బీపీఎల్‌లకు వర్తింపజేసే యోచనలో కేంద్రం
ఉచిత మందులు కూడా పీడీఎస్‌లో సంస్కరణల దిశగా
న్యూఢిల్లీ: ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్)లో సంస్కరణలు చేపట్టి, పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు ప్రకటించాలని కేంద్రం భావిస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న పేదలకు స్పెషాలిటీ ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత పరీక్షలు, మందులు ఇవ్వాలని యోచిస్తోంది. అలాగే ఆదాయ పన్ను చెల్లించేవారిని, ఉన్నతాధికారులను పీడీఎస్ పరిధి నుంచి మినహాయించే దిశగా ఆలోచనలు చేస్తోంది. ‘సంక్షేమ పథకాలను నిజమైన లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. బీపీఎల్ కేటగిరీలో ఉన్నవారికి రేషన్ కార్డుల ఆధారంగా ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత వైద్య పరీక్షలు, మందులు ఇవ్వాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి’ అని ఆహార మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ పీటీఐకి చెప్పారు. పేదలకు ఉచిత వైద్య పరీక్షలు, మందుల పథకంపై రాష్ట్రాలను సంప్రదిస్తామన్నారు. .
ఆహార భద్రత చట్టంపై చిన్నచూపు లేదు
గత యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆహార భద్రత చట్టంపై మోదీ ప్రభుత్వం చిన్నచూపు చూపుతోందని వస్తున్న ఆరోపణలను మంత్రి పాశ్వాన్ తోసిపుచ్చారు. ఆ చట్టం అమలుకు తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. ‘ప్రస్తుతం ఈ చట్టాన్ని 11 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. అందులో హర్యానా, రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలు పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నాయి’ అని తెలిపారు.
పేదలకు ఉచిత వైద్యపరీక్షలు
Published Mon, Oct 13 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 2:44 PM
Advertisement