రేషన్ బియ్యం తిననివారు తీసుకోకండి!
⇒ లబ్ధిదారులు ఇతరులకు బియ్యం అమ్మడం నేరం
⇒ కమాండ్ కంట్రోల్ కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి ఈటల
సాక్షి, హైదరాబాద్: ‘రేషన్ బియ్యం తిననివారు తీసుకోకండి. ఈ బియ్యాన్ని లబ్ధిదారులు ఇతరులకు అమ్మడం నేరం. ప్రజా పంపిణీ ద్వారా ప్రజల కోసం రూ.6,500, కోట్లను ఖర్చు చేస్తున్న సంస్థ ఇది. పారదర్శకంగా సరుకుల సరఫరాకు కమిషనర్ సి.వి. ఆనంద్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయం.. ఈ శాఖలో మార్పులకు సహకరిస్తున్న ఉద్యోగులకు అభినందనలు’ అని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల పంపిణీలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్టకు పౌరసరఫరాలశాఖ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను సోమాజిగూడలోని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసింది. మంగళవారం మంత్రి ఈటల ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. బియ్యం తీసుకోకపోతే కార్డు తిరిగివ్వా లని కోరుతున్నానని ఈటల అన్నారు. సంక్షేమ ఫలాలు పక్కదారి పట్టకుం డా కమాండ్ కంట్రోల్ చేపట్టడం అభినందనీయమని సీఎస్ అన్నారు.
త్వరలో అన్ని రేషన్ షాపుల్లో ఈ పాస్: త్వరలో అన్ని రేషన్ షాపుల్లో ఈ పాస్ అమలు చేస్తామని, అన్నీ గోడౌన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని సివిల్ సప్లైస్ కమిషనర్ సి.వి.ఆనంద్ చెప్పారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం పనితీరు గురించి, శాఖలో చేపట్టిన సంస్కరణల గురించి వివరించారు. రైస్ మిల్లర్స్ నుంచి బకాయిల వసూళ్లు, గన్నీ బ్యాగుల రిటర్న్, సకాలంలో బియ్యం అందించడం వంటి చర్యలు చేపట్టామని.. దీనివల్ల రూ. 600 కోట్ల లాభం చేకూరిందని చెప్పారు.