‘ఆధార్’కు వారం గడువు | 'Aadhaar' to expire in a week | Sakshi
Sakshi News home page

‘ఆధార్’కు వారం గడువు

Published Tue, Aug 6 2013 12:43 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM

'Aadhaar' to expire in a week

 జిల్లాలోని వివిధ సంక్షేమ శాఖల్లో కొనసాగుతున్న ఆధార్ కార్డుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి అర్జీలను అందజేశారు.
 
 కలెక్టరేట్  (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : ప్రజావాణి కార్యక్రమంలో జేసీతోపాటు డీఆర్వో ఎల్.విజయచందర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఉషాకుమారి మాట్లాడుతూ ఆధార్ నమోదు ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. ఆధార్ కార్డుల నమోదు, ఎన్‌రోల్‌మెంట్ విషయంలో నమోదైన శాతం ప్రకారం కాకుండా లబ్ధిదారుడిపరంగా నివేదిక పూర్తిస్థాయిలో ఉండాలన్నారు.  ఆధార్‌కార్డు పొందని వారు తీసుకునేలా చూడాలన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలకు జాప్యం చేయకుండా పరిష్కారం చూపాలన్నారు. మెప్మా పీడీ పి.అనిల్‌కుమార్ మాట్లాడుతూ ఉపాధిహామీ కూలీలకు సంబంధించి ఇప్పటివరకు 84 శాతం ఆధార్ నమోదు ప్రక్రియ జరిగిందన్నారు. ఈ నెల 15 తర్వాత ఉపాధిహామీ పనుల ద్వారా కూలీలకు చెల్లించాల్సిన సొమ్మును ఆధార్‌కార్డుల ద్వారా చెల్లించడానికి ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. ప్రజావాణికి వచ్చిన అర్జీల్లో కొన్నింటిని పరిశీలిద్దాం.
 
 దళితవాడలో రహదారి నిర్మాణం కోసం సేకరించే భూమికి నిధులు మంజూరుచేయాలని కృత్తివెన్ను మండలం మునిపెడ గ్రామానికి చెందిన డి.ఇషాక్‌రావు జేసీకి అర్జీ ఇచ్చారు.
 
 బాపులపాడు మండలం బిల్లనపల్లి గ్రామానికి చెందిన మన్నెం సూరిబాబు తన స్వాధీనంలో ఉన్న భూమికి రెవెన్యూ అధికారులు పట్టాభూమిని మంజూరు చేయాలంటూ అర్జీ ఇచ్చారు.
 
 మచిలీపట్నం కొబ్బరితోట ప్రాంతంలో లోవోల్టేజీ కారణంగా విద్యుత్ సరఫరా సక్రమంగా జరగడం లేదని, దీన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని సీహెచ్.రాము కోరారు.
 
 మచిలీపట్నంలో అపరిశుభ్రత, కలుషితనీరు కారణంగా ప్రజలు రోగాలబారిన పడుతున్నారని, వీటి నివారణకు వైద్యశాఖ.. మునిసిపల్ కమిషనర్‌కు తగిన ఆదేశాలు జారీ చేయాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు.
 
 సుల్తానగరం గ్రామ పంచాయతీ పరిధిలో 250 మంది పేదలకు ఇళ్లస్థలాలు కేటాయించేందుకు భూమి అందుబాటులో ఉందని, గ్రామంలోని పేదలకు ఈ స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ మాజీ సర్పంచి జోగి ఏసుప్రభు అర్జీ అందజేశారు.
 
 పెడన మండలం మడక గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తప్పులు దొర్లాయని, రీకౌంటింగ్ చేయాలని గ్రామానికి చెందిన వై.వెంకటేశ్వరరావు అర్జీలో కోరారు.
 
 మచిలీపట్నం మున్సిపాలిటీలో పీయూసీ వర్కర్‌గా ఉన్న తనను 1995లో తొలగించారని, అనంతరం తనకంటే సర్వీసు తక్కువ ఉన్న వారిని కోర్టు ఆదేశాల ప్రకారం విధుల్లోకి తీసుకున్నారని వై.దుర్గాప్రసాద్ ఫిర్యాదు చేశారు. సీనియార్టీ ఉన్న తనను మాత్రం విధుల్లోకి తీసుకోవడం లేదని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అర్జీలో పేర్కొన్నారు.
 
 కోడూరు గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో పోస్టల్ బ్యాలెట్లు లెక్కించకుండా ఎన్నికల అధికారులు నిలిపివేశారు. సరైన కారణాలు చెప్పకుండా పోస్టల్ బ్యాలెట్లను పక్కనపెట్టారు. దీనిపై చర్య తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ ఐదవ వార్డు సభ్యుడు యోగప్రకాష్ జేసీకి అర్జీ ఇచ్చారు.
 
 ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ కె.శివశంకర్, జెడ్పీ సీఈవో కొండయ్యశాస్త్రి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ డి.మధుసూదనరావు, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రంగరాజారావు, డీఎస్‌వో పీబీ సంధ్యారాణి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement