17.39 లక్షల రేషన్ కార్డులు కట్
* రచ్చబండలో జారీ చేసిన 8.50 లక్షల కూపన్లపైనా దృష్టి
* భారం తగ్గించుకునేందుకు సర్కారు ఎత్తుగడలు
* లబ్ధిదారులు స్థానికంగా లేరంటూ సాకులు
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం రకరకాల ఎత్తుగడలు వేస్తోంది. లబ్ధిదారులు స్థానికంగా లేరని, కార్డుల్లో ఉన్న లబ్ధిదారులకు సంబంధించిన ఆధార్ కార్డులు లేవనే తదితర కారణాలు చూపుతూ కోత పెడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల నాటికి రచ్చబండ కార్యక్రమం ద్వారా ఇచ్చిన కూపన్లతో సహా రాష్ర్టంలో 1,40,21,870 తెల్ల రేషన్ కార్డులు ఉండేవి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ పేరుతో ఇప్పటివరకు 17,39,014 తెల్ల రేషన్ కార్డులను తొలగించింది.
రచ్చబండ కార్యక్రమంలో కూపన్లు పొందిన 8.50 లక్షల మంది లబ్ధిదారులకు కూడా రేషన్ నిలిపివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సమయంలో ఎక్కువమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికే లబ్ధి చేకూరిందని అందులోనూ సగంపైగా అనర్హులు ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, ఉపాధి హామీ పథకం ద్వారా ఇప్పటివరకు పనులు కూడా గుర్తించకపోవడంతో లక్షలాది మంది కూలీలు పనులకోసం కర్ణాటక తదితర ప్రాంతాలకు వలసలు వెళ్ళారు. విచారణకు వెళ్లినప్పుడు లబ్ధిదారులు స్థానికంగా లేరనే కారణం చూపి రేషన్ కార్డులను రద్దు చేయడంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీనికి తోడు మరింత భారం తగ్గించుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ-పాస్ విధానం ద్వారా రేషన్‌ను పంపిణీ చేయాలని భావిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ఈ-పాస్ విధానాన్ని అమలు చేయడంతో లీకేజీలు తగ్గించి రూ. 5 కోట్ల వరకు ఆదా అయిందని ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రెండో విడతగా కర్నూలు జిల్లాలో కూడా ఇదే విధానాన్ని అమలు చేసి సక్సెస్ అయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించారు. రాష్ట్రం అంతటా ఈ-పాస్ విధానం అమలు చేస్తే భారీ ఎత్తున లీకేజీలను అరికట్టి తద్వారా రూ.1,000 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదా వస్తుందని అంచనా వేశారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు అప్పట్లో జారీ చేసిన 8.50 లక్షల తాత్కాలిక రేషన్ కూపన్ల గడువు పూర్తయినా పొడిగించే ప్రయత్నాలు చేయలేదు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా పరిటాల సునీత బాధ్యతలు స్వీకరించిన రోజున రేషన్ కూపన్లను ఆరు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 17వ తేదీ నాటికి గడువు ముగిసినా వాటిపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
రాష్ట్రంలో కుటుంబాలకు మించి రేషన్ కార్డులున్నాయని ఏదో ఒక విధంగా ఇప్పుడున్న రేషన్ కార్డుల్లో 30 శాతం మేరకైనా తగ్గించాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రేషన్ కార్డులకు ఆధార్ లింకు అనుసంధానం లేదనే సాకు చూపి గ్రామీణ ప్రాంతాల్లో సరిగా రేషన్ ఇవ్వకుండా లబ్ధిదారులకు చుక్కలు చూపుతున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం ప్రతి నెలా 1,59,523 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తోంది. వీటిలో పతి నెలా కనీసం 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యం తగ్గితే కొంత ఉపశమనం పొందవచ్చని ఆమేరకు రేషన్ కార్డులు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.