జిల్లాలన్నీ కవరయ్యేలా కొత్తగా 19 యూడీఏలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఇప్పటికే ఉన్న 9 పట్టణాభివృద్ధి సంస్థల పరిధి ఆయా జిల్లాల వ్యాప్తంగా పెంపు
ములుగు, ఆసిఫాబాద్‌లోని కొన్ని మండలాలకు మినహాయింపు
మొత్తం 12 వేలకు గాను 10 వేలకు పైగా గ్రామాలు వీటి పరిధిలోనే..
ఆసిఫాబాద్ జిల్లాలోని 10 మండలాలు కాగజ్‌నగర్ యూడీఏ పరిధిలోకి
వేములవాడ దేవాలయ అభివృద్ధి సంస్థ (వీటీడీఏ) పరిధిలోకి సిరిసిల్ల జిల్లా
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి వరంగల్, హనుమకొండ
డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అనుమతులన్నీ ఇక జిల్లాల్లోనే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని కొన్ని గ్రామాలు మినహా.. రాష్ట్రమంతా వివిధ పట్టణాభివృద్ధి సంస్థ (యూడీఏ–ఉడా)ల పరిధిలోకి వెళ్లింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 9 ఉడాలు ఉండగా, తాజాగా వాటి పరిధిని రాష్ట్ర ప్రభుత్వం విస్తరించింది. దీంతోపాటు.. ములుగు జిల్లా, ఆసిఫాబాద్ జిల్లాలోని ఐదు మండలాలు, కొన్ని జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు మినహా ఇప్పటివరకు ఉడాలు లేని అన్ని జిల్లాలు కవర్ అయ్యేలా కొత్తగా మరో 19 ఉడాలను కూడా ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 28 ఉడాలు ఏర్పాటైనట్టయ్యింది. ప్రతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి ఆ జిల్లాలోని మండలాల్లో ఉన్న దాదాపుగా అన్ని గ్రామాలు చేరాయి. రాష్ట్రంలో సుమారు 12 వేల గ్రామ పంచాయతీలు ఉండగా, దాదాపు 10 వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఉడాల పరిధిలోకి రావడం గమనార్హం.
ఇప్పటివరకు చుట్టుపక్కల గ్రామాలే ఉడాల పరిధిలో..
రాష్ట్రంలో హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు ఉన్నాయి. దీంతో పాటు వరంగల్, కరీంనగర్, వేములవాడ, సిద్దిపేట, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలతో ఏర్పాటు చేసిన మొత్తం 9 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఇప్పటివరకు చుట్టుపక్కలున్న గ్రామాలు మాత్రమే ఉండేవి.
మిగతా గ్రామాలన్నీ డీటీసీపీ (డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) పరిధిలోకి వచ్చేవి. దీంతో 800 చదరపు గజాల పైబడి నిర్మాణాలకు, గ్రామాల్లో సాగే లే అవుట్ల అనుమతులన్నీ డీటీసీపీ ద్వారానే తీసుకోవలసి వచ్చేది. ఇప్పుడు జిల్లాల పరిధి మొత్తానికి ఉడాలను విస్తరించడంతో లే అవుట్లతో పాటు 800 చదరపు గజాల నిర్మాణాల అనుమతులు కూడా ఆయా జిల్లాల్లో ఏర్పాటైన ఉడాల ద్వారానే పొందే అవకాశం లభించింది.
జిల్లాల వారీగా మాస్టర్ ప్లాన్‌కు అవకాశం
రాష్ట్రంలో ఇప్పటివరకు పట్టణాలకు కూడా సరైన మాస్టర్‌ప్లాన్ లేదు. ఉడాల ద్వారా మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు కొన్ని ప్రయత్నాలు గతంలో జరిగినా వివిధ కారణాల వల్ల కొలిక్కి రాలేదు. ఇప్పుడు జిల్లా పరిధినే యూనిట్‌గా పట్టణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడంతో జిల్లా మొత్తానికి మాస్టర్‌ప్లాన్ రూపొందించే అవకాశం లభించినట్లయిందని పురపాలక శాఖ అధికారి ఒకరు తెలిపారు. అలాగే ఆయా మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలతో పాటు మండల కేంద్రాల మాస్టర్ ప్లాన్‌లను కూడా ప్రత్యేకంగా రూపొందించే అవకాశం లభించింది.
కేంద్ర నిధులు పెరిగేందుకు దోహదం
గ్రామాల్లో సాగే పేదల గృహనిర్మాణ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పెరిగేందుకు కూడా ఉడాల ఏర్పాటు దోహదపడనుంది. ప్రతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి పట్టణాలు, కార్పొరేషన్లతో పాటు 10 నుంచి 15 మండలాల్లోని గ్రామాలు వస్తుండడంతో కేంద్రీకృతమైన అభివృద్ధికి ఆస్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
గ్రామ పంచాయతీల అధికారాలు యధాతథం!
జిల్లా పరిధిని పూర్తిగా పట్టణాభివృద్ధి సంస్థ కిందికి తీసుకురావడంతో గ్రామ పంచాయతీల అధికారాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పురపాలక శాఖ అధికారులు మాత్రం అలాంటిదేమీ ఉండబోదని అంటున్నారు. డీటీసీపీకి ఉన్న అనుమతుల అధికారం మాత్రమే పట్టణాభివృద్ధి సంస్థలకు దఖలు పడుతుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో 800 చదరపు గజాల లోపు నిర్మాణాలకు అనుమతులు ఆయా పంచాయతీలే ఇస్తున్నాయి. ఆ విధానం భవిష్యత్తులో కూడా కొనసాగనుందని ప్రభుత్వం చెబుతోంది.
గ్రామ పంచాయతీల అధికారాలు యథాతథం!
జిల్లా పరిధిని పూర్తిగా పట్టణాభివృద్ధి సంస్థ కిందికి తీసుకురావడంతో గ్రామ పంచాయతీల అధికారాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పురపాలక శాఖ అధికారులు మాత్రం అలాంటిదేమీ ఉండబోదని అంటున్నారు. డీటీసీపీకి ఉన్న అనుమతుల అధికారం మాత్రమే పట్టణాభివృద్ధి సంస్థలకు దఖలు పడుతుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో 800 చదరపు గజాల లోపు నిర్మాణాలకు అనుమతులు ఆయా పంచాయతీలే ఇస్తున్నాయి. ఆ విధానం భవిష్యత్తులో కూడా కొనసాగనుందని ప్రభుత్వం చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment