కదిలిన అధికార గణం..
- రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై విస్తృతంగా సోదాలు
- ఆదిలాబాద్‌లో రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు
- మహారాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు.. పలుచోట్ల బియ్యం పట్టివేత
- రాష్ట్రవ్యాప్తంగా దందాకు చెక్ పెట్టేందుకు విజిలెన్స్ సన్నద్ధం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్/హైదరాబాద్: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన ‘లారీ.. లారీ.. నడుమ దళారీ’ కథనం పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ వర్గాల్లో కదలికతెచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ పట్టణాల్లోని పలుచోట్ల సోదాలు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సహాయ సరఫరాల అధికారి(ఏఎస్‌వో) జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఐదుగురు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మహారాష్ట్ర సరిహద్దుల్లోని అంతర్గావ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. జన్నారం మండలం ఇందన్‌పల్లి వద్ద పోలీసులు బియ్యాన్ని తరలిస్తున్న ఓ ఆటోను సీజ్ చేశారు. మంచిర్యాలలోని ఎన్టీఆర్ కాలనీలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 10.50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.
హోటళ్లు, ప్రైవేటు హాస్టళ్లకూ రేషన్ బియ్యమే
రేషన్ బియ్యం హోటళ్లు, ప్రైవేటు హాస్టళ్లకు కూడా తరలుతోంది. హోటళ్లు, హాస్టళ్లలో బియ్యం పిండితో చేసే దోశ, రొట్టెలు, ఇతర వంటకాలకు ఈ బియ్యాన్నే వాడుతున్నారు. లబ్ధిదారుల నుంచి కిలో బియ్యాన్ని రూ.10 నుంచి రూ.12కు కొనుగోలు చేస్తున్న దళారులు దీన్ని ప్రైవేటు వ్యాపారులకు రూ.15కు విక్రయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ దందా కొనసాగుతున్నా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. నిఘా వర్గాలు చెబుతున్న మేరకు... ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే ఏటా 6 వేల నుంచి 10 వేల టన్నుల బియ్యం పక్కదారి పడుతోంది. దాని విలువ సుమారు రూ.15 నుంచి రూ.20 కోట్ల వరకు ఉంటుంద ని పేర్కొంటున్నారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దందాను కలుపుకుంటే దాని విలువ రూ.150 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. అక్రమాల్లో డీలర్ల పాత్రే ఎక్కువగా ఉండటంతో ఇటీవల జంట నగరాల పరిధిలో విసృ్తత తనిఖీలు చేశారు. ఇందులో ఒక్క రంగారెడ్డిలోనే 6(ఏ) కింద 400 కేసులు, మరో 90 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో పౌర సరఫరాల శాఖ ద్వారా గోధుమలను మాత్రమే సరఫరా చేస్తున్నారు. రాయితీ బియ్యం ఇవ్వడం లేదు. దీంతో రాష్ట్ర వ్యాపారులు ఇక్కడి రాయితీ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా వాంకిడి, భోరజ్ చెక్‌పోస్టుల నుంచి, నిజామాబాద్ జిల్లాలోని మద్నూర్ సరిహద్దుల నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. అలాగే మహబూబ్‌నగర్ నుంచి రాయచూర్ మీదుగా కర్ణాటకకు, నల్లగొండ జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఈ దందాపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.
మొత్తం ఆన్‌లైన్ చేస్తాం
రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాలను సమకూర్చుతాం. దీంతోపాటు ‘సరఫరా వ్యవస్థ నిర్వహణ’ (సప్లై చైన్ మేనేజ్‌మెంట్)ను అమలు చేస్తాం. సరకుల సరఫరా మొదలు పంపిణీ వరకు మొత్తం ఆన్‌లైన్ ద్వారా జరిగేలా చర్యలు చేపడతాం. రాష్ట్రంలోని 172 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. జీపీఎస్ వ్యవస్థ ద్వారా అక్రమ రవాణాను అరికడతాం.
- సీవీ ఆనంద్, పౌరసరఫరాల శాఖ కమిషనర్