‘భూ’ ప్రకంపనలు
► సంచలనం సృష్టిస్త్తున్న ‘సాక్షి’ కథనాలు
► ఎక్కడ చూసినా ‘రాజధాని దురాక్రమణ’పైనే చర్చ
► రాజకీయ, అధికారవర్గాల్లోనూ కలకలం
► ఎవరి బండారం బయటపడుతుందోనని గుబులు
► మంత్రులు, టీడీపీ నేతల భూ బాగోతంపై జనాగ్రహం
► కడుపులు కొట్టి భూములు మింగారని ఆందోళన
► అన్యాయం చేసిన వారి పాపం ఊరికే పోదని శాపనార్థాలు
ఊళ్లల్లో తిరుగుతూ హడావుడి చేసిన మంత్రి నారాయణ మూడు వేల ఎకరాలు కొనేశాడా..! ఓ రైతు ఆశ్చర్యం
ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని చెప్పి ప్రపంచ స్థాయి భూ కుంభకోణానికి తెరతీశారా..! మరొకరి అనుమానం
‘సాక్షి’లో సాక్ష్యాధారాలతో సహా వచ్చాయిగా ఇంకా సందేహమెందుకు..?
ఇంకొకరి సమర్థన ...రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా ‘దేశం’ దురాక్రమణ’పైనే చర్చ
సాక్షి, విజయవాడ బ్యూరో/మంగళగిరి : రాజధాని ప్రాంతంలో అధికార పార్టీ చేసిన అడ్డగోలుLand exploitation,పై ‘సాక్షి’ దినపత్రికలో ‘రాజధాని దురాక్రమణ’ పేరుతో వచ్చిన కథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. రాజకీయ, అధికార వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేపాయి. ప్రధానంగా రాజధాని ప్రాంతాలైన మంగళగిరి, తుళ్లూరు, అమరావతి మండలాల్లో ఈ కథనాలు ప్రకంపనలు సృష్టించాయి. దురాక్రమణలో టీడీపీ నేతల నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండడంతో రేపటి కథనాల్లో ఎవరి బండారం బయటపడుతుందోనని అధికార పార్టీ నేతలు గుబులు చెందుతున్నారు.
భూముల క్రయ విక్రయాల్లో అధికార పార్టీ నేతలకు సహకరించిన రియల్‌ఎస్టేట్ వ్యాపారులు, దళారులు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో నేతలకు సహకరించిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. పక్కా సాక్ష్యాధారాలతో ప్రచురితం అవుతున్న కథనాలపై పోలీస్, ఇంటిలిజెన్స్ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తంచేస్తూ విచారణకు దిగారు.
కడుపు కొట్టారంటూ కూలీల ఆవేదన..
రాజధాని పేరుతో రాజకీయ వ్యాపారం చేస్తున్నారని రైతులు, కూలీలు ప్రభుత్వ తీరును ఎండగడుతు న్నారు. ముఖ్యమంత్రి కుటుంబం, మంత్రులు, టీడీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ భూములు లాక్కుని రాజధాని కడతారనుకుంటే వాటిని స్వాధీనం చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారని మండిపడుతున్నారు. వ్యవసాయం లేకుండా పోయి నానా బాధలు పడుతున్నామని రైతులు, పనులు లేకుండా రోడ్డున పడ్డామని కూలీలు ఆందోళన చెందుతున్నారు. భూములు లాక్కుని తమ కడుపులు కొట్టారని వెంకటపాలెం రైతు పి.శేఖర్ ఆవేదనగా చెప్పాడు. రాజధాని పేరుతో తమ ప్రాంతాన్ని సర్వ నాశనం చేశారని, టీడీపీ తమను నట్టేట ముంచిందని తాళ్లాయపాలెంలో ఏసోబు అనే కార్మికుడు ఆవేదనగా చెప్పాడు.
చుకుంటే ఏమీ మిగలదని చెప్పడంతో చాలా తక్కువ రేటుకు తన భూమి అమ్మేశానని మందడం గ్రామానికి చెందిన రైతు నాగేశ్వరరావు తెలిపాడు. తమకు అన్యాయం చేసిన వాళ్ల పాపం ఊరికే పోదని శాపనార్ధాలు పెడుతున్నారు.
కొమ్మాలపాటి కుచ్చుటోపీపై తీవ్ర చర్చ...
పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ నిర్వహిస్తున్న అభినందన హౌసింగ్ సంస్థ రాజధాని గ్రామమైన యర్రబాలెంలో 42 ఎకరాలు కొనుగోలు చేసి వాయిదాల పద్ధతిలో ప్లాట్లు విక్రయించింది. రాజధాని ప్రకటన తర్వాత కొందరు ఖాతాదారులకు ఇక్కడ కాకుండా వేరేవెంచర్లలో ప్లాట్లు కేటాయించింది. మరి కొందరికి నగదు తిరిగి చెల్లించింది. ఇంకా 500కు పైగా ఖాతాదారులు తమకు అక్కడే ప్లాట్లు కేటాయించాలని తిరుగుతుండగా అనుమతులు రావంటూ భయపెట్టి, ఆ భూములను భూ సమీకరణకు కూడా ఇవ్వకుండా మెగా సిటీ నిర్మాణం కోసం ప్లాన్ చేస్తున్నారని వచ్చిన కథనం ఖాతాదారు ల్లో ఆగ్రహాన్ని రగిల్చినట్లు సమాచారం. దీంతో కొందరు ఖాతాదారులు కలిసి సంఘంగా ఏర్పడి తమకు ప్లాట్లు అక్కడే కేటాయించే విధంగా సంస్థపై ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్టు ఓ ఖాతాదారుడు తెలిపారు.
ఖాతాదారుల్లో ఉలికిపాటు..
రాజధాని భూ దురాక్రమణ కథనాల్లో భాగంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని రామ కృష్ణా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వెంచర్‌లో 194 ఎకరాల్లో 54 ఎకరాలు అసైన్డు భూములున్నాయని రావడం యాజమాన్యంతో పాటు అధికార వర్గాల్లోనూ ఆందోళన రేకెత్తించింది. కొందరు ఖాతాదారులు తాము కొనుగోలు చేసిన ప్లాట్లలో ఏవైనా అసైన్డు భూములు ఉన్నాయా.. అని ఆరాలు తీయడం ప్రారంభించారు. దీనిపై యాజమాన్యం ముందు జాగ్రత్తగా వచ్చిన వినియోగదారులను విజయవాడ కార్యాలయానికి పిలిపించి, ఆందోళన చెందాల్సిన పనిలేదని నచ్చజెప్పి పంపినట్లు సమాచారం.
బెదిరించి దోచుకున్నారు..
పేపర్లో కొన్ని భూములే వచ్చాయి. అన్ని ఊళ్లలోనూ నాయకులు భూములు కొన్నారు. కూలి చేసుకునే వాళ్లం మేం ఏం చేయగలం. ఏదైనా మాట్లాడితే బెదిరిస్తున్నారు. -దార్ల విజయ్‌కుమార్ రాయపూడి
రైతుల్ని నట్టేట ముంచారు
మా భూములన్నీ కొల్లగొట్టి వాటితో ఇప్పుడు వ్యాపారం చేసుకుంటున్నారు. సాగు భూములన్నీ బీళ్లయిపోయాయి. రాజధాని సంగతేమో కాని మమ్మల్ని నట్టేట ముంచేశారు. -పి.శేఖర్, వెంకటపాలెం
మాకు మట్టిదిబ్బలు మిగిల్చారు..
టీడీపీ నాయకులు మొదట్లో కార్లేసుకుని మా ఊళ్లలో తిరిగారు. తక్కువ రేటుకు భూములు కొనేశారు. వాళ్ల స్వార్థం చూసుకుని మాకు మట్టిదిబ్బలు మిగిల్చారు. - ఆర్ ముక్కంటి, తాళ్లాయపాలెం