స్వామి భూములు స్వాహా! | TDP Leaders devudi lands Grabbing In Vizianagaram | Sakshi
Sakshi News home page

స్వామి భూములు స్వాహా!

Published Tue, Jun 25 2024 3:19 AM | Last Updated on Tue, Jun 25 2024 3:19 AM

TDP Leaders devudi lands Grabbing In Vizianagaram

విజయనగరం జిల్లాలో దేవుడి భూములకు టీడీపీ నేతల శఠగోపం 

సిరిపురంలోని శ్రీమన్నార్‌ రాజగోపాలస్వామి దేవస్థానం భూములకు ఎసరు 

48 ఎకరాలను గుప్పెటపట్టిన తమ్ముళ్లు..  భూముల క్రయవిక్రయాలకు ప్రయత్నాలు  

చోద్యం చూస్తున్న అధికారులు

గంట్యాడ: దేవుడికే టీడీపీ నాయకులు శఠగోపం పెట్టేశారు. దేవుడి భూములను ఆక్రమించి ఫలసాయం పొందడంతో పాటు వాటి విక్రయాలకు తెగబడుతున్నారు. ఈ విషయం దేవదాయశాఖ అధికారులకు తెలిసినా ప్రేక్షకపాత్రకే పరిమితమవడం చర్చనీయాంశంగా మారింది. 

వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీమన్నార్‌ రాజగోపాలస్వామి ఆలయానికి అదే జిల్లా గంట్యాడ మండలం సిరిపురం గ్రామంలో 48 ఎకరాల భూమి ఉంది.విజయనగరంలోని హుకుంపేటకు చెందిన అనసపురపు జగన్నాథరావు తండ్రి రామమూర్తి పంతులు, అనసపురపు జగన్నాథ రాజగోపాలరావు తండ్రి శ్రీనివాస పంతులు శ్రీమన్నార్‌ రాజగోపాలస్వామివారి ధూప, దీప నైవేద్యాలు, జాతర నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం 1929లో 48 ఎకరాల భూమిని రిజిస్టర్‌ చేశారు.

డాక్యుమెంటేషన్‌ 1815 పేరిట 32 ఎకరాల పల్లపు భూమి, 16 ఎకరాల మెట్ట భూమిని అప్పగించారు. ఈ భూమి సర్వే నెంబర్‌ 95/15, 16, 17, 19, 21, 96/1, 3, 4, 97/20, 21, 23, 99/9, 10, 11, 12, 14, 15, 100/4, 5, 8, 9, 10,  140/3, 4, 9, 11, 12, 14 తదితర నంబర్లలో విస్తరించి ఉంది. దీని విలువ రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు ఉంటుందన్నది స్థానికుల మాట. దీనిపై టీడీపీ నేతల కన్నుపడింది. అంతే.. మొత్తం భూమిని తమ గుప్పెట్లోకి లాక్కున్నారు. ఏళ్ల తరబడి అనుభవించడంతో పాటు ఇప్పుడు అధికార బలంతో విక్రయాలకు సిద్ధపడ్డారు. కొందరైతే అందులో అక్రమ కట్టడాలు సైతం తలపెట్టారు. ఇంత జరుగుతున్నా దేవదాయ శాఖాధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి.  

ఆ రిజిస్ట్రేషన్లు చెల్లవు.. 
శ్రీమన్నార్‌ రాజగోపాలస్వామి ఆలయానికి చెందిన 48 ఎకరాల భూమి సిరిపురం గ్రామ పరిసరాల్లో ఉంది. ఈ భూములన్నీ ఆలయానికి చెందినవే. పక్కా డాక్యుమెంట్లు ఉన్నాయి. శ్రీమన్నార్‌ రాజగోపాలస్వామి దేవస్థానానికి చెందిన భూములన్నీ మ్యానిíసిప్ట్‌ డయాగ్లేట్‌ రిజిస్టర్‌ (ఎండీఆర్‌)లో దేవస్థానం భూములుగా నమోదై ఉన్నాయి. ఈ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు నిలిపివేశాం. అక్రమ రిజి్రస్టేషన్లు చెల్లవు. కొనుగోలు చేసేవారే బాధ్యులవుతారు.    – శ్రీనివాస్, వీఆర్వో, సిరిపురం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement