశ్రమాన్ని కల్యాణ మహోత్సవాలకు వచ్చే భక్తులు సందర్శించుకోవచ్చు. ఇక్కడ అరుంధతీ, వశిష్ట మహర్షులు కొలువు దీరారు. చుట్టూ నీరు ఉండేలా అష్టభుజాకారంగా దీనిని ఆచార్య కే.జీ. ప్రసాదరాజు నిర్మించారు. అరుంధతీదేవికి వశిష్ట మహర్షికి వివాహం జరిగిన సమయంలో సమస్త దంపతులకు రక్షణగా నిలవాలని దేవతలు ఆశీర్వదించారని, అందుకే వీరిని దర్శించుకుంటే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని భక్తుల విశ్వాçÜం. గుర్రాలక్క ఆలయం ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో శ్రీలక్షీ్మనరసింహస్వామివారి సోదరి గుర్రాలక్క(అశ్వ రూఢాంబిక) ఆలయం ఉంది. క్షేత్ర ప్రతిపత్తికి ప్రతీకగా ఉన్న ఆమె ఆలయాన్ని భక్తులు దర్శించుకోవడం ఎంతో శ్రేయస్కరం. రథోత్సవం రోజున రథంపై నూతన వధూవరులుగా మూర్తీభవించిన శ్రీస్వామి సతీసమేతంగా గుర్రాలక్క ఆలయానికి వెళ్లి కొత్త దుస్తులు ఇవ్వడం పరిపాటి. నీలకంఠేశ్వరుని ఆలయం ఆలయానికి సుమారు 200 మీటర్ల దూరంలో శ్రీనీలకంఠేశ్వరుని ఆలయం ఉంది. కృతయుగ ఆరంభంలో బ్రహ్మ రుద్రయాగం నిర్వహించేందుకు వేదికగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్టు ప్రతీతి. యాగరక్షణకు నీలకంఠేశ్వరస్వామిని ప్రతిíష్ఠించి, యాగాన్ని పూర్తి చేసిన మహాపుణ్యక్షేత్రం ఇది. బ్రహ్మ యజ్ఞవేదికైనందున ఈప్రాంతం అంతర్వేదికగా ఏర్పడి కాలక్రమంలో అంతర్వేదిగా మారింది. ఈ క్షేత్రంలో శ్రీఆంజనేయస్వామిని క్షేత్ర సంరక్షకునిగా కూడా ప్రతిష్ఠించారని పురాణ సారాంశం. ఆకట్టుకునే లైట్‌హౌస్, సాగరసంగమం ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో లైట్‌హౌస్ ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. దానికి సమీపంలోనే సాగరసంగమం ఉంది. -
నమో..నారసింహా!
- వైభవంగా జయంత్యుత్సవం - అహోబిలంలో సుదర్శన హోమం ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంత్సుత్సవాలు శనివారం వైభవంగా నిర్వహించారు. నరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతిని పురస్కరించుకొని..భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నవ నారసింహ క్షేత్రాల్లో తెల్లవారు జామునే మూలవిరాట్‌కు అర్చన, అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిగువ అహోబిలంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి శ్రీదేవి, పద్మావతి అమ్మవార్లను కొలువుంచి అభిషేకం నిర్వహించారు. తిరుమంజనం అనంతరం స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం వేద మంత్రోచ్చారణల మధ్య సుదర్శన పావన నరసింహ హోమం వైభవోపేతంగా నిర్వహించి పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించారు. హోమం ప్రత్యేకత.. తమ కల్యాణ మహోత్సవానికి భక్తులను స్వయంగా ఆహ్వానించేందుకు ఉత్సవమూర్తులైన శ్రీ జ్వాల నరసింహస్వామి, శ్రీ ప్రహ్లాద వరద స్వాములు పారువేట మహోత్సవానికి గ్రామాలకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంలో వచ్చిన స్వాతి నక్షత్రంలో న శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, పద్మావతి అమ్మవారిని కొలువుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి సుదర్శన హోమం నిర్వహించారు. ప్రధానార్చకుడు వేణుగోపాలన్, అర్చకులు కళ్యాణం, సంతానం, మణియార్ సౌమ్యానారయన్ , ఈఓ మల్లికార్జున ప్రసాదు పర్యవేక్షణలో నిర్వహించారు. -
చూడకపోతే గోవిందా!
– హుండీలోకి వెళ్లని భక్తుల కానుకలు - బయటనే కనిపిస్తున్న వైనం – పట్టించుకోని అధికారులు – ఆందోళనలో భక్తులు ఆళ్లగడ్డ: దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీ అహోబిలేసుడి పారువేట మహోత్సవాలు జరుగుతాయి. ఉత్సవ పల్లకీలో కొలువైన శ్రీజ్వాలానరసింహస్వామి, ప్రహ్లాదవరదస్వాములను దర్శించుకునేందుకు భక్తులు ఎంత ప్రాధాన్యమిస్తారో పల్లకీకి అమర్చిన హుండీ కూడా వారికి అంతే ముఖ్యం. ఏడాది పొడువున ముడుపులు కట్టి, స్వామి తమ తెలుపు పై కొలువైన సమయంలో ఆ సొమ్ములు హుండీలో వేస్తారు. ఇలా చేస్తే సుఖశాంతులతో పాటు ధనప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. అంతటి ప్రాశస్త్యం ఉన్న హుండీలో భక్తులు సొమ్ములు, కానుకలు వేస్తే లోపలకు పడకుండా బయటనే ఉండిపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ విషయాన్ని కొందరు రెండు రోజులుగా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకోక పోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ప్రతి రోజు వేలాది మంది వేసే కానుకలు ఎక్కడికి వెళ్తున్నాయే ప్రశ్నార్థకంగా మారింది. ఎంతో భక్తితో హుండీలో వేసే కానుకలు తమ కళ్లెదుటే దుర్వినియోగమవుతున్నాయని భక్తులు వాపోతున్నారు. దీనిపై దేవస్థానం ఉద్యోగి రాంభూపాల్ దృష్టికి తీసుకెళ్లగా పల్లకీకి అమర్చిన హుండీ పాతది కావడంతో పాటు కానుకలు వేసే రంద్రం చిన్నగా ఉండటంతో లోపలికి పోవడంలేదని తెలిపారు. వేరే హుండీ పంపిస్తామని అధికారులు చెప్పినట్లు వెల్లడించారు. -
సామాన్యుడి చెంతకు గోవిందుడు
– పార్వేట ఉత్సవాలకు అహోబిలంలో శ్రీకారం – తరలివచ్చిన భక్తులు, చెంచులు – శ్రాస్త్రోక్తంగా ఉత్సవ పల్లికిని సాగనంపిన వేదపండితులు ఆళ్లగడ్డ: తన కల్యాణానికి స్వయంగా భక్తకోటిని ఆహ్వానించేందుకు లక్ష్మీనరసింహ ఆదివారం పల్లె బాట పట్టారు. సంక్రాంతి పర్వదినం ముగిసిన మరుసటి (కనుమ) రోజు అహోబిలేశుడి పారువేట ఉత్సవాలు ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా ఎగువ అహోబిలంలో వెలసిన శ్రీ జ్వాలా నరసింహస్వామిని శనివారం దిగువ అహోబిలం తీసుకువచ్చి అక్కడ వెలసిన ప్రహ్లాద వరదస్వామితో కలిపి కొలువుంచి ఇద్దరికి తలపాగా చుట్టి వేటగాల్లలా ప్రత్యేకాలంకరణ గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ప్రహ్లాద వరదుడు, జ్వాలా నరసింహ మూర్తిని ఉత్సవ పల్లకిలో కొలువుంచి వేదపండితుల వేద మంత్రోచ్ఛారణాల నడుమ, చెంచుల సంప్రదాయ నృత్యాల మధ్య ఆలయ మండపానికి తీసుకు వచ్చారు. అక్కడ ఉత్సవ మూర్తుల సమక్షంలో కుంభహారతి అనంతరం అన్నకూటోత్సవం అర్పించారు. ఇందులో కొంత భాగాన్ని చెంచులు, అటవీ అధికారులు, బోయిలూ, రెడ్డి, కరణం, అర్చకులు, గుడికట్టు, నిషాని, తప్పెట తదితరులకు అందజేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఉత్సవ పల్లకి ఆలయం బయటకు వచ్చిన అనంతరం స్వామి వారిపై బాణాలు ఎక్కుపెట్టి సంధించారు. తమ ఆడబిడ్డ అయిన చెంచులక్ష్మీ అమ్మవారిని స్వామి వివాహం చేసుకునేందుకు భక్తులకు ఆహ్వానం పలికేందుకు గ్రామాలకు వెళ్తున్నందుకు సంతోషంగా బాణాలు వదులుతూ సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీ. అనంతరం చెంచులు పల్లకి ముందర సంప్రదాయ నృత్యాలు చేస్తూ గ్రామ పొలిమేర వరకు పల్లకిని సాగనంపారు. కార్యక్రమాలను మఠం ప్రతినిథి సంపత్, ఈఓ మల్లికార్జున ప్రసాద్, ప్రధానార్చకులు వేణుగోపాల్‌లు పర్యవేక్షించారు. ఆళ్లగడ్డ సీఐ దస్తగిరిబాబు, ఎస్ఐలు రామయ్య, చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పలచాని బాలిరెడ్డి, కెడీసీసీ బ్యాంకు డైరెక్టర్ నాసారి వెంకటేశ్వర్లు, అహోబిలం సర్పంచ్ నాసారి వీరమ్మ తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు. -
వైభవంగా లక్ష్మీనృసింహుడి పల్లకి సేవ
పెన్నహోబిళం(ఉరవకొండ) : మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిళం శ్రీలక్ష్మీనృసింహ స్వామి వారి పల్లకి ఉత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు ద్వారాకానా«థ్ చార్యులు అధ్వర్యంలో అభిషేకం, మహా మంగళహరతి సేవలను నిర్వహించారు. అనంతరం విశేష పుష్పాలతో అలంకరించిన ప్రత్యేక పల్లకిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీనృసింహా స్వామి ఉత్సవ విగ్రహాలను ఆలయ పురవీధుల్లో ఊరేగారు. -
వైభవోపేతం.. స్వామి మహోత్సవం
- అహోబిలేశుడి సన్నిధిలో ఘనంగా వేడుకలు - గోవిందా నామస్మరణతో పులకించిన నల్లమల - స్వామిని దర్శనార్థం అశేషంగా తరలివచ్చిన భక్తులు ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీనృసింహస్వామి జన్మదిన వేడుకలు నవనారసింహ క్షేత్రాల్లో వైభవోపేతంగా నిర్వహించారు. నృసింహస్వామి అవతార దినమైన స్వాతి నక్షత్రాన్ని పురష్కరించుకుని శనివారం భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. నవనారసింహ క్షేత్రాల్లోని 10 దేవాలయాల్లో కొలువై స్వయంభూగా వెలసిన లక్ష్మీనృసింహస్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా ఎగువ అహోబిలంలో కొలువైన శ్రీ జ్వాలనరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు తెల్లవారుజామున విశ్వరూప సేవ, నిత్య పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సహీత శ్రీజ్వాలానృసింహస్వాములను దేవాలయం ఆవరణలోని మండపంలో కొలువుంచి అర్చన, తిరుమంజనం నిర్వహించారు. తర్వాత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ గావించి మండపంలో కొలువుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వాతి , సుదర్శన హోమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో నవనారసింహ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.