సాక్షి, సిటీబ్యూరో: నగర శివారు ప్రాంతాల్లో కొత్త భవన నిర్మాణాలు, అతిక్రమణల క్రమబద్ధీకరణకు సంబంధించిన అనుమతులన్నీ ఇకపై తార్నాకలోని కేంద్ర కార్యాలయం నుంచే జారీ చేయాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. తార్నాకలో బుధవారం జరిగిన హెచ్‌ఎండీఏ కార్యవర్గ (ఈసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. ఇప్పటివరకు 4 వేల చ.గ. లోపు విస్తీర్ణంలో నిర్మించే ఐదంతస్థుల (సెల్లార్ స్టిల్ట్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్) భవనాలకు స్థానికంగానే జోనల్ కార్యాలయాల్లో అనుమతులు ఇచ్చేవారు.
అయితే, పర్మిషన్ల జారీలో జాప్యం, అక్రమాలు పెచ్చుమీరడం వంటి కారణాలతో జోనల్ కార్యాలయాల పునర్‌వ్యవస్థీకరణకు కార్గవర్గ సమావేశం పచ్చజెండా ఊపింది. జోనల్ కార్యాలయాలను పూర్తిగా మూసివేయకుండా వాటిని రిసెప్షన్ సెంటర్లు/ఇన్‌స్పెక్షన్ యూనిట్లుగా మార్చాలని నిర్ణయించారు. శంషాబాద్, శంకర్‌పల్లి, మేడ్చెల్, ఘట్‌కేసర్ జోనల్ కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బందిలో ఏపీఓ, జేపీఓలకు ఇద్దరు సపోర్టింగ్ స్టాఫ్‌ను ఇచ్చి మిగతా జోనల్ ఆఫీసర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, క్లర్క్‌లందరినీ ప్రధాన కార్యాలయంలోని ల్యాండ్ యూనిట్‌కు మార్చనున్నారు.
జోనల్ కార్యాలయాల్లో ఉన్న సిబ్బందికి క్షేత్రస్థాయిలో ఇన్ స్పెక్షన్లు, స్థానికంగా దరఖాస్తుల స్వీకరణ వంటి విధులు అప్పగిస్తారు. ఆయా కార్యాలయాల్లో స్వీకరించిన దరఖాస్తులను వారానికి ఒకసారి కేంద్ర కార్యాలయంలోని డెరైక్టర్, సెక్రటరీ, సీపీఓ, పీఓలతో కూడిన కమిటీ పరిశీలించి అనుమతులిస్తుంది. హెచ్‌ఎండీఏ కమిషనర్ నీర భ్‌కుమార్ ప్రసాద్, హైదరాబాద్ కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా, రంగారెడ్డి జిల్లా జేసీ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాల్లో కొన్ని..
అక్రమ నిర్మాణాలు, అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకొనేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం మరింత బలోపేతం
ఆదాయాన్ని పెంచుకొనేందుకు కొత్తగా లీజ్ పాలసీ, ప్రకటన (హోర్డింగ్స్)ల పాలసీల అమలుకు పచ్చజెండా
ప్రకటనలు ఏర్పాటుకు అవకాశం ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకొనేందుకు ఓ కమిటీ ఏర్పాటు
జలాశయాల పరిరక్షణకు లేక్ ప్రొటెక్షన్ సెల్ మరింత పటిష్టం
ల్యాండ్‌పూలింగ్ స్కీం ద్వారా శివార్ల అభివృద్ధికి సత్వర చర్యలు. ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టు ఫార్మేషన్ యూనిట్ కన్సల్టెంట్‌గా పురుషోత్తంరెడ్డిని, భూ వివాదాలకు సంబంధించి కోర్టు కేసులను వాదించేందుకు అడ్వకేట్ వెంకటేశ్వర్లు నియామకం
ప్లానింగ్ కన్సల్టెంట్‌గా బిడేకు మరో ఏడాది కొనసాగించేందుకు సమావేశం అమోదం
లంగర్‌హౌస్, హైటెక్ సిటీ ఫ్లైఓవర్స్ నిర్వహణ బాధ్యతను జీహెచ్‌ఎంసీకి అప్పగింత
మాదాపూర్ సమీపంలోని ఖానామెట్‌లో 11 ఎకరాల విస్తీర్ణంలో రూ.220 కోట్లతో హ్యాబిటేట్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం.
పార్కింగ్ సమస్యను తొలగించేందుకు అమీర్‌పేటలో రూ.27 కోట్ల వ్యయంతో ఆటోమేటిక్ కార్ పార్కింగ్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆమోదం. బీఓటీ విధానంలో నిధుల సేకరణ. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎంఆర్ ఆసక్తి చూపుతుండటంతో వారి భాగస్వామ్యంతో చేపట్టాలని నిర్ణయం. సరూర్‌నగర్‌లోని హుడా కాంప్లెక్స్‌లో కూడా ఇదే తరహా ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయం.
అనుమతులన్నీ ఇక్కడే..!
Published Thu, Sep 26 2013 2:38 AM | Last Updated on Wed, Sep 5 2018 1:38 PM
Advertisement
Advertisement