ప్రతీకాత్మక చిత్రం
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం : తెల్లరంగు రేషన్‌కార్డు (బీపీఎల్)! ఇప్పుడది కావాలంటే పచ్చచొక్కాల జన్మభూమి కమిటీలను ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి! కాదని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం! సంతృప్తికరస్థాయిలో అర్హులందరికీ రేషన్ కార్డులిస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మరో హామీ కూడా హుష్‌కాకి అయిపోయింది. కొత్త రేషన్ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఈ దఫాలోనూ నిరాశే మిగిలింది. కనీసం ఈ కొత్త సంవత్సరంలోనైనా కార్డు వస్తుందని ఆశించి దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది.
మూడో వంతు బుట్టదాఖలే...
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రెండేళ్లు తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేయలేదు. 2016 డిసెంబరు నాటికి 51,340 వేల కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే కేవలం 26,529 కార్డులు మాత్రమే మంజూరయ్యాయి. అంటే సగానికి సగం దరఖాస్తులను ప్రభుత్వం చెత్తబుట్టలో వేసింది. మళ్లీ 2017 జనవరి నుంచి డిసెంబరు వరకూ 25,883 కుటుంబాలు రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. రెండు విడతల్లో 7,094 కార్డులు మాత్రమే మంజూరయ్యాయి. అంటే నాలుగో వంతు మాత్రమే వచ్చాయి. తర్వాత ఈ ఏడాది జనవరి నుంచి మే నెలాఖరు వరకూ 4,487 కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే, కేవలం 908 కార్డులు మాత్రమే మంజూరయ్యాయి.
అంటే ఏడాదిన్నర కాలంలో 30,370 కుటుంబాలు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం కేవలం 8,002 కార్డులను మాత్రమే మంజూరు చేసింది. కోరినవారందరికీ కార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి సహా టీడీపీ నాయకులు ప్రతి వేదికపై ఊదరగొడుతున్నారు. కానీ ఆచరణలో మాత్రం కనీసం రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎక్‌నాలెడ్జ్‌మెంట్ నంబరు పొందిన కుటుంబాలకు రేషన్ కార్డు మంజూరుకావట్లేదు. ఈ కార్డుల విషయంలోనూ జన్మభూమి కమిటీలు చక్రం తిప్పి తమకు అనుకూలమైనవారికి, చేయి తడిపినవారికే కార్డులు దక్కేలా చూస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘సంక్షేమం’ తగ్గించేసినా...
దారిద్య్రరేఖకు దిగువనున్న పేద కుటుంబాలకు తెలుపు రేషన్‌కార్డు మంజూరైతే వాస్తవానికి ప్రభుత్వం నుంచి నిత్యావసర సరుకులు నెలానెలా అందించాల్సి ఉంది. గత డాక్టరు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రతినెలా తొమ్మిది నిత్యావసర సరుకులు రేషన్ డిపోల ద్వారా అందేవి. అంతేకాదు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సదుపాయం కూడా లభించేది. పిల్లలకు ఉపకార వేతనాల మంజూరులోనూ ఈ కార్డే కీలకంగా ఉండేది. ఈ ఆశతోనే తెల్లరేషన్ కార్డు తమకొక హక్కుగా పేద, సామాన్య కుటుంబాలు భావించేవి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బియ్యం వరకే సరుకుల పంపిణీని పరిమితం చేసింది. ఆరోగ్య శ్రీ పథకం పేరును ఎన్‌టీఆర్ వైద్యసేవగా మార్చినా కొన్ని రకాల చికిత్సలను తొలగించింది. అయినప్పటికీ తెల్లరేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య తగ్గట్లేదు.
రిజిస్ట్రేషన్ కోసం అగచాట్లు..
రేషన్‌కార్డుల దరఖాస్తు ప్రక్రియలోనూ వ్యయప్రయాసలు తప్పట్లేదు. దరఖాస్తుతో పాటు కుటుంబసభ్యుల ఫొటో, ఆధార్ కార్డు నకలు జత చేయాల్సి ఉంటుంది. అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు అంతకుముందు ఏదైనా కార్డులో తమ పేరు నమోదై ఉంటే ముందుగా తొలగించుకోవాలి. ఈ ప్రక్రియ సవ్యంగా పూర్తి చేస్తేనే దరఖాస్తు రిజిస్ట్రేషన్ అవుతుంది. తద్వారా ఎక్‌నాలెడ్జ్‌మెంట్ నంబరు వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏడాది పొడవునా సాగినప్పటికీ జన్మభూమి కమిటీలు మూకుమ్మడిగా సిఫారసు చేసిన దరఖాస్తులకే మంజూరు కావడం గమనార్హం. మిగతా దరఖాస్తులను ప్రభుత్వం అకారణంగా తిరస్కరిస్తోంది. చివరకు సింగిల్ యూనిట్ (కుటుంబంలో ఒకే సభ్యులు) ఉన్నవారికి రిజిస్ట్రేషన్‌కూ అవకాశం లేకుండా చేసింది. మంజూరు జాబితాలో పేరులేకపోతే మళ్లీ కొత్తగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిందే. మళ్లీ ప్రక్రియ మొదటికొస్తుందన్న మాట!
రాజకీయ కక్షాలతో తొలగింపు...
రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ గ్రామస్థాయిలో ఆయా దరఖాస్తుల విచారణ రెవెన్యూ అధికారులు చేస్తున్నారు. తర్వాత జన్మభూమి కమిటీలు సిఫారసు చేయాల్సి ఉంది. ఇక్కడే తిరకాసు పెడుతున్నారు. తమకు అనుకూలమైన, టీడీపీ కార్యకర్తల కుటుంబాల దరఖాస్తులకే సిఫారసు పంపిస్తున్నారు. తమకు అనుకూలంగా లేనివారు, గత ఎన్నికలలో సహకరించనివారు తెల్ల రేషన్‌కార్డు పొందేందుకు అర్హులైనప్పటికీ ఈ కమిటీలు అడ్డుకుంటున్నాయనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ రాజకీయ పక్షపాత ధోరణి వల్ల నిరుపేదలు ఇబ్బందులకు గురవుతున్నారు. కొత్త కార్డుల కోసం గతంలోనున్న కార్డుల్లో పేరును తొలగించుకోవడంతో తీరా కొత్త కార్డు రాక, పాత కార్డులో పేరు లేక రెండు విధాలా నష్టపోతున్నారు. ఒకప్పుడు రేషన్ కార్డు మంజూరు అధికారం తహసిల్దారు పరిధిలో ఉండేది. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారం తహసిల్దార్లకు కాదు కదా జాయింట్ కలెక్టరు, జిల్లా కలెక్టర్‌కూ కూడా లేకుండా చేశారు. నేరుగా పౌరసరఫరాల కమిషనరేట్ నుంచే మంజూరు ప్రక్రియ చేపడుతున్నారు. దీంతో అర్హులకు తెల్లరేషన్‌కార్డు అనేది అందని ద్రాక్షగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment