ఏంచేసుకోవాలె..! | White ration cards to be issued | Sakshi
Sakshi News home page

ఏంచేసుకోవాలె..!

Published Sat, Jun 7 2014 3:54 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

ఏంచేసుకోవాలె..! - Sakshi

ఏంచేసుకోవాలె..!

పాలకులు హడావిడిగా చేపట్టే పనులు ప్రజల సమస్యలను పరిష్కరించకపోగా కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రచ్చబండలో మంజూరు చేసిన తెల్లరేషన్ కార్డులు గొప్పలు చెప్పుకోవడానికే తప్ప.. దేనికీ పనికిరాకుండా అలంకారప్రాయంగా మారాయి. సరుకులకు తప్ప.. మరే అవసరానికి ఉపయోగపడడం లేదు. సంక్షేమ పథకాలకు వర్తించకపోవడంతో అర్హులు అయోమయంలో ఉన్నారు. రేషన్‌కార్డులను ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడం ఇందుకు కారణమని తెలుస్తోంది.
     - న్యూస్‌లైన్, చిలుకూరు
 
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మూడు విడతలుగా నిర్వహించిన రచ్చబండలో అర్హులైన వారిని గుర్తించి తెల్లరేషన్ కార్డులు, కూపన్లు మంజూరు చేశారు. అయితే ఆ రేషన్‌కార్డులు సంక్షేమ పథకాలకు వర్తించడం లేదు. దీంతో అర్హులైన ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికంటే ముందు మంజూరు చేసిన పీఏపీ(పింక్ కార్డు) కూపన్ల పరిస్థితీ అంతే ఉంది.  ఆరోగ్యశ్రీ, వివిధ రకాల పెన్షన్లు,  బంగారుతల్లి, ఇందిరమ్మ ఇళ్లు మరే ఇతర పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా తెల్లరేషన్ కార్డు అవసరం ఉంది.  రేషన్‌కార్డులను ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.   
 
 జిల్లావ్యాప్తంగా 75వేల కార్డుల జారీ
 రెండో విడత రచ్చబండలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని గుర్తించి వారికి మూడో విడత రచ్చబండలో ర్యాప్ (రచ్చబండ కూపన్లు)కార్డులు పంపిణీ చేశారు. ఆ కార్డుల్లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సంబంధింత శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఫొటోలతో డిసెంబర్  2013 నుంచి 2014 జూన్ వరకు ఏడు నెలలపాటు వీటిని పంపిణీ చేశారు. ర్యాప్ పేరుతో మంజూరైన ఈ కూపన్లు రేషన్‌సరుకులకు మినహా ఇతర సంక్షేమ పథకాలకు ఉపయోగపడకుండా పోయాయి.
 
 అ కార్డుల కాలపరిమితి ఈ నెలతో పూర్తవుతుంది.  అప్పుడు జిల్లావ్యాప్తంగా 75వేలకు పైగా ర్యాప్ పేరుతో  రచ్చబండ-3లో మంజూరు చేశారు. అన్ని సంక్షేమ పథకాలకు ఈ కార్డులు వర్తించేలా చూస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో మాత్రమే అమలుచేయలేదు. ఫలితంగా అన్ని అర్హతలు ఉండీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నామని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు.
 
ఈ ప్రభుత్వంలోనైనా..
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం అర్హులైన వారందరికీ తెల్లరేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పింది. ముందుగా ఇలాంటి ఇబ్బందులు ఉన్న ర్యాప్, పీఏపీ కూపన్లు పరిస్థితిని పరిశీలించి వాటి స్థానం కొత్తవి ఇవ్వడమా లేదా వాటినే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వర్తించేలా చేయాలని పలువురు లబ్ధిదారులు కోరుతున్నారు. అయితే రచ్చబండ కార్డులలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ఫొటోలు ఉన్నాయి కాబట్టి వాటి స్థానంలో కొత్తవి ఇవ్వాలని కోరుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement