వైభవోపేతం.. స్వామి మహోత్సవం
వైభవోపేతం.. స్వామి మహోత్సవం
Published Sat, Dec 24 2016 11:01 PM | Last Updated on Mon, Sep 4 2017 11:31 PM
- అహోబిలేశుడి సన్నిధిలో ఘనంగా వేడుకలు
- గోవిందా నామస్మరణతో పులకించిన నల్లమల
- స్వామిని దర్శనార్థం అశేషంగా తరలివచ్చిన భక్తులు
ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీనృసింహస్వామి జన్మదిన వేడుకలు నవనారసింహ క్షేత్రాల్లో వైభవోపేతంగా నిర్వహించారు. నృసింహస్వామి అవతార దినమైన స్వాతి నక్షత్రాన్ని పురష్కరించుకుని శనివారం భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. నవనారసింహ క్షేత్రాల్లోని 10 దేవాలయాల్లో కొలువై స్వయంభూగా వెలసిన లక్ష్మీనృసింహస్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా ఎగువ అహోబిలంలో కొలువైన శ్రీ జ్వాలనరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు తెల్లవారుజామున విశ్వరూప సేవ, నిత్య పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సహీత శ్రీజ్వాలానృసింహస్వాములను దేవాలయం ఆవరణలోని మండపంలో కొలువుంచి అర్చన, తిరుమంజనం నిర్వహించారు. తర్వాత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ గావించి మండపంలో కొలువుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వాతి , సుదర్శన హోమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో నవనారసింహ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
Advertisement
Advertisement