చూడకపోతే గోవిందా!
చూడకపోతే గోవిందా!
Published Tue, Jan 17 2017 11:03 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM
– హుండీలోకి వెళ్లని భక్తుల కానుకలు
- బయటనే కనిపిస్తున్న వైనం
– పట్టించుకోని అధికారులు
– ఆందోళనలో భక్తులు
ఆళ్లగడ్డ: దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీ అహోబిలేసుడి పారువేట మహోత్సవాలు జరుగుతాయి. ఉత్సవ పల్లకీలో కొలువైన శ్రీజ్వాలానరసింహస్వామి, ప్రహ్లాదవరదస్వాములను దర్శించుకునేందుకు భక్తులు ఎంత ప్రాధాన్యమిస్తారో పల్లకీకి అమర్చిన హుండీ కూడా వారికి అంతే ముఖ్యం. ఏడాది పొడువున ముడుపులు కట్టి, స్వామి తమ తెలుపు పై కొలువైన సమయంలో ఆ సొమ్ములు హుండీలో వేస్తారు. ఇలా చేస్తే సుఖశాంతులతో పాటు ధనప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. అంతటి ప్రాశస్త్యం ఉన్న హుండీలో భక్తులు సొమ్ములు, కానుకలు వేస్తే లోపలకు పడకుండా బయటనే ఉండిపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ విషయాన్ని కొందరు రెండు రోజులుగా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకోక పోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ప్రతి రోజు వేలాది మంది వేసే కానుకలు ఎక్కడికి వెళ్తున్నాయే ప్రశ్నార్థకంగా మారింది. ఎంతో భక్తితో హుండీలో వేసే కానుకలు తమ కళ్లెదుటే దుర్వినియోగమవుతున్నాయని భక్తులు వాపోతున్నారు. దీనిపై దేవస్థానం ఉద్యోగి రాంభూపాల్ దృష్టికి తీసుకెళ్లగా పల్లకీకి అమర్చిన హుండీ పాతది కావడంతో పాటు కానుకలు వేసే రంద్రం చిన్నగా ఉండటంతో లోపలికి పోవడంలేదని తెలిపారు. వేరే హుండీ పంపిస్తామని అధికారులు చెప్పినట్లు వెల్లడించారు.
Advertisement