
‘తెల్ల’దొరలు!
- పేద కుటుంబాలకు మించి తెల్లరేషన్ కార్డులు
- అసలైన కార్డుల్లో సైతం డబుల్ యూనిట్లు
- ఆధార్ అనుసంధానంతో బోగస్ బట్టబయలు
అవి చూసే వారికి అందమైన బహుళ అంతస్తుల భవనాలు. వాటి సెల్లార్‌లలో ఖరీదైన కార్లు. అందులో ఉన్న వారంతా అచ్చమైన నిరుపేదలు... ఈ మాటలు నమ్మడానికి నిజం కావనిపిస్తోంది కదూ. ఇది మేమంటున్న మాట కాదు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నివశిస్తున్న కుటుంబాలకంటే అధికంగా ఉన్న తెల్ల రేషన్ కార్డులు చెబుతున్న నిజం. ఇది ‘ఆధార్’ సాక్షిగా బయట పడిన వాస్తవం. ఇటీవల కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వం బోగస్ వ్యవహారాన్ని పసిగట్టి, ప్రక్షాళనకు నడుం కట్టింది. అందులో భాగంగా పౌర సరఫరాల శాఖాధికారులు ‘తెల్ల’ దొరల ఏరివేతకు సిద్ధమవుతున్నారు.
సాక్షి, సిటీబ్యూరో : జంట జిల్లాల్లో సుమారు ఐదు లక్షల బోగస్ తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్టు పౌర సరఫరాల శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆధార్ అనుసంధానంతో బోగస్ తెల్ల రేషన్ కార్డులపై ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. మొత్తం మీద హైదరాబాద్ జిల్లాలోని పౌర సరఫరాల విభాగం పరిధిలో సుమారు 1.55 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 3.45 లక్షల కార్డులు బోగస్‌వి ఉన్నట్లు తెలుస్తోంది.
పేద కుటుంబాల సంఖ్య కంటే తెల్లరేషన్ కార్డులు అధికంగా ఉండగా, మరో పది శాతం కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నాయి. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్‌తో పాటు సంక్షేమ పథకాల వర్తింపు ముడి పడి ఉండటంతో తెల్లరేషన్ కార్డుల సంఖ్య పెరిగింది. నిరుపేదలతో పాటు మధ్య తరగతి, సంపన్నులు సైతం తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారులుగా మారారు. ప్రభుత్వ ఉద్యోగులను కొంతవరకూ మినహాయిస్తే, ప్రయివేటు సెక్టార్‌కు సంబంధించిన పలువురు ఉద్యోగులు, వ్యాపారులకుతెల్లరేషన్ కార్డులు అందాయి.
ఇదీ లెక్క...
హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల జనాభా 93.06 లక్షలు. కుటుంబాల సంఖ్య 22.26 లక్షలు. అందులో పేద కుటుంబాల సంఖ్య 15.20 లక్షల వరకు ఉం టుంది. తెల్ల రేషన్ కార్డుల సంఖ్య మాత్రం 17.87 లక్షలు. మరో 1.11 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరైనప్పటికీ 40 శాతం కూడా జారీ కాలేదు. ఇంకో 1.77 లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీరికి అదనంగా మరో రెండు లక్షల కుటుంబాలు కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆధార్‌తో బట్టబయలైనా...
ఆధార్ నంబర్‌తో రేషన్ కార్డుల బోగస్ వ్యవహారం బట్టబయలైనా... సంబంధిత అధికారులు మేలుకోలేదు. గతేడాదిహైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో నగదు బదిలీ పథకం నేపథ్యంలో ముందస్తు ప్రయోగంగా తెల్ల రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం చేసేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. తెల్ల రేషన్ కార్డుల్లోని అన్ని యూనిట్లకు ఆధార్ అనుసంధానం గడువు వెసులుబాటు కల్పించినప్పటి కీ పూర్తి స్థాయిలో లబ్ధిదారులు ముందుకు రాలేదు. మొత్తం మీద 60 శాతం మించి ఆధార్ అనుసంధానం సాధ్యపడలేదు. ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఆన్‌లైన్ ప్రజా పంపిణీ వ్యవస్థ (ఈపీడీఎస్) ద్వారా సుమారు లక్షకు పైగా యూనిట్లు ‘డబుల్’గా బయటపడ్డాయి. ఇటీవల రచ్చబండ సందర్భంగా మంజూరు చేసిన కార్డుల జారీకి సైతం ఆధార్ నిబంధన పెట్టినప్పటికీ పౌర సరఫరాల శాఖ కింది స్థాయి సిబ్బంది, డీలర్లు కుమ్మక్కై చేతివాటం ప్రదర్శించారు.
ఎట్టకేలకు మేలుకున్నారు...
జంట జిల్లాల్లో బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు పౌర సరఫరాల శాఖ కసరత్తులు ప్రారంభించింది. ఇటీవల ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పేరుతో కొత్త రేషన్ కార్డుల జారీకి సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలుత బోగస్‌వి ఏరివేయాలని నిర్ణయించింది. తాజాగా రాష్ర్ట్ర ప్రభుత్వం బోగస్ వ్యవహారాన్ని సీరియస్ పరిగణించి, ఏరివేతకు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు హడావుడి పడుతున్నారు.