నమో నారసింహ
- నల్లమలలో మోరుమోగిన
గోవింద నామస్మరణ
- శేష వాహనంపై దర్శనమిచ్చిన
జ్వాలనారసింహుడు
- హనుమంత వాహనంపై
ఊరేగిన ప్రహ్లాదవర స్వామి
అహోబిలం(ఆళ్లగడ్డ): బ్రహ్మోత్సవాల సందర్భంగా అహోబిల క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ విరజిల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఎగువ అహోబిలంలో కొలువైన శ్రీ జ్వాలనృసింహస్వామి శేష వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులైన శ్రీ జ్వాలనృసింహ స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు నిత్య పూజల్లో భాగంగా తెల్లవారు జామునే మేలుకొలుపు చేసి వేదపండితుల వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పుష్పాలంకరణ చేసి శేష వాహనంపై కొలువుంచి మంగళ వాయిద్యాల మధ్య భక్తి శ్రద్దలతో మాడ వీధుల్లో వైభవోపేతంగా గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజల్లో భాగంగా అభిషేకం, తిరుమంజనం నిర్వహించి భక్తుల దర్శనార్థం ప్రతేకంగా అలకంరించిన మండపంలో కొలువుంచారు.
దిగువ అహోబిలంలో
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం ఉదయం శ్రీ ప్రహ్లాదవరదస్వామి శ్రీదేవి భూదేవి అమ్మవారు శ్రీ యోగానృసింహ గారుడ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. అంతకు ముందు వేకవజామున నిత్య పూజల్లో భాగంగా సుప్రత సేవ అనంతరం స్వామి అమ్మవార్లను మేలుకొలిపి శ్రీఘ్రదర్శనం అనంతరం అర్చనలు నిర్వహించి, నవకళశస్థాపన గావించిన అనంతరం జలాఅభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన పట్టువస్త్రాలు, మణి మానిక్యాల అభరణాలతో ప్రత్యేకంగా అలకంరించిన స్వామి అమ్మవార్లను శ్రీ యోగనృసింహ గరుడ విమాన వాహనంలో కొలువుంచారు. మంగళవాయిద్యాలతో వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం పంచామృతాభిషేకం, జలాభిషేకం నిర్వహించి స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో కొలువుంచారు. రాత్రి శ్రీ ప్రహ్లాదరవదస్వామి హనుమంతు వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు.
నేటి కార్యక్రమాలు..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఎగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ఉదయయం ఉత్సవం, మధ్యాహ్నం అభిషేకం, రాత్రి శరభ వాహణ సేవ ఉంటుంది. దిగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ ప్రహ్లాదవరదుడు ఉదయం శేషవాహనంపై కొలువై దర్శనమిస్తారు. మధ్యాహ్నం స్వామి, అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై దర్శనమివ్వనున్నారు