జేసీ కుర్చీ కుస్తీ
=జిల్లా వీడేందుకు ఉషాకుమారి బెట్టు
=మురళీ పట్టు
=వారం రోజులపాటు శెలవుపై జేసీ
=ఆఖరి ప్రయత్నాలకేనంటూ ప్రచారం
సాక్షి, మచిలీపట్నం : ఈ ఏడాది అక్టోబర్‌లో ఒకేసారి ఇద్దరు కీలక అధికారులపై ప్రభుత్వం బదిలీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి, జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారిలను ఏకకాలంలో బదిలీ చేయడం వెనుక రాజకీయ నేతల హస్తం ఉన్నట్టు ప్రచారం జరిగింది. తుపానుల సమయంలో జిల్లాపై అవగాహన ఉన్న ఇద్దరు కీలక అధికారులను ఒకేసారి జిల్లా నుంచి పంపించడం సరికాదన్న కారణాన్ని చూపి జేసీ బదిలీకి అప్పట్లో మంత్రి అడ్డుచక్రం వేశారు.
కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి అక్టోబర్ 14న ఇక్కడ విధుల నుంచి రిలీవ్ అయ్యారు. జేసీ ఉషాకుమారి మాత్రం ఇక్కడ కొనసాగుతుండటంతో ఆమె బదిలీ నిలిచిపోయినట్టేనని అందరూ భావించారు. దీంతో జేసీకి అనుకూలంగా, వ్యతిరేకంగా అధికార పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయి పట్టు నిలుపుకొనేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని సీఎం పేషీ నుంచి జాయింట్ కలెక్టర్‌గా ఇక్కడికి బదిలీ అయిన జె.మురళి జిల్లాకు వచ్చి విధుల్లో చేరేందుకు ఒత్తిడి పెంచినట్టు సమాచారం.
ఈ విషయమై హైదరాబాద్ నుంచి ఉన్నతస్థాయి అధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు ఇప్పించినట్టు చెబుతున్నారు. ఈ నెల 28న ఆయన జేసీగా ఇక్కడ విధులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో జేసీ ఉషాకుమారి తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ రిలీవ్ అయ్యి తనకు కేటాయించిన శ్రీకాకుళం జిల్లాకు వెళ్లాల్సి ఉంది.
ఆఖరి ప్రయత్నంగా...
జిల్లాను విడిచి వేళ్లేందుకు ఇష్టపడని జేసీ ఉషాకుమారి ఇక్కడే కొంతకాలం ఉండేందుకు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇక్కడ విధుల్లో చేరేందుకు మురళి ఒత్తిడి పెంచడంతో ఆమె తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ మేరకు తనను కొంతకాలం ఇక్కడే కొనసాగించేలా కలెక్టర్ ఎం.రఘునందనరావు నుంచి కూడా సమ్మతి లేఖ తీసుకుని వెళ్లినట్టు సమాచారం. రాజధాని స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేసేందుకు ఈ నెల 19 నుంచి 25 వరకు ఆరు రోజులపాటు ఆమె సెలవుపై వెళ్లారు. జిల్లాలో కీలకమైన జేసీ పోస్టు ఖాళీగా ఉండటం ఎందుకని ఎవరికైనా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాలని వచ్చిన ప్రతిపాదనను కూడా ఆమె తిరస్కరించినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బెట్టు చేస్తున్న జేసీ ఉషాకుమారి పట్టు సాధిస్తారో.. పట్టుబడుతున్న మురళి బందరు గట్టుకు చేరుకుంటారో చూద్దాం.
జిల్లా...వదలా...
Published Fri, Dec 20 2013 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM
Advertisement
Advertisement