మహిళలను రొమ్ము క్యాన్సర్ వెంటాడుతోంది.. ఒకప్పుడు 45 ఏళ్లు నిండిన వారిపైనే అధికంగా ఈ మహమ్మారి దాడి చేసేంది. ఇప్పుడు యుక్త వయసులోని అతివలను సైతం భయకంపితులను చేస్తోంది. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలనే కబళిస్తోంది. ఈ క్రమంలో ఆడపడుచుల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కార్యాచరణ అమలు చేస్తోంది. అవగాహనతోనే నివారణ సాధ్యమనే నినాదంతో సదస్సులు నిర్వహిస్తోంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద క్షేత్రస్థాయిలో అనుమానితులను గుర్తిస్తోంది. ఏరియా ఆస్పత్రుల్లో ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తోంది. రోగులకు సకాలంలో అత్యుత్తమ చికిత్సలు అందిస్తోంది.
చిత్తూరు రూరల్ : బ్రెస్ట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. అలాగే జిల్లాలోని అన్ని ఏరియా ఆస్పత్రుల్లో స్క్రీనింగ్ పరీక్ష కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉచితంగా పరీక్షలు, చికిత్సలు చేయిస్తోంది. త్వరలో అన్ని సీహెచ్‌సీలో సైతం సీ్‌క్రనింగ్ టెస్ట్ సెంటర్లను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది.
వయసుతో నిమిత్తం లేకుండా..
గతంలో 45ఏళ్లు దాటిన వారిలోనే బ్రెస్ట్ క్యాన్సర్ కనిపించేంది. ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా సోకుతోంది. పాశ్చాత్య దేశాల్ల 50 ఏళ్లు నిండి తర్వాతే పలువురు క్యాన్సర్ బారిన పడుతుండగా, మన దేవంలో 40 ఏళ్లు దాటిన వారిలో సైతం అధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఒక్కోసారి 30ఏళ్ల వారిలోనూ, కొందరు పురుషుల్లో సైతం క్యాన్సర్ బయటపడుతోంది. జిల్లాలో సుమారు 2,211 మంది రొమ్ము క్యాన్సర్ బారిన పడినట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్‌ను సెల్ఫ్ చెక్ చేసుకోవడం ద్వారా కూడా కనిపెట్టవచ్చని తెలియజేస్తున్నారు. తొలి దశలోనే వ్యాధిని గుర్తిస్తే చికిత్స సులువుగా ఉంటుందని వివరిస్తున్నారు. ముందుగా క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించుకుంటే గుర్తించడం సులభతరంగా మారుతుందని, తద్వారా నివారణకు అవకాశముంటుందని వివరిస్తున్నారు. ఎక్కువ మంది మహిళలకు దీనిపై అవగాహన లేకపోవడం వల్లే రెండు, మూడు దశల వరకు క్యాన్సర్ గుర్తించలేకపోతున్నారని చెబుతున్నారు. సకాలంలో వ్యాధిని కనిపెడితే వెంటనే చికిత్స ప్రారంభించి ప్రాణాలను కాపాడవచ్చని వెల్లడిస్తున్నారు.
‘ఫ్యామిలీ డాక్టర్’తో మేలు
గ్రామీణ ప్రాంత మహిళలకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వరంలా మారింది. ప్రతి 15 రోజులకు ఒకసారి గ్రామానికే వైద్యులు వెళ్లడం, జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా స్పెషలిస్టు డాక్టర్లు సైతం అందుబాటులోకి వస్తుండడంతో గ్రామీణ మహిళలు హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారు. ఆయా శిబిరాల్లో మహిళలకు ప్రత్యేక పరీక్షలు చేస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ లక్ష ణాలు ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే మమోగ్రామ్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పెద్దసంఖ్యలో మహిళలకు ప్రాథమిక దశలోనే క్యాన్సర్ గుర్తించారు. అంతేకాదు శస్త్ర చికిత్స తర్వాత కూడా వారికి వైద్య పరీక్షలు చేస్తూ మందులు అందజేస్తున్నారు.
సెల్ఫ్ చెక్ ఇలా
► రుతుస్రావం వచ్చి, ఆగిన ఐదు రోజుల తర్వాత బ్రెస్ట్ చెక్ చేసుకోవాలి
► రొమ్ముపై గింజంత సైజులో కణితులు ఏమైనా వచ్చాయా, చర్మం రంగు మారిందేమో పరిశీలించుకోవాలి
► చంకల్లో గడ్డలు ఏర్పడ్డాయా అనే విషయాలను గమనించాలి
► రొమ్ము టైట్ అవుతోందా, అల్సర్స్ వచ్చాయా, చనుమొనల నుంచి రక్తం కారుతోందా వంటి అంశాలను చెక్ చేసుకోవాలి
► నొప్పిలేని కణితులను క్యాన్సర్‌గా భావించి నిర్ధారణ పరీక్షలు చేయించుకుని చికిత్స పొందాలి.
కారణాలు అనేకం
మహిళలల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చేందుకు అనేక కారణాలు ఉన్నాయి. లేట వయసులో పిల్లలు పుట్టినవారు, బిడ్డకు పాలివ్వని తల్లులు, వంశపారంపర్యంగా కొందరికి, పన్నెండేళ్లోపు రజస్వల అయినవారు, రెడ్‌మీట్ అధికంగా తినేవారు, ఎక్కువ సమయంల కూర్చుని పనిచేసేవారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఊబ కాయంతో ఉన్న మహిళలు, మెనోపాజ్ చేరే సమయంలో వచ్చే దుష్ఫలితాలకు వాడే మందులు కారణంగా ఈ మహమ్మారి బారిన పడవచ్చు. అలాగే వివాహం కాని మహిళలు,, సంతానం లేని వారు, ధూమపానం, ఆల్కాహాల్ తాగే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
– శిల్ప, సీ్త్ర వైద్య నిపుణులు, చిత్తూరు
ప్రత్యేక దృష్టి
ఫ్యామిలీ డాక్టర్ కింద కమ్యూనికల్ డిసీజెస్‌పై ప్రత్యేకంగా దష్టి సారించాం. అందులో భాగంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి లక్ష ణాలున్న వారిని గుర్తించి స్క్రీనింగ్ చేస్తున్నాం. అలాగే ఆయా వ్యాధులతో చికిత్స పొందుతున్న వారిని సైతం మానిటరింగ్ చేసి మందులు అందిస్తున్నాం. రొమ్ముపై కణితులు, గడ్డలు ఉన్న మహిళలు వస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నాం. ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని పరీక్షలను ఉచితంగానే చేస్తున్నాం.
– అమర్‌నాథ్, ఏసీడీ విభాగం వైద్యాధికారి, చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment