దోపిడీ కమిటీలు! | Four Years of Chandrababu Rule | Sakshi
Sakshi News home page

దోపిడీ కమిటీలు!

Published Fri, Jun 22 2018 3:28 AM | Last Updated on Fri, Aug 31 2018 8:42 PM

Four Years of Chandrababu Rule - Sakshi

సాక్షి, అమరావతి : జన్మభూమి కమిటీల ముసుగులో రాష్ట్రంలో నాలుగేళ్లుగా అధికార పార్టీ నేతల దోపిడీ ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. టీడీపీ సర్కారు ఈ కమిటీలను రాజ్యాంగేతర శక్తులుగా మార్చి స్థానిక సంస్థల్లో విపక్ష ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది. రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వీరిని పక్కన పెట్టి టీడీపీకి చెందిన చోటామోటా నేతలతో కూడిన జన్మభూమి కమిటీలే అన్ని వ్యవహారాల్లో పెత్తనం చెలాయిస్తున్నాయి.

ఇవి పేరుకు జన్మభూమి కమిటీలైనా వాస్తవంగా టీడీపీ కమిటీలన్నది బహిరంగ రహస్యమే. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఏయే పనులు చేయాలో నిర్ణయించాల్సింది గ్రామాల్లో గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో మున్సిపాలిటీలు, నగరాల్లో నగరపాలక సంస్థలు. స్థూలంగా గ్రామాల్లో సర్పంచులు, మున్సిపాలిటీల్లో చైర్మన్, నగరపాలక సంస్థల్లో మేయర్‌ పాలక మండళ్లతో కలిసి తీర్మానించిన పనులను చేపట్టాలి. కానీ, అన్నిచోట్లా జన్మభూమి కమిటీలే శాసిస్తున్నాయి.

ఏ సంక్షేమ పథకం కింద లబ్ధి పొందాలన్నా జన్మభూమి కమిటీల ముందు అర్హులు మోకరిల్లాల్సిందే. ఇళ్లు, పింఛన్లు, రేషన్‌ కార్డులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల నుంచి రుణాలు కావాలన్నా ఈ కమిటీల సిఫార్సులే కీలకం. ముడుపులిచ్చి న వారినే ఈ కమిటీలు లబ్ధిదారులుగా చేర్చేందుకు సిఫార్సు చేస్తున్నాయి. ఈ కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించడం సరికాదని హైకోర్టు సైతం వ్యాఖ్యానించింది. అయినా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.  

ఒక్కో పనికి ఒక్కో రేటు
జన్మభూమి కమిటీల సభ్యులు ఒక్కో పనికి ఒక్కో రేటు వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు మంజూరుకు లబ్ధిదారుల జాబితాలో పేరు చేర్చాలంటే రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. పట్టణాల్లో రూ.30 వేల నుంచి రూ.40 వేలు లేదా మంజూరయ్యే మొత్తంలో పది శాతం వరకు డిమాండ్‌ చేస్తున్నారు. రుణాల మంజూరుకు రూ.20 వేలు, పింఛన్లు, రేషన్‌ కార్డులకు రూ.3 వేల నుంచి 5 వేల వరకు తీసుకుంటున్నారు.

రహదారులు, మురుగు కాలువలు, వంతెనలు లాంటి పనులను కూడా ఈ కమిటీలే సిఫారసు చేస్తూ కాంట్రాక్టర్ల నుంచి వసూళ్ల పర్వం సాగిస్తున్నాయి. కాగా.. గుంటూరు జిల్లా తాడికొండ మండలం నరుకుళ్లపాడు సర్పంచ్‌ మాచారపు లక్ష్మీ తులసి తమ గ్రామంలో జన్మభూమి కమిటీల పెత్తనాన్ని ప్రశ్ని ంచడంతో అధికార పార్టీ నేతలు ఆమెను రెండుసార్లు సస్పెండ్‌ చేయించారు. న్యాయపోరాటం ద్వారా ఆమె సస్పెన్షన్‌ను తొలగించుకున్నారు. ఆమె తమ మాట వినడం లేదనే అక్కసుతో జన్మభూమి కమిటీ సభ్యులు ఈ గ్రామంలో ఎటువంటి పనులు చేయనీయడంలేదు.  

కమిటీలు చెప్పిందే వేదం..
గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో విపక్షాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఉన్నచోట కూడా జన్మభూమి కమిటీలు చెప్పిందే వేదంగా సాగుతోంది. గ్రామ జన్మభూమి కమిటీలో సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు, డ్వాక్రా సంఘాల నుంచి ఇద్దరు, సేవా సంస్థల తరఫున ఇద్దరు, పంచాయతీ కార్యదర్శి (కన్వీనర్‌) కలిపి మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు. ఏ పని చేయాలన్నా, ఎవరిని లబ్ధిదారులుగా చేర్చాలన్నా ఈ కమిటీ మెజారిటీ నిర్ణయమే ఫైనల్‌.

సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు ఇద్దరూ వ్యతిరేకించినప్పటికీ నామినేట్‌ అయిన నలుగురు సభ్యులు చెప్పినదే మెజారిటీ తీర్మానమవుతుంది. విపక్షానికి చెందినవారు ప్రజాప్రతినిధులుగా ఉన్న చోట జన్మభూమి కమిటీ సభ్యులే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులున్న ప్రాంతాల్లో పరిస్థితి ఏకపక్షమే. అంతా అధికార పార్టీ వారే అయినందున వాటాలు వేసుకుని పంచుకుంటున్నారు. దీంతో నాలుగేళ్ల క్రితం వరకూ సైకిళ్లపై తిరిగిన టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు మోటారు సైకిళ్లు, కార్లలో తిరుగుతున్నారు. మంచి భవనాలు నిర్మించుకునిఆర్థికంగా స్థితిమంతులమని చాటుకుంటున్నారు.  

టీడీపీ సానుభూతిపరులకే అవకాశం
జన్మభూమి కమిటీలు టీడీపీకి చెందినవే అయినందున ఆ పార్టీ అభిమానులు, సానుభూతిపరులనే వివిధ సంక్షేమ పథకాలకు ఎంపిక చేస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తోపాటు ఇతర పార్టీల వారూ అర్హులైనప్పటికీ వారి ఇళ్లు, పింఛన్లు, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ రుణాల దరఖాస్తులను పక్కన పడేస్తున్నారు. అలాగే, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు, కార్యకర్తలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు రహదారులు,  మురుగు కాలువలు లాంటి పనులు మంజూరు చేయకుండా ఈ కమిటీలు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నాయి.   


మరుగుదొడ్ల మంజూరుకూ ముడుపులు
సర్పంచులు, ఎంపీటీసీ సభ్యుల మాటకు విలువ ఇవ్వకుండా టీడీపీవారికి ఇళ్లు, మరుగుదొడ్లు, పింఛన్లు మంజూరు చేస్తున్నారు. లబ్ధిదారుల నుంచి మరుగుదొడ్డి మంజూరుకు రూ.500–రూ.1000, పక్కా ఇల్లు మంజూరుకు రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదు.   – ఆళ్ల శివలక్ష్మీకుమారి, ఎంపీటీసీ, నెమలికల్లు, అమరావతి మండలం, గుంటూరు జిల్లా


ప్రజా ప్రతినిధులుగా విలువ లేదు  
ప్రజలు గెలిపించిన ప్రజాప్రతినిధులకు విలువలేకుండా పోయింది. సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం, ఉపాధి హామీ పనులు, నీరు–చెట్టు పనులు, పింఛన్లు, రేషన్‌ కార్డులు, ఎన్‌టీఆర్‌ గృహాల పంపిణీ ఇలా అన్నింటా చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. గ్రామ సర్పంచ్‌గా నాకు తెలియకుండా అనేక పనులు చేశారు. – తీల సుభద్రమ్మ, సర్పంచ్, వెంకంపేట, పార్వతీపురం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement