పేదల బియ్యం..పెద్దల పరం | ration rice sent to black market | Sakshi
Sakshi News home page

పేదల బియ్యం..పెద్దల పరం

Published Mon, Aug 11 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 11:41 AM

ration rice sent to black market

 చీరాల: రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. రేషన్ డీలర్లు, వ్యాపారులు, కొందరు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై  బియ్యాన్ని జిల్లాలు దాటిస్తున్నారు. లారీలు, ఆటోలు, రైళ్లు, పార్శిల్ వాహనాలు, ద్విచక్రవాహనాల్లో దేని ద్వారా సులువుగా ఉంటుందో ఆ మార్గంలో తరలించి జేబులు నింపుకుంటున్నారు.  చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా మళ్లీ పుంజుకుంది. 
ఇటీవల నాగులపాలెం పాత పౌరసరఫరాల గౌడౌన్‌లో దాచి ఉంచిన 547 బస్తాల రేషన్ బియ్యాన్ని ఒంగోలు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి సమాచారం ఇవ్వడంతో ఆ బియ్యాన్ని పట్టుకున్నారు.

గురువారం నూతలపాడులో ఓ కొష్టం వద్ద తరలించేందుకు సిద్ధం చేసుకున్న 363 బస్తాల రేషన్ బియ్యాన్ని ఒంగోలు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి కూడా ఆ గ్రామానికి చెందిన వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకోవడం గమనార్హం.

చీరాల రైల్వే స్టేషన్‌లో ప్యాసింజర్ రైలులో రేషన్ బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉంచినట్లు శనివారం తహశీల్దార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీలకు ప్రయాణికులు సమాచారం ఇవ్వడంతో వారు 10 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.  

చీరాల నుంచి రోజూ ఆటోలు, రైళ్లలో బియ్యాన్ని తరలించడం పరిపాటిగా మారింది. పాత వ్యాపారంతో పాటు కొత్తగా చాలా మంది ఈ వ్యాపారంలోకి దిగారు.

 రేషన్‌డీలర్ల వద్ద కేజీ  10 చొప్పున కొనుగోలు చేసి దానిని గుంటూరు జిల్లా బాపట్ల, కాకినాడ తరలించి కిలో 14 చొప్పున విక్రయిస్తున్నారు.

ఒక్కో మండలానికి సుమారు 500 నుంచి 700 క్వింటాళ్ల బియ్యం కేటాయిస్తారు. అందులో ఒక వంతు మాత్రమే పేదలకు అందగా, మూడోవంతు అక్రమ వ్యాపారులు, రేషన్ డీలర్లకు భోజ్యంగా మారుతోంది.
 
 కళ్లకు గంతలు కట్టుకున్న రెవెన్యూ అధికారులు...
 రెవెన్యూ అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారు. తాము చెడు వినం... చెడు చూడం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. అక్రమార్కుల పని పట్టేందుకు ఏ ఒక్క చర్య చేపట్టడం లేదు. రేషన్ షాపుల అక్రమాలపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. తహశీల్దార్ కార్యాలయంలో పనితోనే తమకు సరిపోతుందని చెబుతున్నారు.

 అయితే రేషన్ డీలర్లతో పాటు అక్రమ వ్యాపారులు ప్రతినెలా రెవెన్యూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు పెద్ద మొత్తంలో ముట్టచెబుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక్కో రేషన్‌షాపు డీలరు నెలకు *1200 రెవెన్యూ అధికారులకు మామూలు చెల్లిస్తారని, వాటిని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌తో సహా నలుగురు పంచుకుంటారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఒక్కో నియోజకవర్గం నుంచి రేషన్ డీలర్ల ద్వారా రెవెన్యూ అధికారులకు లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు అందుతున్నట్లు సమాచారం. దీంతోనే వారు రేషన్ డీలర్లపై గానీ, అక్రమ వ్యాపారులపై గానీ చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఎప్పుడైనా దాడులు చేసి పట్టుకుంటే 6ఏ కేసులు మినహా పీడీయాక్టులు పెట్టే పరిస్థితులు లేకపోవడంతో అక్రమార్కులకు పాడికుండగా మారిన వ్యాపారాన్ని వదిలిపెట్టడం లేదు. 6ఏ కేసుల వలన ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో డీలర్లు, అక్రమ వ్యాపారులు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా ఉంటున్నారు. దీంతో పేదల బియ్యం జిల్లాలు దాటి చివరకు పెద్దల పరం అవుతున్నాయి.
 రేషన్ బియ్యం అక్రమ రవాణాను నియంత్రిస్తాం.

 ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ రమేష్
 రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. అక్రమ రవాణాదారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశాం. ఈ రవాణాను నియంత్రించేందుకు అన్నీ చర్యలు తీసుకుంటాం. బియ్యం రవాణాను అడ్డుకుంటాం. మేము డీలర్ల వద్ద నుంచి ఎటువంటి వసూళ్లు చేయడం లేదు.  

 సిబ్బందికి ఆదేశాలిచ్చాం.. బి.సత్యనారాయణ, తహశీల్దార్, చీరాల
 రేషన్‌బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో పాటు వీఆర్వోలను ఆదేశించాం. డీలర్ల నుంచి రెవెన్యూ అధికారులెవరూ వసూళ్లకు పాల్పడటం లేదు. ఎవరైనా అలా చేస్తే చర్యలు తీసుకుంటాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement