వివాదాస్పదమైన ‘మధురానగర్‌ ఠాణా’ వ్యవహారం | Controversy In Madhura Nagar Police Station Hyderabad, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

వివాదాస్పదమైన ‘మధురానగర్‌ ఠాణా’ వ్యవహారం

Published Tue, Sep 10 2024 1:02 PM | Last Updated on Tue, Sep 10 2024 5:12 PM

Controversial In Maduranagar Police Station Hyderabad

గత నెలలో ఉన్నతాధికారి, కానిస్టేబుల్‌ మధ్య వాగ్వాదం 

అధికారి దూషించడంతో ఆవేదనతో తిరగబడిన పీసీ 

కేవలం కానిస్టేబుల్‌ పైనే చర్యలు తీసుకుంటూ సస్పెన్షన్‌ 

ఉన్నతాధికారిని ఎందుకు వదిలేశారని ప్రశి్నస్తున్న సిబ్బంది 

పట్టనట్లు వ్యవహరిస్తున్న పోలీసు అధికారుల సంఘం 

కొత్త కొత్వాల్‌పై అధికారులు, సిబ్బంది ఆశలు

సాక్షి, హైదరాబాద్: ‘చట్టం ముందు అంతా సమానులే... కొందరు మాత్రం ఎక్కువ సమానులు’ ఈ మాటను తరచూ వింటూనే ఉంటాం. ప్రస్తుతం నగర కమిషనరేట్‌లో మరో మాట జోరుగా వినిపిస్తోంది. అదే ‘పోలీసు విభాగం క్రమశిక్షణ కలిగిన ఫోర్స్‌... ఆ క్రమశిక్షణ కింది స్థాయి వారికే పరిమితం’.  

👉పశ్చిమ మండల పరిధిలోని మధురానగర్‌ ఠాణాలో గత నెల 28న చోటు చేసుకున్న పరిణామం, దీనిపై అత్యున్నతాధికారి వ్యవహరించిన తీరే ఇందుకు కారణం. దీనిపై కింది స్థాయి సిబ్బంది తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఉన్నతాధికారి–కానిస్టేబుల్‌ పరస్పరం దూషించుకుంటే కేవలం కింది స్థాయి సిబ్బంది పైనే చర్యలు తీసుకున్నా పోలీసు అధికారుల సంఘం పట్టించుకోకపోవడాన్ని తప్పు పడుతున్నారు. కొత్త కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ మధురానగర్‌ ఠాణా కానిస్టేబుల్‌తో పాటు ఇలా 
అన్యాయమైన ఇతర సిబ్బంది, అధికారులకు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

వారి విధులూ ఆయనే నిర్వర్తిస్తూ...  
వెస్ట్‌జోన్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి ‘అన్ని హోదాల ఉద్యోగాలూ’ ఆయనే చేస్తున్నారనే ఆరోపణ ఉంది. ఇందులో భాగంగా మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో గత నెలలో రోల్‌కాల్‌ నిర్వహించారు. సాధారణంగా ఇలాంటివి ఆ ఠాణా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌గా (ఎస్‌హెచ్‌ఓ) ఉండే ఇన్‌స్పెక్టర్‌.. కీలక సందర్భాల్లో డివిజన్‌ ఏసీపీ నిర్వహిస్తుంటారు. దీనికి భిన్నంగా ఈ డ్యూటీ చేయడానికీ రంగంలోకి దిగిన ఉన్నతాధికారి ఆ రోజు ఉదయం 10.30 గంటలకు రోల్‌కాల్‌ అంటూ సిబ్బందికి ఉదయం 9.19 నిమిషాలకు సమాచారం పంపారు. నిర్దేశిత సమయానికి ఉన్నతాధికారి ఠాణాకు చేరుకున్నారు. అయితే డి.తిరుపాల్‌ నాయక్‌ అనే కానిస్టేబుల్‌ మాత్రం అనివార్య కారణాల వల్ల కొద్దిగా ఆలస్యంగా వచ్చారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు ఉన్నతాధికారి ‘యూజ్‌ లెస్‌ ఫెలో... డ్యూటీ ఇలాగేనా చేసేది.. పోలీసు డ్యూటీ అనుకున్నావా..? గాడిదలు కాసే పని అనుకున్నావా..?’ అంటూ తనదైన పంథాలో ఊగిపోతూ దూషించారు.  

పేరుకు విచారణ... వేటు కానిస్టేబుల్‌ పైనే... 
ఈ వ్యవహారం అప్పటి అత్యున్నత అధికారి దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. అయితే ఈ విచారణ మొత్తం ఏకపక్షంగా జరిగిందని సిబ్బంది వాపోతున్నారు. తిరుపాల్‌ను మొదట ఉన్నతాధికారి దూషించారని, ఆ తర్వాతే తిరుపాల్‌ ఎదురు తిరిగాడని తెలిసినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. కేవలం కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశారు. ఈ వ్యవహారం మొత్తం తెలిసినప్పటికీ నగర పోలీసు అధికారుల సంఘం కూడా పట్టించుకోలేదు. కేవలం ఉన్నతాధికారులను అభినందించడానికి, అత్యున్నతాధికారికి బొకేలు ఇవ్వడానికే సంఘం నేతలు పరిమితం అయ్యారని విమర్శిస్తున్నారు. కనీసం కానిస్టేబుల్‌కు మద్దతుగా ఒక్క ప్రకటన కూడా  చేయని సంఘం నేతల వ్యవహారశైలిని తప్పుపడుతున్నారు. ఈ వ్యవహారంపై కొత్త కమిషనర్‌ అయినా దృష్టి పెట్టాలని, కానిస్టేబుల్‌ తిరుపాల్‌తో పాటు ఇలా ఇబ్బందులు పాలైన అనేక మంది సిబ్బంది, అధికారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.  

సంజాయిషీ ఇస్తున్నా పట్టించుకోకుండా... 
అప్పటి వరకు సాధారణ దుస్తుల్లో ఉన్న సదరు కానిస్టేబుల్‌ సంజాయిషీ ఇవ్వడానికి ప్రయతి్నంచినా ఆయన పట్టించుకోలేదు. దీంతో తిరుపాల్‌ నాయక్‌ స్టేషన్‌ గదిలోకి వెళ్లి యూనిఫాం వేసుకుని బయటకు వచ్చారు. అప్పటికే ఆ ఉన్నతాధికారి వ్యవహారశైలిపై అనేక విమర్శలు ఉన్నాయి. వెస్ట్‌జోన్‌లో కానిస్టేబుల్‌ నుంచి అదనపు డీసీపీ వరకు ఆయన పేరు చెప్తే హడలిపోతారు. ఈ పరిణామాలకు తోడు తీవ్ర ఆవేదనలో ఉన్న తిరుపాల్‌... ‘నువ్వే యూజ్‌లెస్‌ ఫెలోరా..! ఎన్ని మాటలు అంటావురా నన్ను... బయట పని చేస్తే ఇంత కంటే ఎక్కువ జీతం వస్తుందిరా.. నా భార్యకు డెలివరీ అయితే ఆమెను చూసుకుంటున్నారా. ఆమెను నేను కాకుంటే ఎవరు చూసుకుంటార్రా..? చెప్తే అర్థం చేసుకోకుండా దూషిస్తున్నావు’ అంటూ తిరిగి ఘాటుగా సమాధానం ఇచ్చారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement