పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని పట్టణాభివృద్ధి సంస్థ (యూడీఏ)ల పరిధిలో మౌలిక వసతులను మెరుగు పరుస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆయన గురువారం సచివాలయంలో 20 పట్టణాభివృద్ధి సంస్థల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సీఆర్డీఏ సహా రాష్ట్రంలోని 20 యూడీఏల పరిధిలో వేసిన లే అవుట్లలో విద్యుత్తు, రోడ్లు, తాగు నీరు, పార్కులు, మురుగు నీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు చేయడం యూడీఏలో ప్రధాన లక్ష్యమన్నారు.
నెల్లూరు, కడప లేఅవుట్లలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయని, వాటిపై విచారణకు కమిటీని వేశామన్నారు. ఆ కమిటీ నివేదిక వచ్చాక బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో తణుకు మున్సిపాలిటీలో టీడీఆర్ బాండ్ల జారీలో అవకతవకలు జరిగాయని చెప్పారు. దీనిపైనా విచారణ చేయించి బాధ్యుల పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిలిచిపోయిన ఎంఐజీ, టిడ్కో గృహాల నిర్మాణాన్ని కూడా ప్రారంభిస్తామని తెలిపారు.
గతంలో తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికీ 24 గంటలు తాగు నీరందించడానికి ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ద్వారా రూ.5,300 కోట్లు కేటాయించామని, ఈ నిధుల్లో గత ప్రభుత్వం రూ.240 కోట్లే వెచ్చి0చిందన్నారు. మిగిలిన నిధుల వినియోగానికి కాల పరిమితిని పెంచాలని ఆ బ్యాంకుకు లేఖ రాసినట్టు చెప్పారు. 2023–24లో వచ్చిన రూ.1100 కోట్లను కూడా దారి మళ్లించిందన్నారు. ఈ సమావేశంలో డీటీసీపీ విద్యుల్లత, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ చీఫ్ ఆనందరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment