రుద్రవరం పురవీదుల్లో ఉత్సవ పల్లకిని మోసుకెళ్తున్న బోయినులు
తుది ఘట్టానికి పారువేట ఉత్సవం
Published Sun, Feb 26 2017 11:13 PM | Last Updated on Tue, Sep 5 2017 4:41 AM
- రుద్రవరం బోయినుల కాలనీలో పూజలందుకున్న నారసింహుడు
- రాత్రికి కొల్లంవారి కాలనీలో తెలుపుపై కొలువు
రుద్రవరం: పారువేట ఉత్సవంలో భాగంగా అహోబిలం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆదివారం పలు తెలుపులపై కొవుదీరి పూజలందుకోవడంతో ఉత్సవం చివరి ఘట్టానికి చేరింది. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా గత నెల 16న పారువేట ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అహోబిలంలో ప్రారంభమైన ఉత్సవాలు ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, రుద్రవరం మండలాల్లోని పలుగ్రామాల్లో సాగాయి. చివరగా స్వామివారి మండల కేంద్రమైన రుద్రవరం చేరుకున్నాడు.
నాలుగు రోజులుగా ఉత్సవ మూర్తులు పలు తెలుపులపై కొలువు దీరగా స్థానికులతోపాటు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహించారు. ఇదే గ్రామంలో మరో రెండు రోజులపాటు పూజలందుకున్న అనంతరం స్వామివారు కొండకు బయలు దేరుతారు. పల్లకి మోసే బోయినులు నివాసం ఉన్న కాలనీలో స్వామి కొలువుదీరడంతో కాలనీలు వాసులు ఆనందోత్సాహాలతో పూజలు జరిపారు. బోయినీలకు ఇష్ట దైవం, ఇంటి దేవుడు కావడంతో బంధు మిత్రులతో సందడి వాతావరణం నెలకొంది. రాత్రికి కొల్లం వారి తెలుపుపై కొలువుదీరేంత వరకు గోవింద నామస్మరణతో కాలనీలు మొత్తం మారుమోగాయి. స్వామివారి రాకను పురస్కరించుకుని తిరునాల నిర్వహిస్తుండడంతో గ్రామంలోని అమ్మవారిశాల సెంటర్ బొమ్మలు, గాజుల అంగళ్లు, వాటిని కొనుగోలు చేసేందుకు వచ్చిన జనంతో కళకళలాడుతోంది.
Advertisement