అధికార పార్టీ అండ ఉంటే ఎంతటి అక్రమమైనా సునాయాసంగా సాగిపోతుందనడానికి రేషన్ బియ్యం మాఫియా ఆగడాలే నిదర్శనం. చిలకలూరిపేట నియోజకవర్గం, పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాలో యథేచ్ఛగా సాగిపోతున్న అక్రమబియ్యం వ్యాపారానికి అధికారపార్టీ నేతల అండదండలు, కాసులకు కక్కుర్తిపడిన అధికారుల సహకారం అనుకూలంగా మారింది.
చిలకలూరిపేట : పేదల బియ్యం అమ్ముకుంటున్న రేషన్ మాఫియా రూ. కోట్లు గడిస్తోంది. డీలర్ల నుంచి కిలో తొమ్మిది రూపాయల వంతున బియ్యం కొనుగోలు చేసి, ఆ తరువాత పాలిష్ పట్టించి రూ. 21 వంతున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వినుకొండకు చెందిన ఓ వ్యాపారి, చిలకలూరిపేట నియోజకవర్గంలో ముగ్గురు వ్యాపారులు, కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు ఈ వ్యాపారంలో సిద్ధహస్తులని పేరుంది.
నెలలో మూడో తేదీ నుంచి 20 వరకు ప్రకాశం జిల్లా కోనంకి, ఉప్పుమాగులూరు, చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెం, యడవల్లి, మిట్టపాలెం, ఈవూరివారిపాలెం గ్రామాలకు సంబంధించి నాదెండ్లలోని వినాయకుని గుడి సమీపంలో, యడ్లపాడులో జాలాది బ్రిడ్జి, కారుచోల, పట్టణంలోని బాలాజీ థియేటర్ సెంటర్, చెరువుకు వెళ్లేదారిలో రాత్రి 11 గంటల నుంచి రెండు గంటల వరకు లోడింగ్ చేస్తుంటారు. రెండు గంటల తర్వాత బియ్యం లారీలు రోడ్డుపైకి వచ్చేలా ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి గుంటూరు, విజయవాడ, గన్నవరం మీదుగా తాడేపల్లిగూడెం, మండపేటలోని మిల్లులకు రీసైక్లింగ్ కోసం తరలిస్తారు. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి నెలకు 30 లారీలు, ప్రకాశం జిల్లా నుంచి మరో 30 లారీలు తరలి వెళ్తుంటాయి. లారీకి 170 క్వింటాళ్ల చొప్పున బియ్యం లోడ్ చేస్తారు. ఇలా కోట్ల రూపాయలు అక్రమవ్యాపారుల జేబుల్లోకి చేరుకుంటున్నాయి.
అధికారులకు నజరానా ...
లారీలు లోడ్ చేస్తున్న సమయంలో బీటు పోలీసులు, హోంగార్డులు కనబడితే వెయ్యి నుంచి ఐదు వేల వరకు అందజేస్తారు. ఈ మొత్తాల కోసమే రాత్రి బీటు చేయటానికి కొంతమంది పోలీసులు పోటీపడుతున్నారు. రోడ్డు మీదకు చేరుకోవటానికి చెక్‌పోస్టు వారికి లారీకి రూ. వెయ్యి అందిస్తారు.
టోల్‌ప్లాజా వద్ద నుంచి గన్నవరం వరకు తరలిపోవటానికి లారీ ఒక్కింటికి రూ. 1500 చొప్పున సేల్స్‌ట్యాక్స్ అధికారికి అందజేస్తుంటారు. గతంలో గుంటూరులో విధులు నిర్వహించి ప్రస్తుతం కావలిలో పనిచేస్తున్న వాణిజ్యపన్నుల అధికారి ఒకరు ఫోన్ల ద్వారా తమ శాఖ అధికారులకు సూచనలు అందజేస్తుంటారని తెలిసింది. నాదెండ్ల మండలం నుంచి లారీలు బయటకు రావటానికి ఓ అధికారికి 50 వేలు, పట్టణ, రూరల్ పరిధి నుంచి బయటపడటానికి మరో అధికారికి లక్ష రూపాయలు ముట్టజెప్తున్నట్లు సమాచారం. వీటితో పాటు పట్టణానికి చెందిన అధికార పార్టీ యువ నాయకుడికి ప్రతి నెలా, ప్రతి వ్యాపారి లక్ష రూపాయలు అందజేయాల్సి ఉంటుందని సమాచారం.
పెద్దలపై చర్యలేవీ....?
పోలీసు ఉన్నతాధికారులకు అందే సమాచారం మేరకు స్థానిక అధికారులు అక్రమ బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. ఇందులో లారీడ్రైవర్లను మాత్రమే అరెస్టు చేసి బియ్యం వ్యాపారులను వదిలివేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 22 తెల్లవారు జామున పట్టణంలోని సింగ్‌నగర్‌లో ఆరుగురిపై కేసు నమోదు చేసి నలుగురిని మాత్రమే అరెస్టు చేశారు.
అసలు వ్యాపారం చేసేవారిని ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఎఫ్‌ఐఆర్‌లో అందరు నిందితుల వివరాలు పొందుపరిచిన పోలీసులు ఆ ఇద్దరి పేర్లకు సంబంధించి కనీసం ఇంటిపేర్లు, వయస్సు, తండ్రిపేర్లు పేర్కొనకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల యడ్లపాడు మండలం బోయపాలెం వద్ద స్వాధీనం చేసుకున్న నాలుగు లారీల అక్రమ రేషన్ బియ్యం కేసులో కూడా సూత్రధారులను అరెస్టు చేయలేదు. గతంలో వినుకొండకు చెందిన బియ్యం వ్యాపారి బెయిల్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకున్నాక తీరికగా అరెస్టు చేశారు. దీనిని బట్టి ఇక్కడ అధికారులు అక్రమార్కులకు ఎంతగా సహకారమందిస్తున్నారన్నది తేటతెల్లమవుతోంది.
పేదల పొట్టలు కొట్టి..రూ. కోట్లు ఆర్జన !
Published Thu, Mar 5 2015 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM
Advertisement