ప్రైవేటు డెయిరీలకు ముకుతాడు | Focus on government regulation of milk prices | Sakshi
Sakshi News home page

ప్రైవేటు డెయిరీలకు ముకుతాడు

Published Wed, Oct 15 2014 12:44 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

ప్రైవేటు డెయిరీలకు ముకుతాడు - Sakshi

ప్రైవేటు డెయిరీలకు ముకుతాడు

పాల ధరల నియంత్రణపై సర్కారు దృష్టి
విజయ పాల ధర పెంపును తిరస్కరించిన సీఎం కేసీఆర్
ఏపీ డెయిరీ విభజన తర్వాత భారీగా సంస్కరణలు
{పైవేట్ గుత్తాధిపత్యానికి  చెక్ పెట్టే దిశగా చర్యలు

 
 హైదరాబాద్: కర్ణాటకలో లీటర్ పాల ధర రూ. 30.. గుజరాత్‌లో రూ. 35.. మహారాష్ర్టలో రూ. 38.. తెలంగాణలో ప్రభుత్వ విజయ పాలు రూ. 38, ప్రైవేటు పాల ధర లీటర్‌కు రూ. 46. దేశంలోనే పాల ధర అత్యధికంగా ఇక్కడే ఉంది. ప్రైవేట్ డెయిరీల గుత్తాధిపత్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రైవేటుకు చెక్ పెట్టే చర్యలకు రాష్ర్ట సర్కారు నడుం బిగించింది. ప్రైవేటు డెయిరీల ధరలకు అనుగుణంగా విజయ పాల ధరను పెంచాలన్న ఏపీ డెయిరీ ప్రతిపాదనను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తిరస్కరించినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ ధరలను పెంచడానికి వీలు లేదని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. పైగా ప్రైవేటు పాల ధరలను కూడా నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఏపీ డెయిరీని  విభజించి తెలంగాణ డెయిరీని స్థాపించాక ప్రైవేటుకు చెక్ పెట్టాలనేది సర్కారు ఉద్దేశం.

రైతుకు ప్రోత్సాహం... కర్ణాటక ఆదర్శం

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీ డెయిరీని దాదాపు చంపేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన హెరిటేజ్ సంస్థను వృద్ధి చేసుకునేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సహకార డెయిరీని పణంగా పెట్టారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి.. కొన ఊపిరితో ఉన్న ఏపీ డెయిరీకి ప్రాణం పోశారు. ఆయన తదనంతరం పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు పాల విక్రయం రోజుకు 26 లక్షల లీటర్లు ఉంటుందని అంచనా. స్థానికంగా మరికొన్ని లక్షల లీటర్లు ఉండొచ్చు. ఇందులో ఏపీ డెయిరీ 4.5 లక్షల లీటర్లు మాత్రమే విక్రయిస్తోంది. ఒక్క హైదరాబాద్‌లోనే 4 లక్షల లీటర్లు అమ్ముతోంది. అంతా ప్రైవేటు గుత్తాధిపత్యమే నడుస్తోంది. ప్రైవేటు పాల ధర ఎక్కువగా ఉన్నప్పటికీ.. తక్కువ ధరకే విక్రయిస్తోన్న ఏపీ డెయిరీ మాత్రం తన మార్కెట్ వాటాను పెంచుకోలేకపోతోంది. రైతులకు ప్రైవేటు సంస్థలు పాల సేకరణ ధరను అధికంగా చెల్లిస్తుండటంతో ఏపీ డెయిరీకి పాలు పోసే వారే కరువయ్యారు. దీంతో నాలుగున్నర లక్షల లీటర్ల సేకరణలో భాగంగా రెండు లక్షల లీటర్లను కర్ణాటక నుంచి కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. పాల విక్రయ డీలర్లకు ప్రైవేటు సంస్థలు అధిక కమీషన్ ఇస్తుండటంతో.. ధర తక్కువ అయినప్పటికీ విజయ పాలను అమ్మడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలా సర్కారు పాలకు ప్రైవేటు సంస్థలు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలంటే రైతుకు సేకరణ ధర ఎక్కువ ఇవ్వడం, డీలర్లకు కమీషన్ పెంచడమే మార్గమని ఏపీ డెయిరీ అధికారులు అంటున్నారు. కర్ణాటకలో అక్కడి ప్రభుత్వ ఆధ్వర్యంలోని డెయిరీ రోజుకు 50 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోంది. అక్కడ పాడి రైతుకు లీటరుకు ప్రభుత్వమే నాలుగు రూపాయలు ప్రోత్సాహకం ఇస్తుండటంతో రైతులంతా సర్కారు పాడి సంస్థకే పాలను పోస్తున్నారు. దీంతో ప్రైవేటు వ్యవస్థలు అక్కడ కుదేలయ్యాయి. సర్కారు పాల ధర లీటరు రూ. 30కి విక్రయిస్తున్నట్లే ప్రైవేటు వాళ్లు కూడా అంతే ధరకు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కర్ణాటకను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని రాష్ర్ట ప్రభుత్వం యోచిస్తోంది.

శంషాబాద్‌లో మెగా ప్రాజెక్టు

లాలాపేటలో ప్రస్తుతం 5 లక్షల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఏపీ డెయిరీ సహకార పాల ఫ్యాక్టరీ ఉంది. దీనికి తోడు మరో మెగా ప్రాజెక్టును నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు రూ. 40 కోట్లతో శంషాబాద్‌లో 30 ఎకరాల్లో 5 నుంచి 10 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన మరో డెయిరీని ఆధునిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే స్థలాన్ని కూడా సేకరించారు. ఏపీ డెయిరీ విభజన జరిగి తెలంగాణ డెయిరీ ఏర్పడ్డాక ఈ మెగా ఫ్యాక్టరీకి సంబంధించిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. మరోవైపు కర్ణాటకలో మాదిరిగా ఇక్కడ కూడా పాడి రైతుకు ప్రోత్సాహకాలు ఇచ్చి పాల సేకరణను మరింత పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. వైఎస్ హయాంలో మాదిరిగా సహకార పాల డెయిరీని ప్రోత్సహించాలని ఏపీ డెయిరీ అధికారులు సీఎం కేసీఆర్‌కు విన్నవించినట్లు సమాచారం. వైఎస్ లేకుంటే ఏపీ డెయిరీ ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేదని వారు చెప్పినట్లు తెలిసింది. అవసరమైతే పాడి పరిశ్రమకు సంబంధించి నియంత్రణా చట్టాన్ని తీసుకురావాలని కూడా సూచించారు. మొత్తానికి ప్రైవేటు గుత్తాధిపత్యానికి చెక్ పెట్టడంపై రాష్ర్ట ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తోంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement