కోటా బియ్యానికి కోటింగ్! | Quoting rice quota! | Sakshi
Sakshi News home page

కోటా బియ్యానికి కోటింగ్!

Published Sun, Dec 7 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

కోటా బియ్యానికి కోటింగ్!

కోటా బియ్యానికి కోటింగ్!

సన్న బియ్యం పేరుతో కోటా బియ్యం విక్రయాలు
దండిగా లాభాలు ఆర్జిస్తున్న వ్యాపారులు
కన్నెత్తి చూడని పౌరసరఫరాల శాఖ

 
నక్కపల్లి/ నక్కపల్లి రూరల్ : మిల్లర్లకు కాలం కలిసొచ్చింది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు ఈ వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. ట్రేడింగ్ మిల్లుల్లో తక్కువ ధరకు సన్నబియ్యం విక్రయించవచ్చన్న ఆదేశం మిల్లర్లను మరిన్ని అక్రమాలకు పురిగొల్పినట్టయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సన్నబియ్యంలో రేషన్ బియ్యం కలిపేస్తున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల హుద్‌హుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ప్రభుత్వం ఉచితంగా 25, 50కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసింది. జిల్లావ్యాప్తంగా వేలాది టన్నుల కోటాబియ్యం పంపిణీ జరిగింది. ఈ బియ్యాన్ని కార్డుహోల్డర్ల నుంచి కొంతమంది అక్రమవ్యాపారులు, రైసుమిల్లర్లు కొనుగోలు చేశారు. ఇవే బియ్యాన్ని రీ సైక్లింగ్‌తో సన్నబియ్యం, సాంబమసూరు, సోనామసూరు,  ఆర్‌జీఎల్ తదితర రకాలపేరుతో సంచులు మార్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రేడింగ్ మిల్లుల నుంచి లెవీ తగ్గించి రు.30లకే సన్న అమ్మాలనే ప్రభుత్వ ఆదేశాలతో మిల్లర్లు బాగానే సొమ్ము చేసుకుంటున్నారు.

సన్నబియ్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే  రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్న బియ్యాన్ని రీసైక్లింగ్‌చేసి మా ర్కెట్‌లో సాధారణ బియ్యం మాదిరిగా విక్రయిస్తున్న మిల్లర్లకు సన్నబియ్యం అమ్మకాలు చేయమన్న ప్రభుత్వ ఆదేశాలు కొండంత అండనిస్తున్నాయి. ప్రస్తుతం నాణ్యమైన సాంబమసూరి, సోనామసూరి, బీపీటీ సన్నాల బియ్యం ధరలు మార్కెట్‌లో క్వింటా రు.4వేల వరకు అమ్ముతున్నారు. మిల్లర్లు రైతుల వద్ద సాంబమసూరి, ఆర్‌జీఎల్ తదితర రకాల 75కిలోల బస్తారూ.1400నుంచి 1500లకు  కొనుగోలుచేస్తున్నారు. రేషన్ దుకాణాల ద్వారా సేకరించిన బియ్యాన్ని సన్నబియ్యంతో కలిపి విక్రయించడంతో మిల్లర్లకు దండిగా లాభాలు వస్తున్నాయన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
 రూ. 30లకే సన్నబియ్యం సాధ్యమేనా...
 మిల్లర్లు, వ్యాపారస్తులు రైతుల నుంచి సాంబమసూరి, సోనామసూరి ఆర్‌జీఎల్ తదితర ధాన్యం రకాలను 75 కేజీల బస్తాను రు.1500ల వరకు కొనుగోలుచేస్తున్నారు. సన్నబియ్యం రకాల దిగుబడి ట్రేడింగ్ మిల్లుల్లో 150 కేజీల ధాన్యంకు 85 నుంచి 90 కేజీల వరకు బియ్యం దిగుబడి ఉంటోంది. క్వింటాలు సన్నబియ్యం ఉత్పత్తికి మిల్లర్లకు, వ్యాపారస్తులకు రు.3500ల నుంచి4వేలు వరకు (కొనుగోలు, మిల్లింగ్‌కు కలిపి) ఖర్చవుతోంది.  ఈ పరిస్థితుల్లో వ్యాపారస్తులు, మిల్లర్లు  కేజీ రు.30లకే (క్వింటా రు.3వేలు) సన్నబియ్యం అమ్మకాలు ఏవిధంగా చేస్తున్నారన్న ప్రశ్నలకు రేషన్ బియ్యమే సమాధానమిస్తున్నాయన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.     

సన్నబియ్యంలో కల్తీ ఏవిధంగా అంటే....

సన్నబియ్యం ధాన్యం రకాలను 6బస్తాలను మిల్లింగ్‌చేసి ఒక లేయర్ (గీటర్) తొలగిస్తారు.  ఈ బియ్యాన్ని ఒక నెట్టెగా వేసి 5రోజులపాటు నిల్వ ఉంచుతారు.  కొద్దిగా ముక్కిన తర్వాత ఒక రెండు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కలిపి మళ్లీ మిల్లింగ్ చేసి పాలిష్‌పెడతారు. ఈ విధంగా పాలిష్‌చేసిన బియ్యాన్ని సన్నబియ్యంగా అమ్మకానికి ఉంచుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పరోక్షంగా రేషన్ బియ్యాన్నే సన్నబియ్యంగా ప్రజలచే కొనుగోలుచేయిస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.  

పర్యవేక్షణ లేదు...

 సన్నబియ్యం అమ్మకాలు ప్రారంభించిన అధికారులు పర్యవేక్షణ విషయాన్ని పక్కనబెట్టారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.  మిల్లర్లు ఏ బియ్యాన్ని అమ్ముతున్నారన్న విషయమై తనిఖీలు కూడా లేకపోవడం గమనార్హం.   ప్రస్తుతం మిల్లర్లు అమ్ముతున్న సన్నబియ్యం రకాలను తేమ, నూకల శాతం పరీక్షించినట్టయితే వాస్తవాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పౌర సరఫరా శాఖ అధికారులు, రెవిన్యూ పర్యవేక్షణలో మిల్లింగ్‌చేసి సన్నబియ్యాన్ని విక్రయించడం ద్వారా వినియోగదారులకు ప్రయోజనం జరిగే అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. నాన్‌ట్రేడి ంగ్ మిల్లుల్లో ట్రేడింగ్ చేయడానికి వీల్లేదు.

500కు పైగా రైసు మిల్లులు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా నాన్‌ట్రేడింగ్ మిల్లులే. ఈ మిల్లుల్లో కేవలం రైతువారీ ధాన్యాన్ని మాత్రమే మిల్లింగ్ చేయాలి. వీటిలోచాలా చోట్ల ట్రేడింగ్ (మిల్లింగ్, విక్రయాలు) జరుగుతున్నా పౌరసరఫరా శాఖ అధికారులు  పట్టించుకోకపోవడవం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతినెలా మిల్లర్ల నుంచి లక్షలాది రూపాయల మామూళ్లు అందడంవల్లే అధికారులు ఈ అక్రమాలపై కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు తలెత్తుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement