The public distribution system
-
రేషన్ బ్లాక్ మార్కెట్‌కు ఈ-పాస్‌తో చెక్
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న నిత్యావసర సరుకుల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు పౌర సరఫరాల శాఖ సన్నద్ధమవుతోంది. అక్రమాలకు అలవాటుపడ్డ డీలర్లు, అధికారులు అర్హులకు దక్కాల్సిన సరుకులను నల్లబజారుకు తరలించే చర్యలకు ఫుల్స్టాప్ పెట్టాలని యోచిస్తోంది. పక్కదారి పడుతున్న రేషన్ సరుకులను కట్టడి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాలను ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అడ్డదారి నిరోధానికి ఇదొక్కటే దారి రాష్ట్రంలోని సుమారు రెండున్నర కోట్ల బీపీఎల్ లబ్ధిదారులకు ఏటా రూ.2,200 కోట్ల సబ్సిడీతో ప్రభుత్వం నిత్యావసరాలను పంపిణీ చేస్తోంది. రూ.30 విలువ చేసే బియ్యాన్ని ఒక్క రూపాయికి, రూ.50 ఉండే కిరోసిన్‌ను రూ.15కే అందిస్తున్నారు. వీటితో పాటే గోధుమలు, చక్కెర, కందిపప్పును సబ్సిడీపై ఇస్తున్నారు. పక్కాగా పేదలకు అందించాల్సిన ఈ సరుకులను కొంతమంది డీలర్లు కాసులకు కక్కుర్తిపడి బహిరంగ మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నారు. గత జూన్ నుంచి ఇప్పటివరకు 30 వేల క్వింటాళ్ల బియ్యాన్ని, 2లక్షల లీటర్ల కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి తోపాటు గోధుమలు, కందిపప్పు సైతం పెద్దఎత్తున తనిఖీల్లో పట్టుబడుతూనే ఉన్నాయి. పట్టుబడని సరుకుల విలువ వీటికి మూడింతలు ఉంటుంది. ఏటా 25 నుంచి 34 శాతం వరకు పక్కదారి పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నందున దీని కట్టడికి అన్ని రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానాన్ని తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈపాస్ యంత్రాల ఏర్పాటును తెరపైకి తెచ్చింది. అయితే వీటికి సుమారు రూ.230కోట్లు వ్యయమవుతుండటంతో ఈ భారాన్ని భరించాలని కేంద్రాన్ని కోరినా వారి నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో రాష్ట్ర నిధులతోనే వీటిని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అంతా ఆన్లైన్...: ఈ పాస్‌తో పాటే పౌర సరఫరాలో అక్రమాల నిర్వహణకు ‘సరఫరా వ్యవస్థ నిర్వహణ (సప్లై చైన్ మేనేజ్మెంట్)’ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసి సరుకుల సరఫరా మొదలు పంపిణీ వరకు మొత్తం ఆన్లైన్ ద్వారా జరిగేలా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 172 మండల స్థాయి స్టాక్ పాయింట్లలో కంప్యూటర్లు ఉన్నందున వాటికి యుద్ధప్రాతిపదికన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి అన్ని వివరాలు పొందుపరిచేలా చర్య లు తీసుకుంటున్నారు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నుంచి చౌక ధరల దుకాణం వరకు సరుకుల పంపిణీ అడ్డదారి పట్టకుండా ఈ విధా నం ఉపయుక్తంగా ఉండనుంది. ఆన్లైన్ వ్యవస్థను పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చి సరుకు రవాణా చేసే ట్రక్కుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎమ్మార్వో మొదలు కింది స్థాయి అధికారి వరకు చేరేలా ఎస్ఎంఎస్ వ్యవస్థను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. -
17.39 లక్షల రేషన్ కార్డులు కట్
* రచ్చబండలో జారీ చేసిన 8.50 లక్షల కూపన్లపైనా దృష్టి * భారం తగ్గించుకునేందుకు సర్కారు ఎత్తుగడలు * లబ్ధిదారులు స్థానికంగా లేరంటూ సాకులు సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం రకరకాల ఎత్తుగడలు వేస్తోంది. లబ్ధిదారులు స్థానికంగా లేరని, కార్డుల్లో ఉన్న లబ్ధిదారులకు సంబంధించిన ఆధార్ కార్డులు లేవనే తదితర కారణాలు చూపుతూ కోత పెడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల నాటికి రచ్చబండ కార్యక్రమం ద్వారా ఇచ్చిన కూపన్లతో సహా రాష్ర్టంలో 1,40,21,870 తెల్ల రేషన్ కార్డులు ఉండేవి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ పేరుతో ఇప్పటివరకు 17,39,014 తెల్ల రేషన్ కార్డులను తొలగించింది. రచ్చబండ కార్యక్రమంలో కూపన్లు పొందిన 8.50 లక్షల మంది లబ్ధిదారులకు కూడా రేషన్ నిలిపివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సమయంలో ఎక్కువమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికే లబ్ధి చేకూరిందని అందులోనూ సగంపైగా అనర్హులు ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, ఉపాధి హామీ పథకం ద్వారా ఇప్పటివరకు పనులు కూడా గుర్తించకపోవడంతో లక్షలాది మంది కూలీలు పనులకోసం కర్ణాటక తదితర ప్రాంతాలకు వలసలు వెళ్ళారు. విచారణకు వెళ్లినప్పుడు లబ్ధిదారులు స్థానికంగా లేరనే కారణం చూపి రేషన్ కార్డులను రద్దు చేయడంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మరింత భారం తగ్గించుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ-పాస్ విధానం ద్వారా రేషన్‌ను పంపిణీ చేయాలని భావిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ఈ-పాస్ విధానాన్ని అమలు చేయడంతో లీకేజీలు తగ్గించి రూ. 5 కోట్ల వరకు ఆదా అయిందని ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రెండో విడతగా కర్నూలు జిల్లాలో కూడా ఇదే విధానాన్ని అమలు చేసి సక్సెస్ అయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించారు. రాష్ట్రం అంతటా ఈ-పాస్ విధానం అమలు చేస్తే భారీ ఎత్తున లీకేజీలను అరికట్టి తద్వారా రూ.1,000 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదా వస్తుందని అంచనా వేశారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు అప్పట్లో జారీ చేసిన 8.50 లక్షల తాత్కాలిక రేషన్ కూపన్ల గడువు పూర్తయినా పొడిగించే ప్రయత్నాలు చేయలేదు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా పరిటాల సునీత బాధ్యతలు స్వీకరించిన రోజున రేషన్ కూపన్లను ఆరు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 17వ తేదీ నాటికి గడువు ముగిసినా వాటిపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. రాష్ట్రంలో కుటుంబాలకు మించి రేషన్ కార్డులున్నాయని ఏదో ఒక విధంగా ఇప్పుడున్న రేషన్ కార్డుల్లో 30 శాతం మేరకైనా తగ్గించాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రేషన్ కార్డులకు ఆధార్ లింకు అనుసంధానం లేదనే సాకు చూపి గ్రామీణ ప్రాంతాల్లో సరిగా రేషన్ ఇవ్వకుండా లబ్ధిదారులకు చుక్కలు చూపుతున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం ప్రతి నెలా 1,59,523 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తోంది. వీటిలో పతి నెలా కనీసం 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యం తగ్గితే కొంత ఉపశమనం పొందవచ్చని ఆమేరకు రేషన్ కార్డులు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. -
67 లక్షల మందికి రేషన్ కట్: పరకాల
హైదరాబాద్: ఏపీలో 67 లక్షల మంది తెల్లకార్డుదారులకు రేషన్ నిలిపేస్తున్నట్లు ప్రభుత్వ సలహా దారు పరకాల ప్రభాకర్ బుధవారం ప్రకటించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్‌కార్డుల్ని ఆధార్‌తో సరిపోల్చి చూసే ప్రక్రియ 98 శాతం వరకు పూర్తయిందని, ఫోటోలు, చిరునామాలు సరిపోలక 67 లక్షల తెల్లకార్డులు తిరస్కరణకు గురైనట్లు చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ముఖ్యమైన సంస్కరణలు తెచ్చేందుకు చంద్రబాబునాయుడు సర్కారు నిర్ణయించిందని తెలిపారు. దీన్లో భాగంగా పారదర్శకత కోసం, బోగస్, దుబారా అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 27,176 ఈ-పాస్ మిషన్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. రెండు నెలల్లో ఈ మిషన్ల ద్వారా ఈ-పాస్ కార్డులు జారీ చేసి రేషన్ సరుకులు అందించనున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే తండ్రి పింఛను పొందడాన్ని.. సమర్ధిస్తున్నారా? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తండ్రి సుబ్రహ్మణ్యం రెడ్డి పేరిట తెల్ల రేషన్‌కార్డు (ఏపీ 102600500742) ఉందని, పింఛను కూడా పొందడాన్ని తనిఖీ సభ్యులు గుర్తించారని పరకాల ప్రభా కర్ అన్నారు. ఆర్ధికంగా స్థితిమంతుడైన ఎమ్మెల్యే తండ్రి పింఛను పొందడాన్ని ప్రతిపక్ష నేత సమర్ధిస్తారా? అని పరకాల ప్రశ్నించారు. -
మూడంటే మూడే..!
ఆదిలాబాద్ అర్బన్ : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుదారులకు ప్రతి నెల నిత్యావసర సరుకులు ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి నెల కార్డుదారులకు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి. ప్రస్తుతం సరుకుల సరఫరా సక్రమంగా జరగడం లేదు. ప్రభుత్వం నుంచి సరఫరా కావాల్సిన పామోలిన్ కమిషనరేట్ స్థాయిలోనే సరఫరా నిలిచిందని అధికారులు పేర్కొంటున్నారు. సుమారు ఐదు నెలలుగా పామోలిన్ జిల్లాకు రావడం లేదు. దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దీంతో కార్డుదారులకు ఉన్న సరుకులు సరఫరా చేసి చేతులు దులుపుకుంటున్నారు. సెప్టెంబర్ నెల కోటా కింద కార్డుదారుడికి బియ్యం, చక్కెర, ఉప్పు మూడే సరుకులు పంపిణీ చేయడం శోచనీయం. ఇదిలా ఉండగా చింతపండు, పసుపు, గోధుమలు, కందిపప్పు, కారంపొడి సరుకులు గోదాముల్లో అందుబాటులో ఉన్న సంబంధిత డీలర్లు సరఫరా చేసుకోవడం లేదు. దీంతో కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. పండుగలకు ప్రభుత్వం అదనపు కోటా ఇవ్వకున్నా.. ఉన్న సరుకులను సక్రమంగా పంపిణీ చేస్తే బాగుంటుందని కార్డుదారులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్‌లో ‘మూడే’ పంపిణీ జిల్లాలోని రేషన్ కార్డుదారులకు సెప్టెంబర్ నెల కోటా కింద మూడే సరుకులు పంపిణీ అవుతున్నాయి. జిల్లాలో అన్నయోజన, అంత్యోదయ, తెలుపు రేషన్ కార్డులు 6,10,236 ఉన్నాయి. వీరికి సెప్టెంబర్ కోటా కింద 91,346.35 క్వింటాళ్ల బియ్యం, 3051.18 క్వింటాళ్ల చక్కెర, 6,09,660 పసుపు పాకెట్లు, 6,09,187 గోధుమ పిండి ప్యాకెట్లు, 6,09,584 ఉప్పు ప్యాకెట్లు, 6,09,479 కారంపొడి ప్యాకెట్లు, 6,098.51 క్వింటాళ్ల కందిపప్పు, 6.09 లక్షల చింతపండు ప్యాకెట్లు, 6,099.9 క్వింటాళ్ల గోధుమలు నెల కోటాగా కేటాయించారు. కోటా సరుకుల కేటాయింపు జరుగుతున్నా గ్రామాల్లో రేషన్ ద్వారా కార్డుదారుడికి నిత్యావసర సరుకులు సరఫరా కావడం లేదు. ప్రభుత్వం ఆగస్టు నుంచి ఎలక్ట్రానిక్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(ఈ-పీడీఎస్) విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో సరుకుల కేటాయింపు ఆన్లైన్లో జరుగుతుంది. ఈపీడీఎస్తో నిత్యావసర సరుకులు సరఫరా పటిష్టం అని ప్రభుత్వం భావించినా పరిస్థితి అందుకు భిన్నంగా కన్పిస్తోంది. ‘బోగస్ కార్డులకు’ కోటా కట్.. గత నెలలో ప్రభుత్వం బోగస్ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ చేపట్టింది. ఈ ఏరివేతలో బోగస్‌గా తేలిన కార్డులకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన కోటా విడుదల చేయలేదు. అయితే అధికారులు చేపట్టిన బోగస్ ఏరివేతలో అర్హులైన రేషన్ కార్డుదారులు ఉన్నారు. దీంతో వారు ఈ నెల రేషన్ కోల్పోవాల్సి వచ్చింది. సెప్టెంబర్ నెల కోటా సరుకులు తీసుకువెళ్లేందుకు డీలర్ల వద్దకు వచ్చిన అర్హులైన కార్డుదారులు అధికారులు తొలగించారనే విషయం తెలియడంతో ఆందోళన చెందాల్సి వస్తోంది. ఈ ఏరివేతలో చనిపోయిన వారి పేర్లు, వలసలు వెళ్లిన వారి పేర్లు తొలగించారు. జిల్లాలో సుమారు 83,887 రేషన్ కార్డులు బోగస్ గుర్తించి తొలగించారు. వీటికి సెప్టెంబర్ నెల కోటా సరుకుల కేటాయింపు నిలుపుదల చేశారు. సరఫరా నిలిచింది.. - ఆనంద్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మేనేజరు నిత్యావసర సరుకులతోపాటు పంపిణీ చేసే పామోలిన్ సరఫరా ప్రభుత్వం నుంచే రావడం లేదు. మే నెల నుంచి సెప్టెంబర్ వరకు ఐదు నెలలుగా పామోలిన్ జిల్లాకు రాలేదు. ప్రభుత్వం నుంచి సరఫరా అయితే తప్పకుండా కార్డుదారులకు పంపిణీ చేస్తాం. -
‘రేషన్’ అక్రమాలకు చెక్
ఆదిలాబాద్ అర్బన్ : ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు చెక్ పడింది. జిల్లాలో ఎలక్ట్రానిక్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (ఈ-పీడీఎస్) విధానం ద్వారా ఆగస్టు నెలకు సంబంధించిన నిత్యావసర సరుకుల కోటా కేటాయింపు జరిగింది. ప్రస్తుతం కొనసాగుతున్న రాతపూర్వ విధానానికి చెక్ పడింది. ఈ-పీడీఎస్ విధానంతో పౌర సరఫరాల శాఖ కమిషనరేట్ నుంచి నేరుగా మండలాల తహశీల్దార్లకు ఆన్లైన్లోనే కోటా కేటాయింపు జరుగుతుంది. సంబంధిత రేషన్ డీలర్లు తహశీల్దార్ల నుంచే కోటా సరుకులు తీసుకోవాలి. అయితే సరుకుల కేటాయింపు అనంతరం డైనమిక్ కీ రిజిస్ట్రార్‌ను ప్రతి నెల 15 నుంచి 18వ తేదీలోగా కమిషనరేట్ నుంచి విడుదల అవుతుంది. కీ రిజిస్ట్రార్ ప్రకారమే సరుకులు ఎంత మందికి ఇవ్వచ్చు. ఎంత అలాట్మెంట్ వచ్చింది అనే వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. ఇక నుంచి బియ్యం, చక్కెరతోపాటు ఇతర తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు ఈ-పీడీఎస్ విధానం ద్వారా కేటాయిస్తారు. సెప్టెంబర్ నుంచి కిరోసిన్ కోటాను కూడా ఈ-పీడీఎస్ విధానం ద్వారా కేటాయించనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఈ-పీడీఎస్ విధానం తీసుకొచ్చింది. ఈ విధానాన్ని అమలు చేసి అక్రమాలకు చెక్ పెట్టనుంది. ఇక నుంచి ప్రతి మండలానికి కమిషనరేట్ నుంచి సరుకుల కేటయింపు జరుగనుంది. ఎఫ్‌సీఐ గోదాముల నుంచి నేరుగా ఎంఎల్ఎస్ పాయింట్లకు, అక్కడి నుంచి డీలర్లకు రేషన్ సరుకులు సరఫరా అయ్యేవి. ఇదంతా రాతపూర్వకంగా కొనసాగేది. దీంతో బియ్యం, నూనె, చక్కెర తదితర సరుకులు బ్లాక్ మార్కెట్‌కు తరలేవి. ప్రభుత్వానికి రూ.కోట్ల నష్టం వాటిల్లేది. దీనికితోడు ప్రజలకు సరుకులు అందేవికావు. 81,700 రేషన్ కార్డులు తొలగింపు జిల్లాలో 81,700 రేషన్ కార్డులను తొలగించారు. ఈ-పీడీఎస్ డాటా బేస్‌లో రేషన్ కార్డులను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేశారు. ఈ డాటాబేస్ పరిధిలోని లేని రేషన్ కార్డులను బోగస్‌గా గుర్తించి తొలగించారు. జిల్లాలో ఆధార్ అనుసంధానం 85.77 శాతం పూర్తయింది. ఈ నెల 15లోగా అనుసంధానం పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి ఇది వరకే అధికారులకు ఆదేశాలు అందాయి. ఫలితంగా ఈ-పీడీఎస్‌లో ఉన్న కార్డులకు మాత్రమే సరుకులు కేటాయింపు జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. -
రిక్తహస్తం
ఆదిలాబాద్ టౌన్ : అమ్మహస్తం పథకం నిలిచింది. వినియోగదారులకు పంపిణీ చేయాల్సిన తొమ్మిది రకాల సరుకుల జాడ లేదు. రూ.185 ధరకే నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు తలపెట్టిన అమ్మహస్తం పథకానికి ప్రభుత్వం మంగళం పాడింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే సాధారణ సరుకులైన బియ్యం, కిరోసిన్, చక్కెరతోపాటు అదనంగా కారం, పసుపు, చింతపండు, పామాయిల్, గోధుమపిండి, గోధుమలు, ఉప్పు తదితర సరుకులు రూ.185కే అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం కిరణ్ హంగు ఆర్భాటాలతో ప్రవేశపెట్టిన పథకం ప్రస్తుతం కథ ముగిసింది. దీంతో అదనపు సరుకుల పంపిణీ పూర్తిగా నిలిచిపోవడంతో సాధారణ సరుకులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అటకెక్కినట్టేనా! జిల్లాలో 7.05 లక్షల మంది రేషన్‌కార్డుల దారులు ఉన్నారు వీరందరికి నెలవారీగా సరకులు పంపిణీ చేస్తున్నారు. అమ్మహస్తం పథకంలో భాగంగా ఈ కార్డుదారులకు ప్రతినెల తొమ్మిది రకాల సరుకు అందజేయాలి. కాగా అమ్మహస్తం సరుకుల్లో నాణ్యత కొరవడంతో కార్డుదారులు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. నాణ్యమైన సరుకులు అందిస్తామంటూ అప్పటి ప్రభుత్వం, నేతలు ప్రగల్భాలు పలికినప్పటికీ క్షేత్రస్థాయిలో సరుకులపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఫలితంగా రేషన్ డీలర్లు క్రమంగా ఈ సరుకులను పక్కన పెట్టారు. కేవలం బియ్యం, చక్కెర, పామాయిల్ సరుకులకు మాత్రమే డీడీలు కట్టి స్టాకు తెప్పించుకోవడంతో మిగతా సరుకుల ప్రాధాన్యం క్రమంగా పడిపోయింది. కేవలం బియ్యం, చక్కెర, పామాయిల్ మాత్రమే అందజేస్తూ వచ్చారు. బహిరంగ మార్కెట్లో ఈ వస్తువుల ధరలు రెట్టింపు ఉండడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిల్వలు ముక్కిపోయి అమ్మహస్తం పథకం కింద జిల్లాకు కేటాయించిన సరుకులు చింతపండు, కారం, ఉప్పు, గోధుమలు, గోధుమపిండి తదితర సరుకులకు డిమాండ్ లేకుండపోయింది. రేషన్ డీలర్లు సరుకులు తీసుకపోవడంతో వాటిని పౌరసరఫరాల శాఖ అధికారులు గోదాంల్లోనే నిల్వ ఉంచారు. దీంతో కొన్ని సరకులు ముక్కిపోవడంతో ప్రభుత్వానికి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నెలకు సంబంధించి జిల్లాకు వచ్చిన స్టాకులో చింతపండు ఈనెల 14,848 ప్యాకెట్లు, పసుపు నిల్వ 130, కారం 1,92,764, ఉప్పు 64 వేలు, చక్కెర 90 వేలు, గోధుమలు 44 వేలు, గోధుమపిండి 50 వేల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ సరుకులన్నీ కార్డుదారులందరికీ సరిపోవు. కేవలం బియ్యం, చక్కెర మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. వినియోగదారులు సరుకుల కోసం అడిగితే స్టాక్ లేదంటూ తప్పించుకుంటున్నారు. మూడు నెలల నుంచి పామాయిల్ బంద్ రేషన్ కార్డుదారులకు కిలో చొప్పున అందించే పామాయిల్ కొరత జిల్లాలో తీవ్రంగా ఉంది. మూడు నెలల నుంచి కార్డుదారులకు అందడంలేదు. జిల్లాకు 7.05 లక్షల కార్డుదారులకు పామాయిల్ ప్యాకెట్లు అవసరం. ఏప్రిల్ నెల నుంచి రేషన్ కార్డు దారులకు పామాయిల్ పంపిణీ కావడం లేదు. తాజాగా ఈ నెలలో కూడా పామాయిల్ సరాఫరా నిలిచింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అమ్మహస్తం సరుకులు తీసుకోవడం లేదు.. - జిల్లా పౌరసరఫరాల మేనేజర్ అమ్మహస్తం సరుకులను కార్డుదారులు తీసుకెళ్లడం లేదు. దీంతో డీలర్లు ఆ వస్తువులకు సంబంధించి డీడీలు కట్టడంలేదు. గోదాముల్లో ఉన్న సరుకులను డీడీలు కట్టిన వారికి పంపిణీ చేస్తున్నాం. మూడు నెలల నుంచి పామాయిల్ రావడం లేదు. పామాయిల్ వచ్చిన వెంటనే వినియోగదారులకు అందజేస్తాం.