ఆదిలాబాద్ అర్బన్ : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుదారులకు ప్రతి నెల నిత్యావసర సరుకులు ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి నెల కార్డుదారులకు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి. ప్రస్తుతం సరుకుల సరఫరా సక్రమంగా జరగడం లేదు. ప్రభుత్వం నుంచి సరఫరా కావాల్సిన పామోలిన్ కమిషనరేట్ స్థాయిలోనే సరఫరా నిలిచిందని అధికారులు పేర్కొంటున్నారు. సుమారు ఐదు నెలలుగా పామోలిన్ జిల్లాకు రావడం లేదు. దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దీంతో కార్డుదారులకు ఉన్న సరుకులు సరఫరా చేసి చేతులు దులుపుకుంటున్నారు.
సెప్టెంబర్ నెల కోటా కింద కార్డుదారుడికి బియ్యం, చక్కెర, ఉప్పు మూడే సరుకులు పంపిణీ చేయడం శోచనీయం. ఇదిలా ఉండగా చింతపండు, పసుపు, గోధుమలు, కందిపప్పు, కారంపొడి సరుకులు గోదాముల్లో అందుబాటులో ఉన్న సంబంధిత డీలర్లు సరఫరా చేసుకోవడం లేదు. దీంతో కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. పండుగలకు ప్రభుత్వం అదనపు కోటా ఇవ్వకున్నా.. ఉన్న సరుకులను సక్రమంగా పంపిణీ చేస్తే బాగుంటుందని కార్డుదారులు పేర్కొంటున్నారు.
సెప్టెంబర్‌లో ‘మూడే’ పంపిణీ
జిల్లాలోని రేషన్ కార్డుదారులకు సెప్టెంబర్ నెల కోటా కింద మూడే సరుకులు పంపిణీ అవుతున్నాయి. జిల్లాలో అన్నయోజన, అంత్యోదయ, తెలుపు రేషన్ కార్డులు 6,10,236 ఉన్నాయి. వీరికి సెప్టెంబర్ కోటా కింద 91,346.35 క్వింటాళ్ల బియ్యం, 3051.18 క్వింటాళ్ల చక్కెర, 6,09,660 పసుపు పాకెట్లు, 6,09,187 గోధుమ పిండి ప్యాకెట్లు, 6,09,584 ఉప్పు ప్యాకెట్లు, 6,09,479 కారంపొడి ప్యాకెట్లు, 6,098.51 క్వింటాళ్ల కందిపప్పు, 6.09 లక్షల చింతపండు ప్యాకెట్లు, 6,099.9 క్వింటాళ్ల గోధుమలు నెల కోటాగా కేటాయించారు.
కోటా సరుకుల కేటాయింపు జరుగుతున్నా గ్రామాల్లో రేషన్ ద్వారా కార్డుదారుడికి నిత్యావసర సరుకులు సరఫరా కావడం లేదు. ప్రభుత్వం ఆగస్టు నుంచి ఎలక్ట్రానిక్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(ఈ-పీడీఎస్) విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో సరుకుల కేటాయింపు ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఈపీడీఎస్‌తో నిత్యావసర సరుకులు సరఫరా పటిష్టం అని ప్రభుత్వం భావించినా పరిస్థితి అందుకు భిన్నంగా కన్పిస్తోంది.
‘బోగస్ కార్డులకు’ కోటా కట్..
గత నెలలో ప్రభుత్వం బోగస్ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ చేపట్టింది. ఈ ఏరివేతలో బోగస్‌గా తేలిన కార్డులకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన కోటా విడుదల చేయలేదు. అయితే అధికారులు చేపట్టిన బోగస్ ఏరివేతలో అర్హులైన రేషన్ కార్డుదారులు ఉన్నారు. దీంతో వారు ఈ నెల రేషన్ కోల్పోవాల్సి వచ్చింది.
సెప్టెంబర్ నెల కోటా సరుకులు తీసుకువెళ్లేందుకు డీలర్ల వద్దకు వచ్చిన అర్హులైన కార్డుదారులు అధికారులు తొలగించారనే విషయం తెలియడంతో ఆందోళన చెందాల్సి వస్తోంది. ఈ ఏరివేతలో చనిపోయిన వారి పేర్లు, వలసలు వెళ్లిన వారి పేర్లు తొలగించారు. జిల్లాలో సుమారు 83,887 రేషన్ కార్డులు బోగస్ గుర్తించి తొలగించారు. వీటికి సెప్టెంబర్ నెల కోటా సరుకుల కేటాయింపు నిలుపుదల చేశారు.
సరఫరా నిలిచింది.. - ఆనంద్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మేనేజరు
నిత్యావసర సరుకులతోపాటు పంపిణీ చేసే పామోలిన్ సరఫరా ప్రభుత్వం నుంచే రావడం లేదు. మే నెల నుంచి సెప్టెంబర్ వరకు ఐదు నెలలుగా పామోలిన్ జిల్లాకు రాలేదు. ప్రభుత్వం నుంచి సరఫరా అయితే తప్పకుండా కార్డుదారులకు పంపిణీ చేస్తాం.
మూడంటే మూడే..!
Published Mon, Sep 8 2014 1:23 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement