కనులపండువగా సుదర్శన జయంతి
కనులపండువగా సుదర్శన జయంతి
Published Sun, Jul 2 2017 10:52 PM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM
– వేద పండితుల ఆధ్వర్యంలో సుదర్శన హోమం, అభిషేకం
– భారీగా తరలి వచ్చిన భక్తులు
అహోబిలం (ఆళ్లగడ్డ) : సుదర్శన జయంతి మహోత్సవం ఆదివారం అహోబిల క్షేత్రంలో వైభవంగా జరిగింది. ఎగువ అహోబిలంలో కొలువైన ఉత్సవమూర్తులైన జ్వాలనరసింహ స్వామి, శ్రీదేవి, భూదేవి, చెంచులక్ష్మీ అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి దేవాలయం ఎదురుగా కొలువుంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామి అమ్మవారికి ఎదురుట పండితులు వేద మంత్రోచ్ఛారణలతో సుదర్శన హోమం నిర్వహించారు. అంతకుముందు ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో నవకలశ పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం ఉత్సవమూర్తి సుదర్శనమూర్తిని కొలువుంచి నవకలశస్తాపన, గంధాబిషేకం, తిరుమంజనం నిర్వహించి స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో కొలువైన వెండి సుదర్శనమూర్తి ప్రతిమ (సుదర్శ చక్రం)కు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
సుదర్శన హోమం ప్రత్యేకత
సాధారణంగా లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురష్కరించుకుని ప్రతి నెల స్వాతి రోజు సుదర్శన హోమం నిర్వహించడం సాంప్రదాయం. అయితే ఏడాదికి ఒకసారి ఆషాడమాసంలో వచ్చే స్వాతి నక్షత్రానికి ముందు రోజైన చిత్తా నక్షత్రం రోజున సుదర్శనమూర్తి జయంతి కావడంతో సుదర్శన హోమం నిర్వహిస్తారు. సుదర్శనమూర్తి ఆరు చేతులతో ఆరు రకాల ఆయుధాలతో వైష్ణవ దేవుళ్లను రక్షిస్తుంటారని పురాణాలు చెబుతున్నాయి. సుదర్శనమూర్తికి ఆదిదేవుడు లక్ష్మీనరసింహస్వామి గురువు కావడంతో ప్రతి స్వాతి వేడుకల్లో సుదర్శన హోమం చేస్తుంటారు.
స్వామి సేవలో ఎమ్మెల్సీ గంగుల
సుదర్శన జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి పాల్గొని స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మర్యాదల్లో భాగంగా ఎమ్మెల్సీకి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రధానార్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వాదం అందజేశారు. ఈయన వెంట గంగుల బిజేంధ్రారెడ్డి, కెడీసీసీ బ్యాంకు డైరెక్టర్ నాసారి వెంకటేశ్వర్లు, సింగం భరత్‌రెడ్డి, కందుకూరు శ్రీను ఉన్నారు.
నేడు దిగువ అహోబిలంలో స్వాతి మహోత్సవాలు :
దిగువ అహోబిలంలో సోమవారం స్వాతి నక్షత్రం సందర్భంగా వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు జేష్టాభిషేకం, గరుడ సేవ కార్యక్రమాల అనంతరం స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, హోమాలు తదితర కార్యక్రమాలు ఉంటాయి.
Advertisement