
పోలీసులపై దౌర్జన్యం చేస్తున్న టీడీపీ వ్యక్తి
కానిస్టేబుళ్లపై టీడీపీ కార్యకర్త గురువారం దౌర్జన్యం
చిత్తూరు, గంగవరం: విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లపై టీడీపీ కార్యకర్త గురువారం దౌర్జన్యం చేసిన విషయం శుక్రవారం గంగవరం మండలంలో చర్చనీయాంశమైంది. ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో విధిలేక అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసుకానిస్టేబుళ్లు పరమేశ్వర్, శివ గురువారం పలమనేరు–మదనపల్లి జాతీయ రహదారిలోని మబ్బువాళ్లపేట వద్ద వాహనదారులకు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు.
ఆ సమయంలో పెద్దపంజాణి మండలం బొమ్మరాజుపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త మంజునాథ్‌రెడ్డి హెల్మెట్‌తో వచ్చి నప్పటికీ వారు భద్రతా సూచలివ్వడానికి అతని బైక్‌ను ఆపారు. అసలు బైక్‌ను ఆపడానికి మీరెవరంటూ అతను పోలీసులను ఏకిపారేశాడు. అసభ్యకర పదజాలంతో దూషించాడు. అటుగా వెళుతున్న పలువురు అక్కడికి చేరుకుని సర్దిచెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేదు. దీన్ని పోలీసులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఇది వైరల్ అయింది. ఈ విషయమై గంగవరం సీఐ శ్రీనివాస్‌ను వివరణ కోరగా నిందితునిపై కేసు నమోదు చేశామన్నారు.