paruveta
-
తర్తూరులో పారువేట
జూపాడుబంగ్లా: శ్రీలక్ష్మీరంగనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా తర్తూరులో గురువారం పారువేటను వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి పల్లకిలో అధిష్టింపజేశారు. స్వామిని పారువేట గుర్రం వద్దకు తీసుకెళ్లి.. పాత రంగస్వామి దేవాలయం సమీపంలో గొర్రెను వదిలిపెట్టారు. పాత రంగనాథస్వామివారికి పూజలు నిర్వహించి అక్కడి నుంచి పారువేట గుర్రంతో పాటు స్వామివారిని తీసుకొని పారువేట పద్యాలను పాడుకుంటూ భక్తులు స్వామివారిని తిరిగి దేవాలయానికి చేర్చారు. -
తుది ఘట్టానికి పారువేట ఉత్సవం
- రుద్రవరం బోయినుల కాలనీలో పూజలందుకున్న నారసింహుడు - రాత్రికి కొల్లంవారి కాలనీలో తెలుపుపై కొలువు రుద్రవరం: పారువేట ఉత్సవంలో భాగంగా అహోబిలం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆదివారం పలు తెలుపులపై కొవుదీరి పూజలందుకోవడంతో ఉత్సవం చివరి ఘట్టానికి చేరింది. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా గత నెల 16న పారువేట ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అహోబిలంలో ప్రారంభమైన ఉత్సవాలు ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, రుద్రవరం మండలాల్లోని పలుగ్రామాల్లో సాగాయి. చివరగా స్వామివారి మండల కేంద్రమైన రుద్రవరం చేరుకున్నాడు. నాలుగు రోజులుగా ఉత్సవ మూర్తులు పలు తెలుపులపై కొలువు దీరగా స్థానికులతోపాటు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహించారు. ఇదే గ్రామంలో మరో రెండు రోజులపాటు పూజలందుకున్న అనంతరం స్వామివారు కొండకు బయలు దేరుతారు. పల్లకి మోసే బోయినులు నివాసం ఉన్న కాలనీలో స్వామి కొలువుదీరడంతో కాలనీలు వాసులు ఆనందోత్సాహాలతో పూజలు జరిపారు. బోయినీలకు ఇష్ట దైవం, ఇంటి దేవుడు కావడంతో బంధు మిత్రులతో సందడి వాతావరణం నెలకొంది. రాత్రికి కొల్లం వారి తెలుపుపై కొలువుదీరేంత వరకు గోవింద నామస్మరణతో కాలనీలు మొత్తం మారుమోగాయి. స్వామివారి రాకను పురస్కరించుకుని తిరునాల నిర్వహిస్తుండడంతో గ్రామంలోని అమ్మవారిశాల సెంటర్ బొమ్మలు, గాజుల అంగళ్లు, వాటిని కొనుగోలు చేసేందుకు వచ్చిన జనంతో కళకళలాడుతోంది. -
సామాన్యుడి చెంతకు గోవిందుడు
– పార్వేట ఉత్సవాలకు అహోబిలంలో శ్రీకారం – తరలివచ్చిన భక్తులు, చెంచులు – శ్రాస్త్రోక్తంగా ఉత్సవ పల్లికిని సాగనంపిన వేదపండితులు ఆళ్లగడ్డ: తన కల్యాణానికి స్వయంగా భక్తకోటిని ఆహ్వానించేందుకు లక్ష్మీనరసింహ ఆదివారం పల్లె బాట పట్టారు. సంక్రాంతి పర్వదినం ముగిసిన మరుసటి (కనుమ) రోజు అహోబిలేశుడి పారువేట ఉత్సవాలు ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా ఎగువ అహోబిలంలో వెలసిన శ్రీ జ్వాలా నరసింహస్వామిని శనివారం దిగువ అహోబిలం తీసుకువచ్చి అక్కడ వెలసిన ప్రహ్లాద వరదస్వామితో కలిపి కొలువుంచి ఇద్దరికి తలపాగా చుట్టి వేటగాల్లలా ప్రత్యేకాలంకరణ గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ప్రహ్లాద వరదుడు, జ్వాలా నరసింహ మూర్తిని ఉత్సవ పల్లకిలో కొలువుంచి వేదపండితుల వేద మంత్రోచ్ఛారణాల నడుమ, చెంచుల సంప్రదాయ నృత్యాల మధ్య ఆలయ మండపానికి తీసుకు వచ్చారు. అక్కడ ఉత్సవ మూర్తుల సమక్షంలో కుంభహారతి అనంతరం అన్నకూటోత్సవం అర్పించారు. ఇందులో కొంత భాగాన్ని చెంచులు, అటవీ అధికారులు, బోయిలూ, రెడ్డి, కరణం, అర్చకులు, గుడికట్టు, నిషాని, తప్పెట తదితరులకు అందజేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఉత్సవ పల్లకి ఆలయం బయటకు వచ్చిన అనంతరం స్వామి వారిపై బాణాలు ఎక్కుపెట్టి సంధించారు. తమ ఆడబిడ్డ అయిన చెంచులక్ష్మీ అమ్మవారిని స్వామి వివాహం చేసుకునేందుకు భక్తులకు ఆహ్వానం పలికేందుకు గ్రామాలకు వెళ్తున్నందుకు సంతోషంగా బాణాలు వదులుతూ సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీ. అనంతరం చెంచులు పల్లకి ముందర సంప్రదాయ నృత్యాలు చేస్తూ గ్రామ పొలిమేర వరకు పల్లకిని సాగనంపారు. కార్యక్రమాలను మఠం ప్రతినిథి సంపత్, ఈఓ మల్లికార్జున ప్రసాద్, ప్రధానార్చకులు వేణుగోపాల్‌లు పర్యవేక్షించారు. ఆళ్లగడ్డ సీఐ దస్తగిరిబాబు, ఎస్ఐలు రామయ్య, చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పలచాని బాలిరెడ్డి, కెడీసీసీ బ్యాంకు డైరెక్టర్ నాసారి వెంకటేశ్వర్లు, అహోబిలం సర్పంచ్ నాసారి వీరమ్మ తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు.