The reforms
-
ప్రైవేటు డెయిరీలకు ముకుతాడు
పాల ధరల నియంత్రణపై సర్కారు దృష్టి విజయ పాల ధర పెంపును తిరస్కరించిన సీఎం కేసీఆర్ ఏపీ డెయిరీ విభజన తర్వాత భారీగా సంస్కరణలు {పైవేట్ గుత్తాధిపత్యానికి చెక్ పెట్టే దిశగా చర్యలు హైదరాబాద్: కర్ణాటకలో లీటర్ పాల ధర రూ. 30.. గుజరాత్లో రూ. 35.. మహారాష్ర్టలో రూ. 38.. తెలంగాణలో ప్రభుత్వ విజయ పాలు రూ. 38, ప్రైవేటు పాల ధర లీటర్‌కు రూ. 46. దేశంలోనే పాల ధర అత్యధికంగా ఇక్కడే ఉంది. ప్రైవేట్ డెయిరీల గుత్తాధిపత్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రైవేటుకు చెక్ పెట్టే చర్యలకు రాష్ర్ట సర్కారు నడుం బిగించింది. ప్రైవేటు డెయిరీల ధరలకు అనుగుణంగా విజయ పాల ధరను పెంచాలన్న ఏపీ డెయిరీ ప్రతిపాదనను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తిరస్కరించినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ ధరలను పెంచడానికి వీలు లేదని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. పైగా ప్రైవేటు పాల ధరలను కూడా నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఏపీ డెయిరీని విభజించి తెలంగాణ డెయిరీని స్థాపించాక ప్రైవేటుకు చెక్ పెట్టాలనేది సర్కారు ఉద్దేశం. రైతుకు ప్రోత్సాహం... కర్ణాటక ఆదర్శం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీ డెయిరీని దాదాపు చంపేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన హెరిటేజ్ సంస్థను వృద్ధి చేసుకునేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సహకార డెయిరీని పణంగా పెట్టారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి.. కొన ఊపిరితో ఉన్న ఏపీ డెయిరీకి ప్రాణం పోశారు. ఆయన తదనంతరం పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు పాల విక్రయం రోజుకు 26 లక్షల లీటర్లు ఉంటుందని అంచనా. స్థానికంగా మరికొన్ని లక్షల లీటర్లు ఉండొచ్చు. ఇందులో ఏపీ డెయిరీ 4.5 లక్షల లీటర్లు మాత్రమే విక్రయిస్తోంది. ఒక్క హైదరాబాద్‌లోనే 4 లక్షల లీటర్లు అమ్ముతోంది. అంతా ప్రైవేటు గుత్తాధిపత్యమే నడుస్తోంది. ప్రైవేటు పాల ధర ఎక్కువగా ఉన్నప్పటికీ.. తక్కువ ధరకే విక్రయిస్తోన్న ఏపీ డెయిరీ మాత్రం తన మార్కెట్ వాటాను పెంచుకోలేకపోతోంది. రైతులకు ప్రైవేటు సంస్థలు పాల సేకరణ ధరను అధికంగా చెల్లిస్తుండటంతో ఏపీ డెయిరీకి పాలు పోసే వారే కరువయ్యారు. దీంతో నాలుగున్నర లక్షల లీటర్ల సేకరణలో భాగంగా రెండు లక్షల లీటర్లను కర్ణాటక నుంచి కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. పాల విక్రయ డీలర్లకు ప్రైవేటు సంస్థలు అధిక కమీషన్ ఇస్తుండటంతో.. ధర తక్కువ అయినప్పటికీ విజయ పాలను అమ్మడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలా సర్కారు పాలకు ప్రైవేటు సంస్థలు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలంటే రైతుకు సేకరణ ధర ఎక్కువ ఇవ్వడం, డీలర్లకు కమీషన్ పెంచడమే మార్గమని ఏపీ డెయిరీ అధికారులు అంటున్నారు. కర్ణాటకలో అక్కడి ప్రభుత్వ ఆధ్వర్యంలోని డెయిరీ రోజుకు 50 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోంది. అక్కడ పాడి రైతుకు లీటరుకు ప్రభుత్వమే నాలుగు రూపాయలు ప్రోత్సాహకం ఇస్తుండటంతో రైతులంతా సర్కారు పాడి సంస్థకే పాలను పోస్తున్నారు. దీంతో ప్రైవేటు వ్యవస్థలు అక్కడ కుదేలయ్యాయి. సర్కారు పాల ధర లీటరు రూ. 30కి విక్రయిస్తున్నట్లే ప్రైవేటు వాళ్లు కూడా అంతే ధరకు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కర్ణాటకను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని రాష్ర్ట ప్రభుత్వం యోచిస్తోంది. శంషాబాద్‌లో మెగా ప్రాజెక్టు లాలాపేటలో ప్రస్తుతం 5 లక్షల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఏపీ డెయిరీ సహకార పాల ఫ్యాక్టరీ ఉంది. దీనికి తోడు మరో మెగా ప్రాజెక్టును నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు రూ. 40 కోట్లతో శంషాబాద్‌లో 30 ఎకరాల్లో 5 నుంచి 10 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన మరో డెయిరీని ఆధునిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే స్థలాన్ని కూడా సేకరించారు. ఏపీ డెయిరీ విభజన జరిగి తెలంగాణ డెయిరీ ఏర్పడ్డాక ఈ మెగా ఫ్యాక్టరీకి సంబంధించిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. మరోవైపు కర్ణాటకలో మాదిరిగా ఇక్కడ కూడా పాడి రైతుకు ప్రోత్సాహకాలు ఇచ్చి పాల సేకరణను మరింత పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. వైఎస్ హయాంలో మాదిరిగా సహకార పాల డెయిరీని ప్రోత్సహించాలని ఏపీ డెయిరీ అధికారులు సీఎం కేసీఆర్‌కు విన్నవించినట్లు సమాచారం. వైఎస్ లేకుంటే ఏపీ డెయిరీ ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేదని వారు చెప్పినట్లు తెలిసింది. అవసరమైతే పాడి పరిశ్రమకు సంబంధించి నియంత్రణా చట్టాన్ని తీసుకురావాలని కూడా సూచించారు. మొత్తానికి ప్రైవేటు గుత్తాధిపత్యానికి చెక్ పెట్టడంపై రాష్ర్ట ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తోంది. -
పేదలకు ఉచిత వైద్యపరీక్షలు
బీపీఎల్లకు వర్తింపజేసే యోచనలో కేంద్రం ఉచిత మందులు కూడా పీడీఎస్‌లో సంస్కరణల దిశగా న్యూఢిల్లీ: ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్)లో సంస్కరణలు చేపట్టి, పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు ప్రకటించాలని కేంద్రం భావిస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న పేదలకు స్పెషాలిటీ ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత పరీక్షలు, మందులు ఇవ్వాలని యోచిస్తోంది. అలాగే ఆదాయ పన్ను చెల్లించేవారిని, ఉన్నతాధికారులను పీడీఎస్ పరిధి నుంచి మినహాయించే దిశగా ఆలోచనలు చేస్తోంది. ‘సంక్షేమ పథకాలను నిజమైన లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. బీపీఎల్ కేటగిరీలో ఉన్నవారికి రేషన్ కార్డుల ఆధారంగా ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత వైద్య పరీక్షలు, మందులు ఇవ్వాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి’ అని ఆహార మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ పీటీఐకి చెప్పారు. పేదలకు ఉచిత వైద్య పరీక్షలు, మందుల పథకంపై రాష్ట్రాలను సంప్రదిస్తామన్నారు. . ఆహార భద్రత చట్టంపై చిన్నచూపు లేదు గత యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆహార భద్రత చట్టంపై మోదీ ప్రభుత్వం చిన్నచూపు చూపుతోందని వస్తున్న ఆరోపణలను మంత్రి పాశ్వాన్ తోసిపుచ్చారు. ఆ చట్టం అమలుకు తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. ‘ప్రస్తుతం ఈ చట్టాన్ని 11 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. అందులో హర్యానా, రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలు పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నాయి’ అని తెలిపారు. -
మార్కెట్‌యార్డుల్లో వినూత్న సంస్కరణలు
గోడౌన్లలో రైతుల ధాన్యానికి రుణం రూ.2లక్షలకు పెంపు అవసరమైతే నాబార్డు సాయంతో మరిన్ని గోడౌన్లు నిర్మిస్తాం : మంత్రి హరీశ్‌రావు మార్కెట్‌యార్డులపై నివేదికను సమర్పించిన పూనం కమిటీ హైదరాబాద్: రైతులకు మెరుగైన సేవలను అందించేందుకు మార్కెట్‌యార్డులలో మూడుదశల్లో వినూత్న సంస్కరణలను అమలు చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖల మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. గోడౌన్లలో రైతులు నిల్వచేసే ధాన్యంపై ఇచ్చే రుణాన్ని రూ.2 లక్షలకు పెంచుతున్నట్టు ఆయన వెల్లడిం చారు. శుక్రవారం సచివాలయంలో ‘రైతుబంధు’ పోస్టర్‌ను మంత్రి విడుదల చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గోడౌన్లలో నిల్వధాన్యం రుణంపై ఉన్న మూడునెలలు గడువును ఆరునెలలకు పెంచుతున్నామని మంత్రి తెలిపారు. పత్తికి మద్దతుధరను మరింతగా పెంచేలా కేంద్రప్రభుత్వంతో మాట్లాడుతున్నామని చెప్పారు. మార్కెట్‌యార్డులలో తేవాల్సిన సంస్కరణలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాల కొండయ్య నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ అధ్యయనం చేసి రూపొందించిన నివేదికను ఈ సం దర్భంగా మంత్రి హరీశ్‌రావుకు అందచేసింది. కర్ణాటక కన్నా మెరుగైన విధానం... కర్ణాటక మార్కెట్‌యార్డులలో రైతుల నుంచి పత్తి, వరి, మొక్కజొన్న కొనుగోలు విధానాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని, దానికంటే కూడా మెరుగైన వ్యవస్థను రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నట్టు హరీశ్ వివరించారు. మార్కెట్‌యార్డుల ప్రవేశద్వారం వద్దనే రైతులు తీసుకు వచ్చిన ఉత్పత్తులను నమోదు చేసుకోవడం,తూకంలో మోసాలు జరగకుండా ఎలక్ట్రానిక్ మిషన్లను అమర్చడం, మార్కెట్‌యార్డుల్లో ఆ రోజు రైతుల నుంచి కొనుగోలు చేసే ఉత్పత్తుల ధరలను ఆన్లైన్లో పేర్కొనడం వంటి మార్పులు తీసుకొస్తున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలోనే గాక ఇతర రాష్ట్రాలలో ఉన్న ఉత్పత్తుల ధరలను ప్రతిరోజూ తెలియజేయడం వల్ల ఎక్కడ గిట్టుబాటు ధర అనిపిస్తే అక్కడ విక్రయించుకోవడానికి రైతులకు వీలవుతుందని ఆయన వివరించారు. ఇందుకోసం అన్ని మార్కెట్‌యార్డులలో ప్రత్యేకంగా తెరలను ఏర్పాటు చేస్తామన్నారు. దీని వలన రైతులకు, కమిషన్ ఏజంట్లకు, వ్యాపారులకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో వర్షాభావం ఉన్నప్పటికీ కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పది లక్షల ఎకరాలలో వరి పండిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో గోడౌన్ల కొరత లేదన్నారు. ఇంకా వేర్‌హౌజింగ్ కార్పొరేషన్ , నాబార్డ్ సంస్థల సహాయంతో మరిన్ని గోడౌన్లు నిర్మిస్తామని తెలిపారు. మార్కెట్ యార్డులలో దళారుల బెడదనుతొలగించడానికే ఈ సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. -
డాక్టర్ కాబోయి ఎకానమిస్ట్!
ప్రీ మెడిసిన్‌లో చేరి మానేసిన మాజీ ప్రధాని మన్మోహన్ తండ్రి జీవిత చరిత్ర పుస్తకంలో పేర్కొన్న ఆయన కుమార్తె దమన్‌సింగ్ న్యూఢిల్లీ: దేశంలోని గొప్ప ఆర్థికవేత్తల్లో ఒకరిగా, సంస్కరణలతో దేశ ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టిన వ్యక్తిగా అందరికీ సుపరిచితమైన మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ తొలుత వైద్య రంగంవైపు అడుగులు వేశారట! తనను డాక్టర్‌ను చేయాలన్న తండ్రి ఆలోచన ప్రకారం అయిష్టంగానే 1948 ఏప్రిల్‌లో అమృత్‌సర్‌లోని ఖాస్లా కాలేజీలో రెండేళ్ల ప్రీమెడిసిన్ కోర్సు ఎఫ్ఎస్సీలో చేరారట. అయితే వైద్య రంగంపై ఆసక్తి కోల్పోవడంతో కొన్ని నెలలకే ఆ కోర్సు మానేశారట. మన్మోహన్ జీవితంలో చోటుచేసుకున్న ఇటువంటి ఆసక్తికర పరిణామాలకు ఆయన కుమార్తె దమన్‌సింగ్ తాజాగా పుస్తకరూపం ఇచ్చారు. తల్లిదండ్రుల జీవితచరిత్రపై రాసిన పుస్తకం ‘స్ట్రిక్ట్లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్’లో తండ్రి జీవితంలోని విభిన్న కోణాలను ఆమె ఆవిష్కరించారు. అయితే ప్రధానిగా ఆయన పదేళ్ల పదవీకాలంలోని అంశాలను మాత్రం దమన్‌సింగ్ ఇందులో ప్రస్తావించలేదు. తండ్రిని ఉటంకిస్తూ పుస్తకంలో దమన్‌సింగ్ పేర్కొన్న వివరాల ప్రకారం...ప్రీమెడిసిన్ కోర్సు మానేశాక మన్మోహన్ తన తండ్రి దుకాణంలో చేరారు. అయితే అక్కడి పరిస్థితులు నచ్చక 1948 ఆగస్టులో హిందూ కాలేజీలో చేరారు. ఆర్థికశాస్త్రం వైపు అడుగులు...: కాలేజీలో చేరాక మన్మోహన్‌ను ఆర్థికశాస్త్రం ఎంతగానో ఆకర్షించింది. పేదరికానికి సంబంధించిన అంశాలు ఆయనలో ఆసక్తిని కలిగించాయి. కొన్ని దేశాలు పేదరికంలోనే ఎందుకు మగ్గుతున్నాయి? మిగిలినవి ధనక దేశాలుగా ఎందుకు ఉన్నాయి? అనే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందన్న ఉద్దేశంతో ఆ రంగాన్ని ఎంచుకున్నారు. విదేశాల్లో డబ్బుకు ఇక్కట్లు...: కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో మన్మోహన్‌ను ఎక్కువగా డబ్బు సమస్య వేధించింది. టూషన్, వ్యక్తిగత ఖర్చులకు ఏడాదికి 600 పౌండ్లు అవసరమగా పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఆయనకు 160 పౌండ్ల స్కాలర్షిప్ లభించేది. మిగిలిన సొమ్ము కోసం ఆయన తండ్రిపై ఆధారపడేవారు. ఎప్పుడైనా డబ్బుకు ఇబ్బందైనా లేక ఆలస్యంగా అందినా దాన్ని సర్దుబాటు చేసుకునేందుకు మన్మోహన్ భోజనం మానేయడమో లేక క్యాడ్బరీ చాక్లెట్ బార్‌తో కడుపునింపుకోవడమో చేసేవారు. సరదా మనిషే...: మన్మోహన్ స్నేహితులతో పిచ్చాపాటిగా మాట్లాడేటప్పుడు భలే సరదాగా ఉండేవారు. జోకులు పేలుస్తూ నవ్వుతూ కనిపించేవారు. సన్నిహితుల్లో కొందరికి ముద్దుపేర్లు పెట్టడం కూడా ఆయనకు సరదా. సమీప బంధువొకరికి జాన్ బాబు అని, ఇంకొకరికి జువెల్ బాబు అని, మరొకరికి చుంజ్ వాలే అని కొంటెపేర్లు పెట్టారు. భార్యకు గురుదేవ్ అని, పిల్లలకు కిక్, లిటిల్ నోన్, లిటిల్ రామ్ అని పేర్లు పెట్టారు. -
విద్యారంగ సంస్కరణలపై చర్చించాలి: పీఆర్టీయూ
రాజానగరం: విద్యారంగంలో సంస్కరణలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ముందుగా ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) డిమాండ్ చేసింది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఉద్యమాలు తప్పవని ెహ చ్చరించింది. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని గైట్ కళాశాలలో ఆదివారం యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు ఎం.కమలాకరరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలో ప్రవేశపెట్టనున్న బయోమెట్రిక్ విధానాన్ని సంఘం నాయకులు పూర్తిగా వ్యతిరేకించారు. పాత విధానంలోనే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని, మధ్యాహ్న భోజన పథకం నుంచి ఉపాధ్యాయులను పూర్తిగా మినహాయించాలని కోరారు. ఒకే పని సమయాల అంశాన్ని పునః పరిశీలించాలని డిమాండ్ చేశారు. ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్సీలు కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు), గాదె శ్రీనివాసులు నాయుడు, డాక్టర్ బచ్చల పుల్లయ్య హామీ ఇచ్చారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భైరి అప్పారావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.