దుకాణాలకు చేరని రేషన్ బియ్యం!
కర్నూలు: పౌర సరఫరాల శాఖకు ఈ-పాస్ అమలు కుదిపేస్తోంది. రేషన్ కోటా తీసుకెళ్లేది లేదని డీలర్లు మొండికేస్తుండగా.. నోటీసులు జారీ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 10 శాతం సరుకు మాత్రమే చౌకధరల దుకాణాలకు చేరింది. అది కూడా ఈ-పాస్ యంత్రాలు లేని దుకాణాలకు సరుకు చేర్చిన అధికారులు అంతా సవ్యంగానే ఉన్నట్లు చాటుకుంటున్నారు. మరోవైపు భారత ఆహారసంస్థ(ఎఫ్‌సీఐ) గోదాముల నుంచి తూకాలు వేసి నేరుగా చౌక డిపోలకు బియ్యం సరఫరా చేయాలని అధికారులు తీసుకున్న నిర్ణయంతో హమాలీలు ఆందోళన చేపట్టారు.
దీంతో మధ్యాహ్నం వరకూ గోదాములకు తాళాలు పడ్డాయి. చివరకు ఆందోళన కొలిక్కి వచ్చినప్పటికీ సరుకు తీసుకునేందుకు డీలర్లు జిల్లాలో లేకపోవడం గందరగోళానికి తావిస్తోంది. చౌక డిపోల్లో ఈ-పాసు యంత్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ చౌక డిపో డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా నుంచి భారీ ఎత్తున డీలర్లు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. సోమాజీగూడలోని సివిల్ సప్లయ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఫలితంగా ఏప్రిల్ నెల సరుకులు కాస్తా సకాలంలో వినియోగదారులకు అందే పరిస్థితి కరువైంది.
సాంకేతిక ఇబ్బందులు
గోదాముల నుంచి చౌక దుకాణాలకు సరుకుల తరలింపు, అనంతరం కార్డుదారులకు సరఫరా మొత్తం ఈ-పాసు యంత్రాల ద్వారా తూకాలు వేసి పంపిణీ జరగాల్సి ఉంది. అయితే గోదాముల వద్ద ఒక్కో ప్యాకెట్ 50 కిలోల 650 గ్రాములు లెక్కకట్టి ఇవ్వాల్సి ఉండగా కేవలం 48 కిలోలు మాత్రమే ఇస్తుండటంతో డీలర్లు బియ్యం తీసుకుపోవడానికి ముందుకు రాని పరిస్థితి.
తమకు సరైన తూకంలో సరుకులు ఇస్తేనే ఈ-పాస్ అమలుకు ఒప్పుకుంటామని డీలర్లు మొండికేస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో ఈ-పాస్ అమలు చేయాలంటే 3జీ సిమ్ అవసరం ఉంది. అయితే, జిల్లాలో అనేకచోట్ల నెట్‌వర్క్ లేకపోవడంతో త్రీజీ సిమ్ పనిచేసే అవకాశం లేదు. అంతేకాకుండా కర్నూలు పట్టణంలోని ఓల్డ్‌సిటీలోని అనేక ప్రాంతాల్లో కూడా ఈ-పాస్ అమలుకు ఇచ్చిన ఐడియా సిమ్‌లు పనిచేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గోడౌన్ వద్ద హమాలీల ఆందోళన
వేయింగ్ మిషన్ ద్వారా బియ్యం లారీని తూకం వేసి ఇవ్వాలని డీలర్లు పట్టుబట్టడంతో ఖాళీ లారీని కాటా వేసి లోడు లారీతో మరోసారి కాటా వేయడానికి ఎక్కువ సమయం పడుతున్నందున ట్రక్కు డ్రైవర్లు అందుకు నిరాకరించారు. దీంతో ఎఫ్‌సీఐ గోడౌన్ వద్దే లోడు చేసిన లారీని వేయింగ్ మిషన్‌లో కాటా వేసేలా పౌర సరఫరాల శాఖ అధికారులు ట్రక్కు డ్రైవర్లను ఒప్పించారు. అయితే అందువల్ల తాము ఉపాధి కోల్పోతామంటూ మండల స్టాక్ పాయింట్ వద్ద పనిచేస్తున్న హమాలీలు మంగళవారం ఆందోళనకు దిగారు.
బియ్యం లోడుతో సరుకులు బయటకు వెళ్లకుండా గేట్లకు తాళాలు వేసి ఆందోళనకు దిగడంతో డీఎస్‌ఓ ప్రభాకర్‌రావు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వెంకటేష్‌తో పాటు ఇతర అధికారులు గోదాము వద్దకు చేరుకుని హమాలీలతో చర్చలు జరిపారు. గోదాములో ఉన్న నిల్వలన్నీ పూర్తయ్యే వరకు ఇక్కడి నుంచే సరుకులు రవాణా చేయాలన్న ఒప్పందంతో ఆందోళన విరమించారు. హమాలీల ఆందోళనతో మధ్యాహ్నం వరకు సరుకు రవాణా స్తంభించింది. తర్వాత హమాలీలు ఆందోళన విరిమించినప్పటికీ కోటాను తీసుకునేందుకు డీలర్లు మాత్రం ముందుకు రాలేదు.
ప‘రేషన్’
Published Wed, Apr 1 2015 2:51 AM | Last Updated on Thu, Sep 27 2018 4:59 PM
Advertisement