ఉడాలో కుర్చీలాట సా...గదీతే
- రిలీవ్ కాని వైస్ చైర్మన్ రామారావు
- నూతన వీసీ చేరికపై వీడని సందిగ్ధత
- రెండు రోజులు వేచిచూడాలని ఉషాకుమారికి పెద్దల సూచన!
- కొనసాగుతున్న రామారావు యత్నాలు
- నేడు లేదా రేపు ఉషాకుమారి చేరే అవకాశం
ఉడాలో కుర్చీలాట ఇంకా కొన‘సా...గుతోంది’. ప్రస్తుత వైస్ చైర్మన్ రామారావు, నూతనంగా నియమితులైన ఉషాకుమారి తమ పరపతిని ఉపయోగించి ముమ్మరంగా లాబీయింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వైస్‌చైర్మన్‌గా చివరికి ఎవరు వస్తారనేదానిపై సందిగ్ధత నెలకొంది. ఉషాకుమారి సోమవారమే బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా, రామారావు రిలీవ్ కాకపోవటం చర్చనీయాంశంగా మారింది.
సాక్షి, విజయవాడ : ఉడా వైస్‌చైర్మన్‌గా పి.ఉషాకుమారిని నియమిస్తూ గత నెల 31న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో వీసీగా ఉన్న రామారావును బదిలీ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ కేటాయించలేదు. ఉషాకుమారి ఈ నెల ఒకటిన బాధ్యతలు స్వీకరించాల్సి ఉండగా వీసీ రామారావు రిలీవ్ కాకుండా నేరుగా హైదరాబాద్ వెళ్లి సోమవారమే తిరిగి వచ్చారు. రిలీవ్ కాకుండా విధుల్లో కొనసాగారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
ఎవరి ప్రయత్నాలు వారివి...
ఇద్దరు ఐఏఎస్ అధికారులూ తమ గాడ్‌ఫాదర్ల ద్వారా ఎవరికివారు సీటు దక్కించుకోవటానికి ముమ్మర యత్నాలు సాగిస్తున్నారు. వైస్ చైర్మన్ రామారావుకు ఐఏఎస్ అయ్యాక వచ్చిన మొదటి మంచి పోస్టింగ్ కావడం.. అదీ తక్కువ రోజుల్లోనే ఆకస్మికంగా బదిలీ చేయటంతో సీటును కాపాడుకోవటానికి ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. హైదరాబాద్ వెళ్లి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ శాఖ కార్యదర్శిని కలిసి తన ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఐఏఎస్ వచ్చాక పోస్టింగ్ కోసం ఎక్కువ కాలం నిరీక్షించాల్సి వచ్చిందని, ఆ తర్వాత వచ్చిన ఉడా పోస్టింగ్‌లోనూ పట్టుమని మూడు నెలలు కూడా పనిచేసే అవకాశం లేదని చెప్పినట్లు తెలిసింది. తన బదిలీ విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేయటంతో పాటు తన గాడ్‌ఫాదర్ల ద్వారా హైదరాబాద్‌లో లాబీయింగ్ కొనసాగించినట్లు సమాచారం. మరోవైపు చివరి ప్రయత్నాలు చేస్తున్నారని, అవి ఫలించకపోతే మంగళవారం సాయంత్రం ఆయన రిలీవ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. జిల్లా నుంచి బదిలీ అయిన ఉషాకుమారి తన రాజకీయ పరపతితో చక్రం తిప్పి ఉడా వైస్‌చైర్మన్ సీటును పొందగలిగారు. రామారావు ప్రయత్నాల నేపథ్యంలో ఆమె కూడా పావులు కదిపి పోస్టింగ్‌లో చేరే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
వేచిచూడండి...
ఈ క్రమంలో పి.ఉషాకుమారి రెండు రోజులు వేచిచూడాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదివారం మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో ఆమె సోమవారం విధుల్లో చేరలేదు. మంగళవారం సాయంత్రం లేదా బుధవారం విధుల్లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు గత నెల 21న విజయవాడలో జేసీగా రిలీవై 31న ఉడా వైస్ చైర్మన్‌గా మళ్లీ పోస్టింగ్ దక్కించుకున్న క్రమంలో 22 నుంచి 31 వరకు ఆమె దరఖాస్తు చేసుకున్న సెలవు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.