జిల్లా నుంచి వేల క్వింటాళ్లు అక్రమంగా తరలింపు
కాకినాడ పోర్టు ద్వారా ఇతర రాష్ట్రాలకు సరఫరా
నిఘా ఉన్నా ఆగని అక్రమార్కులు
విజిలెన్స్ దాడుల్లో దొరికేది స్వల్పమే.. !
విజయవాడ : జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ గాడితప్పింది. ప్రభుత్వం పేదలకు ఇచ్చే కిలో రూపాయి బియ్యం పక్కదారి పడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా గత నెల 1 నుంచి ఈ నెల 15వ తేదీ మధ్య అక్రమంగా తరలిస్తున్న 1,204 క్వింటాళ్ల బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకోవడమే ఇందుకు నిదర్శనం. కొందరు దళారీలు రేషన్ బియ్యాన్ని కిలో ఆరు రూపాయల చొప్పున డీలర్ల నుంచి కొనుగోలుచేస్తున్నారు. వాటిని పాలిష్ చేసి కిలో రూ.30 నుంచి రూ.40 వరకు ధర కలిగిన బియ్యంలో కలిపి విక్రయిస్తున్నారు. కొందరు వందలాది క్వింటాళ్లను పోగుచేసి కాకినాడ పోర్టు నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు.
డీలర్లకు పెట్టుబడి పెడుతున్న ‘దొంగ’ వ్యాపారులు
పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు కొందరు దొంగ వ్యాపారులు పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తున్నారు. ముందుగానే రేషన్ డీలర్లకు పెట్టుబడి పెడుతున్నారు. విజయవాడ నగరంలో ఇటువంటి వ్యాపారులు పది మంది వరకూ ఉన్నారు. వీరు పటమట, కృష్ణలంక, భగత్‌సింగ్‌నగర్, వించిపేట, కొత్తపేట, చిట్టినగర్, భవానీపురం ప్రాంతాల్లో ఉంటున్నట్లు విజిలెన్స్ అధికారుల వద్ద ఆధారాలు ఉన్నాయి. వీరు దళారుల సాయంతో డీలర్ల నుంచి పోగుచేసిన బియ్యాన్ని లారీలు, ప్యాసింజర్ రైళ్లలో ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం సంబంధిత విభాగాల సిబ్బందికి కూడా మామూళ్లు ఇస్తున్నట్లు సమాచారం. రేషన్ బియ్యాన్ని అక్రమంగా లారీ డ్రైవర్లు చాకచక్యంగా జిల్లాలోని చెక్‌పోస్టులు దాటించేందుకు క్వింటాకు రూ.7.50 చొప్పున ప్రత్యేకంగా చెల్లిస్తారు. కాకినాడ పోర్టుకు చేరిస్తే క్వింటాకు రూ.15లు ఇస్తున్నట్లు విజిలెన్స్ దాడుల్లో స్పష్టమైంది.
భారీగా బ్లాక్‌మార్కెట్‌కు...
జిల్లాలో సాధారణ తెల్లకార్డులు 10,83,413 ఉన్నాయి. అంత్యోదయ అన్న యోజన కార్డులు 70,153, అన్నపూర్ణ కార్డులు 636 ఉన్నాయి. అన్నీ కలిపి 11,54,202 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులకు పంపిణీ చేసేందుకు 20,150 రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల 15వేల టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం ఇస్తోంది. అయితే భారీగా బియ్యం బ్లాక్‌మార్కెట్‌కు తరలివెళ్తున్నాయి. అధికారులు నిఘా పెట్టినా అక్రమాలు ఆగటం లేదు. పౌరసరఫరాల శాఖ అధికారులు మామూళ్లు తీసుకుని చూసీచూనట్లు వ్యవహరించడమే ఇందుకు కారణమే అరోపణలు ఉన్నాయి.
పేదల బియ్యం.. దళారులకు వరం
Published Sat, Feb 21 2015 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM
Advertisement