janmabhumi commitee
-
దోపిడీ కమిటీలు!
సాక్షి, అమరావతి : జన్మభూమి కమిటీల ముసుగులో రాష్ట్రంలో నాలుగేళ్లుగా అధికార పార్టీ నేతల దోపిడీ ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. టీడీపీ సర్కారు ఈ కమిటీలను రాజ్యాంగేతర శక్తులుగా మార్చి స్థానిక సంస్థల్లో విపక్ష ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది. రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వీరిని పక్కన పెట్టి టీడీపీకి చెందిన చోటామోటా నేతలతో కూడిన జన్మభూమి కమిటీలే అన్ని వ్యవహారాల్లో పెత్తనం చెలాయిస్తున్నాయి. ఇవి పేరుకు జన్మభూమి కమిటీలైనా వాస్తవంగా టీడీపీ కమిటీలన్నది బహిరంగ రహస్యమే. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఏయే పనులు చేయాలో నిర్ణయించాల్సింది గ్రామాల్లో గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో మున్సిపాలిటీలు, నగరాల్లో నగరపాలక సంస్థలు. స్థూలంగా గ్రామాల్లో సర్పంచులు, మున్సిపాలిటీల్లో చైర్మన్, నగరపాలక సంస్థల్లో మేయర్ పాలక మండళ్లతో కలిసి తీర్మానించిన పనులను చేపట్టాలి. కానీ, అన్నిచోట్లా జన్మభూమి కమిటీలే శాసిస్తున్నాయి. ఏ సంక్షేమ పథకం కింద లబ్ధి పొందాలన్నా జన్మభూమి కమిటీల ముందు అర్హులు మోకరిల్లాల్సిందే. ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల నుంచి రుణాలు కావాలన్నా ఈ కమిటీల సిఫార్సులే కీలకం. ముడుపులిచ్చి న వారినే ఈ కమిటీలు లబ్ధిదారులుగా చేర్చేందుకు సిఫార్సు చేస్తున్నాయి. ఈ కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించడం సరికాదని హైకోర్టు సైతం వ్యాఖ్యానించింది. అయినా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఒక్కో పనికి ఒక్కో రేటు జన్మభూమి కమిటీల సభ్యులు ఒక్కో పనికి ఒక్కో రేటు వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు మంజూరుకు లబ్ధిదారుల జాబితాలో పేరు చేర్చాలంటే రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. పట్టణాల్లో రూ.30 వేల నుంచి రూ.40 వేలు లేదా మంజూరయ్యే మొత్తంలో పది శాతం వరకు డిమాండ్ చేస్తున్నారు. రుణాల మంజూరుకు రూ.20 వేలు, పింఛన్లు, రేషన్ కార్డులకు రూ.3 వేల నుంచి 5 వేల వరకు తీసుకుంటున్నారు. రహదారులు, మురుగు కాలువలు, వంతెనలు లాంటి పనులను కూడా ఈ కమిటీలే సిఫారసు చేస్తూ కాంట్రాక్టర్ల నుంచి వసూళ్ల పర్వం సాగిస్తున్నాయి. కాగా.. గుంటూరు జిల్లా తాడికొండ మండలం నరుకుళ్లపాడు సర్పంచ్ మాచారపు లక్ష్మీ తులసి తమ గ్రామంలో జన్మభూమి కమిటీల పెత్తనాన్ని ప్రశ్ని ంచడంతో అధికార పార్టీ నేతలు ఆమెను రెండుసార్లు సస్పెండ్ చేయించారు. న్యాయపోరాటం ద్వారా ఆమె సస్పెన్షన్‌ను తొలగించుకున్నారు. ఆమె తమ మాట వినడం లేదనే అక్కసుతో జన్మభూమి కమిటీ సభ్యులు ఈ గ్రామంలో ఎటువంటి పనులు చేయనీయడంలేదు. కమిటీలు చెప్పిందే వేదం.. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో విపక్షాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఉన్నచోట కూడా జన్మభూమి కమిటీలు చెప్పిందే వేదంగా సాగుతోంది. గ్రామ జన్మభూమి కమిటీలో సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు, డ్వాక్రా సంఘాల నుంచి ఇద్దరు, సేవా సంస్థల తరఫున ఇద్దరు, పంచాయతీ కార్యదర్శి (కన్వీనర్) కలిపి మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు. ఏ పని చేయాలన్నా, ఎవరిని లబ్ధిదారులుగా చేర్చాలన్నా ఈ కమిటీ మెజారిటీ నిర్ణయమే ఫైనల్. సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు ఇద్దరూ వ్యతిరేకించినప్పటికీ నామినేట్ అయిన నలుగురు సభ్యులు చెప్పినదే మెజారిటీ తీర్మానమవుతుంది. విపక్షానికి చెందినవారు ప్రజాప్రతినిధులుగా ఉన్న చోట జన్మభూమి కమిటీ సభ్యులే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులున్న ప్రాంతాల్లో పరిస్థితి ఏకపక్షమే. అంతా అధికార పార్టీ వారే అయినందున వాటాలు వేసుకుని పంచుకుంటున్నారు. దీంతో నాలుగేళ్ల క్రితం వరకూ సైకిళ్లపై తిరిగిన టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు మోటారు సైకిళ్లు, కార్లలో తిరుగుతున్నారు. మంచి భవనాలు నిర్మించుకునిఆర్థికంగా స్థితిమంతులమని చాటుకుంటున్నారు. టీడీపీ సానుభూతిపరులకే అవకాశం జన్మభూమి కమిటీలు టీడీపీకి చెందినవే అయినందున ఆ పార్టీ అభిమానులు, సానుభూతిపరులనే వివిధ సంక్షేమ పథకాలకు ఎంపిక చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ తోపాటు ఇతర పార్టీల వారూ అర్హులైనప్పటికీ వారి ఇళ్లు, పింఛన్లు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ రుణాల దరఖాస్తులను పక్కన పడేస్తున్నారు. అలాగే, వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, కార్యకర్తలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు రహదారులు, మురుగు కాలువలు లాంటి పనులు మంజూరు చేయకుండా ఈ కమిటీలు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నాయి. మరుగుదొడ్ల మంజూరుకూ ముడుపులు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యుల మాటకు విలువ ఇవ్వకుండా టీడీపీవారికి ఇళ్లు, మరుగుదొడ్లు, పింఛన్లు మంజూరు చేస్తున్నారు. లబ్ధిదారుల నుంచి మరుగుదొడ్డి మంజూరుకు రూ.500–రూ.1000, పక్కా ఇల్లు మంజూరుకు రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదు. – ఆళ్ల శివలక్ష్మీకుమారి, ఎంపీటీసీ, నెమలికల్లు, అమరావతి మండలం, గుంటూరు జిల్లా ప్రజా ప్రతినిధులుగా విలువ లేదు ప్రజలు గెలిపించిన ప్రజాప్రతినిధులకు విలువలేకుండా పోయింది. సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం, ఉపాధి హామీ పనులు, నీరు–చెట్టు పనులు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఎన్టీఆర్ గృహాల పంపిణీ ఇలా అన్నింటా చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. గ్రామ సర్పంచ్‌గా నాకు తెలియకుండా అనేక పనులు చేశారు. – తీల సుభద్రమ్మ, సర్పంచ్, వెంకంపేట, పార్వతీపురం -
దరఖాస్తులు కొండంత.. మంజూరు గోరంత!
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం : తెల్లరంగు రేషన్‌కార్డు (బీపీఎల్)! ఇప్పుడది కావాలంటే పచ్చచొక్కాల జన్మభూమి కమిటీలను ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి! కాదని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం! సంతృప్తికరస్థాయిలో అర్హులందరికీ రేషన్ కార్డులిస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మరో హామీ కూడా హుష్‌కాకి అయిపోయింది. కొత్త రేషన్ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఈ దఫాలోనూ నిరాశే మిగిలింది. కనీసం ఈ కొత్త సంవత్సరంలోనైనా కార్డు వస్తుందని ఆశించి దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. మూడో వంతు బుట్టదాఖలే... టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రెండేళ్లు తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేయలేదు. 2016 డిసెంబరు నాటికి 51,340 వేల కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే కేవలం 26,529 కార్డులు మాత్రమే మంజూరయ్యాయి. అంటే సగానికి సగం దరఖాస్తులను ప్రభుత్వం చెత్తబుట్టలో వేసింది. మళ్లీ 2017 జనవరి నుంచి డిసెంబరు వరకూ 25,883 కుటుంబాలు రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. రెండు విడతల్లో 7,094 కార్డులు మాత్రమే మంజూరయ్యాయి. అంటే నాలుగో వంతు మాత్రమే వచ్చాయి. తర్వాత ఈ ఏడాది జనవరి నుంచి మే నెలాఖరు వరకూ 4,487 కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే, కేవలం 908 కార్డులు మాత్రమే మంజూరయ్యాయి. అంటే ఏడాదిన్నర కాలంలో 30,370 కుటుంబాలు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం కేవలం 8,002 కార్డులను మాత్రమే మంజూరు చేసింది. కోరినవారందరికీ కార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి సహా టీడీపీ నాయకులు ప్రతి వేదికపై ఊదరగొడుతున్నారు. కానీ ఆచరణలో మాత్రం కనీసం రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎక్నాలెడ్జ్మెంట్ నంబరు పొందిన కుటుంబాలకు రేషన్ కార్డు మంజూరుకావట్లేదు. ఈ కార్డుల విషయంలోనూ జన్మభూమి కమిటీలు చక్రం తిప్పి తమకు అనుకూలమైనవారికి, చేయి తడిపినవారికే కార్డులు దక్కేలా చూస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘సంక్షేమం’ తగ్గించేసినా... దారిద్య్రరేఖకు దిగువనున్న పేద కుటుంబాలకు తెలుపు రేషన్‌కార్డు మంజూరైతే వాస్తవానికి ప్రభుత్వం నుంచి నిత్యావసర సరుకులు నెలానెలా అందించాల్సి ఉంది. గత డాక్టరు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రతినెలా తొమ్మిది నిత్యావసర సరుకులు రేషన్ డిపోల ద్వారా అందేవి. అంతేకాదు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సదుపాయం కూడా లభించేది. పిల్లలకు ఉపకార వేతనాల మంజూరులోనూ ఈ కార్డే కీలకంగా ఉండేది. ఈ ఆశతోనే తెల్లరేషన్ కార్డు తమకొక హక్కుగా పేద, సామాన్య కుటుంబాలు భావించేవి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బియ్యం వరకే సరుకుల పంపిణీని పరిమితం చేసింది. ఆరోగ్య శ్రీ పథకం పేరును ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చినా కొన్ని రకాల చికిత్సలను తొలగించింది. అయినప్పటికీ తెల్లరేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య తగ్గట్లేదు. రిజిస్ట్రేషన్ కోసం అగచాట్లు.. రేషన్‌కార్డుల దరఖాస్తు ప్రక్రియలోనూ వ్యయప్రయాసలు తప్పట్లేదు. దరఖాస్తుతో పాటు కుటుంబసభ్యుల ఫొటో, ఆధార్ కార్డు నకలు జత చేయాల్సి ఉంటుంది. అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు అంతకుముందు ఏదైనా కార్డులో తమ పేరు నమోదై ఉంటే ముందుగా తొలగించుకోవాలి. ఈ ప్రక్రియ సవ్యంగా పూర్తి చేస్తేనే దరఖాస్తు రిజిస్ట్రేషన్ అవుతుంది. తద్వారా ఎక్నాలెడ్జ్మెంట్ నంబరు వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏడాది పొడవునా సాగినప్పటికీ జన్మభూమి కమిటీలు మూకుమ్మడిగా సిఫారసు చేసిన దరఖాస్తులకే మంజూరు కావడం గమనార్హం. మిగతా దరఖాస్తులను ప్రభుత్వం అకారణంగా తిరస్కరిస్తోంది. చివరకు సింగిల్ యూనిట్ (కుటుంబంలో ఒకే సభ్యులు) ఉన్నవారికి రిజిస్ట్రేషన్‌కూ అవకాశం లేకుండా చేసింది. మంజూరు జాబితాలో పేరులేకపోతే మళ్లీ కొత్తగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందే. మళ్లీ ప్రక్రియ మొదటికొస్తుందన్న మాట! రాజకీయ కక్షాలతో తొలగింపు... రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ గ్రామస్థాయిలో ఆయా దరఖాస్తుల విచారణ రెవెన్యూ అధికారులు చేస్తున్నారు. తర్వాత జన్మభూమి కమిటీలు సిఫారసు చేయాల్సి ఉంది. ఇక్కడే తిరకాసు పెడుతున్నారు. తమకు అనుకూలమైన, టీడీపీ కార్యకర్తల కుటుంబాల దరఖాస్తులకే సిఫారసు పంపిస్తున్నారు. తమకు అనుకూలంగా లేనివారు, గత ఎన్నికలలో సహకరించనివారు తెల్ల రేషన్‌కార్డు పొందేందుకు అర్హులైనప్పటికీ ఈ కమిటీలు అడ్డుకుంటున్నాయనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ రాజకీయ పక్షపాత ధోరణి వల్ల నిరుపేదలు ఇబ్బందులకు గురవుతున్నారు. కొత్త కార్డుల కోసం గతంలోనున్న కార్డుల్లో పేరును తొలగించుకోవడంతో తీరా కొత్త కార్డు రాక, పాత కార్డులో పేరు లేక రెండు విధాలా నష్టపోతున్నారు. ఒకప్పుడు రేషన్ కార్డు మంజూరు అధికారం తహసిల్దారు పరిధిలో ఉండేది. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారం తహసిల్దార్లకు కాదు కదా జాయింట్ కలెక్టరు, జిల్లా కలెక్టర్‌కూ కూడా లేకుండా చేశారు. నేరుగా పౌరసరఫరాల కమిషనరేట్ నుంచే మంజూరు ప్రక్రియ చేపడుతున్నారు. దీంతో అర్హులకు తెల్లరేషన్‌కార్డు అనేది అందని ద్రాక్షగా మారింది. -
ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో జన్మభూమిల కమిటీల ఏర్పాటు సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. అర్హులైన లబ్థి దారులకు పింఛన్ తొలగించడంపై దాఖలైన పిటిషన్ ను శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రజాసామ్యబద్దంగా ఎన్నికైన సర్పంచ్ లను పక్కకు పెట్టడమేంటని న్యాయస్థానం సీరియస్ అయింది. మరో వైపు సెక్రటరీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. అదేవిధంగా అర్హులైన 348 లబ్ధి దారులకు మే 1 వతేదీ లోపల మంజూరు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. -
'30 మందికి వెంటనే పెన్షన్లు ఇవ్వండి'
శ్రీకాకుళం: జన్మభూమి కమిటీలు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేయటంలో పక్షపాతం కనబరుస్తాయని చెప్పేందుకు తార్కాణం ఇది. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం అప్పల అగ్రహారం గ్రామానికి చెందిన వృద్ధులు హైకోర్టును ఆశ్రయించి గెలుపుసాధించుకున్నారు. గ్రామంలోని దాదాపు 30 మంది వృద్ధులకు అందుతున్న పింఛన్ ను అధికారులు నిలిపివేశారు. ఇదేమని అడిగితే గ్రామ జన్మభూమి కమిటీ ఆ మేరకు సిఫారసు చేసిందని బదులిచ్చారు. దీనిపై వృద్ధులంతా కలసికట్టుగా హైకోర్టును ఆశ్రయించారు. తాము అన్ని విధాలుగా అర్హులైనప్పటికీ రాజకీయ కారణాలతో పింఛనును ఆపారని విన్నవించుకున్నారు. వారి ఫిర్యాదును పరిశీలించిన న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. తక్షణమే 30 మంది బాధితులకు పింఛను అందించాలని ఎంపీడీవోను ఆదేశించింది. -
'గ్రామస్థాయి రౌడీలతో జన్మభూమి కమిటీలు'
కమలాపురం: ఆర్టికల్ 73, 74 ప్రకారం స్థానిక సంస్థలను బలోపేతం చేయాల్సింది పోయి, వాటిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని వైఎస్సార్ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం కమలాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. ఎక్కడా లేని విధంగా స్థానిక ప్రజా ప్రతినిధులను కాదని, జన్మభూమిలో గ్రామస్థాయి రౌడీలను పెట్టి కమిటీ ఏర్పాటు చేయడం అన్యాయమన్నారు. అలా కమిటీ సభ్యులకు అధికారాలు ఇచ్చి వారు చెప్పిన పనులకే ప్రాధాన్యం ఇస్తున్నారని తప్పుబట్టారు. ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల మ్మెల్యేలు, నాయకుల గొంతు నొక్కుతోందని మండిపడ్డారు.