శాండ్ రిచ్
అనంతపురం సెంట్రల్ : ఇసుక రీచ్‌లపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. త్వరితగతిన సంపాదనకు ఏకైక వనరుగా ఇసుక రీచ్‌లే కనిపిస్తున్నారుు. దీంతో తొలుత లక్ష క్యూబిక్ మీటర్లు ఇసుక వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ప్రస్తుతం మూడు లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వుకోవడానికి ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోతాయని స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నా నేతల ఒత్తిళ్లు మాత్రం ఆగడం లేదు. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వర్షాభావ ప్రాంతమైన జిల్లాలో తాగునీటికి కొరత ఉందేమో కానీ అనేక నదీ పరివాహక ప్రాంతాలు ఉండడంతో ఇసుకకు కొదవలేదు.
ఇన్నాళ్లు తెరవెనుక ఉండి ఇసుక వ్యాపారం చేస్తున్న నాయకులు.. ఈ ప్రభుత్వ హయాంలో అధికారికంగానే ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా ఇసుక వ్యాపారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో తాడిమర్రి మండలం సీసీ రేవు గ్రామంలో చిత్రావతి నది, పెన్నానది పరివాహక ప్రాంతాలైన పెద్దపప్పూరు, చిన్న ఎక్కలూరు గ్రామం, శింగనమల మండలం ఉల్లికల్లు గ్రామంలో ఇసుక రీచ్‌లను గుర్తించారు. ఈ మూడు రీచ్‌లలో లక్ష క్యూబిక్ మీటర్లు తవ్వుకోవచ్చునని గుర్తించారు.
ఆమేరకు మహిళా సంఘాల ద్వారా వ్యాపారం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సీసీరేవు, చిన్న ఎక్కలూరులో ఇసుక రీచ్‌లు ప్రారంభించగా.. వ్యాపారం కూడా మొదలైంది. శింగనమల మండలంలోని ఉల్లికల్లులో మొదలు కావాల్సి ఉంది. భూగర్భ జలాలు అడుగంటి పోతాయని ఆ గ్రామ ప్రజలు ఇసుక రీచ్‌లను వ్యతిరేకిస్తున్నారు. గత నెలలో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ అధ్యక్షతన గ్రామ ప్రజలతో సంప్రదింపులు జరిపినా ఫలితం రాలేదు.
లక్ష్యం పెంచి.. ప్రతిపాదనలు
స్వయం సహాయక సంఘాలను అడ్డుపెట్టుకొని అధికార పార్టీ నేతలు ఇసుక రీచ్‌లపై పెత్తనం చెలాయిస్తున్నారు. డ్వాక్రా మహిళలకే ఇసుక రీచ్‌లు కేటారుుస్తామని బయటకు చెబుతున్నా, లోలోపల మాత్రం అంతా టీడీపీ నేతలే చక్రం తిప్పుతున్నారు. ఇటీవల ప్రారంభించిన ఇసుక రీచ్‌లలో లక్షలాది రూపాయల విక్రయాలు జరిపారు. వ్యాపారం జోరందుకోవాలంటే ఇబ్బడిముబ్బడిగా తవ్వుకోవాలని భావించిన నేతలు లక్ష క్యూబిక్ మీటర్లు ఏమాత్రం సరిపోదని, మూడు లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వడానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.
రెండు నెలల క్రితం ఉల్లికల్లు గ్రామంలో పోలీసు బందోబస్తు మద్య స్థానిక ఎమ్మెల్యే ఇసుక రీచ్‌ను ప్రారంభించినా, ఇప్పటికీ తవ్వకాలు మొదలు పెట్టనివ్వడం లేదు. మిగిలిన చోట్ల కూడా ప్రజల అభిప్రాయాన్ని కాదని తవ్వకాలు చేపడుతున్నారు. తొలుత లక్ష క్యూబిక్ మీటర్లు మాత్రమేనని చెప్పడంతో ప్రజలు అంగీకరించారు.
ప్రస్తుతం మూడు లక్షల క్యూబిక్ మీటర్లకు అనుమతులు ఇవ్వడానికి రంగం సిద్ధమైన నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను ఎలా అణచివేయూలా అని అలోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇసుక తవ్వకాల్లో నిర్వాహకులు చేతి వాటం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు పది ట్రిప్పులు పంపితే ఏడెనిమిది మాత్రమే నమోదు చేస్తున్నట్లు సమాచారం. మిగతా రెండు మూడు ట్రిప్పులు దొడ్డిదారిన అమ్ముకుంటున్నట్లు తెలిసింది.