సామాన్యుడి చెంతకు గోవిందుడు
సామాన్యుడి చెంతకు గోవిందుడు
Published Sun, Jan 15 2017 11:11 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 AM
– పార్వేట ఉత్సవాలకు అహోబిలంలో శ్రీకారం
– తరలివచ్చిన భక్తులు, చెంచులు
– శ్రాస్త్రోక్తంగా ఉత్సవ పల్లికిని సాగనంపిన వేదపండితులు
ఆళ్లగడ్డ: తన కల్యాణానికి స్వయంగా భక్తకోటిని ఆహ్వానించేందుకు లక్ష్మీనరసింహ ఆదివారం పల్లె బాట పట్టారు. సంక్రాంతి పర్వదినం ముగిసిన మరుసటి (కనుమ) రోజు అహోబిలేశుడి పారువేట ఉత్సవాలు ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా ఎగువ అహోబిలంలో వెలసిన శ్రీ జ్వాలా నరసింహస్వామిని శనివారం దిగువ అహోబిలం తీసుకువచ్చి అక్కడ వెలసిన ప్రహ్లాద వరదస్వామితో కలిపి కొలువుంచి ఇద్దరికి తలపాగా చుట్టి వేటగాల్లలా ప్రత్యేకాలంకరణ గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ప్రహ్లాద వరదుడు, జ్వాలా నరసింహ మూర్తిని ఉత్సవ పల్లకిలో కొలువుంచి వేదపండితుల వేద మంత్రోచ్ఛారణాల నడుమ, చెంచుల సంప్రదాయ నృత్యాల మధ్య ఆలయ మండపానికి తీసుకు వచ్చారు. అక్కడ ఉత్సవ మూర్తుల సమక్షంలో కుంభహారతి అనంతరం అన్నకూటోత్సవం అర్పించారు. ఇందులో కొంత భాగాన్ని చెంచులు, అటవీ అధికారులు, బోయిలూ, రెడ్డి, కరణం, అర్చకులు, గుడికట్టు, నిషాని, తప్పెట తదితరులకు అందజేశారు.
ప్రత్యేక పూజల అనంతరం ఉత్సవ పల్లకి ఆలయం బయటకు వచ్చిన అనంతరం స్వామి వారిపై బాణాలు ఎక్కుపెట్టి సంధించారు. తమ ఆడబిడ్డ అయిన చెంచులక్ష్మీ అమ్మవారిని స్వామి వివాహం చేసుకునేందుకు భక్తులకు ఆహ్వానం పలికేందుకు గ్రామాలకు వెళ్తున్నందుకు సంతోషంగా బాణాలు వదులుతూ సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీ. అనంతరం చెంచులు పల్లకి ముందర సంప్రదాయ నృత్యాలు చేస్తూ గ్రామ పొలిమేర వరకు పల్లకిని సాగనంపారు. కార్యక్రమాలను మఠం ప్రతినిథి సంపత్, ఈఓ మల్లికార్జున ప్రసాద్, ప్రధానార్చకులు వేణుగోపాల్‌లు పర్యవేక్షించారు. ఆళ్లగడ్డ సీఐ దస్తగిరిబాబు, ఎస్‌ఐలు రామయ్య, చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పలచాని బాలిరెడ్డి, కెడీసీసీ బ్యాంకు డైరెక్టర్ నాసారి వెంకటేశ్వర్లు, అహోబిలం సర్పంచ్ నాసారి వీరమ్మ తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు.
Advertisement
Advertisement