
‘బాలబాబా’ గుట్టురట్టు
నర్సాపూర్ : నరసింహస్వామి తన కుమారుడిని పూనతాడని ప్రజలను మోసం చేస్తున్న బాలబాబా తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున ్నట్లు మెదక్ జిల్లా నర్సాపూర్ ఎస్‌ఐ గోపీనాథ్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట పంచాయతీ సీతారాంతండాకు చెందిన మాలోత్ లక్ష్మణ్, ప్రమీల దంపతులు వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవారు.
వీరి రెండో కుమారుడు మాలోత్ బాబి పెద్దచింత హైస్కూల్ పదో తరగతి చదువుతున్నాడు. ఇదిలా ఉండగా.. లక్ష్మణ్ దంపతులకు సులభంగా డబ్బు సంపాదించాలన్న దుర్బుద్ధి కలిగింది. వెంటనే తమ కుమారుడు బాబీని బాలబాబా అవతారం ఎత్తించారు. తమ పొలంలో పందిరి వేసి దేవతల ఫొటోలను ఉంచి తమ కుమారుడికి ప్రతి శనివారం లక్ష్మీనరసింహస్వామి పూనతాడని అక్కడివారిని నమ్మించారు. వీరి మాటలు నమ్మిన ప్రజలు బాబా దర్శనార్థం వచ్చేవారు. బాబా వద్దకు వచ్చే భక్తుల నుంచి రూ. 20 రుసుం వసూలు చేస్తూ.. కొబ్బరికాయ, నిమ్మకాయలను వారే విక్రయించేవారు. మూడు వారాల క్రితం నర్సాపూర్ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వినోద్ మొబైల్ ఫోన్ పోవడంతో అతను బాలబాబా వద్దకు వచ్చి తన సమస్యను వివరించాడు.
అయితే బాబా ‘నువ్వు ఉన్న గదిలోని విద్యార్థులే నీ మొబైల్ దొంగలించారు. వారిని ఇక్కడికి తీసుకువస్తే దొంగను పట్టిస్తా’ను అని చెప్పాడు. దీంతో వినోద్ తనతో పాటు గదిలో ఉండే సహచరులైన సతీష్, ప్రభాకర్, పృథ్వీరాజ్, ప్రవీణ్, ప్రకాష్‌రాథోడ్‌లను బాలబాబా వద్దకు తీసుకువచ్చాడు. బాలబాబా వారినుద్దేశించి మీ చేతుల్లో నిప్పులు వేస్తానని, మొబైల్‌ను చోరీ చేసిన వారి చేతులు కాలుతాయని నిప్పు కణికలు వారి చేతుల్లో వేశాడు. అయితే చేతులు కాలుతున్నాయని చెబితే తాము ఎక్కడ దొంగలమని అంటారని భయపడి వారు బాధను భరించారు.
ఇదిలాఉండగా మూడు వారాలుగా బొబ్బల బాధను భరించిన విద్యార్థులు శనివారం బాలబాబా వద్దకు కు వెళ్లి తమ చేతుల్లో నిప్పులు వేసి పరీక్షలు పెట్టినా తమ మిత్రుడి మొబైల్ ఎందుకు దొరకలేదని బాలబాబాను అతడి తల్లిదండ్రులను నిలదీశారు. దీంతో బాబా తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల దురుసుగా వ్యవహరించారు. ఇదే విషయాన్ని విద్యార్థులకు పోలీసులకు ఫిర్యాదు చేశారని ఎస్‌ఐ వివరిచారు. తాను అక్కడికి వెళ్లి బాలబాబా తల్లిదండ్రులను విచారించగా.. తమ కుమారుడికి దేవుడు పూనుతాడని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నట్లు ఒప్పుకున్నారన్నారు. దీంతో వారిని అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు. కాగా తల్లిదండ్రుల మాటలతో బాలబాబాగా కొనసాగిన బాలుడిని పాఠశాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.