ఆంధ్రాబ్యాంక్లో మరో కుంభకోణం
► చేపలు చెరువుల చూపించి రూ.3.3 కోట్లు రుణం
► చిరునామాలు దొరకని రుణగ్రహీతలు
► పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
గుడివాడ: కృష్ణాజిల్లా గుడివాడ ఆంధ్రాబ్యాంక్లో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తప్పుడు చిరునామాలు సమర్పించి అప్పు తీసుకున్నవారి చిరునామా దొరకకపోవడంతో బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాపట్ల సమీపంలోని నల్లమోతువారిపాలేనికి చెందిన ఏడుగురు వ్యక్తులు గుడివాడ పరిసరాల్లోని చేపల చెరువులు లీజుకు తీసుకున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి రూ.3.33 కోట్లు రుణం పొందారు. ఆ అప్పు వడ్డీతో కలిపి రూ.4.79 కోట్లు అయ్యింది.
అయితే అప్పు తీసుకున్నవారి చిరునామాలు దొరకకపోవడంతో బ్యాంక్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. వీరంతా బందరులోని పొలాలను, పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని ఆస్తులను, నల్లమోతువారిపాలెంలోని ఆస్తులను హామీగా పెట్టారు. రుణం తీసుకున్నవారిలో మడ సుబ్రమణ్యం, పిన్నబోయిన వెంకటేశ్వరరావు, నాగరాజు, పోలారయ్య, తాండ్ర జ్యోతి, అంజనీదేవి ఉన్నారని అధికారులు తెలిపారు. బ్యాంకు ఏజీఎం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.