రేషన్ బ్లాక్ మార్కెట్‌కు ఈ-పాస్‌తో చెక్
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న నిత్యావసర సరుకుల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు పౌర సరఫరాల శాఖ సన్నద్ధమవుతోంది. అక్రమాలకు అలవాటుపడ్డ డీలర్లు, అధికారులు అర్హులకు దక్కాల్సిన సరుకులను నల్లబజారుకు తరలించే చర్యలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని యోచిస్తోంది. పక్కదారి పడుతున్న రేషన్ సరుకులను కట్టడి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాలను ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
అడ్డదారి నిరోధానికి ఇదొక్కటే దారి
రాష్ట్రంలోని సుమారు రెండున్నర కోట్ల బీపీఎల్ లబ్ధిదారులకు ఏటా రూ.2,200 కోట్ల సబ్సిడీతో ప్రభుత్వం నిత్యావసరాలను పంపిణీ చేస్తోంది. రూ.30 విలువ చేసే బియ్యాన్ని ఒక్క రూపాయికి, రూ.50 ఉండే కిరోసిన్‌ను రూ.15కే అందిస్తున్నారు. వీటితో పాటే గోధుమలు, చక్కెర, కందిపప్పును సబ్సిడీపై ఇస్తున్నారు. పక్కాగా పేదలకు అందించాల్సిన ఈ సరుకులను కొంతమంది డీలర్లు కాసులకు కక్కుర్తిపడి బహిరంగ మార్కెట్‌లో అమ్మకానికి పెడుతున్నారు. గత జూన్ నుంచి ఇప్పటివరకు 30 వేల క్వింటాళ్ల బియ్యాన్ని, 2లక్షల లీటర్ల కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
వీటి తోపాటు గోధుమలు, కందిపప్పు సైతం పెద్దఎత్తున తనిఖీల్లో పట్టుబడుతూనే ఉన్నాయి. పట్టుబడని సరుకుల విలువ వీటికి మూడింతలు ఉంటుంది. ఏటా 25 నుంచి 34 శాతం వరకు పక్కదారి పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నందున దీని కట్టడికి అన్ని రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానాన్ని తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈపాస్ యంత్రాల ఏర్పాటును తెరపైకి తెచ్చింది. అయితే వీటికి సుమారు రూ.230కోట్లు వ్యయమవుతుండటంతో ఈ భారాన్ని భరించాలని కేంద్రాన్ని కోరినా వారి నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో రాష్ట్ర నిధులతోనే వీటిని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
అంతా ఆన్‌లైన్...: ఈ పాస్‌తో పాటే పౌర సరఫరాలో అక్రమాల నిర్వహణకు ‘సరఫరా వ్యవస్థ నిర్వహణ (సప్లై చైన్ మేనేజ్‌మెంట్)’ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసి సరుకుల సరఫరా మొదలు పంపిణీ వరకు మొత్తం ఆన్‌లైన్ ద్వారా జరిగేలా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 172 మండల స్థాయి స్టాక్ పాయింట్లలో కంప్యూటర్లు ఉన్నందున వాటికి యుద్ధప్రాతిపదికన ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించి అన్ని వివరాలు పొందుపరిచేలా చర్య లు తీసుకుంటున్నారు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నుంచి చౌక ధరల దుకాణం వరకు సరుకుల పంపిణీ అడ్డదారి పట్టకుండా ఈ విధా నం ఉపయుక్తంగా ఉండనుంది. ఆన్‌లైన్ వ్యవస్థను పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చి సరుకు రవాణా చేసే ట్రక్కుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎమ్మార్వో మొదలు కింది స్థాయి అధికారి వరకు చేరేలా ఎస్‌ఎంఎస్ వ్యవస్థను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.