CV Anand
-
HYD: నగరంలో నెల రోజులపాటు ఆంక్షలు..కారణమిదే..
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో నెలరోజుల పాటు ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు,పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం ఉన్నందునే ఆంక్షలు విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.నవంబర్ 28 సాయంత్రం ఆరు గంటల దాకా నెల రోజులు సభలు,సమావేశాలు,ధర్నాలు,రాస్తారోకోలు,ర్యాలీలపై నిషేదం విధిస్తున్నట్లు తెలిపారు. ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బీఎన్ఎస్ సెక్షన్ 163(పాత సీఆర్పీసీ 144 సెక్షన్) కింద ఆంక్షలు విధించినట్లు ఆదేశాల్లో తెలిపారు.కాగా, ఇటీవల సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ గుడిపై దాడి ఘటన తర్వాత అల్లర్లు జరగడం తెలిసిందే. దీనికి తోడు గ్రూప్-1 విద్యార్థులు, మూసీ నిర్వాసితులు, బెటాలియన్ పోలీసుల వరుస ఆందోళనలతో హైదరాబాద్‌లో పోలీసులకు శాంతిభద్రతల నిర్వహణ సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో తాజా ఆంక్షలు విధించినట్లు సమాచారం. ఇదీ చదవండి: జన్వాడ రేవ్‌పార్టీ సంచలనం.. అర్ధరాత్రి పోలీసులకు ఆదేశాలు -
కొత్వాల్ సాబ్ జర దేఖో!
నగరవాసికి ట్రాఫిక్ నరకం చూపిస్తోంది. ఎక్కడపడితే అక్కడ ఉల్లంఘనలు, ఎప్పుడుపడితే అప్పుడు ట్రాఫిక్‌జాంలు తప్పట్లేదు. వాహనాలను నియంత్రించాల్సిన ట్రాఫిక్ విభాగం సిబ్బంది కెమెరాలు, ట్యాబ్‌లు చేతపట్టి ఈ–చలాన్లకే పరిమితమవుతున్నారు. చౌరస్తాలతో పాటు కొన్ని ప్రాంతాల్లోనే ఉంటూ ఈ డ్రైవ్స్ చేస్తున్నారు. దీంతో మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడిక్కడ ఉల్లంఘనులు రెచ్చిపోతున్నారు. రహదారులపై దూసుకుపోతున్నా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనల్ని ప్రధానంగా మూడు కేటగిరీలుగా విభజిస్తారు. వాహనం నడిపే వ్యక్తికి ముప్పు కలిగించేవి, ఎదుటి వారికి ముప్పుగా మారేవి, వాహన చోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ముప్పును తెచి్చపెట్టేవి. ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్.. ఇలా ఇవన్నీ మూడో కేటగిరీ కిందికి వస్తాయి. రాజధానిలో మూడో కేటగిరీకి చెందిన ఉల్లంఘనలే ఎక్కువగా ఉంటున్నాయి. రెండోసారి సిటీ కొత్వాల్‌గా వచ్చిన సీవీ ఆనంద్‌కు ట్రాఫిక్ విభాగంపై మంచి పట్టుంది. గతంలో సుదీర్ఘకాలం సిటీ ట్రాఫిక్ చీఫ్‌గా వ్యవహరించారు. అప్పట్లో ఆయన వేసుకున్న మార్కు ఇప్పటికీ పదిలమే. సైబరాబాద్, హైదరాబాద్ సీపీలుగా పని చేసినప్పుడూ అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ట్రాఫిక్‌పై సీపీ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నగర వాసులు కోరుతున్నారు. -
వివాదాస్పదమైన ‘మధురానగర్ ఠాణా’ వ్యవహారం
సాక్షి, హైదరాబాద్: ‘చట్టం ముందు అంతా సమానులే... కొందరు మాత్రం ఎక్కువ సమానులు’ ఈ మాటను తరచూ వింటూనే ఉంటాం. ప్రస్తుతం నగర కమిషనరేట్‌లో మరో మాట జోరుగా వినిపిస్తోంది. అదే ‘పోలీసు విభాగం క్రమశిక్షణ కలిగిన ఫోర్స్... ఆ క్రమశిక్షణ కింది స్థాయి వారికే పరిమితం’. 👉పశ్చిమ మండల పరిధిలోని మధురానగర్ ఠాణాలో గత నెల 28న చోటు చేసుకున్న పరిణామం, దీనిపై అత్యున్నతాధికారి వ్యవహరించిన తీరే ఇందుకు కారణం. దీనిపై కింది స్థాయి సిబ్బంది తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఉన్నతాధికారి–కానిస్టేబుల్ పరస్పరం దూషించుకుంటే కేవలం కింది స్థాయి సిబ్బంది పైనే చర్యలు తీసుకున్నా పోలీసు అధికారుల సంఘం పట్టించుకోకపోవడాన్ని తప్పు పడుతున్నారు. కొత్త కొత్వాల్ సీవీ ఆనంద్ మధురానగర్ ఠాణా కానిస్టేబుల్‌తో పాటు ఇలా అన్యాయమైన ఇతర సిబ్బంది, అధికారులకు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వారి విధులూ ఆయనే నిర్వర్తిస్తూ... వెస్ట్‌జోన్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి ‘అన్ని హోదాల ఉద్యోగాలూ’ ఆయనే చేస్తున్నారనే ఆరోపణ ఉంది. ఇందులో భాగంగా మధురానగర్ పోలీస్ స్టేషన్లో గత నెలలో రోల్‌కాల్ నిర్వహించారు. సాధారణంగా ఇలాంటివి ఆ ఠాణా స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (ఎస్హెచ్ఓ) ఉండే ఇన్స్పెక్టర్.. కీలక సందర్భాల్లో డివిజన్ ఏసీపీ నిర్వహిస్తుంటారు. దీనికి భిన్నంగా ఈ డ్యూటీ చేయడానికీ రంగంలోకి దిగిన ఉన్నతాధికారి ఆ రోజు ఉదయం 10.30 గంటలకు రోల్‌కాల్ అంటూ సిబ్బందికి ఉదయం 9.19 నిమిషాలకు సమాచారం పంపారు. నిర్దేశిత సమయానికి ఉన్నతాధికారి ఠాణాకు చేరుకున్నారు. అయితే డి.తిరుపాల్ నాయక్ అనే కానిస్టేబుల్ మాత్రం అనివార్య కారణాల వల్ల కొద్దిగా ఆలస్యంగా వచ్చారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు ఉన్నతాధికారి ‘యూజ్ లెస్ ఫెలో... డ్యూటీ ఇలాగేనా చేసేది.. పోలీసు డ్యూటీ అనుకున్నావా..? గాడిదలు కాసే పని అనుకున్నావా..?’ అంటూ తనదైన పంథాలో ఊగిపోతూ దూషించారు. పేరుకు విచారణ... వేటు కానిస్టేబుల్ పైనే... ఈ వ్యవహారం అప్పటి అత్యున్నత అధికారి దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. అయితే ఈ విచారణ మొత్తం ఏకపక్షంగా జరిగిందని సిబ్బంది వాపోతున్నారు. తిరుపాల్‌ను మొదట ఉన్నతాధికారి దూషించారని, ఆ తర్వాతే తిరుపాల్ ఎదురు తిరిగాడని తెలిసినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. కేవలం కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారం మొత్తం తెలిసినప్పటికీ నగర పోలీసు అధికారుల సంఘం కూడా పట్టించుకోలేదు. కేవలం ఉన్నతాధికారులను అభినందించడానికి, అత్యున్నతాధికారికి బొకేలు ఇవ్వడానికే సంఘం నేతలు పరిమితం అయ్యారని విమర్శిస్తున్నారు. కనీసం కానిస్టేబుల్‌కు మద్దతుగా ఒక్క ప్రకటన కూడా చేయని సంఘం నేతల వ్యవహారశైలిని తప్పుపడుతున్నారు. ఈ వ్యవహారంపై కొత్త కమిషనర్ అయినా దృష్టి పెట్టాలని, కానిస్టేబుల్ తిరుపాల్‌తో పాటు ఇలా ఇబ్బందులు పాలైన అనేక మంది సిబ్బంది, అధికారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. సంజాయిషీ ఇస్తున్నా పట్టించుకోకుండా... అప్పటి వరకు సాధారణ దుస్తుల్లో ఉన్న సదరు కానిస్టేబుల్ సంజాయిషీ ఇవ్వడానికి ప్రయతి్నంచినా ఆయన పట్టించుకోలేదు. దీంతో తిరుపాల్ నాయక్ స్టేషన్ గదిలోకి వెళ్లి యూనిఫాం వేసుకుని బయటకు వచ్చారు. అప్పటికే ఆ ఉన్నతాధికారి వ్యవహారశైలిపై అనేక విమర్శలు ఉన్నాయి. వెస్ట్‌జోన్‌లో కానిస్టేబుల్ నుంచి అదనపు డీసీపీ వరకు ఆయన పేరు చెప్తే హడలిపోతారు. ఈ పరిణామాలకు తోడు తీవ్ర ఆవేదనలో ఉన్న తిరుపాల్... ‘నువ్వే యూజ్లెస్ ఫెలోరా..! ఎన్ని మాటలు అంటావురా నన్ను... బయట పని చేస్తే ఇంత కంటే ఎక్కువ జీతం వస్తుందిరా.. నా భార్యకు డెలివరీ అయితే ఆమెను చూసుకుంటున్నారా. ఆమెను నేను కాకుంటే ఎవరు చూసుకుంటార్రా..? చెప్తే అర్థం చేసుకోకుండా దూషిస్తున్నావు’ అంటూ తిరిగి ఘాటుగా సమాధానం ఇచ్చారు. -
అసలు కథ ఇప్పుడే మొదలైంది.. ఎమ్మెల్యేల ఎపిసోడ్లో కీలక ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. కాగా, ఈ ఎపిసోడ్‌పై తెలంగాణ ప్రభుత్వం సీట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక, గురువారం మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులను చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. వారిని రెండు రోజుల పాటు విచారించనున్నారు. ఇక, రాజేంద్రనగర్ ఏసీపీ ఆఫీసులో సిట్ కార్యాలయం సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. సిట్ సభ్యులుగా నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరీ, డీసీపీ కల్మేశ్వర్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో లక్ష్మీరెడ్డిలను నియమించింది. -
హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్
-
దొడ్డు అన్నం తినేదెట్లా..?
సాక్షి, యాదాద్రి : వివిధ వర్గాలు, అధికారుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు సివిల్సప్లై కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలతో రెండు రోజులుగా జిల్లాలో రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో వరుస దాడులు జరిగాయి. గురువారం సివిల్సప్లై టాస్క్ పోర్స్ ఎస్పీ నాగోబారావు ఆధ్వర్యంలో జిల్లాలో పలు చోట్ల ఆకస్మిక దాడులు, తనిఖీలు నిర్వహించారు. నాసిరకం భోజనం పెడుతున్నారని భువనగిరి సాంఘిక సం క్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు పాఠశాలను తనిఖీ చేసినప్పుడు విద్యార్థులు మెనూ విషయంలో పలు ఫిర్యాదులు చేశారు. దొడ్డు బియ్యం అన్నం, నీళ్లచారుతో కడుపునిండా తినలేకపోతున్నామని అధికారుల ముందు వారు వాపోయారు. మెనూ పాటిం చడం లేదని ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. సన్నబియ్యంతో నాణ్యమైన కూరగాయలతో మంచి భోజనం పెట్టించాలని విద్యార్థులు ఎన్ఫోర్స్మెంట్ అధికారులను వేడుకున్నారు. అలాగే పాఠశాల రికార్డుల్లో ఉన్న విధంగా 577 మంది విద్యార్థుల్లో 16 మంది విద్యార్థులు రావడం లేదని తేలింది. వారందరిని రప్పించాలని ప్రిన్సిపాల్‌ను అదేశించారు. ఆత్మకూర్ఎం మండలం ముత్తిరెడ్డిగూడెంలో పీవీఎన్రెడ్డికి చెందిన హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో తనిఖీ చేశారు. అనంతరం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రేషన్‌దుకాణంలో తనిఖీ నిర్వహించారు. అలాగే బుధవారం బీబీనగర్ మండలం భట్టుగూడెం కాదంబరి రైస్ మిల్‌పై 6 ఏ కేసు నమోదు చేశారు. కస్టం మిల్లింగ్ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం, మిల్లులో ఉన్న స్టాక్‌కు తేడాను గుర్తించి మిల్లుపై కేసు నమోదు చేశారు. భువనగిరిలోని యాదాద్రి మిల్లులో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో తూనికల కొలతల జిల్లా అధికారి శ్రీనివాసరావు, అధికారులు జనార్ధన్‌రెడ్డి, కాశప్ప, వెంకట్‌రెడ్డిలు ఉన్నారు. -
రెస్టారెంట్లలో సర్వీసు చార్జీ చట్ట వ్యతిరేకం: సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగదారుల బిల్లులో అదనంగా సేవా రుసుం (సర్వీస్ చార్జీ) వేయడానికి వీల్లేదని, ఇది చట్ట వ్యతిరేకమని పౌర సరఫరాల శాఖ కమిషనర్, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. సర్వీసు చార్జీని బిల్లులో అదనంగా వేస్తే వినియోగ దారుల చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హోటల్ యజమానులను హెచ్చరించారు. ఈ నెల 13 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లలో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. వినియోగదారుల నుంచి సర్వీసు చార్జీల వసూలుపై ఫిర్యాదులు రావడంతో కమిషనర్ ఆనంద్ హోటల్స్ అసోసియే షన్ ప్రతినిధులతో శనివారం పౌర సరఫరాల భవన్లో సమావేశం నిర్వహించారు. వినియోగదారుడికిచ్చే బిల్లులో సర్వీసు చార్జీ స్వచ్ఛందంగా చెల్లించే అంశం అని స్పష్టంగా పేర్కొనాలని, ఆ అంశం దగ్గర ఎటువంటి రుసుం పేర్కొనకుండా ఖాళీగా వదిలేయాలని, దానిని వినియోగదారుడు బిల్లు చెల్లించే సమయంలో తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకుంటాడని సూచించారు. బలవంతంగా సర్వీసు చార్జీలు వసూలు చేస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి ఆ కేసులను రాష్ట్ర వినియోగదారుల ఫోరానికి అప్పగిస్తామ న్నారు. ఈ విషయంలో కేంద్ర మార్గదర్శకాలను పాటించాల న్నారు. సర్వీసు చార్జీల వసూలుపై వినియోగ దారులు పౌరసరఫరాల శాఖ వాట్సాప్ నంబర్ 7330774444తో పాటు తూనికల కొలతల శాఖ 9490165619 నంబర్లకు ఫిర్యాదులు చేయొచ్చని పేర్కొన్నారు. -
కదిలిన అధికార గణం..
- రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై విస్తృతంగా సోదాలు - ఆదిలాబాద్‌లో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు - మహారాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు.. పలుచోట్ల బియ్యం పట్టివేత - రాష్ట్రవ్యాప్తంగా దందాకు చెక్ పెట్టేందుకు విజిలెన్స్ సన్నద్ధం సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్/హైదరాబాద్: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన ‘లారీ.. లారీ.. నడుమ దళారీ’ కథనం పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ వర్గాల్లో కదలికతెచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ పట్టణాల్లోని పలుచోట్ల సోదాలు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ విభాగం సహాయ సరఫరాల అధికారి(ఏఎస్వో) జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఐదుగురు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మహారాష్ట్ర సరిహద్దుల్లోని అంతర్గావ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. జన్నారం మండలం ఇందన్పల్లి వద్ద పోలీసులు బియ్యాన్ని తరలిస్తున్న ఓ ఆటోను సీజ్ చేశారు. మంచిర్యాలలోని ఎన్టీఆర్ కాలనీలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 10.50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. హోటళ్లు, ప్రైవేటు హాస్టళ్లకూ రేషన్ బియ్యమే రేషన్ బియ్యం హోటళ్లు, ప్రైవేటు హాస్టళ్లకు కూడా తరలుతోంది. హోటళ్లు, హాస్టళ్లలో బియ్యం పిండితో చేసే దోశ, రొట్టెలు, ఇతర వంటకాలకు ఈ బియ్యాన్నే వాడుతున్నారు. లబ్ధిదారుల నుంచి కిలో బియ్యాన్ని రూ.10 నుంచి రూ.12కు కొనుగోలు చేస్తున్న దళారులు దీన్ని ప్రైవేటు వ్యాపారులకు రూ.15కు విక్రయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ దందా కొనసాగుతున్నా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. నిఘా వర్గాలు చెబుతున్న మేరకు... ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే ఏటా 6 వేల నుంచి 10 వేల టన్నుల బియ్యం పక్కదారి పడుతోంది. దాని విలువ సుమారు రూ.15 నుంచి రూ.20 కోట్ల వరకు ఉంటుంద ని పేర్కొంటున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దందాను కలుపుకుంటే దాని విలువ రూ.150 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. అక్రమాల్లో డీలర్ల పాత్రే ఎక్కువగా ఉండటంతో ఇటీవల జంట నగరాల పరిధిలో విసృ్తత తనిఖీలు చేశారు. ఇందులో ఒక్క రంగారెడ్డిలోనే 6(ఏ) కింద 400 కేసులు, మరో 90 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో పౌర సరఫరాల శాఖ ద్వారా గోధుమలను మాత్రమే సరఫరా చేస్తున్నారు. రాయితీ బియ్యం ఇవ్వడం లేదు. దీంతో రాష్ట్ర వ్యాపారులు ఇక్కడి రాయితీ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా వాంకిడి, భోరజ్ చెక్‌పోస్టుల నుంచి, నిజామాబాద్ జిల్లాలోని మద్నూర్ సరిహద్దుల నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. అలాగే మహబూబ్‌నగర్ నుంచి రాయచూర్ మీదుగా కర్ణాటకకు, నల్లగొండ జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఈ దందాపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. మొత్తం ఆన్లైన్ చేస్తాం రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాలను సమకూర్చుతాం. దీంతోపాటు ‘సరఫరా వ్యవస్థ నిర్వహణ’ (సప్లై చైన్ మేనేజ్మెంట్)ను అమలు చేస్తాం. సరకుల సరఫరా మొదలు పంపిణీ వరకు మొత్తం ఆన్లైన్ ద్వారా జరిగేలా చర్యలు చేపడతాం. రాష్ట్రంలోని 172 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. జీపీఎస్ వ్యవస్థ ద్వారా అక్రమ రవాణాను అరికడతాం. - సీవీ ఆనంద్, పౌరసరఫరాల శాఖ కమిషనర్