Urban Development Corporation
-
Telangana: జిల్లాలన్నీ 'ఉడా'లే..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని కొన్ని గ్రామాలు మినహా.. రాష్ట్రమంతా వివిధ పట్టణాభివృద్ధి సంస్థ (యూడీఏ–ఉడా)ల పరిధిలోకి వెళ్లింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 9 ఉడాలు ఉండగా, తాజాగా వాటి పరిధిని రాష్ట్ర ప్రభుత్వం విస్తరించింది. దీంతోపాటు.. ములుగు జిల్లా, ఆసిఫాబాద్ జిల్లాలోని ఐదు మండలాలు, కొన్ని జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు మినహా ఇప్పటివరకు ఉడాలు లేని అన్ని జిల్లాలు కవర్ అయ్యేలా కొత్తగా మరో 19 ఉడాలను కూడా ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 28 ఉడాలు ఏర్పాటైనట్టయ్యింది. ప్రతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి ఆ జిల్లాలోని మండలాల్లో ఉన్న దాదాపుగా అన్ని గ్రామాలు చేరాయి. రాష్ట్రంలో సుమారు 12 వేల గ్రామ పంచాయతీలు ఉండగా, దాదాపు 10 వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఉడాల పరిధిలోకి రావడం గమనార్హం. ఇప్పటివరకు చుట్టుపక్కల గ్రామాలే ఉడాల పరిధిలో.. రాష్ట్రంలో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు ఉన్నాయి. దీంతో పాటు వరంగల్, కరీంనగర్, వేములవాడ, సిద్దిపేట, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలతో ఏర్పాటు చేసిన మొత్తం 9 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఇప్పటివరకు చుట్టుపక్కలున్న గ్రామాలు మాత్రమే ఉండేవి. మిగతా గ్రామాలన్నీ డీటీసీపీ (డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) పరిధిలోకి వచ్చేవి. దీంతో 800 చదరపు గజాల పైబడి నిర్మాణాలకు, గ్రామాల్లో సాగే లే అవుట్ల అనుమతులన్నీ డీటీసీపీ ద్వారానే తీసుకోవలసి వచ్చేది. ఇప్పుడు జిల్లాల పరిధి మొత్తానికి ఉడాలను విస్తరించడంతో లే అవుట్లతో పాటు 800 చదరపు గజాల నిర్మాణాల అనుమతులు కూడా ఆయా జిల్లాల్లో ఏర్పాటైన ఉడాల ద్వారానే పొందే అవకాశం లభించింది. జిల్లాల వారీగా మాస్టర్ ప్లాన్‌కు అవకాశం రాష్ట్రంలో ఇప్పటివరకు పట్టణాలకు కూడా సరైన మాస్టర్‌ప్లాన్ లేదు. ఉడాల ద్వారా మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు కొన్ని ప్రయత్నాలు గతంలో జరిగినా వివిధ కారణాల వల్ల కొలిక్కి రాలేదు. ఇప్పుడు జిల్లా పరిధినే యూనిట్‌గా పట్టణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడంతో జిల్లా మొత్తానికి మాస్టర్‌ప్లాన్ రూపొందించే అవకాశం లభించినట్లయిందని పురపాలక శాఖ అధికారి ఒకరు తెలిపారు. అలాగే ఆయా మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలతో పాటు మండల కేంద్రాల మాస్టర్ ప్లాన్లను కూడా ప్రత్యేకంగా రూపొందించే అవకాశం లభించింది. కేంద్ర నిధులు పెరిగేందుకు దోహదం గ్రామాల్లో సాగే పేదల గృహనిర్మాణ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పెరిగేందుకు కూడా ఉడాల ఏర్పాటు దోహదపడనుంది. ప్రతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి పట్టణాలు, కార్పొరేషన్లతో పాటు 10 నుంచి 15 మండలాల్లోని గ్రామాలు వస్తుండడంతో కేంద్రీకృతమైన అభివృద్ధికి ఆస్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామ పంచాయతీల అధికారాలు యధాతథం! జిల్లా పరిధిని పూర్తిగా పట్టణాభివృద్ధి సంస్థ కిందికి తీసుకురావడంతో గ్రామ పంచాయతీల అధికారాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పురపాలక శాఖ అధికారులు మాత్రం అలాంటిదేమీ ఉండబోదని అంటున్నారు. డీటీసీపీకి ఉన్న అనుమతుల అధికారం మాత్రమే పట్టణాభివృద్ధి సంస్థలకు దఖలు పడుతుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో 800 చదరపు గజాల లోపు నిర్మాణాలకు అనుమతులు ఆయా పంచాయతీలే ఇస్తున్నాయి. ఆ విధానం భవిష్యత్తులో కూడా కొనసాగనుందని ప్రభుత్వం చెబుతోంది. గ్రామ పంచాయతీల అధికారాలు యథాతథం! జిల్లా పరిధిని పూర్తిగా పట్టణాభివృద్ధి సంస్థ కిందికి తీసుకురావడంతో గ్రామ పంచాయతీల అధికారాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పురపాలక శాఖ అధికారులు మాత్రం అలాంటిదేమీ ఉండబోదని అంటున్నారు. డీటీసీపీకి ఉన్న అనుమతుల అధికారం మాత్రమే పట్టణాభివృద్ధి సంస్థలకు దఖలు పడుతుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో 800 చదరపు గజాల లోపు నిర్మాణాలకు అనుమతులు ఆయా పంచాయతీలే ఇస్తున్నాయి. ఆ విధానం భవిష్యత్తులో కూడా కొనసాగనుందని ప్రభుత్వం చెబుతోంది. -
పట్టణాల్లో వసతులు మెరుగుపరుస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని పట్టణాభివృద్ధి సంస్థ (యూడీఏ)ల పరిధిలో మౌలిక వసతులను మెరుగు పరుస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆయన గురువారం సచివాలయంలో 20 పట్టణాభివృద్ధి సంస్థల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సీఆర్డీఏ సహా రాష్ట్రంలోని 20 యూడీఏల పరిధిలో వేసిన లే అవుట్లలో విద్యుత్తు, రోడ్లు, తాగు నీరు, పార్కులు, మురుగు నీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు చేయడం యూడీఏలో ప్రధాన లక్ష్యమన్నారు. నెల్లూరు, కడప లేఅవుట్లలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయని, వాటిపై విచారణకు కమిటీని వేశామన్నారు. ఆ కమిటీ నివేదిక వచ్చాక బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో తణుకు మున్సిపాలిటీలో టీడీఆర్ బాండ్ల జారీలో అవకతవకలు జరిగాయని చెప్పారు. దీనిపైనా విచారణ చేయించి బాధ్యుల పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిలిచిపోయిన ఎంఐజీ, టిడ్కో గృహాల నిర్మాణాన్ని కూడా ప్రారంభిస్తామని తెలిపారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికీ 24 గంటలు తాగు నీరందించడానికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా రూ.5,300 కోట్లు కేటాయించామని, ఈ నిధుల్లో గత ప్రభుత్వం రూ.240 కోట్లే వెచ్చి0చిందన్నారు. మిగిలిన నిధుల వినియోగానికి కాల పరిమితిని పెంచాలని ఆ బ్యాంకుకు లేఖ రాసినట్టు చెప్పారు. 2023–24లో వచ్చిన రూ.1100 కోట్లను కూడా దారి మళ్లించిందన్నారు. ఈ సమావేశంలో డీటీసీపీ విద్యుల్లత, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ చీఫ్ ఆనందరావు పాల్గొన్నారు. -
తెలంగాణకు ఆర్థిక సహాయం చేస్తాం
హడ్కో సీఎండీ ఎం.రవికాంత్ వెల్లడి గత రెండున్నరేళ్లలో రూ.10 వేల కోట్ల రుణాలిచ్చాం టీఎస్ఆర్టీసీకి రూ.1.34 కోట్ల విరాళం అందజేత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు కావాల్సిన రుణ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హౌసింగ్, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) సీఎండీ ఎం.రవికాంత్ పేర్కొన్నారు. తెలంగాణకు గత రెండున్నరేళ్లలో రూ.10 వేల కోట్ల వరకు రుణ సహాయం అందించామని చెప్పారు. అందులో మిషన్ భగీరథకు రూ.4,750 కోట్లు, డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.3,344 కోట్లు, ఫార్మా సిటీ ప్రాజెక్టుకు రూ.740 కోట్ల ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. రవికాంత్ శుక్రవారం హైదరాబాద్‌లోని హడ్కో కార్యాలయంలో ఆ సంస్థ తరఫున తెలంగాణ ఆర్టీసీకి రూ.1.34 కోట్లను కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద విరాళంగా అందజేశారు. ఆర్టీసీ కార్యాలయాల్లో 6 వేల ఎల్ఈడీ దీపాల ఏర్పాటు కోసం ఈ మొత్తాన్ని ఇచ్చారు. అనంతరం రవికాంత్ విలేకరులతో మాట్లాడారు. తెలుగువాడిగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు హడ్కో తరఫున సాధ్యమైనంత సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. విస్తృతంగా ఆర్థిక సహాయం హడ్కో గత 46 ఏళ్లలో తెలంగాణ ప్రాంతానికి రూ.31,168 కోట్ల రుణ సహాయం అందించిందని చెప్పారు. పేదలకు 8.44 లక్షల ఇళ్ల నిర్మాణంతో పాటు తాగునీరు, రోడ్డు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఈ నిధులను కేటాయించిందన్నారు. బస్సుల కొనుగోళ్ల కోసం టీఎస్ఆర్టీసీకి గతంలో రూ.425 కోట్ల రుణం కేటాయించగా.. ఈ ఏడాది మరో రూ.100 కోట్లు విడుదల చేశామని చెప్పారు. హడ్కోకు రుణాలను తిరిగి చెల్లించే విషయంలో సీఎం కేసీఆర్ చొరవ తీసుకుంటున్నారని ప్రశంసించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పథకం బాగుందని కితాబిచ్చారు. తెలంగాణలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.5 వేల కోట్ల రుణం కావాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించిందని హడ్కో ప్రాంతీయ అధికారి పి.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీలో వైట్ టాపింగ్ రోడ్లు, ఇతర అవసరాల కోసం రూ.3 వేల కోట్లు, ఇతర మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.2 వేల కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని... దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో పీఐబీ అదనపు డీజీ పీజే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
వాటర్‌గ్రిడ్‌కు ‘హడ్కో’ రుణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి రూ.5 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) అంగీకరించింది. వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ ప్రాజెక్టులపై.. బుధవారం సీఎం కె.చంద్రశేఖరరావు సమీక్షిస్తున్న సమయంలోనే అక్కడికి వచ్చిన హడ్కో ప్రతినిధులు ప్రభుత్వానికి రుణం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పనుల పురోగతిని బట్టి వివిధ దశల్లో రుణ మొత్తాన్ని అందిస్తామని వారు హామీ ఇచ్చారు. వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటయ్యాక మరోమారు భేటీ కావాలని నిర్ణయించారు. -
అనుమతులన్నీ ఇక్కడే..!
సాక్షి, సిటీబ్యూరో: నగర శివారు ప్రాంతాల్లో కొత్త భవన నిర్మాణాలు, అతిక్రమణల క్రమబద్ధీకరణకు సంబంధించిన అనుమతులన్నీ ఇకపై తార్నాకలోని కేంద్ర కార్యాలయం నుంచే జారీ చేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. తార్నాకలో బుధవారం జరిగిన హెచ్ఎండీఏ కార్యవర్గ (ఈసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. ఇప్పటివరకు 4 వేల చ.గ. లోపు విస్తీర్ణంలో నిర్మించే ఐదంతస్థుల (సెల్లార్ స్టిల్ట్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్) భవనాలకు స్థానికంగానే జోనల్ కార్యాలయాల్లో అనుమతులు ఇచ్చేవారు. అయితే, పర్మిషన్ల జారీలో జాప్యం, అక్రమాలు పెచ్చుమీరడం వంటి కారణాలతో జోనల్ కార్యాలయాల పునర్వ్యవస్థీకరణకు కార్గవర్గ సమావేశం పచ్చజెండా ఊపింది. జోనల్ కార్యాలయాలను పూర్తిగా మూసివేయకుండా వాటిని రిసెప్షన్ సెంటర్లు/ఇన్స్పెక్షన్ యూనిట్లుగా మార్చాలని నిర్ణయించారు. శంషాబాద్, శంకర్పల్లి, మేడ్చెల్, ఘట్కేసర్ జోనల్ కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బందిలో ఏపీఓ, జేపీఓలకు ఇద్దరు సపోర్టింగ్ స్టాఫ్‌ను ఇచ్చి మిగతా జోనల్ ఆఫీసర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, క్లర్క్లందరినీ ప్రధాన కార్యాలయంలోని ల్యాండ్ యూనిట్‌కు మార్చనున్నారు. జోనల్ కార్యాలయాల్లో ఉన్న సిబ్బందికి క్షేత్రస్థాయిలో ఇన్ స్పెక్షన్లు, స్థానికంగా దరఖాస్తుల స్వీకరణ వంటి విధులు అప్పగిస్తారు. ఆయా కార్యాలయాల్లో స్వీకరించిన దరఖాస్తులను వారానికి ఒకసారి కేంద్ర కార్యాలయంలోని డెరైక్టర్, సెక్రటరీ, సీపీఓ, పీఓలతో కూడిన కమిటీ పరిశీలించి అనుమతులిస్తుంది. హెచ్ఎండీఏ కమిషనర్ నీర భ్కుమార్ ప్రసాద్, హైదరాబాద్ కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా, రంగారెడ్డి జిల్లా జేసీ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాల్లో కొన్ని.. అక్రమ నిర్మాణాలు, అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకొనేందుకు ఎన్ఫోర్స్మెంట్ విభాగం మరింత బలోపేతం ఆదాయాన్ని పెంచుకొనేందుకు కొత్తగా లీజ్ పాలసీ, ప్రకటన (హోర్డింగ్స్)ల పాలసీల అమలుకు పచ్చజెండా ప్రకటనలు ఏర్పాటుకు అవకాశం ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకొనేందుకు ఓ కమిటీ ఏర్పాటు జలాశయాల పరిరక్షణకు లేక్ ప్రొటెక్షన్ సెల్ మరింత పటిష్టం ల్యాండ్‌పూలింగ్ స్కీం ద్వారా శివార్ల అభివృద్ధికి సత్వర చర్యలు. ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టు ఫార్మేషన్ యూనిట్ కన్సల్టెంట్‌గా పురుషోత్తంరెడ్డిని, భూ వివాదాలకు సంబంధించి కోర్టు కేసులను వాదించేందుకు అడ్వకేట్ వెంకటేశ్వర్లు నియామకం ప్లానింగ్ కన్సల్టెంట్‌గా బిడేకు మరో ఏడాది కొనసాగించేందుకు సమావేశం అమోదం లంగర్‌హౌస్, హైటెక్ సిటీ ఫ్లైఓవర్స్ నిర్వహణ బాధ్యతను జీహెచ్ఎంసీకి అప్పగింత మాదాపూర్ సమీపంలోని ఖానామెట్‌లో 11 ఎకరాల విస్తీర్ణంలో రూ.220 కోట్లతో హ్యాబిటేట్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం. పార్కింగ్ సమస్యను తొలగించేందుకు అమీర్‌పేటలో రూ.27 కోట్ల వ్యయంతో ఆటోమేటిక్ కార్ పార్కింగ్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆమోదం. బీఓటీ విధానంలో నిధుల సేకరణ. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే జీహెచ్ఎంసీ, హెచ్ఎంఆర్ ఆసక్తి చూపుతుండటంతో వారి భాగస్వామ్యంతో చేపట్టాలని నిర్ణయం. సరూర్‌నగర్‌లోని హుడా కాంప్లెక్స్‌లో కూడా ఇదే తరహా ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయం.