ఘనంగా నరసింహ స్వామి జయంత్యుత్సవాలు
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం లో వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురష్కరించుకుని దిగువ అహోబిలంలోని శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో స్వామి అమ్మవార్లను కొలువుంచి అర్చన, అభిషేకాలు, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాత్రి ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సవ పల్లకిలో కూర్చోబెట్టి మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు.